సబ్ ఫీచర్

‘గిడుగు’.. వాడుక భాషకు ‘గొడుగు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు వాడుక భాష వ్యాప్తి కోసం అలనాడు గిడుగు వేంకట రామమూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయం. వాడుక భాషోద్యమ పితామహుడిగా, సంఘ సంస్కర్తగా చెరగని ముద్ర వేసిన ఆయన జన్మదినాన్ని (ఆగస్టు 29) ఏటా ‘తెలుగు భాషా దినోత్సవం’గా పాటిస్తున్నాము. గ్రాంథిక భాషతో కఠినంగా ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి, వ్యవహారిక భాషలోని అందాన్ని, వెసులుబాటును లోకానికి తెలియచెప్పిన మహనీయుడు ‘గిడుగు’. శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో 1863, ఆగస్టు 29న ఆయన జన్మించారు. ‘గిడుగు’ తల్లిదండ్రులు వెంకమ్మ, వీర్రాజులు. తండ్రి వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తుండేవారు. 1875 సంవత్సరం వరకూ రామమూర్తి పంతులు ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. 1879లో తండ్రి మరణానంతరం విజయనగరంలోని తన మేనమామ ఇంట్లో ఉంటూ, మహారాజా వారి ఇంగ్లీషు పాఠశాలలో ఆయన 1875 నుంచి 1880 వరకు చదివారు. 1879లో మెట్రిక్యులేషన్ పరీక్ష పాసయ్యారు. ఆరోజులలో ‘మహాకవి’ గురజాడ అప్పారావు రామమూర్తికి సహాధ్యాయి. చిన్నతనంలోనే ‘గిడుగు’కు వివాహం జరిగింది.
1880లో ముప్పది రూపాయల జీతం మీద పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో ఫస్ట్ఫురంలో చరిత్ర బోధించే అధ్యాపకుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. విద్యాసక్తి, కార్యదీక్ష, సత్యానే్వషణ వంటి లక్షణాలు చిన్నతనం నుండే ఆయనకు అలవడ్డాయి. సవరలు (గిరిజన తెగ) , హరిజనులు అంటరాని వారని అప్పటి సంఘం అంటుంటే, ఆ కాలంలోనే రామమూర్తి పంతులు సవర విద్యార్థులకు తన ఇంట్లోనే బస ఏర్పరచి భోజనం పెట్టేవారు. 1930లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడిన సమయంలో- పర్లాకిమిడి రాజా తన ప్రాంతాన్ని మొత్తం ఒరిస్సాలో చేర్పించడానికి ప్రయత్నించినపుడు- తెలుగు ప్రజల నాయకుడిగా రామమూర్తి ఎదురు నిలిచి తీవ్రంగా ప్రతిఘటించారు. పర్లాకిమిడి తాలూకాలో చాలా భాగాన్ని, ముఖ్య పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా ఒరిస్సాలో చేర్చడం వల్ల తెలుగువారికి అన్యాయం జరిగిందని రామమూర్తి నిరసన గళం విన్పించారు. 1936లో ఒరిస్సా రాష్ట్రం ఆవిర్భావ సమయంలో పర్లాకిమిడిలో వుండడానికి ఇష్టపడక, అదే రోజున ఆయన రాజమహేంద్రవరం వచ్చి అక్కడే తన శేష జీవితాన్ని గడిపారు. ఆయన పట్టుదలకు ఇది ఒక గొప్ప తార్కాణం. హైస్కూల్‌లో చరిత్ర పాఠాలు చెప్పే రోజులలోనే దగ్గరలో వున్న శ్రీముఖలింగం దేవాలయంలో చారిత్రక శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని ఆయన అధ్యయనం చేశారు. ‘గాంగ వంశీయుల’ గురించి ఇంగ్లీషులో ఆయన రాసిన ప్రామాణిక వ్యాసాలు ‘మద్రాస్ లిటరేచర్ జర్నల్’ ప్రచురించింది.
30 ఏళ్ల సర్వీసు పూర్తికాగానే అధ్యాపక వృత్తి నుంచి ఆయన 1911లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఆ రోజులలో పాఠశాలలు, కళాశాలల్లో గ్రాంథిక భాష రాజ్యమేలుతోంది. కందుకూరి వీరేశలింగం ప్రతిపాదించిన సరళ గ్రాంథికం కూడా అప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా తిరుగుతూ ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయిత కూడా నిర్దిష్టంగా రాయలేడని నిరూపించారు. 1919లో గిడుగు ‘తెలుగు’ అనే మాస పత్రికను స్థాపించి శాస్ర్తియ దృక్పథంలో వ్యాసాలు, రచనలు అందిస్తూ వాడుక భాష వ్యాప్తికి అవిశ్రాంతంగా పోరాటం సాగించారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షుడిగా, గిడుగు కార్యదర్శిగా ‘వర్తమానాంధ్ర భాషాప్రవర్తక సమాజం’ ఆవిర్భవించింది. 1936లో ‘ప్రతిభ’ అనే సాహిత్య పత్రికను ప్రారంభించారు. 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ చేసిన తన విన్నపంలో వ్యావహారిక భాషావ్యాప్తికి చాలా సంతృప్తి పొందుతున్నానని తెలిపారు.
గ్రాంథిక భాష గ్రంథాలలో కనబడేదే కానీ ఎవరి నోటా వినబడేది కాదు. ప్రసంగాలలో గ్రాంథిక భాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా, సరసాలాడుకున్నా హాస్యాస్పదంగా వుండేది. ‘గిడుగు’ వారు 1934లో ‘రైడెర్ ఏ హింద్’ అనే బిరుదును అందుకున్నారు. 1913లో ప్రభుత్వం ‘రావు సాహెబ్’ పురస్కారంతో సత్కరించింది. 1938లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో గౌరవించింది. ‘కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ ఓ సందర్భంలో ‘గిడుగు’ వారి గురించి మాట్లాడుతూ, ‘రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోముల పంట.. ఆయన వాదాన్ని అర్థం చేసుకోక దురర్థం కలిగించి తెలుగువాళ్లు ఎంతో నష్టపోయినారు..’ అన్నారు. మరో కవి పులిదిండి మహేశ్వర్ ‘గ్రాంథికమ్ము నెత్తిన పిడుగు- గిడుగు, వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు’ అన్నారు. తెలుగు భాషను తన సర్వస్వంగా భావించిన ఆయన జనవరి 22, 1940న కన్నుమూశారు. మాతృభాష కోసం, వాడుక భాష కోసం కృషి చేయడమే మనం ఆయనకు అర్పించే నివాళి అవుతుంది. ఆయన ఆశయాలను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆచరించాలి. ప్రపంచ తెలుగు మహాసభలతో పాలకుల బాధ్యత తీరిపోదు. రామమూర్తి పంతులు జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

(నేడు గిడుగు రామమూర్తి జయంతి....)

-కామిడి సతీష్‌రెడ్డి 98484 45134