సబ్ ఫీచర్

బామ్మ డైరీ నుంచి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**నాకిప్పుడు 90 ఏళ్ళ పైమాటే. నా అనుభవాలని మీతో పంచుకునే ముందుగా నా గురించిన పరిచయం కొద్దిగానైనా అవసరమనిపించింది. నేను చెప్పేది చాదస్తంగా వున్నా, నేను రాయబోయే విషయాలను కొంచెం బోర్ ఫీల్ అవ్వకుండా చదివితే బోలెడు లాభాలున్నాయని గ్రహిస్తారు. మంచి మాటలు ముందు కొంచెం బోరుగానే ఉన్నా ఆ తరువాత వాటి విలువ ఏమిటో మీకు తప్పక తెల్సిరాగలదనే ఆశతో ఈ వ్యాసాన్ని మీకోసమే రాస్తున్నాను. ‘‘చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ’’ అనే ఈ నా వ్యాసం చదువుకునేవారికి కూడా వర్తిస్తుంది. ఇక నా గురించి కొంచెం చెబుతాను.. మనవలూ మనవరాళ్ళలారా**..
============================

నలభయ్యో దశకాలనుంచే అత్తలను కోడళ్ళు ఆడిపోసుకోవడం చూసినదానిని నేను. సదరు ఆడిపోసుకోవడాలను చదివిన తరువాత నా వయస్సులోని జ్ఞాపకాలను తలచుకుంటే గుండె బరువెక్కుతుంది. మీరు మీ రోజులని నాగరికం అంటున్నారు కాబట్టి మావి అనాగరికపు రోజులనుకోవాలి. మా రోజుల పద్ధతులూ, ఆచారాలూ కొండకచో అలనాటి ప్రేమానురాగంతో కూడిన ఆప్యాయపు తిట్లూ, శాపనార్థాలూ, ధర్మాలూ నేటి నాగరికపు లోకంలో భూతద్దం పెట్టి వెదికినా కనిపించడంలేదు. మార్పు కాల సహజం. అది చివరికి ‘‘చీర కట్టు అయినా, పెట్టుకునే బొట్టయినా..’’ సరే ఏమంటారూ?
మావి మోటు అనాగరికపు రోజులు. అందుకేనేమో మొగుడిని దైవంలా చూసేవాళ్ళం. తల్లి అంటే ప్రేమ. తండ్రి అపారమైన గౌరవాలు ఇచ్చేవాళ్ళం. మీ నాగరిపు రోజులేమో ‘‘అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు, 3ఆలి వంకవారు ఆప్తబంధులాయే’’ చందాన సాగిపోతున్నాయి. సో.. మీవి తప్పకుండా నాగరికపు రోజులే, సందేహం లేదు గాక. నా మనవడు వాడి పెళ్లాన్ని జేబిలో పెట్టుకుంటే, మనవరాలేమో దాని మొగుడుని కొంగున కట్టేసుకుని తిరుగుతోంది. ఎలాగంటారా? ఏముంది చాలా సింపుల్. వాడు పెళ్లాం ఫొటోను పర్సులో పెట్టుకొని జేబిలో దోపుకుంటాడు. అదేమో మొగుడి ఫొటోని కొంగున ముడేసుకుంటుంది, అంతే. మా రోజుల్లో భర్త సంపాదనాపరుడైనా, కాకున్నా గౌరవం కించిత్తు కూడా తగ్గేది కాదు. భర్త కష్టంలో పాలు పంచుకోవడం మా లాంటి సగటు అనాగరిక స్ర్తిలకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. కానీ నేడు ఆడపిల్లలు కాబోయే మొగుడికి జీతం, ఆస్తిపాస్తుల వివరాలు ముందుగానే అడిగి తెలుసుకొని వివాహ బంధానికి ఆర్థిక పునాదులు వెతుకుతున్నారు. మరికొంతమంది తమ భర్తల ఆదాయ వ్యయాలతో నిమిత్తం లేకుండా వారానికోసారి సినిమా, బయటి రెస్టారెంట్లలో విందులూ, అలిగినప్పుడల్లా చీరెలు, పెళ్లి రోజుకి ఏదో ఒక బంగారపు నగ మస్టుగా వుండాల్సిదే. సంపాదించే భార్యలదీ ఇదే తంతు. ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిన మహిళలు అలాగే ప్రవర్తించాలా? అనిపిస్తుంటుంది నాకైతేనూ...
