సబ్ ఫీచర్

ఆల్ రౌండర్ పేకేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

8.10.1918- 8.10.2018
*
పేకేటి శివరామ్ శత జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం
*
ఏ రంగంలోనూ మహోన్నత ఖ్యాతికి
వెళ్లకపోయినా పలు రంగాల్లో ప్రశంసలుఅందుకున్న బహుముఖ ప్రజ్ఞావంతుల జాబితాలో పేకేటి శివరామ్‌ను అగ్రపథాన స్మరించుకోవాలి. అనుభవం లేని రంగాల్లో అడుగుపెట్టి ‘ఔరా! ఎంత టాలెంట్.. ఎన్ని విద్యలు.. ఎన్ని విజయాలు’ అని ప్రశంసలందుకున్నాడు పేకేటి. స్నేహానికి మారుపేరుగా నిలిచిన శివరామ్ ఈ తరానికి, ఏ తరానికీ ఆదర్శవంతుడు.
తెలుగు టాకీలు ప్రారంభమైన (1931) ఆరేళ్లకు (1937) మద్రాసులో అడుగుపెట్టిన పేకేటి శివరామ్ సినీ, తదితర రంగాలకు అందించిన సేవలు ఒక్కసారి వీక్షిస్తే ‘ఔరా ఎంత టాలెంట్.. ఎన్ని విద్యలు.. ఎన్ని విజయాలు’ అనిపించక మానదు. ఆల్ రౌండర్ అనిపించుకున్న పేకేటి 1918 అక్టోబర్ 8న జన్మించాడు. చిన్ననాడే మాతామహుడు బసవరాజు రామబ్రహ్మం వద్ద భారత, భాగవత, రామాయణ, భగవద్గతలు జీర్ణం చేసుకొన్నాడు. భీమవరంలో కాలేజీ విద్యతోబాటు ఖురాన్, బైబిల్ అధ్యయనం చేశాడు. భమిడిపాటి కామేశ్వరరావు ‘బాగు బాగు’ వంటి నాటకాల్లో నటించి తండ్రి మరణానంతరం సినిమా రంగంపై మోజుతో 1937లో మద్రాసు చేరి ఉదర పోషణార్థం బహూకృత వేషం అన్నట్టు కెమేరా డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంటుగా చేరాడు. ఫొటోగ్రఫీ అధ్యయనంవల్ల 1948-49 ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ శాఖలో జవహర్‌లాల్ నెహ్రూకి పర్సనల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసే అవకాశం దక్కటం, దానివలన ఆ కుటుంబంతో పరిచయం, ఫలితంగా తరువాతి కాలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దక్షిణ భారతానికి కాంగ్రెస్ పబ్లిసిటీ ఇన్‌ఛార్జిగా పేకేటిని నియమించటం జరిగింది. ఇది రాజకీయ రంగం.
తరువాత చెప్పుకోదగ్గ మజిలీ ప్రతిభా పిక్చర్స్‌లో ప్రొడక్షన్ మేనేజర్. ఈ సమయంలోనే అక్కినేని నాగేశ్వరరావును తొలిసారిగా 1944 మే 8న మద్రాసులో రిసీవ్ చేసుకుని స్వాగతం పలికారు. నాటినుంచి పేకేటి కన్నుమూసేదాకా వారి మైత్రి ఏకోదర సోదర భావంతో వృద్ధిచెందింది. 1945 ప్రాంతాల్లో కొంతకాలం హెచ్‌ఎంవి గ్రామ్‌ఫోన్ రికార్డుల సంస్థకు ఇన్‌ఛార్జిగా పనిచేశారు. ఆ కాలంలో ఘంటసాల చేత ప్రైవేటు రికార్డు లలిత గీతాలు పాడించి ఆయన భవిష్యత్తుకు బాటలువేశారు.
అటు ప్రతిభాకు, ఇటు వినోదా సంస్థకు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసిన పేకేటిని తొలిసారిగా వేదాంతం రాఘవయ్య ‘శాంతి’ (1952) చిత్రం ద్వారా నటుడిని చేశారు. అందులో సావిత్రి సరసన, ఆ వెంటనే ‘వద్దంటే డబ్బు’లో జమున సరసన హాస్యపాత్రలు పోషించారు. తర్వాత శతాధిక చిత్రాల్లో కామెడీ పాత్రల్ని, కామెడీ టచ్ వున్న విలన్ పాత్రల్ని పోషించారు. ‘దేవదాసు’లోని భగవాన్ పాత్రకు దిలిప్‌కుమార్ ప్రత్యేక ప్రశంసలందజేశారు. ఇతర చిత్రాల్లో చిరంజీవులు, పెళ్ళినాటి ప్రమాణాలు, నిత్యకళ్యాణం- పచ్చతోరణం, భలేరాముడు, పెళ్లిసందడి చెప్పుకోదగ్గవి.
