సబ్ ఫీచర్

‘దాంపత్య దీపం’ కొడిగడితే ఇక చీకట్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాహేతర సంబంధం నేరం కాదు. ఒకవేళ అది అనైతికం అనుకుంటే భార్యాభర్తలు విడాకులు తీసుకోవచ్చు’- ఇది మన దేశ ‘సర్వోన్నత న్యాయస్థానం’ అనబడే ఒక రాజ్యాంగబద్ధ పీఠం సెలవిచ్చిన నిర్ణయాత్మక నీతిసూక్తి. భారత రాజ్యాంగం ప్రసాదించిన సమానత హక్కు (Right of Equality) , స్వేచ్ఛ హక్కు (Right to Freedom) అనే రెంఢింటినీ ఆధారం చేసుకొని ఈ మహాభిప్రాయాన్ని సుప్రీం వెలిబుచ్చి ఉండవచ్చు. ఇలా ప్రకటించిన న్యాయమూర్తులకు ‘రాజ్యాంగం’ ఒక్కటి మాత్రమే తలపులో ఉండి ఉండాలి. రాజ్యాంగంలో లేని మానవ మనస్తత్త్వ శాస్త్రం, బాలల మనస్తత్త్వ శాస్త్రాలను, జాతి నరనరాల్లోను, జన్యువులలోను ఉండే ఒక చిరంతన ఉదాత్త ధర్మభావన, జిజ్ఞాస, ఆచరణీయతలను వారు విస్మరించడం శోచనీయం, దురదృష్టకరం.
తమ తల్లిగాని, తండ్రి గాని వివాహేతర సంబంధం నెఱపుకోవటం వాళ్ళ పిల్లలు గ్రహిస్తే ఆ లేతమనసులు పడే బాధ, మానసిక క్షోభ, తోటి పిల్లలమధ్య పొందే చులకన, స్వాపరాధభావ చింత (Guilty tragic feeling), అన్యాయ, నిర్హేతుకఫు తలవంపు (Unjust, Irrational and Baseless Humiliation) లు ఎంత దుర్భరంగా ఉంటాయో మాటలలో చెప్పలేం, రాతలలో వివరించలేం. తమ పిల్లలకు అలాంటి దుర్భర వేదన కలిగించే అధికారం, హక్కు తల్లిదండ్రులకున్నాయా? సమాజానికి ఉన్నాయా? సుప్రీం కోర్టుకైనా ఉన్నాయా?
మానసిక దౌర్బల్యం వల్లో, ‘కోరిక’ రేకెత్తించే ఒత్తిడివల్లో ఎవరైనా- ‘వివాహేతర సంబంధం నేరం కాదు’ అని కోర్టు చెప్పింది కాబట్టి- తమ తమ పిల్లలకు తెలియకుండా ఇలాంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారే అనుకుందాం. కొన్నాళ్లకు పిల్లలకు ఆ సంగతి తెలియకుండా ఉంటుందా? అప్పుడు ఎదిగిన మనసులతో కౌమారులు (Teenagers), లేత వనలు ఇంకా ఎంతో మానసిక క్షోభ అనుభవించరా? లేకపోతే వాళ్ళూ పెళ్ళిళ్ళు జరిగాక- తమ తల్లిదండ్రుల మార్గాలలోనే నడవరని చెప్పగలమా? ఇలా సత్ప్రవర్తన పట్ల సమాదరణ లోపిస్తే సమాజం గతి ఏమవుతుంది? ‘స్వీయ సుఖానుభూతి ప్రధానతావాదియైన’ చలం చెప్పిన సందేశానికి హారతిపట్టే ఈ సుప్రీం ప్రవచనం ఎంతవరకు శిరోధార్యం? ఏ విధంగా ఆచరణయుక్తం?
