సబ్ ఫీచర్

ధ్యానమే అన్నింటికీ జవాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది మరొకరికి సంబంధించినది. అందుకే అది బానిసత్వాన్ని సృష్టిస్తోంది కానీ, స్వేచ్ఛను సృష్టించట్లేదు.
స్వేచ్ఛ నాకు అత్యంత విలువైనది. ఎందుకంటే, కేవలం ఒక్క స్వేచ్ఛలో మాత్రమే మీరు పూర్తిగా వికసించగలరు.
ఈ సమాజం మనిషి అస్తిత్వం నిర్ణయించిన అసలైన వాస్తవమా లేక అది మనిషి నిద్రావస్థలో ఉన్నందువల్ల ఏర్పడిన నిబద్ధీకరణతో కూడిన అసత్య భావనా?
నిజానికి, సమాజానికి అస్తిత్వం లేదు. అది గందరగోళం మత్తులో వున్న మనిషి సృష్టించినది. అందుకే అది కృత్రిమంగా ఉంటుంది. అయినా అది అవసరమే. ఎందుకంటే, విచ్చలవిడితనంగా మార్చకుండా స్వేచ్ఛను ఆస్వాదించగల సామర్థ్యం మనిషికి లేదు.
సమాజం కృత్రిమమైనది. కాబట్టి, దానిని నాశనం చెయ్యగలం. ఏదో అవసరానికి దానిని సృష్టించుకున్నంత మాత్రాన అది శాశ్వతంగా ఉండవలసిన అవసరం లేదు. అది లేకపోతేనే మంచిది. ఒకవేళ అది ఉన్నట్లైతే దానిని వదిలించుకోక తప్పదు. అది మనం నిర్మించుకున్నది కాబట్టి, మనం ఎప్పుడు కావాలనుకుంటే అపుడు దానిని నాశనం చెయ్యగలం.
దేశాలు మరీ ఆటవికంగా పరస్పరం ఘర్షణపడే వ్యక్తిగత అహంకారాలు కలిగిన గుంపు మనస్తత్వమున్న సమాజాల నుంచి బయటపడి పరిణతి సాధించేదెలా? నేను చెప్పే ఒక చిన్ని కథ వింటే అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి.
ఒక సత్యానే్వషి సముద్రపు ఒడ్డున కూర్చున్న ఒక గొప్ప గురువు దగ్గరకు వెళ్లి, ఆయన పాదాలకు నమస్కరించి, ‘‘మహానుభావా, సత్యాన్ని తెలుసుకునేందుకు మీరు ఏమి చెప్పినా చేస్తాను. దయచేసి ఏం చెయ్యాలో చెప్పండి’’ అని అడిగాడు. వెంటనే ఆయన కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు. వెంటనే ఆ సత్యానే్వషి ‘‘నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఈ మహానుభావుడు కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడేమిటి?’’ అని మనసులో అనుకుంటూ, ఆయనను తట్టి లేపి ‘‘నా ప్రశ్నకు మీరు ఏమీ చెప్పలేదు’’ అన్నాడు.
వెంటనే ఆ గురువు ‘‘నేను సమాధానం చెప్పాను. దానిని నువ్వే అర్థం చేసుకోలేదు. ఏమీ చెయ్యకుండా నిశ్శబ్దంగా కూర్చుని, ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదించు. అన్నీ వాటంతటవే జరుగుతాయి’’ అన్నాడు.
‘‘అలా చేస్తే, ఏం చేస్తున్నావు? అని అందరూ నన్ను అడుగుతారు. అపుడు వారికి నేనేం చెప్పాలో ఒక్క మాటలో చెప్పండి’’ అన్నాడు ఆ సత్యానే్వషి.
వెంటనే ఆ గురువు ఇసుకలో ధ్యానం అని రాశాడు. ‘‘ఇది చాలా చిన్నదిగా ఉంది. అందరికీ అర్థమయ్యేలా కాస్త వివరంగా రాయండి’’ అన్నాడు ఆ సత్యానే్వషి.
