సబ్ ఫీచర్

మార్క్స్ బోధనలకు దిక్కుదివాణం లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్టుబడిదారీ విధానంలో ‘లాభం’ ప్రధాన పాత్ర పోషిస్తుంది, ఈ ఒక్క అంశం చుట్టూనే ఆ వ్యవస్థ పరిభ్రమిస్తుంది. అనేక అవలక్షణాలను మోసుకొస్తుంది. ‘శ్రమదోపిడి’కి ఉసిగొల్పుతుంది. కాబట్టి ఏకంగా ఆ పెట్టుబడిదారీ వ్యవస్థను తుంగలో తొక్కాలని, దోపిడీనుంచి ‘విముక్తి’ పొందాలని మార్క్సిజం బోధిస్తున్నది. ఆ విషయాలనే తాజాగా రచయిత్రి రంగనాయకమ్మ తనదైన శైలిలో తన రచనల ద్వారా ప్రబోధిస్తున్నారు. కమ్యూనిస్టులు, మావోయిస్టులు సైతం తమతమ పద్ధతుల్లో దీనే్న చెబుతున్నారు. శతాబ్దంన్నర కాలంగా ప్రపంచంలో ఈ ప్రచారం కొనసాగుతోంది. కానీ ఫలితం అంతగా కనిపించదు. తాజాగా రోబోల రాకతో ఆ బోధనలు దిక్కుదివాణం లేనివయ్యాయి.
మనిషి తనకోసం తాను పనిచేసినప్పుడు దోపిడీ కనిపించదు. లాభం ప్రసక్తే లేదు. కాబట్టి దాని చుట్టూ అల్లుకుని ఏ ‘చెడు’ దరిచేరదు. అందుకే ఆ పద్ధతి.. ఆ వ్యవస్థ కొనసాగాలని, అవసరమైతే దాని రూపాంతరం రూపుదిద్దుకోవాలని రంగనాయకమ్మతో సహా కమ్యూనిస్టులు, మావోయిస్టులు ఆశిస్తున్నారు. అందుకోసం శాయశక్తులా కృషిచేస్తున్నారు. నక్సలైట్లు-మావోలు మందుపాతరలు - మర తుపాకులు పేలుస్తున్నారు.
ఓ బిడ్డ పుట్టి బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు ముద్దు అనిపిస్తుంది. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఆనందమేస్తుంది. అంత మాత్రాన ఆ బిడ్డ జీవితాంతం అలాగే బుడిబుడి అడుగులు వేయలేడు కదా? పెరిగి పెద్దవాడవుతాడు నడక మారుతుంది- నడత మారుతుంది. ఇది సహజ సిద్ధంగా జరిగే పరిణామం. ప్రకృతి కల్పించిన సౌలభ్యం. దీన్ని నిరోధించడం ఎవరివల్లా సాధ్యంకాదు.
అలాగే మానవ సమాజమూనూ. సమాజంలోని మనుషులు తమకోసం మాత్రమే ‘శ్రమ’ చేసే విధానం.. తమ కోసమే కష్టపడే పద్ధతి చిరస్థాయిగా అలాగే నిలిచిపోవాలనుకోవడం సబబుగా ఉంటుందా?... అసలు అది సాధ్యమా?... ఇతరుల కోసం పనిచేసే పరిస్థితి ఏర్పడినప్పుడు సహజంగానే పూర్వపు స్వేచ్ఛ, పూర్వపు ఫలితం కనిపించదు. అక్కడ ‘‘రాజీ’’ పడక తప్పదు! రాజీపడకుండా మనుగడ కొనసాగించే ‘‘వీలు’’ ఉంది. కాని పెరిగిన ఆకాంక్షలు- కోర్కెలు, కుటుంబ అవసరాల కోసం ఇతరుల కోసం పనిచేసే పరిస్థితి- పద్ధతి ఉబికిరావడం.. అది ఉభయ కుశలోపరిగా భావించి ఆ ‘పని’లోకి దిగడం జరిగింది... జరుగుతోంది. స్వచ్ఛందంగానే ఆ పనిలోకి ప్రవేశించాక... ఉభయ తారకంగా ఆ ‘ఒప్పందం’ ఉందని ‘పని’లోకి దిగాక ఆ వ్యవస్థలో, విధానంలో, ‘శ్రమదోపిడీ’ఉందని వాపోవడం.. ఆ దోపిడీని అరికట్టేందుకు ఆ ఉత్పత్తిసాధనాలను స్వాధీనం చేసుకోవాలని భావించడం భావదారిద్య్రంగాక ఏమవుతుంది? మొత్తం సమాజం ఈ ‘రెండుమెట్ల’ పైనే ఆధారపడి అనాదిగా కొనసాగుతోంది.