కిష్కింధకాండలో సీత ‘‘్భర్త దీనుడైనా రాజ్యహీనుడైనా సరే అతడే నాకు సర్వస్వం’’ అని. ఇదే మాటలు బామ్మలో, అత్తగారో కోడలికి చెబితే ‘‘ఫెమినిజం, స్ర్తి స్వేచ్ఛ’’2పేరుతో ఉపన్యాసాలూ, పత్రికల్లో రచనలూను. ఈ రెండూ చేయలేని అమ్మలు చెప్పినవారు ఎంత తొందరగా చస్తారో అని మొక్కులు మొక్కడమూనా? రాముడిలాంటి మొగుడు లభిస్తే నేనూ సీతాదేవినే అని వితండవాదం చేసేవారికి ఏమి చెప్పగలను? అదేవిధంగా కాలానుగుణంగా మాలో మార్పు రాకూడదనా? మీ ఉద్దేశ్యం అని కూడా మీరు నన్ను నిలదీయవచ్చు. ఎందుకంటే మీరు అంతా నాగరీకులు గనుక. ఆర్థిక నేపథ్యాలలో పెరుగుతున్న విడాకుల సంఖ్య నన్ను కలవరానికి గురిచేస్తూ ఉంటుంది. పోనీ తొందరగా తీసుకెళ్ళు మారాజా అని దేవుడిని అడిగితే, మేము మోటు- అనాగరిక మనుషులం కనుక మాకు వందా, నూట పది, నూట ఇరవైలు దాటినా దేవుడు మా ప్రార్థనలను విని నవ్వుకుంటున్నాడే తప్ప మాపైన జాలి చూపడంలేదు.
***
మేము ఐదుగురం అప్పచెలెళ్లం. నా పెద్దక్క పేరు జోగులాంబ. ఆవిడ చావుకోసం ఎదురు చూసీ చూసీ దేవుడు తన చావు గురించి మర్చిపోయి ఉంటాడనే భ్రమలో, మేం భయపడినట్టుగానే తన 106వ ఏట బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ వయసులో సైతం ఆమెకి ఒక్క పన్ను వూడలేదు, శరీరంపైన ఒక్క ముడత లేదు, కంటి చూపు తగ్గలేదు, సులోచనాలు (కళ్లజోడు) పెట్టిన పాపాన పోలేదు. అదీ ఆవిడ ఆరోగ్యం.
అందర్లోకి నేను ఆఖరి ఆడపిల్లని. రెండు, మూడు ఒకరు 85లో, మరొకరు 90లలో కాలం చేశారు. నాలుగో ఆమెకు 110 ఏళ్ళు. ఇంకా దృఢంగానే తన పనులు తాను చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. నా భర్తకి 105 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయనకున్న బలం నా కొడుకులకిగానీ, మనవలకి గానీ లేదు. అప్పటి తిండి అటువంటిది అని మీరే నన్ను విదిలించేయవచ్చు. కానీ నేటి మీ నాగరికులు 3డైటింగ్2ల పేరుతో ముప్ఫై ఏళ్ళకే ముసలోళ్లు అవుతున్న విషయాన్ని గమనించారా? మీ మొదటి కాన్పుకే నడుం నొప్పి మొదలు. పిల్లలకి ఎనిమిదేళ్లకే కళ్లద్దాలు. ఇవన్నీ నాగరికం నేర్పిన అనాగరికమైన అలవాట్లు అనుకోమంటారా? పైగా మా కాలంలో సున్నుండలూ, అరిసెలు, గారెలూ, వేరుసెనగ ఉండలూ తినడంవల్లనే మేము ఇంకా ఆరోగ్యంగా ఉన్నామని నా నమ్మకం. మీ నాగరికులు తినే పిజ్జాలూ, బర్గర్లూ, వేడి కుక్కలూ (అదేనండీ వాటిని హాట్ డాగ్స్ అంటారుట కదా..), చీజులు, లేయస్ చిప్సూ, మయోన్నా సీలూ (ఇదేదో సన్నాసి ఫుడ్డులా ఉందే) మేము తింటే ముప్ఫైలకే హరీమనేవాళ్లం అనిపిస్తుంది. మీ సున్నితమైన తిండి మీ శరీరాలను బలంగా ఉంచమంటే ఎలా ఉంచుతుంది చెప్పండి పిల్లల్లారా?
