సబ్ ఫీచర్

కృత్రిమ మేధ ముందు ‘వీవీ’ తెలివి ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల మాంత్రికుడు, ‘విరసం’ నాయకుడు వరవరరావు (వీవీ) విస్తుపోయే రోజులొచ్చాయి. అయినా- తన వాదనే ఉత్కృష్టమైనది... శాస్ర్తియమైనది... ప్రజానుకూలమైనది... పదికాలాలు నిలిచేదని వాదించడం ఆయనకున్న బలహీనత. ఆ బలహీనతనే ఆయన తన బలమనుకుంటూ కాలం గడుపుతున్నాడు.
కాలం అందరికన్నా గొప్పది. ఈ విషయాన్ని విస్మరించి సర్వకాలాలందు తన వాదన, తన (మావోయిస్టు) వైఖరి విప్లవాత్మకమైనది, విశాల ప్రజానుకూలమైనది. మిగతా వాదనలన్నీ నిర్వీర్యమైనవి... నిరర్ధకమైనవి... నిజాయితీ లేనివిగా భావిస్తూ తన భావాలను విత్తుతున్నారు ‘వీవీ’. ఆ భావాలు మొలకెత్తే స్థితిలో లేవని గుర్తించేందుకు తిరస్కరించడంతోనే ఆయన వాదనాపటిమ ఎంత వితండమో బహిర్గతమవుతోంది.
భావాలు, ఆలోచనలు నిరంతరం రూపాంతరం చెందుతుంటాయి. దీన్ని మాయమాటలతో బోల్తాకొట్టించి 200 సంవత్సరాల క్రితపు మార్క్స్ భావాలు, ఆలోచనలు ఆధునికమైనవని, విశ్వసించదగ్గవని వీవీ చెప్పడంతో ఆయన ఎంత సనాతనవాదో వ్యక్తమవుతోంది. కాని ఆయన తన వాదన, తాను విశ్వసించిన మార్క్సిజం ఇప్పటికీ ఎప్పటికీ సర్వోత్కృష్టమైనదని గగ్గోలు పెట్టడం వింతల్లోకెల్లా వింతగాక ఏమవుతుంది?
పారదర్శకత, పరిశ్రమ, విచక్షణ, విజ్ఞత అంతా తన వాదనలోనే ఉందనుకుని మాట్లాడే వీవీది విచిత్ర వాదన తప్ప సమంజసమైనది కాదు. అది వితండ వాదన. మాటల గారడీతో అందరిని అన్ని కాలాల్లో ఆకర్షించేందుకు చేసే ప్రయత్నం చిరకాలం తనను, తన పార్టీని కాపాడుతుందనుకోవడం విషాదమే!
కాలానుగుణంగా అన్నీ మారుతాయి, రూపాంతరం చెందుతాయి. కాని వీవీ వాదన... ఆయన వైఖరి... విప్లవకర పరిస్థితి ఎప్పటికీ ఒకేలా కళకళలాడుతూ పత్రహరితంలా జిగేల్ మంటుందనుకోవడం పొరపాటు.
వీవీ తాను అధ్యాపకత్వం నెరపుతున్న కాలం నుంచి ‘తాత’అయిన సమయానికి జరిగిన పరిణామాల్ని పట్టించుకునేందుకు ఇష్టపడక ఇంకా విప్లవ భావజాలమే మొత్తం సమాజాన్ని ప్రక్షాళన చేస్తుందని భావించడమంత విడ్డూరం మరొకటి ఉండదు. అనేకానేక ఆలోచనలు... భావధారల్లో, అభిమతాల్లో విప్లవ భావమొకటి తప్ప! అదే సర్వం- సమస్తం కాదు. ఈ ఇంగితాన్ని విస్మరించి వీవీ తన వాదన-వైఖరి సర్వోత్కృష్టమైనదన్నట్టుగా ఇప్పటికీ వాదించడం విచిత్రం, అమాయకత్వం. మరోమాటలో చెప్పాలంటే అది అజ్ఞానం.
వర్తమాన సమాజాన్ని తలకిందులు చేయాలన్నది మార్క్స్ ప్రతిపాదన. దాని అవసరం ఎప్పటికీ రాదని మిగతా వాదాల మాట. మార్క్స్ బోధనలు అసంబద్ధమైనవి, మానవ సహజాతాలకు భిన్నమైనవి... కేవలం ఊహలకే పరిమితమైన అంశాలను పట్టుకుని పాకులాడే వైనంపై ప్రాణాలు నిలిపి ఆరాటపడటం ఆశ్చర్యకరం.
