సబ్ ఫీచర్

నీటి సంరక్షణే దేశానికి రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణ మార్పులు దేశంలోని వివిధ ప్రాంతాలను వైపరీత్యాలతో వణికిస్తున్నాయి. తరచు అనావృష్టి, తుఫాన్లు, వరదలకు గురౌతున్నాయి. వాటి ఉధృతి మునుపటికన్నా ఎక్కువైంది. ఇటీవలి కాలంలోనే ఈ మూడురకాల వైపరీత్యాలు పెరగటం ఆందోళన కలిగించే అంశం. గతంలో దేశం చాలానే అనావృష్టులను చవిచూచింది. కాని 1998 తరువాత వాటి రాక ఎక్కువైంది. 1999, 2002, 2009, 2014, 2015 సంవత్సరాల్లో అనావృష్టుల చేదు రుచి చూడక తప్పలేదు. ఈ పరిణామం పేద రైతులను అత్యంత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసాయి. వీరికున్న కొంచెం వ్యవసాయ భూమిని తెగనమ్ముకొనేలా చేసి, జీవనోపాధికోసం నగరాలకు వలస కూలీలుగా తరిమేసాయి.
ప్రస్తుత సంవత్సరం కూడా చాలా ప్రాంతాలు కరువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. దేశంలో కరువు తాండవిస్తోందని కేంద్రం ప్రకటించింది. దాదాపు నాలుగోవంతు జనాభా కరువుతో పలు ఇక్కట్లు పడుతున్నారని ప్రభుత్వం లెక్కగట్టింది. దేశంలోని సగం జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదై కనీసం తాగునీరు దొరకని పరిస్థితులు దాపురించాయి. దీనికితోడు ఎండవేడి 45 డిగ్రీలు పైబడి ప్రజలను మలమల మాడ్చేస్తున్నది. మహరాష్ట్ర, కర్నాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరువు ప్రభావం అధికంగా వుంది. పంటలు చేతికందని రైతులను ఆదుకోవడానికి, తాగునీటి సమస్యను తీర్చడానికి రాష్ట్రాలకు కేంద్రం సాయం ప్రకటించింది. లాతూర్ వంటి మహా కరువు ప్రభావ ప్రాంతానికి నీటి రైలు పంపిన విషయం మనకు తెలుసు. ఈ సహాయ చర్యలన్నీ అవసరమే. కాని సమస్య చాలా తీవ్రమైంది, లోతైంది. ఇది వ్యవసాయంపై చూపే ప్రతికూల ప్రభావం అంతా ఇంత కాదు. వ్యవసాయ రంగంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 75 శాతం మంది జీవనోపాధి పొందుతున్నారు. కరువు పరిస్థితుల తీవ్రత ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వరి, గోధుమ పంటల దిగుబడి దిగజారి ఆహార భద్రత గాలిలో కలసిపోయే ప్రమాదం పొంచి వుంది. దేశంలోని 91 నీటి ప్రాజెక్టుల్లో నీరు అడుగంటిపోయింది. వీటిల్లో కనీసం 20 శాతం కూడా నీటి నిల్వలు లేవు. కరువు పరిస్థితులను ఆదుకోవడంలో సాగునీటి ప్రాజెక్టులు ఏమా త్రం పనికిరావని తేలిపోయింది.
ప్రభుత్వ సాగునీటి లెక్కలు గమనిస్తే వాటి ప్రగతి ఏమాత్రం ముందుకు వెళ్ళిన దాఖలాలు కనిపించవు. 6కోట్ల 30 లక్షల హెక్టార్ల దగ్గరే కొట్టమిట్టాడుతున్నాయి. ఇది వ్యవసాయానికి పనికివచ్చే భూమిలో 45 శాతం మాత్రమే. ఇటీవలి కాలంలో అస్సాం, కాశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కొంచం నీటి వ్యవస్థ విస్తరించింది. పెద్ద మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులకు భారీగా పెట్టుబడులు అవసరం. కాని వాటి నుండి వచ్చే ఫలితం పెట్టుబడులకు తగినంతగా ఉండటం లేదు. వీటిల్లో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. 2004-05లో 23,500 కోట్లు వుండగా 2013-14నాటికి అవి 30,009 కోట్లకు పెరిగాయి. భారీ ప్రాజెక్టులో పెట్టుబడి మూడున్నర రెట్లు, మధ్యతరహాప్రాజెక్టులో 2 1/2 రెట్లు ఎక్కువైయ్యాయి. కాని నీటిని అందించే సామర్థ్యం నిన్న ఎక్కడ వుందో నేడు అక్కడనే వుండటం గమనార్హం. ఈ సందర్భంగా వీటిపై అంతర్జాతీయ ఆహార సంస్థ జరిపిన అధ్యయనం గమనించడం అవసరం. భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు 90లలో 14 శాతం లాభం అందించగా, 2000 నాటికి అవి అందించే ఫలితాలు 0.12కు జారిపోయాయి.