వెంటనే ఆ గురువు మళ్లీ ‘్ధ్యనం’ అని చాలా పెద్ద అక్షరాలు రాశాడు.
‘‘మీరు ఇంతకు ముందు రాసిన అక్షరాలనే కాస్త పెద్దవిగా రాశారు. అంతే కదా!’’ అన్నాడు ఆ సత్యానే్వషి.
‘‘అంతకంటే ఎక్కువగా ఏమి చెప్పినా అది తప్పవుతుంది. నేను చెప్పినది నీకు అర్థమైతే, వెంటనే ఆ పని చెయ్యి. అపుడు ఏం చెయ్యాలో నీకే తెలుస్తుంది. ఆ తెలిసినదే నీ ప్రశ్నకు నా సమాధానం’’ అన్నాడు ఆ గురువు.
ప్రతి వ్యక్తి నిశ్శబ్దాన్ని నిశ్శబ్దంగా గమనించే ధ్యానిగా మారాలి. అపుడే అతని గురించి అతనికి తెలుస్తుంది. అదే అతని చుట్టూ వున్న అన్నింటిని మారుస్తుంది. అలా మనం ధ్యానం ద్వారా అనేకమందిని మార్చగలిగితే ఒక నూతన ప్రపంచాన్ని మనమే సృష్టించగలుగుతాం. అనేకమంది అనేక శతాబ్దాలుగా ఒక నూతన ప్రపంచం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ దానిని ఎలా సాధించాలో వారికి తెలియదు. అందుకే దానిని సాధించేందుకున్న అసలైన శాస్ర్తియ విధానాన్ని నేను మీకు చెప్తున్నాను. దాని పేరే ధ్యానం.
దేవుడితో సమస్య
‘‘దేవుడు మరణించాడు, మనిషి స్వేచ్ఛ పొందాడు’’ అంటాడు మహాజ్ఞాని ‘నీషే’. ఆ విషయంపై ఆయనకు అద్భుతమైన పరిజ్ఞానముంది. చైతన్య చరిత్రలో ఆయన ప్రవచనం ఒక మైలురాయి. కానీ, చాలాకొద్దిమంది మాత్రమే ఆయన ప్రవచనంలోని భావగంభీరతను అర్థం చేసుకోగలరు. దేవుడున్నంతవరకు మనిషికి స్వేచ్ఛ లభించడం అసంభవం. ఎందుకంటే, దేవుడు సృష్టికర్త కాబట్టి. మనందరినీ సృష్టించినది ఆయనే. అందుకే ఆయన ఎపుడైనా మనందరినీ అంతమొందించగలడు.
మీతో వినయంగా ‘‘మిమ్మల్ని ఎపుడు సృష్టించమంటారు, ఎపుడు చంపమంటారు’’ అని ఆయన ఎప్పుడూ అడగడు. అదంతా ఆయన ఇష్టం. మీరందరూ ఆయన చేతిలో కీలుబొమ్మలే. అంటే మీకు స్వేచ్ఛ లేనట్లే కదా! కనీసం, మీరు మీరుగా ఉండేందుకు కూడా మీకు స్వేచ్ఛ లేదు. చివరికి మీ జనన మరణాల విషయంలో కూడా మీకు స్వేచ్ఛ లేదు. ఇన్ని బానిసత్వాలలో మగ్గుతున్న మీరు స్వేచ్ఛగా జీవిస్తున్నారని భావించగలరా?
‘‘మనిషి స్వేచ్ఛ’’ రక్షించబడాలంటే దేవుడు మరణించాల్సిందే తప్ప, మరొక దారి లేదు. దేవుడున్నంతవరకు మనిషి బానిసగానే ఉంటాడు. ‘స్వేచ్ఛ’ కేవలం ఒక పదంగానే మిగిలిపోతుంది. దేవుడు లేనపుడే స్వేచ్ఛ అనే పదానికి అసలైన అర్థం తెలుస్తుంది.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.