సబ్ ఫీచర్

లాహోర్ ఫాంసీకీ కోఠీలో షహీద్ భగత్సింగ్ ఆఖరి క్షణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగత్‌సింగ్ జయంతి సందర్భంగా.....

1907 సెప్టెంబర్ 28న జన్మించిన విప్లవ వీరుడు భగత్‌సింగ్, మాతృభూమి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకోసం సుఖదేవ్, రాజగురువులతో కలిసి లాహోర్ సెంట్రల్ జైలులో ఉరికంబాన్ని ముద్దుపెట్టుకొన్నప్పుడు వయస్సు 24 ఏళ్లు. తెల్లవారితే ఆ ముగ్గురికి ఉరి మరణ దండన వార్త తెలిసిన అఖండ భారతావనిలో విషాద ఛాయలు అలముకొన్నాయి. 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైలులో ‘్ఫంసీకీ కోఠీ’లో ఉరి మరణ దండన ఎదుర్కోవలసిన, ఆ ముగ్గురినీ మొదట ఆదేశించినట్టుగా రేపు ఉదయం కాదు, ఆరోజు రాత్రి 7 గంటలకే ఉరిశిక్ష అమలుజరపమని బ్రిటిష్ నిరంకుశ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. 1930 అక్టోబరు 7న ఉరి ఖరారు అయినప్పటినుంచి ఆ ముగ్గురు విప్లవ యువకులు ఆ క్షణాలకోసం ఎదురుచూస్తున్నారు. జైలు గోడల కాఠిన్య కర్కశ నిశ్శబ్దంలో గుండెల్ని పిండేస్తున్న భయంకర నీరసం తాండవిస్తోంది. మరణ దండన విధించబడిన ఖైదీలు వుంచే ఆ సెల్స్‌లో దుర్భర ఒంటరితనం, నరకయాతన అనుభవిస్తున్న ఆ ముగ్గురికీ ఇక తమ ప్రాణాలు పోతాయనే భయంలేదు. ఉరి కంబంపై ఏ క్షణం అయినా ఉరితాళ్ళు మెడకు తామే తగిలించుకోవాలనే ఆ ముగ్గురు ఎటువంటి ఉద్వేగం, కలవరం లేకుండా శాంతంగా నిర్వికారంగా మరణాన్ని వరించటానికి సంసిద్ధంగా వున్నారు. ఆ సమయం రానే వచ్చింది.
భగత్‌సింగ్ వున్న సెల్ నెంబరు 14. అది జైలు గది కాదు. మరణ కూపం. 5 అడుగుల 10 అంగుళాల పొడుగువున్న భగత్సింగ్ కనీసం కాళ్లు జాపుకోవటానికి వీలులేదు. ఆ కొట్టంపైన చిన్న కిటికీ కంతలోంచి వెలుతురు వస్తే పగలు, చీకటి అలుముకొంటే రాత్రి అయినట్టే. గాలి వెలుతురు లేకపోగా దుర్గంధం. వార్డన్ చత్తార్‌సింగ్‌తో కలిసి డిఫెన్స్ న్యాయవాది మెహతా ఆఖరి చూపుగా ఉరికి ముందు చివరి కోరిక తెలుసుకోవడానికి వచ్చేటప్పటికి బోనులో సింహంలా భగత్‌సింగ్ సెల్‌లో పచార్లుచేస్తూ నేనడిగిన పుస్తకం తెచ్చావా అన్నారు.
అంతిమ సందేశం మాతృ వందనం
మామూలు చిరుదరహాసంతో, మెహతా తాను తెచ్చిన ‘ది రివల్యూషనరీ లెనిన్’ పుస్తకం అందించాడు. పుస్తకం పేజీలు తిరగేస్తూ తల ఎత్తకుండానే ‘‘ఊ! టైం వచ్చిందన్న మాట’’ అది మరణ దండన ప్రస్తావన. మెహతాకు దుఃఖంతో కన్నీళ్ళు. మాట గద్గదమైంది. ‘‘మీ చివరి కోరిక ఏమిటో తెలుసుకోవడానికి నన్ను అనుమతించారు’’. భగత్, పుస్తకంలోంచి తలపైకి తిప్పలేదు. చిన్నగా నవ్వారు. ‘‘మళ్ళీ హిందుస్థాన్‌లో పుట్టాలి. నా దేశాన్ని సేవించటానికి ఇంకో అవకాశం రావాలి. అదే నా కోరిక’’. మళ్లీ చదవటంలో లీనమయ్యారు.
