సబ్ ఫీచర్

తెలంగాణ మేలుకే ‘ముందస్తు’..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మాది సాధువుల మఠం కాదు రాజకీయ పార్టీ.. బాజాప్తా రాజకీయమే చేస్తాం..’-అని తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో అనేక సార్లు ప్రకటించారు. ప్రత్యర్థులెవరైనా తనను విమర్శిస్తే- ‘మీరు రాజకీయం చేస్తున్నారు..’ అని అనడం తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటు. కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా- రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు. ప్రతిదానిలో రాజకీయం ఉంటుంది. కొందరు నిజాయితీగా ఆ మాట ఒప్పుకుంటారు. కొందరు తామేదో ‘సాధువుల మఠంలో సేవ చేస్తున్నాం’ అన్నట్టు నటిస్తారు. రాజకీయ పక్షాలు రాజకీయమే చేస్తాయి.. రాజకీయమే చేయాలి కూడా. ‘ముందస్తు ఎన్నికలు’ కచ్చితంగా కేసీఆర్ రాజకీయ వ్యూహమే. ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళితే తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ముందస్తు ఎన్నికలు జరిగినట్టు అవుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ముందస్తు ఎన్నికల వ్యూహం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చల సంగతి ఎలా ఉన్నా కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఎవరైనా ముందస్తుకు వెళతారు. 1999 ఎన్నికలలో స్వల్ప తేడాతో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో విజయం సాధించారు. ఆ తరువాత విద్యుత్ ఉద్యమం, రైతులపై కాల్పులు, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమం, వరుసగా కరువు వీటన్నింటితో ఓటమి ఖాయం అని చంద్రబాబు అనుకున్న దశలో- 2003లో తిరుపతి వద్ద అలిపిరిలో ఆయనపై నక్సల్స్ దాడి చేశారు. సానుభూతి పవనాల కోసం మీడియా అండదండలతో బాబు తీవ్రంగానే కృషి చేశారు. తనపై దాడి జరిగినందున తనకు ఎన్నికల్లో ఓటు వేయాలన్నట్టుగా చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. రోజు రోజుకూ జనంలో వ్యతిరేకత పెరుగుతుండడం వల్ల సానుభూతి పవనాలతో గట్టెక్కవచ్చునని ఆయన ముందస్తుకు వెళ్లారు. కానీ, చిత్రంగా తన సొంత జిల్లాలో సైతం బాబు పట్ల సానుభూతి కనిపించలేదు. అప్పటి ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి ముందస్తు ఎన్నికలపై రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తే అది వారి రాజకీయ అవగాహనా లోపమే అవుతుంది.
ముందస్తు ఎన్నికలు జరిగినా, సకాలంలో జరిగినా, వెనకస్తు ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా- ‘అధికారపక్షం పరిస్థితే బాగుంద’ని ప్రత్యర్థులు సైతం ‘ఆఫ్ ది రికార్డు’గా మాట్లాడుతూ చెప్పేమాట. ఒకేసారి ఆవిర్భవించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి. ఆంధ్రలో ఎవరు గెలుస్తారు? అని అంతా ఎదురు చూస్తే, తెలంగాణలో మాత్రం టిఆర్‌ఎస్‌కు ఎంత మెజారిటీ వస్తుంది అని మాత్రమే చూసే పరిస్థితి ఉంది. 2014 సంవత్సరానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్థితి, సొంత రాష్ట్రంలో తెలంగాణ పరిస్థితికి తేడా రాజకీయ మేధావులకు తెలియక పోవచ్చు కానీ సామాన్య ప్రజలకు తెలుసు. ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించేది సామాన్యులే.
రాబోయేవి తెలంగాణ రాష్ట్రంలో జరిగే తొలి ఎన్నికలు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినా- ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన జరిగినా అపాయింటెడ్ డేట్‌కు ముందే ఎన్నికలు జరిగాయి. అప్పటి వాతావరణం వేరు. అప్పటి వరకు బలంగా ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు బలహీనపడ్డాయి. తెలుగుదేశం ఆంధ్ర ప్రాంతానికే పరిమితం కాగా, కాంగ్రెస్‌కు ఆంధ్రలో అస్సలు అడ్రెస్ లేకుండా పోయింది. తెలంగాణలో నామమాత్ర ప్రతిపక్షంగా మిగిలిపోయింది.
నాలుగేళ్ల కాలంలో అన్ని రంగాల్లోనూ తెలంగాణ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. 2014 ఎన్నికల సమయంలో తెలంగాణలో కూడా బలంగా ఉన్న టిడిపి, బిజెపి ఈ నాలుగేళ్ల కాలంలో పూర్తిగా బలహీనపడ్డాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో- ‘హైదరాబాద్ జనాభాలో 60 శాతం మా వాళ్లే’ అంటూ ఆంధ్ర ప్రాంత ఎంపీలు చెప్పేవారు. అలాంటిది ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో 150 వార్డులకు గాను టిడిపి ఒకే ఒక వార్డును గెలుచుకుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తరువాత టిడిపి క్రమంగా టిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందింది. అనంతరం ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో విలీనం అయ్యారు. దేశమంతా మోదీ హవా ఉన్న కాలంలోనే తెలంగాణలో బిజెపి పరిస్థితి అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో భయంతో టిఆర్‌ఎస్ ముందస్తుకు వెళుతోందని అనుకుంటే హస్యాస్పదంగా ఉంటుంది.
ముందస్తు కన్నా సకాలంలో ఎన్నికలకు వెళ్లడం వల్లనే టిఆర్‌ఎస్‌కు చెప్పుకోవడానికి ఎక్కువ విజయాలు ఉంటాయి. ఇంటింటికీ మంచినీటి పథకం పూర్తవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలాలు కంటి ముందు కనిపిస్తాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవాలు పెరుగుతాయి.