పెట్టుబడిదారుడు- కార్మికుడు కజిన్స్
పెట్టుబడిదారుడు, కార్మికుడు తొలినాళ్ళలో పరాయివాళ్లు కాదు శత్రువులు అసలేకాదు. పైగా అంతకు పూర్వతరంలో వారందరూ ఒకే ‘కుదురు’కు చెందినవారు. ఇరుగుపొరుగు లేక ఒకే కుటుంబానికి చెందినవారైనా ఆశ్చర్యపోనవసరం లేదు. లేదా కజిన్స్ కావచ్చు. ఆ కజిన్స్ ఒకచోట కలిసి పనిచేసినవారిలో ఒకరు పెట్టుబడిదారునిగా మిగతావారు శ్రామికుల్లా ఎదిగితే ఆ ‘వరుస’అలాగే కొనసాగితే ఆఖరికి ఆ బంధువే, ఆ మిత్రుడే, ఆ రక్త సంబంధీకుడనే ‘శత్రువు’ని చూసినట్టు చూడ్డం. పీకలదాక ‘కసి’ని పెంచుకుని అతని ప్రాణంతీసేందుకు సైతం వెనుకాడవద్దని నూరిపోసే మార్క్సిస్టు-మావోయిస్టు సిద్ధాంతం... ఎలా మానవాభ్యుదయమైనదో ఎవరికివారే ఆలోచించాలి.
ఎదగాలన్న కాంక్ష, తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించాలన్న ఇచ్ఛ... సహజసిద్ధమైనవి. ఆత్రుతతో ఆ శ్రామికుల్లోంచి, తనకన్నాముందు ‘నాయకత్వ’స్థాయిలోకి వచ్చిన వారిని అనుకరించి... అనుసరించి తనదైన ప్రత్యేకశైలిలో ఉబికివచ్చి అజమాయిషిని ప్రదర్శించి నయా పెట్టుబడిదారునిగా ఎదిగితే... కొంతకాలం తర్వాత అతన్నికూడా శత్రువుగా, దోపిడీదారునిగా, నిర్దయుడిగా ముద్రవేసి అతని పీచమణిచేందుకు ఉద్యుక్తులవుతే ఆ పరంపరం అలాగే కొనసాగితే అంతిమంగా ఎక్కడ తేలుతాం?
స్వాభావికమైన ఎదగాలన్న ‘లక్షణాన్ని’ తుంగలో తొక్కాలని చూస్తే అది అదృశ్యమవుతుందా? ఆ లక్షణం తిరిగి కనిపించకుండా కనుమరుగవుతుందా?... ఇది చాలా సింపుల్ ప్రశ్న. దీనికి లేదనే సమాధానమొస్తున్నది. మనం జంతువులం కాదు. మారే లక్షణం మానవులకుంది. కాబట్టి మారాలి ఆ ఎదగాలన్న కాంక్షను, లక్షణాన్ని ‘సమాధి’ చేయాలని మార్క్సిస్టు ప్రేమికులు హుకుం జారీచేస్తే అంతా వారు చెప్పినట్టు జరుగుతుందా?...
మార్క్స్ హ్రస్వ దృష్టి
ఇక్కడే మార్క్స్... ఆయన అభిమానులు పప్పులో కాలేశారు.
మనిషి ఒక యంత్రం కాదు. స్విచ్ ఆన్... ఆఫ్‌చేస్తే పని ప్రారంభించడానికి, ఆపేయడానికి. మనిషి వివేకం... విచక్షణా జ్ఞానం... సొంత ఆలోచనలతో మసలుకోవాలని చూసే జీవి. జంతువుకు-మనిషికి మధ్యగల తేడా వివేకం... విచక్షణ... సొంత నిర్ణయాలు... స్పందన, ప్రతిస్పందన... ఎదగాలన్న కాంక్ష. కాలక్రమంగా మెరుగైన పరిస్థితులను సృష్టించుకోవాలన్న తపన...తాపత్రయం, దీన్ని గమనించాలి. దాని పర్యవసానమే ఈ ఆధునిక వాతావరణం మన కళ్ళముందు కనిపిస్తోంది. పని స్థానంలో యంత్రాలు, రోబోలు కనిపిస్తున్నాయి.