1945లోనే జర్నలిస్టుగా మరో అవతారం ఎత్తాడు పేకేటి. విశాఖ, మార్విస్, చాణక్య పేర్లతో ఆనాడు వెలువడిన చిత్రకళ, రూపవాణి వంటి పత్రికలకు వ్యాసాలు రాసి ఆంధ్రా అబ్బాస్ అని ప్రశంసలు అందుకున్నారు. ఆ కాలంలోనే ప్రముఖ దర్శకుడు సి.పుల్లయ్య కుమార్తెకు పాఠాలూ చెప్పారు. పేకేటి జీవితంలో చెప్పుకోదగ్గ అధ్యాయం దర్శకపర్వం. ఎవరి దగ్గరా దర్శకత్వ శాఖలో పనిచేయని పేకేటి, ఒక మిత్రుని బలవంతంమీద ‘చక్రతీర్థ’ సినిమాను తనకు పరిచయంలేని కన్నడ భాషలో రికార్డు టైం 50 రోజుల్లో పూర్తిచేసి విడుదల చేయటం, దానికి అవార్డులు రావటం, ఉత్తమ దర్శకునిగా గుర్తించబడటం ఊహించని విశేషం. తరువాత రాజ్‌కుమార్ హీరోగా కన్నడంలో ఏడు చిత్రాలు; తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ముత్తురామన్‌లతో ‘కుల గౌరవం’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ చిత్రాల్లో వారు త్రిపాత్రాభినయం చేయడం విశేషం. ఆవిధంగా అగ్ర హీరోల్ని డైరెక్ట్‌చేసే అవకాశం పేకేటికి రావడం అదృష్టమే. తెలుగులో వీరి దర్శకత్వంలో రూపొందిన ఇతర చిత్రాలు.. ‘చుట్టరికాలు’, ‘భలే అబ్బాయిలు’. తమిళంలో ఎజీఆర్‌ను కూడా డైరెక్ట్ చేశారు. సుజాత (జయసుధ పూర్వనామం), జయంతి (కమలకుమారి), లక్ష్మి, మంజుల, శారద (కన్నడ రంగంలో నాయక)లను ఆర్టిస్టులుగా ప్రమోట్ చేసిన వ్యక్తి శివరామే.
తన జీవితంలో 900మంది లాయర్లు కర్నాటక బార్ అసోసియేషన్ తరఫున బెంగుళూరులో తనకు చేసిన ఘన సన్మానం మరువలేనిది అనేవాడు పేకేటి. 1975లో హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించాడు శివరామ్. నెల్లూరులో జరిగిన పౌర సన్మాన సభలో డాక్టర్ బెజవాడ గోపాల్‌రెడ్డి వీరిని హాస్య నటనా ధురీణ బిరుదుతో గౌరవించారు.
ఉత్సాహంకొద్దీ జ్యోతిష శాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి పేకేటి. అడపాదడపా కవితలు చెప్పటమేగాక పేరడీ పద్యాలను చెప్పి అందులో ఘనుడైన జలసూత్రం రుక్మిణీనాథశాస్ర్తీ నుంచి ప్రశంసలందుకున్నాడు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పేకేటిని ఆశు కవితా సార్వభౌమ బిరుదుతో సత్కరించారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రెండేళ్లు దర్శకునిగా ఉండి, పలు డాక్యుమెంటరీలు తీర్చిదిద్దటమేకాక, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కోసం రెండుగంటల నిడివిగల టీవీ ఫిల్మ్ రూపొందించారు. వీటన్నింటినీ మించి స్నేహశీలి పేకేటి అనే మంచి పేరును, మిత్ర బృందాన్ని సంపాదించుకున్నారు. అసాధారణ ధారణయే ఆయనకు గొప్ప వరం. ఏ రంగంలోనూ మహోన్నత ఖ్యాతికి వెళ్లకపోయినా పలు రంగాల్లో ప్రశంసలుపొంది ఆ తీపి గుర్తులతో జీవితం హాయిగా గడిచిపోతుందంటారు. అన్నట్టు ప్రఖ్యాత కళాదర్శకులు పేకేటి రంగా వీరి కుమారుడే. మరో కుమారుడు కృష్ణమోహన్ మద్రాసులో ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్‌గా పనిచేశారు. తమిళ రంగంలో అగ్రశ్రేణి హీరోగా రాణిస్తున్న ప్రశాంత్ ఈయన మనుమడు. హైదరాబాద్‌లో సాంస్కృతిక కార్యక్రమాల్లో తన అనుభూతులతో ప్రేక్షకుల్ని అలరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి పేకేటి. తన ఎనభై ఎనిమిదో ఏట 2006 డిసెంబర్ 30న చెన్నైలో కీర్తిశేషులైనారు.

-ఎస్‌వి రామారావు