సబ్ ఫీచర్

ముందస్తు ముంచుకొస్తోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నంగా ఆలోచించే వర్తమాన రాజకీయ నాయకుల్లో కేసీఆర్ ముం దు వరసలో నిలుస్తారు. ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రిగా కావచ్చు, పార్టీని శాసించే అధ్యక్షుడిగా కావచ్చు. ఆయనది ఒక విలక్షణ శైలి. పుష్కర కాలానికి పైగా ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిపిన తీరును, ఆ స్వప్నాన్ని సాకారం చేసుకున్న విధానాన్ని దగ్గరనుంచి పరికించిన వారికి, నలుగురి ఆలోచనలకు భిన్నంగా కేసీఆర్ ఎలా ఆలో చిస్తారో, ఎవరికీ అంతుచిక్కని విధంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారో అనేది కరతలామలకం. ప్రత్యేకమైన ఈ స్వభావమే కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఒక విలక్షణ నాయకుడిగా తయారు చేసింది. ఆయనకే సొంతమైన ప్రసంగ చాతుర్యం కూడా కేసీఆర్‌లోని నాయకత్వ లక్షణాలను మరింత పరిపుష్టం చేసింది. ఈ విలక్షణ స్వభావం నుంచి పుట్టుకొచ్చిందే ఇప్పుడు నలుగురి నోళ్ళలో నానునుతున్న ‘ముందస్తు ఎన్నికల’ చర్చ.
ప్రతివాళ్లూ ‘ముందస్తు, ముందస్తు’ అని ఒకటికి పది సార్లు అంటున్నారే కాని కేసీఆర్ నోటివెంట ఎన్నడూ ఈ ముందస్తు మాటే రాలేదు. పైపెచ్చు, ‘జరగాల్సిన సమయం’ కన్నా ఆరు నెలల లోపు జరిగే ఎన్నికలను ‘ముందస్తు ఎన్నికలు’ అనరని ఆయనే కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. కాబట్టి ఎవరు ఈ విషయంలో ఏమి మాట్లాడుకున్నా ఆయన లక్ష్యపెట్టేది లేదని తేలిపోయింది. నిజజీవితంలో కేసీఆర్ భోలాశంకరుడని ఆయన ప్రత్యర్ధులు సయితం మెచ్చుకోవడం కొత్తేమీ కాదు. కానీ, రాజకీయం దగ్గరికి వచ్చేసరికి ఆయన రూటే సపరేటు. ఎప్పుడు ఏం చెయ్యబోతున్నదీ ముందే నిర్ణయం తీసుకున్నా ఆ విషయంలో గట్టి గోప్యత పాటిస్తారు. అదే ఆయన రాజకీయ విజయాల వెనుక దాగున్న చిదంబర రహస్యం.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయో లేదో అనేదానిపైన ఇంతవరకు స్పస్థత లేదు. అయినా ఆ అంశంపై తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశంలో ఇంకా అనేక చోట్ల చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే ఇది నిప్పులేని పొగ అనుకోవడానికి వీలులేదు. ఈ మధ్య కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి వచ్చారు. అంతకు ముందు మంత్రులతో, పార్టీలో బాధ్యులతో సమావేశాలు జరిపారు. పార్టీ ఎంపీలను, సీనియర్ అధికారులను ఢిల్లీ పంపి కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడించారు. ఇంత వరకు కేంద్రం వద్ద పరిష్కారానికి ఎదురు చూస్తున్న అనేక విషయాలకు సంబంధించి అనుమతులు సాధించారు. ఎన్నికల్లో విజయావకాశాలను అధ్యయనం చేయించే సర్వేలను జరిపి మరోసారి అధికారానికి రావడం తథ్యమనే నిర్ధారణకు వచ్చారు. ఆ విషయాన్ని దాచుకోకుండా ఢంకా బజాయించి మరీ చెప్పారు. పాతిక లక్షల మందికి తగ్గకుండా జనం హాజరయ్యే విధంగా హైదరాబాదు సమీపంలోని కొంగర కలాన్‌లో సెప్టెంబర్ రెండో తేదీన ‘ప్రగతి నివేదన’ మహాసభ ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఇన్ని కారణాలను విశే్లషించుకుంటే ఇదేదో కచ్చితంగా ‘ముందస్తు’ ఎన్నికల సన్నాహమే అనే ఊహాగానాలకు ఊపిరి పోస్తోంది.
