సబ్ ఫీచర్

జాతీయ భాష వికసించేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయోద్యమం ఉద్ధృతంగా కొనసాగుతున్న కాలంలో ఆనాటి పాలకుల భాషయైన ఇంగ్లీషు కాకుండా భారతీయులలో జాతీయ స్ఫూర్తిని రగిలించగలిగే ఒక ప్రభావశీలమైన దేశీయ భాష అవసరం ఏర్పడింది. రాజకీయ, సాంఘిక అవసరాల రీత్యా దేశవ్యాప్తంగా ఒక సమైక్య భాష ఆవశ్యకత కలిగింది. 130కి పైగా భాషలు వ్యవహారంలో ఉన్న ఇంత పెద్ద దేశానికి జాతీయ భాషగా హిందీ అయితే అనుకూలంగా ఉంటుందని అప్పటి నేతలు భావించారు. భారత్‌లో 30 శాతం ప్రజలు మాట్లాడే హిందీని ఇంకా సులభతరం చేసి దేశవ్యాప్తంగా ప్రచారం గావించాలని గాంధీజీ, బాబూ రాజేంద్రప్రసాద్, పండిట్ మదన్‌మోహన్ మాలవ్య, పురుషోత్తమ దాస్ టాండన్ తదితరులు ప్రయత్నించారు. ఈ కృషిలో భాగంగా హిందీ విద్యాపీఠం (దేవఘడ్); నాగరి ప్రచారిణీ సభ (కాశీ); హిందీ సాహిత్య సమ్మేళన్ (ప్రయాగ); దక్షిణ భారత హిందీ ప్రచార సభ (మద్రాస్) మొదలైన సంస్థలు నెలకొల్పబడ్డాయి.
రాజ్యాంగ పరిషత్ 1949 సెప్టెంబర్ 14న దేవనాగరి లిపితో కూడిన హిందీని జాతీయ భాషగా ఆమోదించింది. అప్పటి నుండి హిందీ భాషాభిమానులు ఏటా సెప్టెంబర్ 14న హిందీ దివస్‌ను జరుపుకుంటున్నా, ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. బిహార్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, దిల్లీ రాష్ట్రాలతోపాటు మారిషస్, ఫీజీ దీవులు, ట్రినిడాడ్, రష్యా, సురినామ్, దక్షిణాఫ్రికా తదితర దేశాలలో హిందీ వ్యవహార భాషగా ఉంది. అమెరికాలో కూడా ఇంగ్లీషు తర్వాత అత్యధికులు మాట్లాడేది హిందీనే. ప్రపంచంలో సైతం చైనీస్, ఇంగ్లీష్ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాషగా హిందీ గుర్తింపు పొందింది.
సింధూ నది తూర్పు ప్రాంతీయులు మాట్లాడేది హిందీ అనే అర్థంలో ఈ పదం ఉద్భవించినట్లుగా చెబుతారు. హిందీ భాషా చరిత్ర ప్రకారం అపభ్రంశ భాషా మాండలికాలైన శూరసేని, మైథిలి, అవథి, రాజస్థానీ, వ్రజభాష, భోజ్‌పురీ, ఖడీబోలీల కలయికతో హిందీ భాష ఏర్పడినట్లు తెలుస్తోంది. 19వ శతాబ్ది నాటికి దక్షిణ భారతదేశంలో సైతం దక్కనీ పేరుతో ఖడీబోలీ వ్యవహార భాషగా వేళ్ళూనుకుంది. ఖడీబోలీ అంటే అధిక సంఖ్యాకుల వ్యవహార భాష అని అర్థం. కచ్చితంగా చెప్పాలంటే సంస్కరించబడిన ఖడీబోలీ రూపాంతరమే హిందీ. ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన హిందీ 10వ శతాబ్దంనుండి ప్రచారంలో ఉంది. హిందీ అనే పదాన్ని మొదటగా ప్రయోగించిన కవి అమీర్‌ఖుస్రూ.
హిందీని జాతీయ భాషగా నిర్ణయించే ప్రక్రియలో రాజ్యాంగ పరిషత్ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో చర్చోపచర్చలు నడిచాయి. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వ్యవహారంలో ఉన్న ఒక భాషను ఏ ప్రాతిపదికపై జాతీయ భాషగా నిర్ణయిస్తారని దక్షిణాది సభ్యులు వాదించారు. మరీ ముఖ్యంగా భాషాభిమానంలో సదా ముందుండే తమిళులు ఆనాటి నుండి నేటి వరకు హిందీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అధిక సంఖ్యాకుల భాషే జాతీయ భాషగా గుర్తించదలచుకుంటే నెమలి స్థానంలో కాకిని జాతీయ పక్షిగా ఎన్నుకోవాలని ఎద్దేవా చేశారు. ఇది అప్పటికప్పుడు ఏర్పడిన వ్యతిరేకత కాదు. దీని మూలాలు స్వాతంత్య్రానికి పూర్వం నుండే కనిపిస్తున్నాయి. 1937లో మద్రాసు రాష్ట్రంలో చక్రవర్తుల రాజగోపాలాచారి నేతృత్వంలో జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయింది. గాంధీజీ అభిప్రాయానికి అనుగుణంగా తమిళనాడులోని పాఠశాలల అన్నింటా హిందీ బోధనను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో తమిళులు హిందీ వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
రాజ్యాంగ సభ 11 ఏళ్ళ తర్వాత జాతీయ భాషగా హిందీని నిర్ణయించినపుడు కూడా ఇదే తరహా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఉత్తరాదివారి ఒత్తిడితో ఎట్టకేలకు దేవనాగరి లిపితో కూడిన హిందీని జాతీయ భాషగా రాజ్యాంగ సభ ఆమోదించింది. దక్షిణాది వారి ఆందోళనను అర్థం చేసుకున్న రాజ్యాంగ సభ హిందీ జాతీయ భాష అయినా 15 ఏళ్ళపాటు ఆంగ్లమే అధికారిక అవసరాలకు ప్రాతిపదికగా ఉంటుందని, ఒక ప్రత్యేక నిబంధనను ఇందులో చేర్చింది. దేశంలోని అన్ని ప్రాంతాలు అంగీకరించినపుడే పూర్తిస్థాయిలో హిందీని అధికార భాషగా అమలుచేస్తామని తొలి ప్రధాని నెహ్రూ ప్రకటించారు.
