సబ్ ఫీచర్

నిస్వార్థ సేవకు నీరాజనం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషుల మస్తిష్కాలలో డబ్బు యావ తప్ప సమాజ శ్రేయస్సు అనే పదం తుడిచిపెట్టుకుపోతోంది.
ఇదివరలో ఇళ్ళముందు వుండే పెద్ద పెద్ద నూతులు పూడ్చి అంత చోటు వృధాగా పోకూడదని అక్కడో గది కడతారు. గోడవారకి ఓ మూలగా బోర్‌వెల్ తవ్వుతారు. ఆ బోర్‌లో నీళ్ళు వానాకాలంలో తప్ప వేసవిలో వుండవు. అప్పుడది బోరే!
అందరూ చేసే పని వేసవిలో లారీలతో నీళ్ళు కొనుక్కోవడమే! తాగడానికి వేరే సీసాలు. అలా సంపాదించే డబ్బు ఇలా పోతోంది. ఎటొచ్చీ ఆర్థిక సేవ స్వార్థ సేవ తప్ప సంఘ సేవ మటుమాయం. ఇంటికి ఎవరైనా వస్తే మంచినీళ్ళు ఇమ్మని అడిగితే కూడా సగం గ్లాసులో నీళ్లు ఇచ్చే రోజులు వచ్చాయి. ఇదివరలో ఇంటికి ఎవరైనా వస్తే ముందుగా ఓ పెద్ద గ్లాసుడు మంచినీళ్ళుచ్చే కుశల ప్రశ్నలు వుండేవి. కాస్త వెసులుబాటుంటే మజ్జిగతోనే పలకరింపులు.
ఈ రోజుల్లో చెట్ల నీడలు, చలివేంద్రాలు ఎదురుచూడలేం. కనుక ఇంటినుంచి వెళ్ళేటప్పుడే ఓ పెద్ద నీళ్ళ సీసాకి తడిగుడ్డ చుట్టి (నీళ్ళు వేడెక్కకుండా) తీసుకువెళ్ళాలి. తప్పనిసరైతే తప్ప ఎండవేళ బైటికి వెళ్ళకూడదు. వెళ్తే ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలమీద తడిగుడ్డ వేసుకోవడం మంచిది. నామోషీ మడి బాగోదు అనుకుంటే తరువాత మన పరిస్థితి బాగుంటుందో? అసలు వుండదో చెప్పలేం!
ఇంట్లోంచీ వెళ్ళే ముందే బాగా ఏదన్నా తిని పళ్ళరసాలు, మంచినీళ్ళు తాగి వెళ్ళడం మంచిది. మామిడి కాయల రసం వడదెబ్బనుండి కాపాడుతుంది. కూడా తీసుకువెళ్ళడం మంచిది. మనకి అవసరం లేకపోయినా ఆ పరిస్థితిలో వున్న వాళ్ళెవరైనా తారసపడితే వారికిచ్చి వారి ప్రాణాల్ని కాపాడవచ్చు.
అది ఒక గొప్ప పుణ్యకార్యమని, నలుగురూ పొగడాలని కాక సాటి మనిషిగా అది మన బాధ్యత అనుకుని చేయాలి.
వేసవిలో అందరూ సాధారణంగా మామిడిపళ్ళు తింటారు. ఆ టెంకలు కుప్ప బుట్టలో పడేస్తే వాళ్ళు ఎక్కడో ఊరి వెలుపలకి తీసుకెళ్ళి పడేసి తగలబెడతారు.
దానికి బదులుగా వాటిని జాగ్రత్త చేసి ఓ కవరులో పెట్టుకుని మనం బైటికి వెళ్ళినపుడు ఎక్కడైనా ఖాళీ స్థలం కనబడితే అందులో చిన్న గొయ్యి తీసి కప్పెడితే వానలు పడ్డాక మొక్కలొస్తాయి. అవి ఎదిగి పెద్దవయ్యాక కొందరికి నీడనిస్తాయి. కాయలు కాస్తే దారిపోయే పేదవారికి ఉపయోగపడతాయి.
