సబ్ ఫీచర్

భజరే నందబాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వాపర యుగంలో పరిపూర్ణ అవతారునిగా దేవకీ వసుదేవుల గర్భశుక్తి ముక్త్ఫాలంగా జనించిన వైకుంఠవాసి శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణునిగా అవతరించి యాదవ కులోద్ధరణగావించిన మహనీయుడు పరమాత్మ. జగద్గురువు- లీలామానుష విగ్రహుడు- నందనందనుడైన శ్రీకృష్ణ భగవానుని కథ మహనీయమైనది. రమణీయమైనది. యుగయుగాలకు మార్గదర్శకమై, శ్రవణానంద సంధాయకముగావించేదిగా పలు గ్రంథాలలో ముఖ్యంగా భాగవత పురాణంలో అద్భుతంగా వర్ణించబడినది.
కాల నిర్ణయంలోని మాసాలలో శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రివేళ మధురానగరంలో మేనమామ కంసుడు నిర్ణయించిన చెఱసాలలో శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా చతుర్భుజాలతో దేవకీ వసుదేవులకు దర్శనభాగ్యమిచ్చి, వారి కోరిక మేరకు చిన్ని బాలకునిగా మారినాడు. తల్లిదండ్రులకు మార్గదర్శనంగావించాడు.
ధర్మసంస్థాపనార్థం అవతారాలు వస్తాయి. శ్రీకృష్ణుని అవతారం 9వది. అవతార కాలం 125 సంవత్సరాలు. ధర్మసంస్థాపనార్థమే నా అవతారం అని ఆ హరి స్వయంగా దెలిపి, దుష్టశిక్షణకు శిష్టరక్షణకే నా రుూ కృష్ణావతారం అన్నారు.
తెలుగు పద్య భాగవతంలో దశమ స్కంధంలో కృష్ణచరితం వర్ణించబడినది. బాలకృష్ణునిగా గోకులం చేరి, గోకులంలో పలు లీలలను ప్రదర్శించి గోపాలకుడుగా-గోవిందునిగా- గోరక్షకునిగా- గోపాల బాలునిగా- వంశీ వినోదునిగా- నంద కుమారునిగా- నవనీత చోరునిగా- యశోదమ్మ ముద్దుబిడ్డగా పెరిగి అమాయకునిగా ప్రవర్తించి, తల్లి ప్రేమపాశానికి లొంగి విశ్వరూపాన్ని తన నోటి ద్వారా చూపించి ఆశ్చర్యచకితులను గావించిన దామోదరుడే బాలకృష్ణుడు.
పరమాత్ముడైనా బాలకునిగా చిలిపిచేష్ఠలు చేశాడు. గంధర్వులకు శాప విముక్తిగావించాడు. రాక్షస సంహారంచేశాడు. గోవులనుగాచి గోప బాలకులతో సన్నిహితంగా మెలిగి వారి ప్రేమను దోచుకున్న ధీశాలి. కాళీయుని మర్దించినాడు. ఉట్లుకొట్టి, పాలు, వెన్నలు తిన్నాడు. గోపబాలుర ఆనందంకోసం మురళీనాదం చేశాడు. అందరినీ పరవశింపచేశాడు. రాధను పరిపూర్ణంగా ప్రేమించాడు.
యుక్తవయసులో రుక్మిణికోసం అందరినీ ఎదిరించాడు. ఇష్టసఖి సత్యభామతో తన్నులుతిన్నా చిరునవ్వే చూపాడు. తులాభారం తూగాడు. పాండవ పక్షపాతిగా పాండవులకు అన్నీ తానే అయి ద్రౌపదీ మాన సంరక్షణ చేశాడు. ధర్మరక్షణకోసం కౌరవులవద్దకు పాండవ దూతగా రాయబారం చేశాడు. కురుక్షేత్ర సంగ్రామంలో విజయుని రథసారధిగా ఉండి విజయం చేకూర్చినాడు. అర్జునునికి గీతోపదేశంగావించి, గీతాచార్యుడై భగవద్గీతను మానవులకందించి, విశ్వవిఖ్యాతిగాంచి జగద్గురువైనాడు. భూదేవి మొర ఆలించి ధరణీ భారమును బాపినాడు.