నిజంగా మార్క్స్ బోధనలు అద్భుతమైనవి, ఆచరణ సాధ్యమైనవే అయితే కోట్ల మంది హననం తర్వాత రూపొందించుకున్న సోవియట్ యూనియన్, జనచైనా ఎందుకు విప్లవపు పూర్వపు పరిస్థితులను ఆహ్వానిస్తాయి? సమాజాన్ని తలకిందులు చేయడం సమంజసమైన ‘చర్య’కాదన్న తత్త్వం బోధపడి అక్కడి పాలకులు తిరిగి ఎందుకు మొదటికొచ్చారు? ఈ విషయం వీవీ గుర్తించకుండా అదే పనిగా సమాజాన్ని సమూల ప్రక్షాళన, సమాజాన్ని తలకిందులు చేయాలన్న ప్రతిపాదనకు మద్దతు తెలపడం తెలివిగల చర్య అనిపించుకోదు.
మార్క్సిజం శాస్ర్తియం... అన్నమాట ఆయన ఇప్పటికి అనేకసార్లు చెప్పారు. దాన్నొక ఊతపదంగా వాడతారు. శాస్ర్తియమంటే ఆచరణలో, పరీక్షలో నెగ్గినది, అన్ని అనుమానాలను నివృత్తిచేసి పరీక్షలకు నిలవగలిగినదే శాస్ర్తియమవుతుంది. మరి మార్క్సిజం ఏ పరీక్షలకు, ఏ అనుమానాలను నివృత్తిచేసి కాలపరీక్షలో నిలిచింది? ప్రతి పరీక్షలో అది విఫలమైంది. కేవలం కాగితాలకే పరిమితమై ఆచరణలో విఫలమైన దాన్ని ‘శాస్ర్తియం.. శాస్ర్తియం’ అనడం గోబెల్స్ ప్రచారం లాగే ఉంటుంది తప్ప సత్యం అవదు. ఎంతో రక్తం చిందించినా, ఎంతో హింసకు పూనుకున్నా, మరెంతో విధ్వంసానికి పాల్పడినా ఆ సిద్ధాంతం ఎక్కడా విజయం సాధించి నిలబడలేదు. తాత్కాలికంగా నిలిచినచోట ఘోరంగా విఫలమైంది. ‘వెనిజులా లాంటి దేశాల్లో ప్రజలు అన్నమో రామచంద్రా..’- అంటూ పొరుగు దేశాలకు వలసబాట పట్టారు. ద్రవ్యోల్బణం పెరిగి సంచి నిండా కరెన్సీకట్టలు తీసుకెళ్ళినా పిడికెడు తిండి దొరకడం లేని పరిస్థితి ఏర్పడింది.
ఇంత చూశాక కూడా మార్క్స్ ప్రతిపాదనలు ఎంతో పవిత్రమైనవని పేర్కొనడం ఆరోగ్యకరమైన ఆలోచనలు చేసే వ్యక్తి చెప్పే మాట కాదు. కరుడుగట్టిన విప్లవవాది కావడం తనకు తాను గొప్ప అనిపించుకోవడానికి ఉపకరిస్తుందేమోగాని సమకాలీన ప్రజలకు వీసమెత్తు ఉపయుక్తం కాదు.
