సబ్ ఫీచర్

శనైశ్చరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవగ్రహాలలో శనిగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. సూర్యుని కుమారుడు, యుమునికి సోదరుడు అయిన శని అంటే మానవులకు భక్తి కంటే భయమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకు కారణం శనిగ్రహ ప్రభావం వల్ల కష్టాలు వస్తాయని, శని పట్టినపుడు అనేక సమస్యలను, సంకట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనే ఒక నమ్మకం ఉండటమే. కాని శని సంచారం జాతకంలో ఉన్నపుడు మంచి ఫలితాలను కూడా ప్రసాదిస్తాడు అని తెలుసుకోవాలి. శని గురించి అపోహలతో అనవసర భయాలను కలిగి ఉండటం సరికాదు.
శని మందంగా అంటే నెమ్మదిగా సంచరించే గ్రహం. అందుకే శనికి మందుడు అని, శనివారానికి మందవారం అని పేర్లు ఉన్నాయి. సాధారణంగా ప్రతి మనిషి జాతకంలోను నవగ్రహాలు సంచరిస్తూ తమ తమ స్థానాలను మార్చుకుంటూ జీవితంలో జరిగే మంచి చెడులకు ఉన్నత, సామాన్య, అథమ స్థితులకు కారకులవుతూ ఉంటారు. ఆయా గ్రహాల ఉచ్ఛస్థితి, నీచస్థితులను బట్టి ఒక వ్యక్తి జీవితంలో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఉండటం సహజం.
ప్రతి వ్యక్తి జీవితంలోను ఏదో ఒక సమయంలో శని తన ప్రభావాన్ని చూపించక మానడు. శని జాతక చక్రంలో వున్న స్థితిని బట్టి మంచి చెడు ఫలితాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. శని ప్రవేశించిన జాతకాన్ని పరిశీలించినవారు ఏలిననాటి శని, అష్టమ శని, అర్థాష్టమ శని అని ఇలా శని ఆ జాతకంలో వసించే సమయాన్ని బట్టి లెక్కించి చెబుతూ ఉంటారు. శనిదోషంవల్ల అనారోగ్య బాధలు, ఎక్కువగా కాళ్ళకు సంబంధించినవి, ప్రమాదాలు, పనులలో ఆటంకాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. శనిని దూషించటంగాని, నిర్లక్ష్యంగా మాట్లాడటం కాని చేయకూడదు. కష్టాలు వచ్చినపుడే మనిషిలో వున్న ఓర్పు తెలుస్తుంది. ధైర్యంగా సమస్యలను పరిష్కరించుకునే మార్గం తెలుసుకుని ఆచరించగలగాలి.
మహారాష్టల్రోని ‘శని సింగణాపూర్’, ఆంధ్రలోని ‘మందపల్లి’ శనికి సంబంధించిన ప్రముఖ క్షేత్రాలుగా ప్రసిద్ధి. శని బాధలనుండి నివారణ కోసం భక్తులు ఎక్కువగా ఈ క్షేత్రాలకు వెళ్లి పూజలు చేయించుకుంటూ ఉంటారు. మనం నిత్యం దర్శించుకునే ఇతర దేవాలయాలలో కూడా నవగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి. శనికి ప్రధానమైన శనివారంనాడు శనికి పూజలు జరిపించి శని బాధలనుండి నివారణ పొందవచ్చు.
శనికి నలుపు రంగు అంటే ఇష్టం. ఆయన వాహనం నల్లగా ఉండే కాకి. నల్లని నువ్వులు, నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నల్లని వస్త్రాన్ని ధరింపజేసి వంగపండు రంగు పువ్వులతో పూజించి ధూపదీపాలు ఇచ్చి, పండ్లు, కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి. కర్పూర హారతిని ఇవ్వాలి. శనైశ్చరునికి భక్తిశ్రద్ధలతో ఈ విధంగా పూజలు చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేసి శని బాధలు తొలగుటకై ప్రార్థించాలి. శనికి ఎప్పుడూ కూడా ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. ఆయన చూపులు తీక్షణంగా ఉండటంవలన ఆ చూపులను తట్టుకునే శక్తి మనకు ఉండదు కనుక దుష్పరిణామాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఈ విషయం తెలియక ఎదురుగా నిలబడి పూజించటం, నమస్కరించటం చేస్తుంటారు. ఒక పక్కగా ఉండి చేయటమే మంచిది. త్రయోదశి తిథి కలిసివచ్చిన శనివారం శని పూజలకు శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. శని త్రయోదశినాడు శని ఆరాధన, పూజ, స్తోత్ర పఠనము, ప్రదక్షిణలు వెంటనే ఫలించి శని ప్రభావం త్వరగా తొలగటానికి ఉపయోగంగా ఉంటుంది.
ఎంతటివారైనా శని ప్రభావం నుండి, శని పెట్టే బాధలనుండి తప్పించుకోలేరు అనటానికి ఉదాహరణగా ఒక కథ ప్రచారంలో వుంది. ఒకసారి పరమశివునితో శని ‘నేను ఆవహించినవాళ్ళు కష్టాలపాలు కావలసిందే! నా నుండి ఎవరూ తప్పించుకోలేరు’ అన్నాడట. ‘అయితే నన్ను కూడానా?’ అని అన్నాడు శివుడు.
‘అవును రెండు రోజులు నేను నిన్ను పట్టబోతున్నాను’ అన్నాడు శని.
ఆ తరువాత శని నన్ను ఎలా పట్టుకుంటాడో చూద్దాం అని ఎవరికీ తెలియకుండా శివుడు భూలోకానికి వచ్చి ఒక చెట్టు తొర్రలో దాగి ఉన్నాడు. రెండు రోజులు గడిచాక తిరిగి కైలాసానికి వెళ్లాడు. శనైశ్చరుడు వచ్చినపుడు ‘చూశావా! నువ్వు నన్ను పట్టుకుంటానన్నావు కాని పట్టలేకపోయావు. ఒప్పుకుంటావా?’ అన్నాడు.
అందుకు శని- ‘పరమేశ్వరా! నేను పట్టాను కాబట్టే నువ్వు రెండు రోజులు కైలాసాన్ని వదిలి భూలోకంలో ఒక చెట్టు తొర్రలో ఉండవలసి వచ్చింది’ అన్నాడు. అపుడు శివుడు శని ప్రభావాన్ని గ్రహించి, అతనిని మెచ్చుకుని ఇకనుండి నన్ను పూజించిన వారికి శని ప్రభావం తొలగిపోతుంది అని వరమిచ్చాడట. అందువలన శివారాధన చేసేవారిని శని బాధించడు. అంతేగాకుండా ఆంజనేయస్వామి కూడా శివుని అంశయే కాబట్టి ఆయనను శనివారంనాడు అర్చించి ఆరాధించినవారికి కూడా శని బాధలు తొలగిపోతాయి. భయాందోళనలను వదలి శ్రద్ధగా శనిని పూజించటంవలన, శని మంత్రజపంవలన ఆటంకాలను, అపజయాలను ధైర్యంగా ఎదుర్కొనగలుగుతాము.

-అబ్బరాజు జయలక్ష్మి