ఇప్పుడు అందరి దృష్టీ ఈ సభలో కేసీఆర్ చేయబోయే ప్రసంగంపైనే కేంద్రీకృతమై ఉంది. ఆ ఉపన్యాసం ద్వారా కేసీఆర్ ఈ ఊహాగానాలకు తెర దించుతారా? లేదా వాటిని నిజం చేస్తూ ఏదైనా ప్రకటన చేస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రజల్లో, ప్రత్యర్ధి పార్టీల్లో రగులుతున్న ఈ ఆసక్తిని గమనిస్తే కేసీఆర్ వేయబోయే కొత్త ఎత్తుగడ సగం ఫలించినట్టే అనిపిస్తోంది. ముందే చెప్పినట్టు పరిపక్వత చెందిన రాజకీయ చాతుర్యానికి ఇది మరో మచ్చు తునక. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఆయన ఇదే విధమైన విధానాన్ని అమలు చేసి, చివరాఖరుకు విజయాన్ని కొంగున ముడేసుకున్నారు. ఉద్యమ పార్టీల పుట్టుక, ఎదుగుదల ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ సాగుతాయి. ఇందుకు టీఆర్‌ఎస్ పార్టీ కూడా మినహాయింపు కాదు. పద్దెనిమిదేళ్ళ క్రితం సంగతులను సింహావలోకనం చేసుకుంటే ఎన్ని బాలారిష్టాల నడుమ ఈ పార్టీ బతికి బట్టకట్టిందీ అవగతమవుతుంది. తెలంగాణా ప్రజలకు ఉద్యమాలు కొత్తకాదు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం గతంలో పలుమార్లు ఉద్యమాలు జరిగాయి. అయితే ప్రతిసారీ అవి హింసాత్మకంగా మారాయి. సాధించింది ఏమీ లేకపోవడంతో అసలు ఉద్యమాల పట్లనే ప్రజలకు ఏవగింపు కలిగే పరిస్థితిలో కేసీఆర్ రంగప్రవేశం చేసి సుదీర్ఘ శాంతియుత పోరాటానికి బాటలు వేశారు. స్వల్ప సంఘటనలు మినహాయిస్తే పుష్కర కాలం పైచిలుకు సాగిన తెలంగాణ సాధన పోరాటంలో ఎక్కడా అపశ్రుతులు దొర్లిన దాఖలాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ముందు చెప్పినట్టు, వినూత్నంగా ఆలోచించే కేసీఆర్ తత్వం, తెలంగాణ ఉద్యమ స్పూర్తి ఏ దశలోనూ దెబ్బతినకుండా కాపాడింది. ఉద్యమజ్యోతి వెలుగులు మసిబారకుండా చూసింది. ఈ క్రమంలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు ఎప్ప టికప్పుడు ఉద్యమ తీవ్రత తగ్గుముఖం పట్టకుండా చేయగలిగాయి. ఉద్యమ తీవ్రతలో హెచ్చుతగ్గులు వుండవచ్చేమో కానీ, త్రికరణశుద్ధిగా సాగించే ఉద్యమాలు, ఆందోళనలు వైఫల్యం చెందే ప్రశే్న ఉండదని కేసీఆర్ నమ్మకం. ఈ పరిణామ క్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, మోసిన నిందలు అన్నీ ఇన్నీ కావు. తీసుకున్న ప్రతి నిర్ణయం అవహేళనలకు గురైంది. వేసిన ప్రతి అడుగు అపనిందల పాలయింది. అయినా కేసీఆర్ ప్రతి మలుపును గెలుపు దిశగా మళ్ళించుకుని, పార్టీకి ఎప్పటికప్పుడు నూతన జవసత్వాలను అందిస్తూ పోయారు. ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డారు.
దశలు దశలుగా, రకరకాలుగా రూపాలు మార్చుకుంటూ సాగించిన ఉద్యమం ఒక కొలిక్కి రావడానికి పట్టిన సమయం కూడా దశాబ్ద కాలం పైమాటే. మరి అనే్నళ్లు ఒక ఉద్యమ పార్టీ ఊపిరి పీల్చుకోవాలంటే మాటలు కాదు. సాధ్యమూ కాదు. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన సత్తా ఉండబట్టే కేసీఆర్ తెలంగాణ ప్రజల దృష్టిలో ఒక గొప్ప నాయకుడు కాగలిగారు. మొత్తం మీద ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు. సరే ఇదొక ఎత్తు అనుకుంటే, అధికారం సిద్ధించిన తరువాత ఎదురయ్యే పరిణామాలను సమర్ధవంతంగా నిభాయించుకోవడం మరో ఎత్తు. పార్టీని చీల్చయినా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూసే శక్తులు పక్కనే పొంచి ఉంటాయి. ఏమరుపాటుగా వుంటే చాలు ఏమి చేయడానికయినా సిద్ధం అన్నట్టు వ్యవహరించే శక్తులను ఆదిలోనే కట్టడి చేసిన విధానం కేసీఆర్ వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన ఒక ఉద్యమ నేత మాత్రమే కాదు, చాణక్య నీతిని సయితం వంటబట్టించుకున్న వ్యూహకర్త అని ప్రపంచానికి వెల్లడయింది.
తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే పుష్కర కాలంగా తన మెదడులో సుడులు తిరుగుతున్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చే పనికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణ చీకటి కూపం అవుతుందని వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించిన వారు చేసిన ఎద్దేవాలను గుర్తు పెట్టుకుని, పట్టుదలగా పనిచేసి, కరెంటు కోతల ఇబ్బందులను మంత్రదండంతో మాయం చేసినట్టు మాయం చేశారు. రాష్ట్రం విడిపోగానే హైదరాబాదులోనూ, ఇతరత్రా తెలంగాణలోనూ స్థిరపడ్డ ప్రాంతీయేతరులు తమ భవితవ్యంపై పెంచుకున్న భయాందోళనలను అనతికాలంలోనే మటుమాయం చేశారు. భగీరథ, కాకతీయ వంటి బృహత్తర పధకాలను అమలుచేస్తూ బంగారు తెలంగాణ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ ధ్యేయం పూర్తిగా నెరవేరాలంటే మరోసారి అధికారం చేతికి దక్కినప్పుడే సాధ్యం అవుతుంది. లేకపోతే ఇంతవరకు చేసిన కృషి ఈనగాచి నక్కల పాలు చేసినట్టవుతుందనే సందేహమూ కేసీఆర్‌కు ఉండి ఉండొచ్చు. అంచేతే, పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడే ప్రజాతీర్పు కోసం పోవా లనే నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ఏమైనా ఇవన్నీ ప్రస్తుతానికి ఊహా గానాల ప్రాతిపదికపై చేసే అంచనాలే. పెద్దగా చర్చ అనవసరం. విదియనాడు కనబడని చంద్రుడు తదియనాడు తానే కనబడతాడని సామెత. కనక, కొంగర కలాన్ సభ పూర్తయ్యే వరకు సంయమనం పాటించడం విజ్ఞత.

--భండారు శ్రీనివాసరావు 98491 30595...bhandarusr@gmail.com