వరవరరావు తండ్రి కాలం ఇప్పుడు లేదు. వీవీ కాలేజీలో చదువుతున్న సమయం నాటి కాలం కూడా ఇప్పుడు లేదు. తన పిల్లలు చిన్నగున్నప్పటి కాలం ఇప్పుడు లేదు. వర్తమానంలో నాల్గవ పారిశ్రామిక విప్లవం పరిఢవిల్లుతోంది. దీని ప్రత్యేకత కార్మికశక్తి కాదు.. అది- కృత్రిమ మేధ. ఈ వౌలిక తేడాను గమనించక ఏవో ఊహల పల్లకీలో తేలియాడుతూ మాటల మాంత్రికుడిలా వ్యవహరిస్తే ఏమిటి ప్రయోజనం? ‘కృత్రిమ మేధ’ చిక్కనవుతున్న వేళ...శ్రమ... కార్మికశక్తి గూర్చిన ఉపన్యాసం ఏమాత్రం ప్రాసంగికం కాదు. వీవీ మాటలు సైతం ప్రాసంగికం కానే కావు. కాని తన భావాలు, తన విప్లవ పార్టీ కార్యాచరణ సర్వోత్కృష్టమని భావించడం పూర్తిగా భావ దారిద్య్రం. ప్రజల్ని మభ్యపెట్టి, మసిబూసి మారేడుకాయ చేయడం. మాటల మాంత్రికుడి అవతారం అన్ని కాలాలకు ఉపయుక్తం కాదనే మాట గుర్తెరిగితేనే విజ్ఞత అనిపించుకుంటుంది. ఎదురుదాడి చేసి, ఎదురుప్రశ్నలు వేసి ఉక్కిరిబిక్కిరి చేశామనుకోవడం ఓడిపోయే సమయంలోనే చేసే ఆలోచన.. వ్యక్తీకరణ. ఏదో స్ఫురణకొచ్చి చేసే తర్కం... తడబాటు... ఆ తడబాటులోనే తర్క రహితంగా ఎదురు దాడిచేసి ఎదుటివారిని నిరుత్తరుడిని చేశామని భుజాలెగరేయడం అంత గొప్ప విజ్ఞత అనిపించుకోదు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలుకుని, నక్సల్‌బరి, శ్రీకాకుళం, ఉత్తర తెలంగాణ, దండకారణ్య పోరాటం ఒక గొప్ప కొనసాగింపు.. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా విప్లవం సజీవంగా ఉందని భ్రమపడటం చూస్తే వీరెంత అల్పసంతుష్టులో, అమాయకులో అర్థమవుతుంది.
ప్రజారాశుల్లో బలమైన మార్పురావడం ముఖ్యం తప్ప, ఎన్ని గెరిల్లా దాడులు, తాజాగా అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యల లాంటివి ఎంతకాలం కొనసాగించామన్నది ముఖ్యం కాదు. కొలంబియాలోని ‘్ఫర్క్’ దళాలకన్నా గొప్పగా దండకారణ్యంలో గెరిల్లాల పోరాటం లేదు. అలాంటి ‘్ఫర్క్’ కాలానుగుణంగా స్పందించి, మారిన కాలాన్ని, పరిస్థితుల్ని అర్థంచేసుకుని పోరాటాన్ని విరమించి ప్రజాసేవలో పునీతులవుతున్నది. వారికి మార్క్స్ బోధనలు, లెనిన్ పోరాటం, మావో ‘లాంగ్‌మార్చ్’, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారమన్న నినాదం గూర్చి తెలియక పోరాటాన్ని విరమించలేదు. అన్నీ తెలిసి- ప్రజల సంక్షేమం రీత్యా, వారి యోగక్షేమాల దృష్ట్యానే పోరాటాన్ని విరమించుకుని జన జీవన స్రవంతిలో కలిశారు. చైనాను, నేపాల్‌ను, కొలంబియా ఫార్క్‌ను విమర్శిస్తూ తాము చెప్పిందే సర్వ సమ్మతం, అంతకుమించి మరో మాట లేదన్నట్టు వ్యవహరించడంలోనే ‘తప్పు’ ఉందని గుర్తించకపోవడం విడ్డూరం.
ప్రజలు కేవలం తమవైపే చూస్తున్నారన్న ఒక భ్రమలో మావోలు, వీవీ వంటి వారు ఇంకా కాలం వెళ్లదీస్తున్నారు. మిగతా రాజకీయ పార్టీలు, మిగతా విశ్వాసాలుగలవారు, చివరకు ఎంతోకొంత బలం ఉన్న వామపక్షాల వైపున్న ప్రజలు ప్రజలుకారు.. వారంతా భ్రమల్లో బతుకుతున్నారు.. కేవలం తమను బలపరిచేవారు మాత్రమే పుటం పెట్టిన రీతిలో స్వచ్ఛమైన వారనుకుంటే అదెంతటి అజ్ఞానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కార్మికుడికి ప్రత్యామ్నాయంగా ‘రోబో’ రంగ ప్రవేశం చేసింది. ఈ రోబో విప్లవం రెక్కవిప్పుకుంటున్న తరుణంలో ‘వీవీ’ విప్లవ నినాదం ఇంకా పనిచేస్తుందా..?

-వుప్పల నరసింహం 99857 81799