***
నేటి పిల్లలకి వేకువ ఝాము అంటే తెలియదు. కారణం- మొగుడూ పెళ్లాలూ తీరుబడిగా ఏడింటికి లేవడమే. నేటి కాలం పెళ్ళాలూ మొగుడుకంటే ఒక ఆకు ఎక్కువే చదివారనిపిస్తుంది. ఎందుకంటే భర్త లేచిన అరగంట తర్వాతే ఆమెకు ఉషోదయం కాబట్టి.
మనిషికి ప్రాణము, యవ్వనమూ, ధనము, సంసారము, జీవితము అనే ఐదు చంచలమైనవని భర్తృహరి పేర్కొన్నాడు. చంచలం కానివి ధర్మం, ఆచారం అనేవి మాత్రమే. వాటిని నాగరిక జనం ఎప్పుడో తుంగలో కలిపేశారు. బహిష్టు రోజుల్లో ఇంట్లో కలిపేవారం కాదు. కానీ నేడు స్ర్తిలు ఇంట్లో వాళ్ళకే తెలియనంత బహుగోప్యమైన విషయం. చంచలం కాని ధర్మం, ఆచారం అనే వాటిని ఇంట్లో బహిష్టుతో కలిపేయడంవలన చాలా అనర్థాలున్నాయి. మొదటిది లక్ష్మీదేవి ఇంటినుంచి తరచుగా వెళ్లిపోవడం, రెండు రుణబాధలు, మూడు ఉద్యోగంలో కారణం కానరాని సమస్యలు, నాలుగు తరచూ ఆనారోగ్యాలు, ఐదు ఇంట్లోని ఆడపిల్లలకు త్వరగా సంబంధాలు కుదరకపోవడం, కుదిరితే కాపురంలో మనస్పర్థలు, సంతానలేమి. అనుభవం కానివారికి నేను రాసింది కాకమ్మ కబుర్లే అనిపించడంలో సందేహం లేదు.
మను ధర్మాలలో వేదము, ధర్మశాస్త్రం, పెద్దలు, ఆచారవంతులు, సత్ఫురుషుల మాటలు అనే నాలుగింటిలో ధర్మం నెలవై వుంటుందని చెప్పబడింది. కానీ నేటి తరం ఈ నాలిగింటినే నిర్లక్ష్యం చేస్తూ రావడం విచారకరం. ఇంతా చదివి మోరల్ పోలీసింగు చేస్తున్నావా బామ్మా? వయసు మళ్లినదానివి అంతకుమించి ఏం చేయగలవులే అంటూ హాస్యాలూ, ఎత్తిపొడుపూలూను. కలికాలం.. పిల్లలని ఏమనాలి? చెప్పండి.
ఓర్పు వుంటే వేరే కవచంతో పనిలేదంటాడు భీష్ముడు. ఇది కేవలం యుద్ధ్భూమిలోనే కాదు ఇండ్లలోని అందరు అత్తా కోడళ్లకీ వర్తిస్తుంది. ఓర్పువల్ల సఖ్యత పెరుగుతుంది. ముఖ్యంగా అత్తాకోడళ్ళ మధ్య సదరు సఖ్యత కుటుంబ శాంతికి హేతువు అవుతుంది. అత్తగారు ఒక మాట అన్నదీ అంటే దాని వెనకున్న భావాన్ని కోడలు గ్రహించగలగాలి. అలా గ్రహించలేకపోతే అత్తగారిని అనునయంగా అడిగి తెలుసుకుంటే, ఆ అత్త కోడలి వినమ్రతకు మురిసిపోకుండా చస్తుందా చెప్పండి? నేటి నాగరిక తరాల్లో ఈ ఓర్పు నశించిపోతున్నది. దినివల్ల అత్తాకోడళ్లమధ్య తగవులూ, అపార్థాలూ, పూడ్చలేని అగాధాలూ చోటుచేసుకుంటూ విడి కాపురాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నవి. భార్యకి బుద్ధి, భర్తకి జ్ఞానం వుంటే ఈ ఓర్పు దానంతట అదే వస్తుంది. అయ్యో పెద్దలను, తల్లీ తండ్రీని విడిచి వెళ్లాలా అనే భావన అటు కొడుకూ కోడలు మదిలో మెదలకుంటే వారిపైన అధర్మపరులనే ముద్ర వేయాల్సిందే.
