సబ్ ఫీచర్

గుండె తడిని పెంచిన ‘దృశ్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదో వృద్ధాశ్రమం..
ముసలావిడను పట్టుకుని ఏడుస్తున్న విద్యార్థిని..
ఆ దృశ్యం ఫొటోలా మారింది..
సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది..
అంతే..
వేల షేర్లు..
లక్షల లైకులు..
కొన్ని కోట్ల కన్నీటి చుక్కలు..
వందమాటల్లో చెప్పలేనిది.. ఒక దృశ్యంతో చెప్పొచ్చంటారు. అలాంటిదే ఈ దృశ్యం. అసలు విషయంలోకి వెళితే..
లోకంపై అవగాహన కలిగించడం కోసం ఒక స్కూలు వాళ్లు తమ పిల్లలను వృద్ధాశ్రమానికి తీసుకువచ్చారు. అక్కడ ఒక ముసలావిడను చూసి ఓ విద్యార్థిని ఏడవడం మొదలుపెట్టింది. ఆ ముసలావిడ కూడా ఆ పిల్లను పట్టుకుని ఏడవసాగింది. కారణం వారిద్దరూ నానమ్మా, మనవరాళ్లు. నానమ్మ అంటే ఆ పిల్లకు ఎనలేని ప్రేమ. ఆ బామ్మకు కూడా మనవరాలు అంటే చెప్పలేని మమకారం. దయలేని ఆ కొడుకు తల్లిని తెచ్చి వృద్ధాశ్రమంలో పడేశాడు. తన బిడ్డతో మాత్రం నానమ్మ బంధువుల ఇంటికి వెళ్లింది అని చెప్పారు. దాంతో ఆ అమ్మాయి ఊరుకుంది. తరువాత వాళ్ల నానమ్మను ఇలా వృద్ధాశ్రమంలో చూసేసరికి తట్టుకోలేకపోయింది ఆ అమ్మాయి. వాళ్ల నానమ్మ కూడా మనవరాలిని చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. వీళ్లే కాదు అక్కడున్న ఇతర పిల్లలు, వృద్ధాశ్రమంలోని వృద్ధులూ, ఇతర సభ్యులూ.. ఇలా అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. ఇదీ ఈ ఫొటోల వెనుకున్న అసలు కథ. హృద్యమైన ఈ ఫొటోలను చూసిన అనితా చౌహాన్ అనే ఓ సామాజిక కార్యకర్త వాటిని ట్వీట్ చేసింది. ఆ ఫొటోలను చూసిన హర్బజన్ సింగ్, కేజ్రీవాల్.. తదితరులు కూడా స్పదించి షేర్ చేశారు. ఇలా రెండు రోజుల్లో ఫొటోలు, వాటి వెనుకున్న కథ ఫుల్ వైరల్ అయిపోయింది. అంతే వేల షేర్లు.. లక్షల లైకులు.. ఈ ఫొటోలను వెనకున్న కథ చదివి కొంతమంది కన్నీరు పెడితే, మరికొందరు ఇదంతా ట్రాష్. ఇవి మార్ఫింగ్ ఫొటోలు అయి ఉంటాయి. అయినా సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్‌లు మామూలే కదా అనుకున్నారు. కానీ ఈ ఫొటోల వెనుకున్న అసలు కథను ఆ ఫొటోలను తీసిన గుజరాతీ సీనియర్ ఫొటో జర్నలిస్టు కల్పిత్ భరేచ్ చెప్పాడు. అదేంటంటే..