శ్రావణ బహుళ అష్టమినాడు రేయిని ఆ దేవకీదేవి గ్రహనక్షత్రాదులు శుభగతిలో నుండగా శ్రీకృష్ణుని కని పరమాత్మగా భావించినది. బాలునిగనే దేవకీ వసుదేవుల గత జన్మ కోరికను తెలియజేశాడు. ఆశ్చర్యపోయారు దంపతులు. వసుదేవునికి తన ఉనికిని దెలిపి యముననుదాటి, నంద వ్రజమును చేరాడు. నందవ్రజంలో నందుడు సుతుడు జన్మించుట తెలిసి ఆనందించి పలు దానాలు చేశాడు. తన అదృష్టానికి పొంగిపోయాడు. యశోదతో కలిసి ‘విప్రులు బాలుని దీవించారు. నందవ్రజంలో పండుగ వాతావరణం నెలకొన్నది. సంతోషంతో యాదవులందరు జయజయ ధ్వానాలు చేశారు. తీపి వస్తువులనుగొని మాధవుని చూడటానికి వచ్చారు. నేయి-పెరుగు- పాలు నీరు- వెన్నను తెచ్చి, వసంతము లాడించారు. తెచ్చిన కానుకలను యశోదామాతకు అందించారు. తలంటుపోసి జోల పాటలు పాడారు. గోప భామనులేమిచేసినా, ఏమీ తెలియని వానివలె కనులు తెరవకయున్నాడు. ఇవన్నీ నారాయణుని లీలలే.
యాదవ పురోహితుడు గర్గుని వసుదేవుడు గోకులానికి పంపినాడు. నందుడు ఆదరించి గౌరవించాడు.
గర్గుడు జ్యోతిష్కుడు- తేజోమూర్తి- పేరుగొన్నవాడు- బ్రహ్మబోధనుడు. నేర్పుతో నందుని కోరికపై బలరామకృష్ణులని నామకరణం చేసినాడు. రోహిణీ పుత్రునికి రాముడనీ, యాదవాకర్షణుడు గాన సంకర్షణుడనీ, బలశాలిగల బలుడనీ పేరు పెట్టాడు. కృష్ణునిగాంచి పూర్వం ఈ బాలుడు ధవళారుణ పీతవర్ణుడై, ఇపుడు నల్లనైనవాడుగాన ‘కృష్ణుడని’’పేరుపెట్టాడు. వసుదేవునికి జనించాడుగాన వాసుదేవుడనీ, గుణ-రూప-కర్మంబులు పలురకాలుగా చేయుటవలన పలు పేర్లుంటాయన్నాడు గర్గుడు. ఈ బాలుని వలన మీరందరూ దుఃఖదూరులై తరిస్తారన్నాడు. దుష్టశిక్షణ-శిష్టరక్షణ జరుగుతుంది. బాలుడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు గాన ఇది గోపకుల అదృష్టం. కృష్ణుని సహచరులుగా ఆటపాటలతో ధన్యులుకండి. గోపికలు, బలరాముడు చాడీలుచెప్పి మన్నుతిన్నాడని చెబితే యశోదకు విశ్వరూపం చూపింపగా, యశోద తన మానసికస్థితి భావనలో పరమాత్మ దర్శనం చేసికొని తన్మయురాలైనది. వైష్ణవ మాయను పొందించినాడు. సర్వాత్మకుడైనాడు పరమాత్ముడైన ఆ హరి.
శ్రీకృష్ణుని జన్మాష్టమి పర్వదినంనాడు సకల జగతి ఆ పరమాత్ముని రూప, నామాలను పదిలంగా మదిలో దాచుకోవాలి. పరిపరివిధాలుగా కృష్ణనామ స్మరణనుచేస్తూ- ముక్తిపధానికి బాటలు వేసుకోవాలి. పర్వదినాల పరమార్ధం తెలుసుకొని క్రియాశీలురు కావాలి. కలియుగంలో కడతేర్చేది కేవలం కృష్ణనామమే. కృష్ణరూపమే.

- పి.వి.సీతారామమూర్తి