***
నేను బడికి డుమ్మా కొట్టడంలో ఎప్పుడూ మొదటిస్థానంలో ఉండేదాన్ని. మాష్టారు మా ఇంటికి వచ్చి జోగులు ఎక్కడ? ఇంకా బడికి రాలేదే? అంటూ పడక్కుర్చీ వెనకాల దాక్కున్న నన్ను జబ్బ పుచ్చుకుని, బరబరా బడికి లాక్కెళ్లడం ఇంకా నాకు గుర్తే. మాస్టార్లు అలా శ్రద్ధగా మా గురించి పట్టించుకునేవారు. నేటి గురువులకి ఆ శ్రద్ధ లేదు. వారి శ్రద్ధ అంతా నెలాఖరున పడబోయే జీతం గురించే. ఈ కాలపు చదువులు అన్నీ వానాకాలం బాపతు. ఎందుకంటే మీ చదువుని ఒక సర్ట్ఫికెట్ అనే కాయితం ముక్క నిర్థారిస్తుంది, అంతేకాని మీరు చదివినది వంటబట్టి, నిజ జీవితంలో దాన్ని ఉపయోగించి ప్రయోజనాన్ని పొందగలరా? అని మాత్రం కాదు. డిగ్రీలు ఎంతమందికైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చుగాక, కానీ వాటిలోని సారం మీ బుర్రలో ఉందా లేదా అనేదే మీ నిజమైన విద్యకి అసలు పెద్ద కొలమానం. ఈ సందర్భంలో నాకు భాస్కర శతకకారుడు చెప్పిన ఈ కింది పద్యం గుర్తుకొస్తోంది..
చం చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
భావం: ఎంత గొప్పగా వండినా ఉప్పులేని కూర రుచించదు. అలాగే ఎంత చదివినా ఆ చదువులోని సారం గ్రహించలేకపోయినట్లయితే ఆ చదువు నిరుపయోగం.. దానిని ఎవరూ మెచ్చుకోరు..
***
మొన్న నా పాత స్నేహితురాలొకామె వచ్చింది. నేను ‘రవిక’తో ఉన్నాను, ఆవిడ ‘జబ్బల జాకెట్టు’ వేసుకొంది. ఈ రెంటికీ తేడా నేటివారికి తెలియదు. రవిక అంటే మోచేయి దాటి మూడంగుళాల వరకూ వుండే కప్పుడు వస్త్రం. జాకెట్టు అంటే రవికకి ఆరంగుళాలు పైకి వుండే వస్త్రం. జాకెట్టులో జబ్బలు పాక్షికంగా కనిపిస్తుంటాయి, రవికకి ఆ సౌలభ్యం లేదు కనుక ఫాషన్ కాదని నాగరీకపు స్ర్తిల వాదన. ఇదీ మా కాలపు కట్టు గురించిన ఆసక్తి సమాచారం. ఇక బొట్టు, నగల వద్దకి వెళదాం. మేము నాను అంటే నాన్తాడు, పట్టెడ (నెక్లెస్), జిగినీ గొలుసు (నేటి వొంటిపేట గొలుసు) వంటి నగలతోపాటు పాపిడి పిందెలూ, రాగిడీలూ, నత్హు, అడ్డాబూసా వంటి అరుదైన ఆభరణాలను పెట్టుకునేవాళ్లం. వీటిని నేటి తరాలు చూడలేదు కనుక వాటికి నాగరీకపు పేర్లు ఏమిటో నాకు సైతం తెలియదు.
సంప్రదాయం, మంచి చెడుల గురించి నేటి తరాలకి మేము చెప్పేకన్నా ఏ అనుష్కో, జెనీలియానో, సమంతో, అనసూయో చెబితే తొందరగా తలకెక్కుతాయని నా విశ్వాసం. ఇప్పటికే సదరు సినీ కథానాయికలు పూర్తిగా బట్టలు కట్టుకోవడం అంత సౌకర్యం కాదని మీకు చెప్పేసి ఉంటారు. ఎందుకంటే మేం చెప్పేవి మీకు సాధింపులూ- వారు చెప్పేవి అమృత పలుకులూ కాబట్టినూ...

--జయదేవ్ చల్లా 98846 75329