పిల్లలకు తెలియకుండా- ‘మా సుఖానుభూతి పనులను మేము చూసుకుంటాం కదా!’ అని అంటారేమో ఈ సుప్రీం కోర్టు ప్రవచనానుకూలురు. ఎవ రూ చూడకుండా ‘కూడని పని’ చేస్తే అది నేరమో, తప్పోకాకుండా పోతుందా? అయితే దొంగతనం కూడా తప్పుకాదు ఈ లెక్కన. ఎలాగంటే తనదగ్గర లేనిది, తనకు కావలసినది ఉన్నచోట తెచ్చుకోవటం దొంగపని. తనకు ఇంట్లో దొరకనిది. తనకు చాలనిది మరో వ్యక్తిదగ్గర పొందటం వివాహేతర సంబంధాలు పెట్టుకునేవారు చేసే పని. ఇలా (కు)తర్కిస్తూపోతే లోకంలో ఏదీ తప్పుకాదు, ఏదీ నేరమూ కాదు. సుప్రీం న్యాయమూర్తులకు ఒక సార్వకాలిక, సార్వజనీన సత్యం తెలుసు. అది ఏమిటంటే చట్టబద్ధమైన ప్రతిదీ న్యాయ సమ్మతమే. కానీ న్యాయ సమ్మతమైన ప్రతిదీ చట్టబద్ధం కాదు. ఉదాహరణకు ఒకతను ఇంకెవరినో చంపు అని చెప్పి అందుకు ప్రతిఫలంగా ఒక హంతక వృత్తిదారుడికి పదివేల రూపాయలు ముందుగానే బయానా (ఎడ్వాన్స్)గా ఇచ్చాడనుకుందాం. కానీ, ఆ హంతక వృత్తిదారుడు ఆ హత్య చేయలేదు బయానాగా పైకం తీసుకొని కూడా. ఇచ్చిన మాట నిలుపుకోలేదు. కనుక హంతక వృత్తిదారుడు చేసిన నమ్మక ద్రోహం న్యాయబద్ధం కాదు, హత్య చేయకపోవటం చట్టబద్ధమే. ఇదిగో ఇలాగే ఉంటాయి సమాజశ్రేయస్సు దృష్ట్యా చాలా విషయాలు.
వివాహేతర సంబంధం మానవుని ప్రాకృతిక వాంఛా సహజ ధర్మమూను, ప్రాథమిక హక్కులలోనిదీను కావచ్చు. కానీ దానిని సమాజ భద్రత, సుస్థిరత, శాంతి, క్రమశిక్షణ, పురోగతుల దృష్ట్యా నేరం గానే చూడాలి. ఈ సందర్భంగా ప్రఖ్యాత అమెరికా ఆధ్యాత్మిక విజ్ఞాన విదుషీమణి అయిన మేరీ బేకర్ ఎడ్డీ (1821-1910) ‘పరిశుద్ధత లేక పాతివ్రత్యము నాగరికతా పురోగతుల నిర్మాణానికి రసాయనికపు అడుసు (సిమెంట్). అదే గనుక లేకపోతే సామాజిక సుస్థిరత, నియమబద్ధ జీవనం ఉండవు. (Chastity is the cement of civilization and progress. Without it there is no stability in society and without it one cannot attain the science of life)

ప్రాథమిక హక్కు-హద్దు...
వీధిలో నీవు నడుస్తూ పోతున్నప్పుడు నీ రెండు చేతులూ ముందు వెనుకులకు ఊపుతూ పోవటం నీ ప్రాథమిక హక్కు. కానీ నీ రెండు చేతులలో ఏ ఒక్క చేరుూ పక్కవాడికి తగలకుండా ఉండే వఱకే నీకు ఆ హక్కు ఉంటుంది. నీ చేయి పక్కనపోయే వాడికి తగిలినా, వాడికి అడ్డం వచ్చినా నీ ఆ హక్కు అక్కడితో ఆగిపోతుంది. అలాగే ఏ స్ర్తిఅయినా, పురుషుడైనా ‘కోరిక’ల విషయంలో తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటం వారికి రాజ్యాంగం, సుప్రీం కోర్టులు స్వేచ్ఛా-సమానత హక్కుగా ప్రసాదించి ఉండవచ్చు. కానీ- రచయిత చలం ప్రతిపాదించిన స్వేచ్చాశృంగార విశృంఖలత మన తరువాతి తరాలవారు- ముఖ్యంగా అభము శుభము తెలియని పిల్లలు చెడిపోకుండాను, భావి సమాజం అధోగతికి, అస్తవ్యస్తతకు లోనుకాకుండాను ఉండేవరకే అని గుర్తించాలి ఏ భౌతికవాదియైనా, ఏ నిహిలిస్ట్ (విధ్వంసక (సుఖ)వాది)యైనా. దీన్ని కాదని- సుప్రీం కోర్టు ప్రవచనాన్ని మానసికంగా, శారీరకంగా ఆచరణలో పెడితే సంసారాలు కూలిపోవటం ఖాయం. కేంద్ర ఆర్థికశాఖామంత్రి జైట్లీ వంటి ప్రముఖులు ఇదే మాట అన్నారు.
