సబ్ ఫీచర్

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5న ఏటా ‘ఉపాధ్యాయ దినోత్సవం’ పాటించడం మన దేశంలో ఆనవాయితీ. ఈ ఆనవాయితీ 1962లో మొదలైంది. ఉపాధ్యాయ వృత్తితో ప్రారంభమైన తన జీవన యానంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన రాష్టప్రతిగా అత్యున్నత పదవిని నిర్వహించారు. రాష్టప్రతిగా బాధ్యతలు స్వీకరించినపుడు- దేశ విదేశాల్లో ఉన్న తన శిష్యులు, శ్రేయోభిలాషులు అభినందించి, ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుతామని చెప్పగా, తన పుట్టినరోజును ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా జరుపుకుంటే తాను ఆనందిస్తానని రాధాకృష్ణన్ అన్నారు. తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని కోరినందుకు- అధ్యాపక వృత్తిపై ఆయనకున్న గౌరవం ఎంతటిదో మనకు అవగతమవుతుంది. దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు బోధనావృత్తిని ఆయన ఎంతో పవిత్రంగా నిర్వహించారు. రాష్టప్రతిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, తన ఉపాధ్యాయ జీవితాన్ని ఆయన ఏనాడూ మరిచిపోలేదు. ఉపాధ్యాయ దినోత్సవం జరపడమంటే- ఆ వృత్తికి సమాజంలో గౌరవం, గుర్తింపు, ప్రతిష్ట మరింతగా ఇనుమడించాలనేది ఆయన విశ్వాసం. అన్ని ఉద్యోగాల లాంటిది కాదు ఉపాధ్యాయ వృత్తి. విద్యార్థుల ఆకాంక్షలను గుర్తించి వాటి సాకారానికి చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే. ఒక ఉపాధ్యాయునికి సగటున ఏటా 150 మంది విద్యార్థులతో సంబంధం ఏర్పడుతుందని అనుకుంటే, ప్రతి ఉపాధ్యాయుడు తాను పదవీ విరమణ చేసేలోపు 4వేల నుండి 5వేల మంది విద్యార్థులను ప్రభావితం చేయగలడన్నమాట. మంచి ఉపాధ్యాయులు మంచి విద్యార్థులనేగాక మంచి సమాజాన్ని కూడా నిర్మించగలరు. మంచి ఉపాధ్యాయుణ్ణి ఏ విద్యార్థికూడా తన జీవిత కాలంలో మరిచిపోడు. విద్యార్థులు తప్పుదారి పడితే దానికి సగం బాధ్యత ఉపాధ్యాయులదే అని విశ్వసించిన వ్యక్తి రాధాకృష్ణన్.
మన దేశం గర్వించదగ్గ గొప్ప రచయిత, తత్త్వవేత్త అయిన రాధాకృష్ణన్ సమకాలీన దార్శనికులలో పేరెన్నికగలవాడు. ప్రాచ్య పాశ్చాత్య తత్త్వశాస్త్రాల మధ్య వారధిగా పనిచేసిన ఘనత ఆయనదే. భారతీయ దర్శనానికి పాశ్చాత్య తత్త్వశాస్త్రానికి మధ్య ఉన్న అంతరాలను పూడ్చడానికి ఎనలేని కృషిచేశారు. హెన్రీ బర్గ్‌సన్ భావజాలంతో ప్రభావితుడైన ఆయన పాశ్చాత్య భావవాదాన్ని, భారతీయ దర్శనంలో ప్రవేశపెట్టి భారతీయ దర్శనాన్ని పాశ్చాత్య భావవాదకోణంలో ఆవిష్కరించి పెక్కు భారతీయ దార్శనిక గ్రంథాలను రచించి పాశ్చాత్యులు భారతీయ దర్శనాన్ని అధ్యయనం చేసేలా కృషి చేసిన వేదాంతి. భారతీయ సంస్కృతి, ఉపనిషత్తులు, భారతీయ దర్శనం, భగవద్గీత, ఉపనిషత్తులు, ‘బ్రహ్మసూత్రాలు’ వంటి అంశాలపై ఆయన రాసిన పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆయన వల్లనే భారతీయ దర్శనం ప్రపంచవ్యాప్తంగా వెలుగొందిందనడంలో అతిశయోక్తి లేదు.
రాధాకృష్ణన్ తైత్తరీయ ఉపనిషత్తులో వౌద్గల్య మహర్షి చెప్పిన ‘ఉపాధ్యాయుని లక్షణాలు- విధుల’తో ప్రభావితమయ్యారు. ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? విద్యార్థికి, ఉపాధ్యాయునికి మధ్య ఎట్లాంటి సంబంధం ఉండాలి? ఎలాంటి లక్షణాలుంటే ఉపాధ్యాయునికి గుర్తింపు, గౌరవం, స్థాయి లభిస్తాయి? సామాజిక ధర్మాన్ని లేదా సంఘ్ధర్మాన్ని ఉపాధ్యాయుడు ఏ విధంగా నిర్వహించాలనే పెక్కు అంశాలను వౌద్గల్య మహర్షి తైత్తరియ ఉపనిషత్తులో పేర్కొన్నారు. ఉపాధ్యాయుని లక్షణాలు, విధులకు సంబంధించిన 15 అంశాలను వివరించారు. ఆ 15 అంశాలు ఉపాధ్యాయ విధులను నిర్దేశిస్తాయి. ప్రతిభతోపాటు ఆ 15 లక్షణాలు ఉన్న వ్యక్తే ఆ వృత్తికి అర్హుడు.