‘ఆ మొక్క నేను నాటాను. దాని కాయలు నేనే తినాలి లేదా అమ్మి డబ్బు సంపాదించాలి. అక్కడెక్కడో నాటితే నాకేం లాభం?’- ఇలా ఆలోచించకూడదు. అవి చెత్తలో పడెయ్యాలనుకున్న టెంకలే కదా! అలాగే ఓ చోట పడేశామనుకుంటూ వుంటే ఇలాంటి స్వార్థపు ఆలోచనలు రావు. మన పెద్దలు అలా ఆలోచించి మొక్కలు నాటివుంటే ఈనాడు మనకి మామిడిపండ్లు, కాయలు వుండేవి కాదు. మామిడి ఒక్కటే కాదు, సపోట, సీతాఫలం, పసన వంటి ఎన్నో ఫలాలు తిన్నప్పుడు ఆ గింజలు ఆ విధంగా ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో నాటితే భవిష్యత్తులో కొందరికైనా ఫలాలు ఇచ్చినా లేకున్నా నీడనిస్తుంది. ఎండన పడిన ప్రాణులు సేదతీరుతాయి. సంతృప్తి చెందుతాయి.
చలివేంద్రాలు పెట్టగలిగితే వేసవిలో ఎందరినో కాపాడినవారౌతారు. అందుకు వీలు లేకపోయినా ఇంటివారగా కాస్త నీడ వున్న చోట ఓ కుండతో నీళ్ళు పెట్టి దాని మూతపై ఓ ప్లాస్టిక్ గ్లాసు పెట్టి వుంచితే దారినపోయేవాళ్ళకి ఉపయోగపడతాయి.
ఓ హేండిల్ పోయిన ప్లాస్టిక్ బక్కెట్టో, అంచులు విరిగిన ప్లాస్టిక్ టబ్బులు పడేస్తూంటాము. వాటిలో నీళ్ళు పోసి ఓ గోడవారగా వుంచితే కుక్కలు, ఆవులు, మేకలు, కాకులు వగైరా అన్నీ వచ్చి మంచినీళ్ళు తాగి వెళ్తాయి.
ఆలోచిస్తే ఇలాంటివి ఎన్నో చెయ్యచ్చు. ముక్కిపోయిన బియ్యం, పురుగుపట్టిన పప్పు్ధన్యాలు మనం వృధాగా చెత్తబుట్టలో పడేస్తూంటాం.
అలా కాక వాటిని ఓ ప్రహరీ గోడమీదనో, డాబాపై పిట్టగోడమీదనో, వాకిటికి ఓ వారగానో వేస్తే వాటిని ఎన్నో పక్షులు, ఉడతలు మొదలైన జీవరాసులకి ఆహారంగా పనికివస్తాయి.
పుణ్యం కోసం పాకులాడేవారు భారీగా గుళ్ళల్లో పూజలు, అభిషేకాల పేరిట ఎన్నో పదార్థాలు (పాలు, పెరుగు, తేనె, కొబ్బరిబోండాలు వగైరా) వృధా చెయ్యక్కర్లేదు. వాటిని పేదవారికి పంచిపెడితే ఆ అభిషేకాలకి మించిన పుణ్యఫలం దక్కుతుంది.
‘మానవ సేవే మాధవ సేవ’ అని మన పెద్దలు ఎప్పుడో చెప్పినా మన మనసులు అటువైపు తిరగడం లేదు. మానవసేవే కాదు, మనుగడ సాగిస్తున్న ఏ ప్రాణి సేవైనా మాధవసేవే అవుతుంది. అందరిలో వున్న ఆ పరమాత్మని సంతృప్తిపరుస్తుంది. ఆ మూగజీవాలకి చెట్ల నీడ కల్పించినా మాధవసేవే! ఫలితం వెంటనే మనకి కనబడదు. దక్కకపోదు.

- ఆర్.ఎస్.హైమవతి