అధికార భాషగా హిందీని నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం తదనంతర కాలంలో అనేక కమిటీలను ఏర్పాటు చేసింది. అయినా అవి దేశవ్యాప్తంగా హిందీని పాదుకొల్పలేకపోయాయి. రాజ్యాంగ సభ నిర్దేశించిన 15 ఏళ్ళ కాలపరిమితి పూర్తియై హిందీ అమలుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. 1965 పార్లమెంటు సమావేశాలలో ‘హిందీ అధికార భాష కావాలి’ అనే ఏకవాక్య తీర్మానం ఒక్క ఓటుతో నెగ్గింది. దాంతో మద్రాసు రాష్ట్రం మండిపోయింది. రెండు నెలలపాటు తీవ్ర హింస దమనకాండ కొనసాగాయి. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పారామిలిటరీ దళాలను రప్పించింది. పోలీసులు సహా 70 మంది దాకా ఆనాటి అల్లర్లలో మృతి చెందారు. దాంతో అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌శాస్ర్తీ హిందీని బలవంతంగా రుద్దబోమంటూ పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. తమిళనాట జరిగిన హిందీ వ్యతిరేకోద్యమ ఫలితంగా కాంగ్రెస్ భారీమూల్యానే్న చెల్లించింది. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై డి.ఎం.కె. అఖండ విజయం సాధించింది. ఆ తర్వాత కూడా ఎన్నడూ తమిళనాడులో కాంగ్రెస్ తిరిగి అధికారం చేపట్టనే లేదు. 1967లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అధికార భాషల చట్టాన్ని సవరించింది. హిందీ, ఇంగ్లీషులను నిరవధికంగా అధికార భాషలుగా కొనసాగిస్తామని ప్రకటించారు.
దేశంలో ఏర్పడిన క్లిష్టమైన ఈ భాషా సమస్యను పరిష్కరించే దిశగా 1965లో కేంద్ర విద్యా విషయక సలహా సంఘం త్రిభాషాసూత్రాన్ని ప్రతిపాదించింది. హిందీయేతర రాష్ట్రాల్లో జాతీయ భాష అయిన హిందీని తప్పకుండా బోధించాలని, హిందీ రాష్ట్రాల్లో ఒక దక్షిణ భారత భాష తప్పనిసరిగా నేర్చుకోవాలన్నది ఈ సూత్ర ముఖ్యఉద్దేశం. కాని ఇది చాలా రాష్ట్రాల్లో ద్విభాషా సూత్రంగా పరిణమించింది. ఉత్తరాదివారు దక్షిణ భారతీయ భాషల స్థానంలో సంస్కృతాన్ని చేర్చుకున్నారు. అదే రీతిలో తమిళనాడు సైతం హిందీని పక్కన పెట్టింది.
గత యేడాది నరేంద్రమోదీ ప్రభుత్వం అధికార భాషా విషయంలో ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేసింది. రాష్టప్రతి సహా హిందీ తెలిసిన వారందరూ తమ వ్యవహారాలన్నింటినీ హిందీలో మాత్రమే చేయాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. అప్పటి రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ సైతం ఈ సిఫారసును ఆమోదించారు. దాంతో తిరిగి వివాదం రాజుకుంది. డి.ఎం.కె. నాయకుడు స్టాలిన్ ఇండియాను హిందియాగా మార్చడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని విమర్శించారు. హిందీ మాట్లాడలేని వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణిస్తారా? అని దుయ్యబట్టారు.
అధికార భాషగా హిందీ ఏర్పడి 68 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఏకాభిప్రాయం సాధించలేకపోవడం విచారకరం. ఇప్పటికీ ఈ సమస్యకు సంతృప్తికర పరిష్కారం లభించలేదు. కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు చాలావరకు హిందీలోనే జరుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ వ్యతిరేకత ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. త్రిభాషాసూత్రం పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లో హిందీని బోధిస్తున్నా ప్రజలందరికీ దీనిపై గట్టిపట్టు ఉన్నట్లుగాని, ప్రత్యేక అభిమానం ఉన్నట్లుగాని కనిపించదు. అయితే హిందీ భాష వచ్చి ఉండడం అనేది రానురాను వ్యక్తిగత అవసరంగా మారుతుంది. ఏనాటికైనా హిందీ అనివార్యమవుతుందన్న విషయం దక్షిణాది ప్రజలకు అవగతమవుతుంది. హిందీని బలవంతంగా రుద్దకుండా దానిపై ప్రేమాదరాలు పెంచే చర్యలేవీ చేపట్టినట్లుగా లేవు. హిందీ పఠన, లేఖన, భాషణాలలో ఉచితంగా శిక్షణఇచ్చే ఏర్పాట్లుచేయడంవల్ల పౌరులందరూ క్రమక్రమంగా హిందీవైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది.

-డా. ఐ.సచ్చిదానందం 99661 75009