సబ్ ఫీచర్

అమరావతి నగరికి ఇన్ని భూములా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్మిస్తున్న ‘అమరావతి’ నగరాన్ని నిజానికి రాజధాని అనకూడదు. రాష్ట్ర ముఖ్య పట్టణం అని మాత్రమే అనాలి. రాజధాని అంటే దిల్లీ నగరం మాత్రమే. ఉమ్మడి రాష్ట్రం విడిపోగానే ‘రాజధాని అమరావతి’ అంటూ తెలుగుదేశం ప్రభుత్వం విపరీతమైన ఖర్చు ప్రారంభించింది. దాదాపు 30 వేల పైచిలుకు ఎకరాల పంట భూములను సేకరించింది. ఏపీలో ఎక్కడా పెద్ద పట్టణం లేదా? నూతన రాజధాని పేరిట ఇంత భారీగా నిర్మాణాలు ఎందుకు? విశాఖపట్నం వంటి మహానగరం అన్నివిధాలా రాష్ట్ర మఖ్య పట్టణానికి అనుకూలమైనది. ముఖ్య పట్టణం భౌగోళికంగా రాష్ట్రం మధ్యలో ఉండాలనే సిద్ధాంతం ఏదీ లేదు.
పొరుగు రాష్టమ్రైన తమిళనాడు ముఖ్య పట్టణం చెన్నై మన సరిహద్దులోనే ఉంది. దేశ రాజధాని దిల్లీ నగరం కన్యాకుమారికి చాలా దూరంలో ఉంది. నేటి ఆధునిక కాలంలో విమానాలు, వేగంగావెళ్లే రైళ్లు విరివిగా ఉన్నాయి. అందువల్ల ముఖ్య పట్టణం ఎక్కడ ఉన్నా ఇబ్బంది లేదు. ఒకే ప్రాంతంలో ఇలా నిధులను భారీగా ఖర్చు చేస్తే- ముందు ముందు రాయలసీమ వాసులు ప్రత్యేక రాష్ట్రం కావాలంటారు. అప్పుడు కొన్ని కోట్లు ఖర్చుచేసి మరొక ముఖ్య పట్టణం నిర్మిస్తారా? విశాఖలో నౌకాశ్రయం, విమానాశ్రయం ఉన్నాయి. అవసరమైన అదనపు కట్టడాలకు చుట్టుపక్కల దండిగా ప్రభుత్వ భూములున్నాయి. అవి అమరావతి వద్దగల సారవంతమైన పొలాల వంటివి కావు. అసెంబ్లీ భవనం, సచివాలయం, వివిధ శాఖల ప్రధాన ఆఫీసులు వంటివి నిర్మిస్తే చాలు. కోట్లాది రూపాయలు ఆదా అవుతాయి. అమరావతిని ఏదో మెరిసిపోయే పట్టణంగా చేయాలని ఉవ్విళ్లూరిపోవడం అనవసరం.
కాగా, అమరావతి నిర్మాణం, ఏపీకి ప్రత్యేక హోదా అంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు జాతీయ సమైక్యతని అపసాస్యం చేసే విధంగా ఉంటున్నాయి. ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్యాకేజీ అంటే ఏమిటి? హోదా ఐదుకోట్ల ఆంధ్రుల హక్కా? హోదా ఇవ్వకపోతే తడాఖా చూపిస్తారా? ఇందుకు తెలుగుదేశం ప్రభుత్వం ధర్మపోరాటం ప్రారంభించింది. తడాఖా చూపించేవారు ధర్మపోరాటం చేయడం ఎందుకు? ఈ పోరాటం ఎవరిపైన? ప్రధాని మోదీ పైనా? లేక భారతీయ జనతాపార్టీపైనా? ప్రత్యేక హోదా ఇవ్వనందుకు అధికార పార్టీ నేతలు మోదీని, భాజపాను అదేపనిగా దూషిస్తున్నారు. ఒక రాష్ట్ర ప్రజల అసంతృప్తిని కోరుకునే అంత మూర్ఖుడు కాదు మోదీ.