సత్యం చెప్పటం, సత్యాన్ని జీవిత పర్యంతం ఆచరించటం, తోటి మానవుల యందు దయ, దాక్షిణ్యం, కరుణ, మైత్రి, నమ్రత, వినయం, అణకువ కలిగి ఉండడం, ధర్మబద్ధంగా సంసారం చేయటం, కోపాన్ని నిగ్రహించుకోవటం, అధ్యయనం, బోధన ఉపాధ్యాయుని ముఖ్య విధులుగా తైత్తరీయ ఉపనిషత్తు చెబుతోంది. వీటన్నింటినీ తన జీవిత పర్యంతం ఆచరించిన వ్యక్తి రాధాకృష్ణన్. ప్రతి ఉపాధ్యాయుడు వీటిని ఆచరించి ఇతరులకు మార్గదర్శకులుగా, ఆదర్శవంతులుగా నిలబడ్డప్పుడే వాళ్లు సామాజిక ధర్మాన్ని నెరవేర్చిన వారవుతారనేది రాధాకృష్ణన్ ప్రగాఢ విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు విద్యార్థులకు ఉండవల్సిన లక్షణాలు, ఆశయాలు, విధుల గురించి కూడా వివరించింది. దాదాపుగా ఇలాంటి విషయాలనే గోల్డ్‌స్మిత్ ‘ది విలేజ్ స్కూల్ మాస్టర్’లో వివరించారు. రాధాకృష్ణన్ జీవితాన్ని ఉపాధ్యాయ లోకమంతా మార్గదర్శకంగా తీసుకుంటే- దేశంలో నైతిక విలువలతో కూడిన ఆదర్శ సమాజ నిర్మాణం సాకారం కావడం అసాధ్యమేమీ కాదు. సమాజంలో మనం ఆశిస్తున్న విలువలతో కూడిన గుణాత్మకమైన మార్పు ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యవౌతుంది. ఈ గుణాత్మకమైన మార్పును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ముందుగా తమలో నైతిక, సామాజిక, లౌకిక, ప్రజాస్వామ్య, శాస్ర్తియ విలువలను పెంపొందించుకోవాలి. అప్పుడే అది సాధ్యవౌతుందన్నది రాధాకృష్ణన్ నిశ్చిత అభిప్రాయం.
ఉపాధ్యాయునికి ఉండాల్సిన లక్షణాలు, ఆశయాలు, విధులకు సంబంధించిన అంశాలన్నింటినీ రాధాకృష్ణన్ తాను సమర్పించిన ‘విశ్వవిద్యాలయాలు- విద్యా విధానం’అనే నివేదికలో స్పష్టంగా వివరించారు. విశ్వవిద్యాలయాలు విద్యార్థులలో మంచి నాయకత్వ లక్షణాలు కలిగించే నాగరికతా కేంద్రాలుగా భాసిల్లి ప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబాలుగా నిలబడాలి. మన విద్యా విధానం మానవీయ విలువలను విద్యార్థులలో ఇనుమడింపచేయాలి. వారిలో నిగూఢంగా ఉన్న సామర్థ్యాలను వెలికితీసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. విద్యార్థుల మానసిక పరిపక్వతకేకాక వారి శారీరక అభివృద్ధికి అవి దోహదపడాలి. విద్యాబోధనలో మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం మొదలగు ప్రజాస్వామిక విలువలను యూనివర్సిటీలు కాపాడాలి. వీటన్నింటిని విద్యార్థులకు ఒంటపట్టించడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. మంచి ఉపాధ్యాయులే మంచి విద్యార్థులను, మంచి సమాజాన్ని నిర్మించగలరు. సమాజంలో మార్పు విద్యావిధానం ద్వారానేగాక విద్యను బోధించే ఉపాధ్యాయుల ద్వారా అధికంగా వస్తుంది. ఉపాధ్యాయుల ప్రభావం పాఠశాల గోడలకే పరిమితం కాక సమాజం అంతా విస్తరిస్తుంది. కానీ, నేడు దురదృష్టకరమైన విషయమేమిటంటే ఉపాధ్యాయులకు విషయ పరిజ్ఞానం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దినదినం బోధనాప్రమాణాలు క్షీణించిపోవటం బాధాకరమైన విషయం. ఉపాధ్యాయులలో సామాజిక, నైతిక విలువలు క్షీణించటం, అత్యధికులు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ప్రభావంతో స్వప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వటంతో ఉపాధ్యాయవృత్తి మసకబారుతోంది. బోధనా ప్రమాణాలు, విద్యాప్రమాణాలు దినదినం క్షీణించిపోవడానికి ఉపాధ్యాయులదే కాదు కారణం. దానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా విధానాలు కూడా కారణాలే. బోధనా ప్రమాణాలు, విద్యాప్రమాణాలు, నైతిక విలువలు పడిపోతున్న ఈ తరుణంలో ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయులకు తమ విధులను, బాధ్యతలను గుర్తుకుతెచ్చి ఆ వృత్తికి న్యాయం చేయటంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, హక్కుల గురించి మాట్లాడేవారికి బాధ్యతలను గుర్తు చేస్తుందని ఆశిద్దాం.

-ప్రొ. జి.లక్ష్మణ్ 98491 36104