ఎవరికైనా సందేశం ఇస్తారా? మళ్లీ మెహతా ప్రశ్న. ‘‘ఆ ఔను. సుభాష్ చంద్రబోస్‌కు, పండిట్ నెహ్రూకి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలపండి. వాళ్ళు నా విషయంలో ఎంతో శ్రద్ధ చూపారు. చాలా సాయంచేసారు.’’ భగత్ మళ్ళీ చదువులోపడ్డాడు. మెహతా, తరువాత సెల్ దగ్గరికి రాగానే రాజగురు ఆప్యాయంగా కౌగిలితో ధన్యవాదాలు తెలిపారు. సుఖదేవ్ సెల్‌లో చివరి కోరిక అడగగా, నా దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబం ఎక్కడం. అంతకంటే కోరదగింది ఏముంది? అన్నారు. గంభీరంగా. రాయల్ మెహతాను పంపించి, వార్డెన్ చత్తార్‌సింగ్ మళ్ళీ సెల్‌కువెళ్లాడు. ‘‘ముందు నిర్ణయించినట్టు రేపు ఉదయం 6 గంటలకు కాదు. ఈరోజు సాయంత్రం 7 గం.లకే ఉరి అమలు జరపమని ఆర్డర్ వచ్చింది. మీరు ఇక బయలుదేరాలి. భగత్‌సింగ్ మొఖంలో ఎటువంటి ఆందోళన లేదు. ‘‘ఇప్పుడే మొదలెట్టాను. కనీసం ఒక అధ్యాయమైనా చదవనివ్వరా?’’ వార్డెన్ తల ఊపడంతో కాసేపు చదివి, కొసన పేజీలో గుర్తుగా ముడిచి పుస్తకం మూసి సరే పదండి’ అన్నారు.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి గర్భశత్రువులుగా మాతృభూమి స్వేచ్ఛా స్వాతంత్య్రంకోసం జైలుగోడలనుంచి ఆ ముగ్గురు బయటకు వచ్చేటప్పటికి సూర్యాస్తమయం అయింది. జైలు గడియారం ఆరుగంటలు కొట్టింది. సెంట్రీ ఎలర్ట్‌అయ్యారు. మూడు సింహాలు బయటకు రావటంతో జైలు అప్రమత్తమైంది.
ఉరికంబంపై విప్లవోత్తేజం
భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురు సెంట్రీల వెంట ఒకరి చేయి ఒకరు పట్టుకొని వేస్తున్న అడుగుల చప్పుడు మిగిలిన ఖైదీలు విషాద హృదయాలతో ఊపిరి ఉగ్గపట్టుకొని వినగలుగుతున్నారు.
‘‘కభీ వో దిన్ భీ ఆయేగా
కే జబ్ ఆజాద్ హమ్ హోంగే
యే అప్నేహీ జమీన్ హోగీ
యే అప్నా ఆస్మాన్ హోగా’’
‘‘ఆరోజు వస్తుంది. ఎప్పుడో మనం స్వతంత్రులమవుతాం. ఈ నేల మనదే అవుతుంది. ఈ ఆకాశం మనదే అవుతుంది’’
‘‘ఇంక్విలాబ్ జిందాబాద్
హిందుస్థాన్ ఆజాద్ హో’’
ఉరికంబం వైపు ఇరుకు దారి, పాట దేశభక్తి నినాదాలతో జైలు ప్రహరీ ప్రతిధ్వనించింది. మృత్యుగహ్వారాన్ని ఆహ్వానిస్తూ కొదమసింహాల్లా నడుస్తున్న విప్లవ కిశోరాల ఆఖరి చూపులకోసం సెల్స్‌లో ఖైదీలు నిర్బంధంలో ఎగబడ్డారు, అందులో గుండెలు పిండే వేదన, బాధ కన్నీళ్లు. జైలు అధికారులు నిరాసక్తంగా బరువు తూచారు. నిర్లిప్తంగా స్నానాలు చేయించారు. అయిష్టంగా నల్లదుస్తులు వేశారు. భగత్ చెవిలో పంజాబీ వార్డన్ చత్తార్‌సింగ్.. ఒక్కసారి అయినా వాహే గురువును ప్రార్థించమని గొణిగాడు. ‘‘ఇప్పటిదాకా నేను ప్రార్థన చేయలేదు. పేదల బతుకులనుచూసి దేవుణ్ణి చాలాసార్లు తిట్టానుకూడా. ఇప్పుడు నేను క్షమించమని అడిగితే వీడు పిరికి... చస్తాడంటేనే నేను గుర్తుకొచ్చాను. అనుకొంటాడు అన్నాడు భగత్!! మాకెవరికీ భయం లేదు. ముసుగులు అక్కర్లేదు. ‘‘అక్కడనుంచి ఉరి కంబానికి కాస్తంతే దూరం.’’ సర్ఫరోషికే తమన్నా అబ్ హమారే దిల్ మే హై’’అని పాడుతూ ముగ్గురూ నడిచారు.