క్రైస్తవ మేధావి అభిప్రాయం
1978-2005 కాలంలో వాటికన్ సిటీలో పోప్‌గా ఉండిన సెయింట్ జాన్ పాల్-2 మహనీయుడు కూడా ఇదే చెప్పాడు మరో విధంగా. ‘పరిశుద్ధ ప్రవర్తనాపరులు (ఏక (జీవిత) భాగస్వామి (నీ)వ్రతులు) అయిన స్ర్తి, పురుషులు మాత్రమే నిజమైన ప్రేమానుభూతులు పొందగలరు.
(Only the chaste man and the chaste woman are capable of true love)

ఐతికాసికాలు...
రామాయణంలో పర పురుష వ్యామోహిని అయిన శూర్పణఖ ముక్కుచెవులు పోగొట్టుకొని భంగపడింది. అనుచితమైన కాముకతో కచుని మోహించి దేవయాని విఫల మనోరథయై భంగపడింది. వరూధిని అధర్మపూర్వక వాంఛతో గతి తప్పింది. రావణుడు పరస్ర్తి వ్యామోహంతో అంతమైపోయాడు. పరపురుషునకు శరీర వాంఛాసక్తితో లొంగిపోవటం అనేది భారతీయ స్ర్తి ధర్మ లక్షణం కాదు. అది పాశ్చాత్య సంస్కృతిలో తప్పు కాకపోవచ్చు. ఉదాహరణ ‘హెలెన్ ఆఫ్ ట్రాయ్’ వృత్తాంతంలో హెలెన్‌ను ఒకడు అపహరించుకుపోయి ఆమెను భార్యగా అనుభవిస్తాడు. ఆమె కూడా సహకరిస్తుంది. తరువాత అసలు భర్తవెళ్ళి అతనిని ఓడించి భార్యను తెచ్చేసుకుంటాడు. రామాయణంలో ఊర్మిళ వృత్తాంతం మహాద్భుతం. భర్త లక్ష్మణుడు అన్న రామునితో అరణ్యవాసానికి వెళితే అంతదీర్ఘ కాలమూ ఊర్మిళ యోగనిద్రలో ఉండిపోయింది. పురాణ కథల దాకా ఎందుకు? కొందఱు పాశ్చాత్యుల నీతిబాహ్యత చెప్పటానికి? రెండవ ప్రపంచ యుద్ధం (1940-45)లో జర్మనీ చేతిలో ఫ్రాన్స్ ఓడిపోయింది. అప్పుడు ఫ్రెంచి సేనాని ‘మేము సమర వ్యూహంలో ఓడిపోలేదు. నర్తనశాల వ్యాపకాల (Balroom dances) వల్ల ఓడిపోయాము’ అన్నాడు.

అన్యోన్యత- పరస్పర అవగాహన..
సంసారంలో సుఖశాంతులకు ఆధార పీఠాలు అన్యోన్యత, పరస్పర అవగాహనలు. ‘ఎడబాయని కూరిమి.. జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా..’ అన్నాడొక సినీ కవి. ‘శరీరాలు వేరేకాని మనసొకటై మసలాలి’ అన్నాడు మరో సినీ కవి.
ఉదాత్త మనుష్య ధర్మం..
