సబ్ ఫీచర్

ముక్తినిచ్చే మూకాంబిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రేతాయుగంలో శక్తిస్వరూపిణి జగన్మాత సౌపర్ణికా నది ఒడ్డున కోడచాద్రి కొండపై మూకాంబికాదేవి అవతరించింది. కర్ణాటక రాష్ట్రంలో మంగుళూరుకు 135 కి.మీల దూరంలో 3880 అడుగుల ఎత్తులో వున్న కోడచాద్రి కొండపై పరశురాముడు ప్రతిష్ఠించారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. మహామహితామూర్తి అయిన మూకాంబికాదేవిని దర్శించడానికి భక్తులు ఆ పర్వత శిఖరాన్ని ఎక్కలేకపోతున్నారని ఆదిశంకరాచార్యులు కొండ క్రిందిభాగంలో మూకాంబకాదేవిని పునఃప్రతిష్ఠ చేశారని పురాతన గ్రంథాలు చెప్తున్నాయి. శ్రీరాముడుకు రావణాసురుడికి జరుగుతున్న యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తున్న సమయంలో ఆ పర్వతంపై వున్న ఔషధాలు, వనమూలికలు కొన్ని కొల్లూరు ప్రాంతంలోని కొండ ప్రాంతంలో పడ్డాయని చరిత్ర చెబుతోంది.
ఈ కారణంగా ఈ ప్రాంతమంతా సుగంధ పరిమళాలతో కూడిన వనమూలికల సువాసనతో నిండి వుంటుంది. మహారణ్యపురం అనే నామంతో వున్న ఈ ప్రాంతంలో కోలమహర్షి తపస్సు చేసి శివుడిని మెప్పించాడు. స్వయంగా రూపుదిద్దిన పార్దివలింగాన్ని కోల మహర్షికి ఆ స్వామి ప్రసాదించాడు. ఆ కారణంగా ఈ ప్రాంతానికి కోలపురం అనే పేరు సార్థకమైంది. కాలక్రమేణా కొల్లూరుగా ఆ ప్రాంతాన్ని పిలుస్తున్నారు. కోల మహర్షి తపస్సుచేస్తున్న సమయంలో మూకాసురుడు అనే రాక్షసుడు ఆ మహర్షిని వేధిస్తూ తపోభంగం చేస్తుండటంవలన ఆ మహర్షి కోరిక మేరకు జగన్మాత మూకాంబికాదేవిగా అవతరించి మూకాసురుడిని వధించింది. ఆ తరువాత మహర్షి కోరికతో ఆ జగన్మాత మూకాంబికాదేవిగా అక్కడే వుండిపోయింది. ఆమెకు ఆలయాన్ని నిర్మించి ఆరాధించారు.
ఈ మహాశక్తి దుర్గాదేవి అవతారం శంఖ చక్రాలతో సింహంపై కూర్చున్నట్లుగా కనిపించే ఈ అమ్మవారితోపాటు పార్దివ లింగాన్ని శంకరాచార్యులు స్వయంగా ప్రతిష్ఠించారు. అమ్మవారికి ముందుభాగంలో పాదాల దగ్గర శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఆ తరువాత ఆదిశంకారాచార్యులు చేసిన తపస్సుకు మెచ్చి జగన్మాత ప్రత్యక్షమై దర్శనమిచ్చింది. ఆ రూపాన్ని మనసులో పదిలంగా వుంచుకున్న శంకరాచార్యులు పంచలోహాలతో ఆమె విగ్రహాన్ని రూపొందించి శ్రీచక్రం దగ్గర ఉంచారు. నిత్య అభిషేక పూజలు ఆ పంచలోహ విగ్రహానికి చేస్తుంటారు.
ఆనాడు శంకరాచార్యులు జరిపించిన అభిషేక పూజలన్నీ అదేవిధంగా నేటికీ జరుగుతున్నాయి. ఆదిశంకరాచార్యులు పూజలు చేసిన ఈ ఆలయంలో ఎంతో మహిమ వుందని, ఇక్కడ అమ్మవారిని దర్శించి ప్రార్థిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి సమీపంలో సౌపర్ణికా సరస్సు వుంది. ఇక్కడ నీరు ఎంతో స్వచ్ఛంగా వుంటాయి. భక్తులు ఈ సరస్సులో స్నానం చేసి అమ్మవారిని దర్శిస్తారు. పండుగ రోజులలో ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతుంటాయి. దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే పది చేతులతో ఆయుధాలు ఉన్న అభయ వినాయక విగ్రహం, సుబ్రహ్మణ్యస్వామి, వీరభద్రుడు, ఆంజనేయస్వామి మందిరాలు కూడా వున్నాయి.
ఆదిశంకరాచార్యుల విగ్రహం ఎంతో ప్రకాశవంతంగా ఆ స్వామి తపస్సు చేస్తున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఈ ఆలయంలో రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మహానివేదన హారతి ఇస్తారు. ఈ ఆలయంలో అక్షరాభ్యాసాలు ప్రతిరోజూ జరుగుతుంటాయి. ఈ ఆలయ సమీపంలో కోల మహర్షి ఆశ్రమం కూడా వుంది. ఈ ఆలయ దర్శనానికి భక్తులకు అనువుగా బస్సు సౌకర్యం కూడా వుంది. ప్రకృతి అందాలతో ప్రతినిత్యం భక్తుల సందడితో దేదీప్యమానంగా ప్రకాశించే ఈ ఆలయంలో మూకాంబికాదేవి దర్శనం భక్తులకు ఆ జగన్మాత వరప్రసాదం.

-కురువాడ మురళీధర్