ఈ వౌలిక లక్షణాన్ని ఇంకో రూపంలో దర్శించి అందులో ‘శ్రమదోపిడీ’ ఉంది...ఇది పెట్టుబడిదారుల ప్రపంచం, శ్రమచేయనివాడు సుఖపడుతున్నాడు, శ్రమచేసేవారు కష్టపడుతున్నారు... దుఃఖపడుతున్నారు. ఈ దుఃఖం-బాధ, ఆర్తి ఆర్పేయాలి... కాబట్టి తిరుగుబాటుకు సిద్ధంకావాలి, సంఘం పెట్టాలి, సంగతేందో తేల్చాలి అని ఉసిగొల్పడం, కసిని నింపడం న్యాయసమ్మతంగా కనిపించినా మూలాలలోకి వెళితే ఆ సూచనలోని ‘వెలితి’ బోధపడుతుంది.
పరస్పర ఆధారంగాకాక విడిగా మనలేని దశకు మానవ సమాజం చేరుకుంది. బలవంతంగా ఇటువైపు, మనుషుల్ని ఎవరో తరమలేదు. సమష్టి నిర్ణయమే అది. అందరి భాగస్వామ్యంతో, అందరి ఆకాంక్షల, కలల ప్రతీకగానే ఈ సమాజం రూపుదిద్దుకుంది. కొందరికి ఈ పరిణామం, పరివర్తన పసందుగా అనిపించకపోవచ్చు. అలాంటివారి అభిప్రాయం, ఆకాంక్ష చెల్లుబాటయ్యేదే అవుతే, సరసమైనది.. మానవాభివృద్ధికి మేలైనదే అవుతే, ఆ అభిప్రాయమే సమాజంలో స్థిరపడేది. అదే తన ప్రభావాన్ని సమాజంపై చూపేది. అలా కొనసాగలేదంటే దానికున్న పరిమితులను గమనంలోకి తీసుకోవాలి.
ముద్ర
సమాజంలో ఎన్నో అభిప్రాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు వెలుగుచూస్తూ ఉంటాయి. అవన్నీ స్థిరపడవు. మెజార్టీ ప్రజలు దేన్నికోరుకుంటారో, ఇష్టపడతారో అదే తన ‘ముద్ర’ను సమాజం మొత్తంపై బలంగా వేస్తుంది.
ఈ ప్రక్రియ...పద్ధతి.. వైఖరి చిరకాలంగా కొనసాగుతూ వస్తోంది. కొంత నిశితంగా పరిశీలిస్తే ఇది బోధపడుతుంది. దీన్ని తిరస్కరించే ‘హక్కు’ ఉన్నప్పటికీ ఆ హక్కు అధికారంగా మారడానికి కావలసిన ‘పరిస్థితులు’ సమాజంలో ఏర్పడాలి. ఆ పరిస్థితులు లేకుండానే ఆవేశపడితే, ఆగ్రహంతో ఊగిపోతే ఒరిగేది ఏమిటి? హళ్ళికిహళ్ళి సున్నాకు సున్నా!
ఈ స్పష్టత లేక, సరైన దృక్పథం లేక, వాస్తవాలను పట్టించుకోక, ‘మానవ జీవన సరళి’ని అందులోని మెలకువలను గుర్తించకుండా మూస ధోరణిలో మార్క్సిస్టులు, రంగనాయకమ్మ చెప్పినట్టు ప్రయాణించడమంటే ఏమిటి ప్రయోజనం?
మార్క్స్ ప్రతిపాదించింది, రచయిత్రి రంగనాయకమ్మ పెట్టుబడి గ్రంథంపై ప్రచారం చేసేది, మావోయిస్టులు మందుపాతరలు, మర తుపాకులు పేల్చి చెప్పేది పూర్తిగా మానవ స్వభావానికి విరుద్ధమైనది. అతని ఆవరణంలోకి రానిది, ఆకాంక్షలను తుంచేసేది, ఎదుగుదలను అరికట్టేది. నియమిత...పరిమిత అభివృద్ధికి ఇష్టపడని తత్వాన్ని జయిస్తామని చెప్పడం అమాయకత్వమైనా అయిఉండాలి... లేదా అజ్ఞానమైనా అయి ఉండాలి.