అన్ని రాష్ట్రాలూ కలిస్తేనే దేశం. వివిధ రాష్ట్రాలకు వివిధ సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం కలిగిస్తుంది. ప్రత్యేక హోదా పేరిట ఎంతగా పోరాడితే అంత పేరు వస్తుందని తెలుగుదేశం నాయకత్వం భ్రమపడుతోంది. కేంద్రం అంటే ఏదో విదేశీ పాలన వంటిదనే భావం ప్రజలలో కలిగిస్తుంది. ఇది ప్రమాదకర పరిణామం. వైకాపా నేత జగన్, ‘జనసేన’ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఏపీకి ప్రత్యేక హోదా కోరుతున్నా, వారు మోదీని దూషించడం లేదు. ప్రజాస్వామ్యంలో దూషణలు పనికిరావు. పార్టీలతో నిమిత్తం లేకుండా కేంద్రం కూడా ఇచ్చిపుచ్చుకునే మాదిరిగా సమన్వయంతో పనిచేయాలి. ఆ పని ఇప్పుడు భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం చేస్తున్నది. దేశం అన్నిరంగాలలోను ప్రగతిని సాధిస్తోంది. ఇలా కొనసాగితే భారతీయ జనతాపార్టీ ఏకుమేకై పోతుందని ప్రతిపక్షాలకి భయం పట్టుకున్నట్టుంది. వాటి ప్రధాన ధ్యేయం మోదీని గద్దెదింపడమే. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌లో, భారతీయ జనతాపార్టీలో చేరితే పదవులు అందరికీ రావడం కష్టం. అందువలన ప్రాంతీయ పార్టీలు విజృంభిస్తున్నాయి. వీటికి ప్రజాసేవ కన్నా పదవులు ముఖ్యం.
ఇప్పుడు భాజపాను అప్రతిష్టపాలు చేయడానికి ‘మతతత్వ పార్టీ’ అనే ముద్ర వేస్తున్నారు. మతతత్వం లేని పార్టీలు ఏమైనా ఉన్నాయా? అన్ని పార్టీలకూ కులాలు, మతాలు కావాలి. ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ముస్లిం వేషం ధరించి వారి ఓట్లు కోరడం లేదా? కేంద్రంలో ప్రస్తుత పాలకులు ప్రజలను పీడిస్తున్నారని, తమకు అధికారం ఇస్తే ప్రజలను సుఖపెడతామని ప్రాంతీయ పార్టీలు చెబుతున్నాయి. ఆ పని ఏదో జాతీయ పార్టీలలోనే ఉండి చేయవచ్చు కదా. కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతంగా మసలడం, సమైక్యతా భావం కలిగి ఉండడం ప్రధానం. అదే నిజమైన దేశభక్తి. కాగా, మద్యపానం నిషేధిస్తామని గానీ, విచ్చలవిడిగా పెరిగిపోతున్న అశ్లీల చిత్రాలను తొలగిస్తామని గానీ ఏ పార్టీ చెప్పడం లేదు. ఇలాంటి మాటలు చెప్పే పార్టీలకు ఓట్లు రావు. ప్రసార మాధ్యమాల్లో పెడ ధోరణులు పెరిగిపోతున్నా, వాటిని నిలదీసేందుకు రాజకీయ పార్టీలు ఆసక్తి చూపవు. మీడియా అవసరం ఉంది గనుకనే రాజకీయ నాయకులు వాటిలోని లోపాలను ఎత్తిచూపేందుకు సాహసించడం లేదు. పాలకులు చేస్తున్న అవకతవకలను ప్రశ్నించేందుకు మీడియా కూడా వెనుకంజ వేస్తోంది.

-వేదుల సత్యనారాయణ 96183 96071