‘పరహింసా పరకీయ విత్త హరణాభావంబు, సత్యవ్రతా దరమున్, దాన పరత్వమన్య వనితో దంతోక్తిమూకత్వమున్.. భద్ర ప్రాప్తికిన్ మార్గముల్’ -అన్నాడు భర్తృహరి. ఒక స్ర్తియొక్క భర్తతో మరొక స్ర్తి సంగమిస్తే ధర్మపత్ని ఎంతో మానసిక హింస అనుభవిస్తుంది. ఇలాంటి స్థితి ఎవరికీ కలిగించకుండా ఉండడం, పరస్ర్తిని గాని, పరపురుషుని గాని, పరుని ధనమును గాని ఆపేక్షించకుండా ఉండటం, పరస్ర్తిల గురించి మాట్లాడకుండా ఉండటం మొదలైన పద్ధతులు భద్రతకు- అంటే- శుభత, శ్రేష్ఠతాస్థితి, మేలైన పరిస్థితులకు దోహదములు అని భర్తృహరి చేసిన హితోపదేశం.
‘‘ఒరులేయవి యొనరించిన
నరవర! అప్రియము తనమనంబునకగు; తా
నొరులకు నవిసేయకునికి
పరాయణము పరమ ధర్మపథములకెల్లన్’’ అన్నాడు తిక్కన (భారతం శాంతి పర్వంలో). దీన్ని మనసులో పెట్టుకొని జీవితంలో జీర్ణించుకుంటే ఏ స్ర్తిగాని, ఏ పురుషుడుగాని పర ‘వస్తు’వ్యామోహంలో పడదు, పడడు. ఈ సనాతన ధార్మిక మానవ హృదయస్థ న్యాయనీతి దంపతులలో ఇద్దరికీ వర్తిస్తుంది.
‘కమలములు నీటబాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమతమ నెలవులు తప్పిన
తమ మిత్రులె శత్రులౌట తథ్యము సుమతీ!’
భార్యాభర్తలు రెండు పద్మాలు. ఆ రెండు పద్మాలూ అన్యోన్యత అనే సరస్సులో ఉన్నన్నాళ్ళూ సూర్యుడు అనే సమాజం యొక్క ఆదరభావ దృష్టి ఆ రెండు కమలాలపై పడుతూ వాటిని కళకళలాడిస్తూనే ఉంటుంది. అవి రెండూ తమ అన్యోన్యత అనే సరస్సును వీడిపోతే- అప్పుడు సమాజపు చూపే వీళ్ళ ముఖాలు వివర్ణమయ్యేట్లుగా చేస్తుంది.. అనే భావధ్వని ఉంది పై పద్యంలో.
‘ధరలో నీతియె తొడవెవ్వారికి; నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!’ (లోకంలో ఎవరికైనా నీతిమంత జీవితమే ఆభరణం, స్ర్తికి పాతివ్రత్యమే భూషణం)- అన్న సుమతీ శతకకారుడే ‘పరనారీ సోదరుడై / పరధనముల కాసపడని/ యతడు పరముడు సుమతీ! (పరస్ర్తిలకు అన్నగా మెలిగే, ఇతరుల సొత్తును ఆశించకుండా ఉండేవాడే చాలా గొప్పవాడు)’ అని కూడా అన్నాడు. వివాహ ఘట్టంలో ‘్ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరామి’ (ధర్మ, అర్థ, కామ విషయాలలో నీతిని అతిక్రమించను) అని వరుని చేత ప్రమాణం చేయిస్తారు. ఆ ప్రమాణం వధువుకూ వర్తిస్తుంది- ఆమె నోట అనిపించకపోయినా.
ఇలాంటి సముదాత్త సంస్కార పూర్వక సమాజశ్రేయోదాయక ఆలోచనా మార్గాన్ని ఏ మాత్రమూ పట్టించుకోకుండా రాజ్యాంగ పుస్తక పుటలలోకి పూర్తిగా దూరిపోయి, తలను (మెదడును) కప్పేసుకొని, సుప్రీం కోర్టు ప్రవచనానే్న ఆచరణయోగ్యంగా తీసుకుంటే భారత పౌరులు- ‘పెక్క్భుంగులు వివేకభ్రష్ట సంపాతముల్’ అనే భర్తృహరి వాక్యానికి తార్కాణప్రాయులై పోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త!

--శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 98497 79290