వాస్తవానికి దోపిడీ వ్యవస్థను కూల్చేయాలన్న మార్క్స్ బోధనలను పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రాణవాయువును తీసేయాలన్న వంద సంవత్సరాలకు పైగా ఆచరణలో పెట్టేందుకు విశేష ప్రయత్నంచేసినా, అనూహ్య రీతిలో మానవ హననానికి పూనుకున్నా, హత్యలుచేసినా, సమిష్టి క్షేత్రాల్లోకి చదువుకున్న ‘వైట్ కాలర్’ వారిని మందలుమందలుగా తరలించినా, ప్రణాళికాబద్ధంగా సోషలిస్టు సమాజం కోసం అవిశ్రాంతంగా శ్రమించినా, మొక్కవోని పద్ధతిలో ప్రయత్నించినా అంతిమంగా మానవ బలహీనతలు... ఆకాంక్షలు... స్వేచ్ఛాయుత వాతావరణంకోసం ఆత్రుత, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరినుంచి తప్పించుకునేందుకు యుక్తిని ప్రదర్శించడంతో ఆ ‘ప్రయోగం’ కాస్త విఫలమైంది. ఇదంతా మానవ సమూహాలద్వారా జరిగింది. ఎవరో గ్రహాంతరవాసులు వచ్చి సోషలిస్టు భావనను, కమ్యూనిస్టు కానె్సప్ట్‌ను కొలిమిలో కరిగించలేదు.
మానవ ఆకాంక్ష
ఈ తెలివిడి, ఎరుక, మానవునిలోని ప్రాథమిక ఆకాంక్ష, సృజనాత్మక శక్తి, దానితో ఉబికివచ్చే ఎదగాలన్న ఉత్సుకత, నూతన ఆవరణం కోసం తహతహ ఇవన్నీ నిరంతరం ఉండేవే... ఒక తరహాలో గాకుంటే రూపం మార్చుకుని మరో పద్ధతిలో వెల్లువెత్తుతాయి. దీన్ని పసిగట్టగలిగితే ఫలితం ఉంటుంది తప్ప- ఈ ప్రక్రియను తెరవెనక దాచేసి శ్రమదోపిడీ లేని సమాజ ఆవిష్కరణకోసం పిడికిలెత్తుతాం అంటే అందులో ఏమేరకు విజ్ఞత ఉందన్నది మొదటగా వినిపించే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే శతాబ్దానికి పైగా ‘కసి’ని ప్రదర్శిస్తే, ప్రజలను విడదీసి ఉసిగొల్పితే జరిగింది ఏమిటో మన కళ్ళముందు కనబడుతోంది.
అరిషడ్వర్గాలు
ఉత్పత్తి రంగంలో ‘పీస్‌వర్క్’ విధానం పరమ దుర్మార్గమైనదని విచ్చలవిడి దోపిడీకి మూలమని భావించి దాన్ని భూస్థాపితం చేయాలనుకున్నా సోషలిస్టు వ్యవస్థలు సైతం ఆ విధానాన్ని తీసివేయలేకపోయాయని రంగ నాయకమ్మ ఒక విశే్లషణలో వివరించారు. అంటే ఏమిటి అర్థం?... సోషలిస్టువ్యవస్థను కొనసాగించేవారే ఆ విధానాన్ని తొలగించలేకపోయారంటే అందులో ‘స్వాభావిక అంశం’ ఎంత బలంగా ఉందో వెల్లడవుతున్నది. ఈ విధానంలో కార్మికుల మధ్య ఆదాయ వ్యత్యాసాలు పెరుగుతాయని, ఈర్ష్యలు బయలుదేరుతాయని సమాజం కలుషితమవుతుందని కూడా ఆమె వెల్లడించారు.
ఇదో, ఇదే మానవ స్వభావం. ఇదే మనిషిలోని అరిషడ్వర్గాల స్వరూపం. ఇది కూడా పెట్టుబడిదారీ విధాన ‘పాపం’గా పరిగణించడంలోనే ఆ ఆలోచనా విధానంలోని లోపం. తాజగా ప్రపంచవ్యాప్తంగా పనివిధానం మారుతోంది. కార్మికశక్తి కనుమరుగై అంతటా యంత్రాలు, రోబోలు రానున్నాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ సర్వేలు చెబుతున్నాయి. దాంతో రంగనాయకమ్మ ప్లస్ మార్క్సిస్టుల మార్క్సిజం, పెట్టుబడి గ్రంథంపైగల అపారప్రేమ ఆవిరైపోతోంది.

- వుప్పల నరసింహం 99857 81799