నీరు సహజ వనరు. దీన్ని కృత్రిమంగా తయారు చేయలేం. చేసినా ఇంత పెద్దఎత్తున తయారీ అసాధ్యం. గిట్టుబాటు అసలే కాదు. వానే మంచినీటి సరఫరాదారు. జీవకోటి మనుగడకు నీరే ఆధారం. వాతావరణం ఆధారంగా చేసిన విభజనే కాలం. కాలాలు గతి తప్పాయి. మరి వర్షం సమయానికి ఎలా వస్తుంది. ముసురులు మాయమయ్యాయి. భూగర్భ జలం వేగంగా అడుగంటిపోవడానికి ఇదొక కారణం. ఎడారిలో 100 గంటలే వర్షం కరుస్తున్నది. అలా భూమిని చేరిన నీటిని 8660 గంటలు వాడుకోవాలి. ఇంటి అవసరాలు తీరాలి. వ్యవసాయం సాగాలి. పశుపక్ష్యాదులకు చేరాలి. పరిశ్రమలకు అందాలి. రానున్న వర్షాకాలంలో వానలు బాగా కురవొచ్చు. కాని కరువు పరిస్థితులు చక్కబడతాయని ఎవరూ భరోసా ఇవ్వలేరు. శాశ్వత చర్యలు చేపడితేనే నీటి కరువు తీరుతుంది. నిలకడైన అభివృద్ధి సాధ్యపడుతుంది. క్రమంగా జనాభా పెరుగుతోంది. సగటు నీటి వాడకం అంతకన్నా వేగంగా పెరుగుతోంది. కరువును నివారింపగల సత్తా వాటర్‌షెడ్‌కు మాత్రమే వుందని జాతీయ, అంతర్జాతీయ సుదీర్ఘ అనుభవాలు చెబుతున్నాయి. పరుగులు తీసే నీటికి నడక నేర్పడమే వాటర్‌షెడ్ అంటే ఈ కార్యక్రమం పట్టణాలకు, నగరాలకు విస్తరింపజేయాలి. అభివృద్ధిచెందిన దేశాల నగరాల్లో కూడా వాటర్‌షెడ్ అమలు చేస్తున్నారన్నది గమనార్హం.
దేశంలో 5 లక్షల గ్రామాలున్నాయి. గ్రామీణుల్లో ఎక్కువమంది చిన్న, సన్నకారు రైతులు. కౌలుదార్లు. వీరందరూ పేదలే. తక్కువ ఖర్చుతో కరువును పారద్రోలే కార్యక్రమం నేడు అవసరం. అది వాటర్‌షెడ్. ఇది నీటి సేకరణ, వినియోగం, నిర్వహణ, సంరక్షణల సమాహారం. అన్ని స్థాయిల్లో గ్రామస్థుపాలు పంచుకోవాలి. పనికి ఆహార పథకం వాటర్‌షెడ్‌కు అనుసంధానించి, అవసరమైన సాంకేతికత అందించితే చాలు. బావుల్లోకి, చెరువుల్లోకి నీరు చేరుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. ప్రజలకు నీటి వ్యవస్థ నిర్వహణ అలవడుతుంది. స్థానిక మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి. పర్యావరణం కుదుట పడుతుంది. కరెంటు ఖర్చు తగ్గుతుంది. వాటర్‌షెడ్ దేశాన్ని సస్యశ్యామలం చేసే ప్రజాస్వామ్య కార్యక్రమం.

- వి.వరదరాజు