ఐతే మరి- టిఆర్‌ఎస్ ముందస్తు ఆలోచన ఎందుకు చేస్తుందని ప్రశ్నించుకుంటే- కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఆశించేనన్న జవాబు వస్తుంది.
ఈ ఏడాది డిసెంబర్‌లో మూడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దేశంలో మోదీకి వ్యతిరేక పవనాలు బలంగానే వీస్తున్నాయి. డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉండవచ్చని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత సహజంగా కాంగ్రెస్ హడావుడి పెరుగుతుంది. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ప్రధానంగా కాంగ్రెస్‌తోనే పోటీ ఉంటుంది. కాంగ్రెస్‌కు సానుకూలంగా వచ్చే ఏ ఫలితం కూడా టిఆర్‌ఎస్‌కు ఇష్టం ఉండదు.
ఇక, 2019లో సకాలంలో ఎన్నికలు జరిగితే ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలే జాతీయ స్థాయి దృష్టిని ఆకట్టుకుంటాయి. రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలపై అంతగా దృష్టి ఉండదు. మొత్తం దేశానికి సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయి. ఏ ప్రాంతీయ పార్టీకైనా ఇది ఇష్టం ఉండదు. మోదీ విజయాలు, పరాజయాలపై ఎన్నికలు జరగడం టిఆర్‌ఎస్ నాయకత్వానికి ఇష్టం ఉండదు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై చర్చనే ప్రధాన అంశంగా నిలవాలని టిఆర్‌ఎస్ కోరుకుంటోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక గురించి గతంలో ప్రకటించారు. ఒకవేళ సకాలంలో ఎన్నికలు జరిగితే ఆయన తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కావలసి ఉంటుంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికే పరిమితం కావాలి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తన పార్టీకి ఘన విజయం ఖాయం అనే స్పష్టత ఆయనకు ఉంది. డిసెంబర్‌లో అయితే రాష్ట్ర ఎన్నికలను ముగించుకుని కేసీఆర్ విజయోత్సాహంతో ఉంటారు. అప్పటికి సాధారణ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల గడువు ఉంటుంది. దేశమంతా ఎన్నికల వాతావరణం నెలకొని ఉంటుంది. అప్పుడు విజేతగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సైతం దృష్టిసారించే అవకాశం ఉంటుంది.
దేశంలో మోదీ హవా తగ్గినట్టు ఉన్నా, రాహుల్ హవా ఏమీ లేదు. ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఖాయమని అనిపిస్తుంది. భాజపా బలం గణనీయంగా తగ్గవచ్చు. కానీ ‘సింగిల్ లార్జెస్ట్ పార్టీ’గా నిలిచే అవకాశం ఉంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో చురుకైన రాజకీయ నాయకులు కీలక పాత్ర వహిస్తారు. ఇది కేసీఆర్‌కు అందివచ్చే అవకాశం అవుతుంది. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ వ్యతిరేకత, బిజెపి వ్యతిరేకత అనే అర్థం లేని సిద్ధాంతాలు ఏమీ ఇప్పటి వరకు తెలంగాణ నాయకత్వం ఆచరించలేదు. తమిళనాడు ప్రయోజనాల కోసం డిఎంకె, ఏఐఎడిఎంకె పార్టీలు అటు కాంగ్రెస్, ఇటు బిజెపితో సంబంధాలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇదే తరహాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వంతో సన్నిహితంగానే మెలిగింది. ఉమ్మడి రాజధాని, సెక్షన్- 8, ఉమ్మడి హైకోర్టు వంటి అనేక సమస్యలు ఉన్నా, కేంద్రంతో సఖ్యతగా ఉండడం వల్లనే చిక్కుముడులు విప్పుకొని అనేక ప్రాజెక్టులకు కేసీఆర్ అనుమతులు సాధించారు. తెలంగాణకు సంబంధించి అత్యంత కీలకమైన జోనల్ వ్యవస్థను సైతం సాధించారు.
కేంద్రంలో బిజెపి నాయకత్వంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ప్రస్తుత విపక్షాల నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడినా టిఆర్‌ఎస్ గుడ్డిగా వ్యతిరేక వైఖరి ఏమీ అవలంబించే అవకాశం లేదు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండే విధానానే్న ఎంచుకొనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఓటమి భయంతోనే తెరాస ముందస్తు ఎన్నికలకు వెళుతోందని వ్యాఖ్యానిస్తున్న వారికి ప్రస్తుత పరిస్థితిలో ప్రతిపక్ష స్థానం దక్కడం అనుమానమే! ఓటమి భయం కాదు, రేపటి జాతీయ రాజకీయాల్లో తెలంగాణ తన వంతు పాత్ర పోషించేందుకే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికల శంఖారావంలో భాగంగానే కొంగర కలాన్‌లో ఆదివారం నాడు భారీ బహిరంగ సభకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఆరు దశాబ్దాల శాపవిమోచనం తరువాత ప్రకృతితో పాటు అన్నీ తెలంగాణకు సానుకూలంగా మారాయి. మిత్రపక్షం కాకపోయినా కేంద్రంలో మోదీ ప్రభుత్వంతో చాకచక్యంగా వ్యవహరించిన కేసీఆర్ ఇక- కొన్ని రాజకీయ పక్షాల అండతో ఏర్పడే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ మరింత మేలు ఆశించడం అత్యాశ ఏమీ కాదు. తెలంగాణకు ముందున్నవి ఇంకా మంచి రోజులు.

--వౌర్య