లాహోర్ సెంట్రలు జైలులో ఉరి కంబంపై కర్తార్‌సింగ్ సరాబా, విష్ణుగణేశ్ పింగ్లేవంటి గదర్ పార్టీ యువకులెందరో అంతకుముందు బలిఅయ్యారు. కర్తార్‌సింగ్‌ను 18వ ఏట బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసేటప్పుడు భగత్సింగ్‌కు 8 ఏళ్ళు.
అమర త్రయం త్యాగశీలత్వం
ఆ ఉరికంబం పాతదే. ఉరి తీసే తలారి బలవంతుడే. అంతిమ క్షణాల మృత్యు సన్నివేశం అది. బలిపీఠం చెక్కబల్లపైకి ఎక్కి, వేలాడుతున్న ఉచ్చులను ముగ్గురూ ముద్దుపెట్టుకొన్నారు. మాతృభూమి స్వేచ్ఛాస్వాతంత్య్రం కోసం మృత్యుదేవతను స్వచ్ఛందంగా ఆహ్వానించే ముక్కుపచ్చలారని ఆ యువకులు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరితాళ్ళు తామే మెడకు తగిలించుకొన్నారు. మధ్యలో భగత్సింగ్ అటూఇటూ సుఖదేవ్, రాజగురు. బహుశా బానిస శృంఖలాల భారతమాత కన్నీళ్ళతో వారికి సాక్షాత్కరించి వుంటుంది. తలారి తాళ్ళు మెడలకు బిగిసేటట్టు, కాళ్ళ కింద చెక్క పలకలను మీటనొక్కి లాగేసే డ్యూటీ నిర్వర్తించాడు. ఊపిరి ఆగిపోయేంతవరకు, ఆ ముగ్గురి నిర్జీవ మృతదేహాలు నిర్ణీత సమయం వరకు వేళ్ళాడాయి. కిందకు దించిన తరువాత జైలు డాక్టరు పరీక్షించి మరణించినట్టు ధృవీకరించాడు. కర్కశ నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం మోపిన రాజద్రోహ నేరానికి మరణదండన సక్రమంగా అమలుజరిగినట్టు జైలు ఉన్నతాధికాయరి సంతకంతో ధృవీకరించాలి. విషాద నిశ్శబ్దం ఆవరించివుంది. అమరమూర్తుల త్యాగశీలత, దేశభక్తి, ఆత్మస్థైర్యం ఆఖరి క్షణాలు కళ్ళారాచూసిన జైలు అధికారి చలించి, నిరాకరించాడు. వెంటనే అక్కడికక్కడే అతనిపై సస్పెండు ఉత్తర్వులు పుట్టుకొచ్చాయి. ఆ తతంగం వేరొక అధికారి పూర్తిచేశాడు. ఆరోజు అస్వతంత్ర అఖండ భారతావనిలో తల ఎత్తనున్న ఆగ్రహ క్రోధావేశాలకు వణికిన బ్రిటిష్ ప్రభుత్వం అంత్యక్రియల రహస్య తతంగం నడిపించింది.
భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు నేడు స్వతంత్ర దేశాలు. ఎందరో గదర్ విప్లవ యువకులు, విప్లవోత్తేజంతో చంద్రశేఖర అజాద్, మహబీర్‌సింగ్, జతీంద్రనాథ్‌దాస్, అల్లూరి శ్రీరామరాజు వంటి వీర యువకులు ఎందరో ప్రాణత్యాగాల ఫలితమే నేటి స్వాతంత్య్రం. నేటికీ లాహోర్‌లో భగత్సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల ఆఖరిక్షణాల ఉరికంబం ఒక ట్రాఫిక్ కూడలిగా నామరూపాలులేకుండా వుంది. షహీద్ భగత్సింగ్‌కు పాకిస్థాన్‌లోవున్న ఆ ప్రాంతాన్ని స్మృతిచిహ్నంగా నెలకొల్పాలని, మెమోరియల్ ఫౌండేషన్ న్యాయవాది ఇమ్త్‌యాజ్ రషీద్ ఖురేషి కృషి ఫలించటంలేదు. డెబ్భైఏళ్ళు పైబడ్డ స్వతంత్రంలో, మన త్యాగధనుల కలల సాఫల్యానికి, ఆశయ సాధనకు మనం ఏం చేస్తున్నాం? చరిత్ర మనల్ని క్షమిస్తుందా? హృదయం వుంటే ఆలోచిద్దాం.

-- జయసూర్య