సబ్ ఫీచర్

కర్మఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరించలేని కష్టాలు పడేవారిని చూచి ఏ జన్మలో వీరు ఏ పాపం చేశారో, ఇపుడు అనుభవిస్తున్నారు అంటారు. అలాగే సుఖాలు పొందేవారిని చూచి గత జన్మలో పెట్టి పుట్టారు అందువలన సుఖపడుతున్నారు అంటారు. కర్మఫలాన్ని అనుభవించకుండా ప్రకృతిలో ఏ శక్తి ఆపలేదు. ఒక చెడ్డ పని చేస్తే దానివలన బాధ అనుభవించి తీరాలి. ఒక మంచి పని చేస్తే దాని ఫలితం తప్పక లభిస్తుంది. నిత్యం అనేకమంది పాపప్రక్షాళన కొరకు గంగాస్నానం చేస్తున్నారు. వారి పాపాలన్నీ అందువలన తొలగిపోతాయా? అని రామకృష్ణ పరమహంసను శిష్యులు ప్రశ్నించగా, వారి పాపాలు గంగ ఎందుకు స్వీకరిస్తుంది? వారు స్నానానికి వెళ్లేముందు ఆ పాపాలు ఒడ్డునగల చెట్లపై ఆగుతాయి. స్నానం చేసి రాగానే తిరిగి ఆవహిస్తాయి అన్నారు. మానవుడు ఈ లోకంలో సత్కర్మలు ఆచరిస్తూ నూరేళ్లు జీవించాలని అభిలషించాలి. కర్మలు మూడు విధాలు. ఒకటి సత్కర్మ, రెండు దుష్కర్మ, మూడు అకర్మ. సత్కర్మ దుష్కర్మ అంటే అందరికీ తెలుసు. అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండడం. ఒక్కొక్కప్పుడు ఏది సత్కర్మో ఏది దుష్కర్మో నిర్ణయించడం కష్టం. పండితులు సైతం ఈ విషయంలో భ్రాంతికి లోనవుతారు అని గీత చెబుతూంది. ‘మాగృధః కస్యస్విధ్ధనమ్’ అని యజుర్వేదం చెబుతోంది. అనగా ఎవరి ధనాన్ని ఆశించకూడదు. లోకంలో సమస్త దుష్కర్మలకు ఆశయే మూలం. ఆశను విడచి చేసే కర్మ నిష్కామ కర్మ. అలాంటి కర్మలు ఆచరించమని వేదం చెబుతోంది. నూరేళ్లు పూర్ణాయువుతో జీవించాలంటే సత్కర్మలనే ఆచరించు అని వేదవాక్కు. ఈ మార్గమే ఎందుకు గొప్పది? అనే సందేహం కలగవచ్చు. నిష్కామకర్మలు మానవుని బాధించవు. మానవులు పాపపుణ్య ఫలాలు అనుభవించడానికి జన్మలు ఎత్తి తీరవలసిందే. పాప ఫలం లాగే పుణ్యఫలం కూడా సంసార చక్రంలో బంధిస్తుందే కాని మోక్షాన్ని ఈయలేదు. కనుక మోక్షం కోరుకునే వ్యక్తి నిష్కామ కర్మలు ఆచరించాలి. నిష్కామ కర్మలు మనుష్యుని బంధంలో చిక్కుకోకుండా చేసి మోక్ష మార్గానికి అర్హుణ్ణి చేస్తాయి. అన్నివిధాలా సంగం త్యజించడం మేలు. అలా త్యజించడానికి వీలు కాకపోతే సజ్జనులతోనే సంగం పెట్టుకోవాలి. సత్సాంగత్యమే ఆశలను నివారించగల దివ్యౌషధం. కోరికలను విడచిపెట్టాలి. వదలడం సాధ్యంకాకపోతే మోక్షంపైనే కోరిక పెట్టుకోవాలి. బాహ్య పదార్థాలపై మమకారం పెంచుకున్నవారే దుఃఖసాగరంలో మునిగిపోతారు. ఇల్లు తగులబడిపోయినపుడు యజమాని దుఃఖిస్తాడు. కాని ఆ యింటిలో అంతవరకు నివసించిన బల్లులు ఎలుకలు వంటివి వేరే ఇల్లు చూసుకుంటాయి. అవి దుఃఖించవు. అందుకు కారణం యజమానివలె వాటికి ఆ ఇంటిపై మమకారం లేకపోవడమే. పృధ్విజలం తేజస్సు వాయువు ఆకాశం అనే పంచభూతాలలోనే నేను ఏదీ కాదు. వీటి కలయికవల్లనే శరీరం ఏర్పడింది. అందువలననే శరీరం భౌతిక భోగాలకు ఆరాటపడుతుంది. నేను కేవలం ఆత్మ స్వరూపుడను. సుఖ దుఃఖాలతో నాకు పనిలేదు అనే భావన పెంపొందించుకోవాలి.

కం కర్మంబులెల్ల బాయను మర్మముతలపంగ లేదు మధురిపుపేరే
పేర్మిని నొడవుట కంటెను దుర్మదమున చిత్తమెన్ని త్రోవలజన్నన్
అనగా కర్మలన్నీ విడిపోవడానికి వేరే ఉపాయం ఏదీ లేదు. చెప్పిన మాట వినకుండా ఎదురుతిరిగిన మనస్సు ఎన్ని మార్గాలలో పోయినా సర్వదా నారాయణ స్మరణ చేయడమే సరియైన ఉపాయం. అజామిళుడు అనే దుష్టుడు అవసానకాలంలో కుమారుని పేరుతో పిలిచాడు. అతని పేరు నారాయణ. అది విష్ణునామం కావడంవలన హరి సాన్నిధ్యాన్ని చేరగలిగాడు. ఇక భక్తిపూర్వకంగా భగవన్నామాన్ని ఉచ్చరిస్తే ఆ ప్రభావం అంతిమదశలో సద్గతి కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

-వేదుల సత్యనారాయణ