‘‘అది అహ్మదాబాద్. 2007, సెప్టెంబర్ 12వ తేదీన మణినగర్‌లోని జీఎన్సీ స్కూలు ప్రిన్సిపల్ రీటాబెన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. పిల్లలు ఫీల్డ్ ట్రిప్‌కు వెళుతున్నారని, ఫొటో తీయడానికి రమ్మని ఆ ఫోను సారాంశం. నేను కూడా గోడాసర్ ఏరియాలోని మణిలాల్ గాంధీ వృద్ధాశ్రమానికి వెళ్లాను. అక్కడికి పిల్లలు కూడా వచ్చారు. ఒక ముసలామెను చూసి ఓ స్కూల్ విద్యార్థిని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఆ క్షణంలో ఆశ్చర్యపోతూనే ఫొటోలను తీశాను. వారి గురించి తెలుసుకుంటుంటే ఒకవైపు మనసు మెలిపెడుతున్నా కెమెరాకు పని చెప్పాను. కళ్లు వర్షిస్తున్నా కెమెరా కంటితో ఆ దృశ్యాల్ని బంధించాను. నేనే కాదు అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్లూ తడిశాయి. కాసేపటికి వాతావరణాన్ని తేలికబరచడానికి పిల్లలు పాటలు మొదలుపెట్టారు. ఈ ఫొటో పొద్దునే్న దివ్యభాస్కర్ పత్రికలో ఫస్ట్ పేజీలో వచ్చింది. పెద్ద సంచలనం.. గుజరాత్ మొత్తం అదే చర్చ. ఆ ఫొటోలో అంత హృద్యమైన కథ దాగుంది. ఆ ఫొటో తీసే అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా అనిపించింది. వృత్తిలో భాగంగా చాలా రకాల ఫొటోలు తీస్తుంటాం. కానీ తృప్తినిచ్చే ఫొటోలు కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిలో కూడా పేరు తెచ్చేవి కొనే్న.. కానీ ఈ ఫొటో వల్ల కెరీర్‌లోనే తొలిసారిగా వందల ఫోన్‌కాల్స్ వచ్చాయి. అసలు సంతృప్తినిచ్చిన విషయం ఏమిటంటే.. తరువాతరోజు ఇతర పత్రికలకు చెందిన కొందరు రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లు వెళ్లి ఆమెను పలకరించగా.. ఆ తల్లి తనంతట తానుగానే వృద్ధాశ్రమానికి వచ్చానని చెప్పింది. కన్నపేగు మరి అలాకాక ఎలా చెబుతుంది. తన కొడుక్కు చెడ్డపేరు వస్తుంటే ఏ తల్లి అయినా తట్టుకుంటుందా? ఇంటికి వెళ్లిన తన బిడ్డ ఏడుపుతో కదిలిపోయిన ఆ తండ్రి.. కూతురిపై ప్రేమతో, లోకనిందకు భయపడి ఆ తల్లిని ఇంటికి తెచ్చేసుకోవడం కొసమెరుపు.. ఏమైతేనేం.. ఒక ఫొటో తల్లీ బిడ్డలను, నానమ్మ మనవరాళ్లను కలిపింది. అలా నా ఫొటో వారి జీవితాల్లో ఆనందాన్ని నింపింది’’ అని ముగించాడు ఆ ఫొటో జర్నలిస్టు.
పదకొండేళ్ల తర్వాత..
ఇది జరిగింది 2007లో కదా.. మరి ఇప్పుడెందుకు సోషల్ మీడియాలో వైరలవుతుంది అనే సందేహం ప్రతి ఒక్కరికీ కలగచ్చు. ఆగస్టు 19 ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బీబీసీ గుజరాతీ రాష్టవ్య్రాప్తంగా ఉన్న జర్నలిస్టులను తమ కెరీర్‌లో తీసిన ఉత్తమమైన ఫొటోలను షేర్ చేయమని కోరింది. గుజరాతీకి చెందిన భరేచ్.. తన బెస్ట్ ఫొటోలన్నింటినీ బీబీసీకి షేర్ చేయగా.. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి మరోసారి అందరినీ కదిలించి కన్నీరు తెప్పించింది. భరేచ్ ప్రస్తుతం దివ్యభాస్కర్‌లో పనిచేస్తున్నాడు. ఈ ఫొటో మరోసారి వైరల్ అయ్యేసరికి ఆ నానమ్మ, మనవరాలు ఎలా ఉన్నారో అని బీబీసీ ఒకసారి వాళ్లను కలిసింది. వాళ్లంతా ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. ఆ నానమ్మ పేరు దమయంతి.. ఆ మనవరాలి పేరు భక్తి.
ఏది ఏమైనా పాపిష్టికలికాలం అనుకుంటున్న ఈ కాలంలో కూడా మానవత్వం నిండిన మనసున్న మనుషులు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ వందనాలు!