సబ్ ఫీచర్

అజేయమైన కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దూరంగా ఓక వ్యక్తి జీవితమంటే ఏంటని కేక వేశాడు. రకరకాల గొంతులు సమాధానాలు విసురుతున్నాయి. ఒక గొంతు ఎలాంటి భయం, అనుమానం, తడబాటు లేకుండా జీవితమంటే అజేయం అని ముక్కుసూటిగా చెప్పింది. జీవితంలో ఏమి సాధించామని ఎవరైనా అడిగితే జీవించి ఉండటమే సాధించామని చెప్పండి. పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకోకపోవడమే అజేయమని చెప్పండి. అవును గాలితోపాటు పరిగెత్తడమంటే అది అజేయమైన చర్య అని తెలుసుకున్నవారే జీవితపు విలువను గ్రహిస్తారు. జీవితమంటే అజేయం మరి అజేయంగా ఎవరుంటారు. జనంలో నగ్నంగా ప్రవహించే వారే అజేయంగా ఉండగలరు. మట్టి పెళ్ళలను అరచేతుల్లోకి తీసుకొని మునివేళ్ళతో మట్టిని తడుముతూ పరిమళాన్ని ఆస్వాదించేవారు అజేయులు. పొలాల గట్లమీద పచ్చని పాదముద్రలను వదిలి బురద నీటిలో విత్తులు వేసేవారే అజేయమైన అజేయులు. స్వార్థపు కలుపును గుండె పొలంలో తీసేసి చెప్పులు లేని పాదాలతో నగ్నభూమిపై నడిచేవారు మహా అజేయులు. మీరు అజేయంగా ఉండాలంటే జనంనుండి జనంలోకి మలుపులు మలుపులుగా కాంతివేగంతో ప్రయాణించండి.
‘కవులేం జేస్తారు!/ గోడలకు నోరిస్తారు
చెట్లకు కళ్ళు ఇస్తారు/ గాలికి గొంతులిస్తారు
కవులేం జేస్తారు!/ ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారు
ప్రజలకు చేతులిస్తారు/ తెల్లకాగితానికి అనంతశక్తినిస్తారు’’
కవి అంటే కనికట్టు చేసేవారని ఎంత తేలికగా అన్నావు కవి అంటే బుర్ర తినేవాడని నోరు పారేసుకున్నావు కవి అంటే పనిపాట లేకుండా ఏదో పిచ్చిరాతలు రాసుకునేవాడని చెప్పడానికి నోరెలా వచ్చింది. కవులేం చేస్తారులే మహాఅయితే అవినీతి ప్రభుత్వాలను కూలదోస్తారు. మీ హృదయాలలో అడ్డుగా కట్టుకున్న గోడలను పగలకొట్టి పచ్చని మొక్కను మీ శ్వాసలో నాటుతారు. కవులేం చేస్తారు కంచెలు నిర్మించుకున్న మీ నోటికి ప్రశ్నను వేలాడతీస్తారు. చేతి వేళ్లు తెగిపోయి నిస్తేజంగా పడిపోయిన మీ మనికట్లపై వృక్షాన్ని విస్తరిస్తారు. రాజ్యాంగ లొసుగులను నిందిస్తారు. దేశంపై అక్షరాల విత్తనాలు వెదజల్లుతారు. ఎడారిలో నదులు, జలపాతాలను సృష్టిస్తారు.
మీ చెమట చుక్కలకు ఖరీదుకట్టిన వ్యక్తుల నాలుకలను కోస్తారు. కవులు శాశ్వతంగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల హక్కులకై పోరాడుతారు. విశ్వంపై సమస్త హక్కులను పొంది నిరంతరం అక్షరిస్తారు. కవులు అప్పుడప్పుడు పసిపిల్లలై మన ముఖాలపై నవ్వులు చిందించేలా చేస్తారు. మేఘాలలో ప్రేమను నింపి మన దేహాలపై వర్షించేలా చేస్తారు. వృద్ధుల ఆలోచించి గత అనుభవాలను చెప్తూ భవిష్యత్తును మనముందు ఉంచుతారు. కవులు అప్పుడప్పుడు సాదుజీవులౌతారు. కొన్నిసార్లు చురకత్తులౌతారు మరికొన్నిసార్లు మీ పిడికిళ్లల్లో నిండిపోయి ఒక మహత్తర నినాదంలా రూపాంతరం చెందుతారు. కవులు మొక్కల్లా ఉన్నప్పుడే తుంచేయకండి. వారిని ఎదగనీయండి వృక్షాలు సమూహాలు సమూహాలుగా విస్తరించేలా చేయండి అప్పుడే సమాజం మెరుస్తుంది.
‘‘వివశమై పోవటాన్కి ఎమున్నదిక్కడ. గాలి పీల్చే మాంసం ముద్దలు తప్ప’’ ఇది శివారెడ్డిగారు మనుషుల స్థితి గురించి చెప్పిన వాక్యం. సమాజంలో లేదా సమూహంలో తిరుగుతున్నా వారంతా మనుషులు ఎలా అవుతారు. ఊపిరిని పీలుస్తూ తిరుగుతున్న శవాలే కదా! మనుషులు మనుషులుగా బ్రతకడం మానేసి యుగాలే గడిచిపోయింది. ఎవరైనా అక్షరాలలో ఊపిరిని నింపి వారికి అందించండి. కాళ్ళను నరుక్కొని ఉన్న చోటే కూలపడిపోకండి. వలయాలు వలయాలుగా లేదా నక్షత్రాలు నక్షత్రాలుగా తిరుగుతూ వెలుగులను వెదజల్లండి. ఎండిపోయిన చేతులతో కాకుండా వరి పంటలనో లేదా వర్షపు చినుకులనో లేదా దాహాన్ని తీర్చే నదులనో నింపుకొని ఒక వెచ్చని స్పర్శను అందిస్తూ తిరగండి. కళ్ళు తెరిచి కాదు కాదు కళ్ళు మొగ్గల్లా విప్పి సమాజాన్ని చూడండి. అప్పుడే ‘‘నా’’ అనే పదం మరణించి మనం అనే పదం జెండాపై ఎగురుతుంది. జీవితాన్ని తెల్లకాగితంలా విడిచి వెళ్ళకండి నింపండి నింపండి అనుభవాల అక్షరాలను నింపండి ఒక తరంనుండి మరో తరందాక ప్రవహించండి.
‘‘నిజానికి ఊహలేని వాణ్ని ఉరితీయాలి’’ కళ్ళలో ఊహలు లేనివారు కనీసం జీవితంలో ఊహలు లేనివారు బతికుండి ప్రయోజనమేంటి? అబ్దుల్ కలాంగారు చెప్పినట్లు కలలుకనాలి వాటిని నిజం చేసుకోవాలి. అయినా కలలు కనడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు కదా మరి కలలు కనడానికి కూడా భయమెందుకు? స్వేచ్ఛగా స్వతంత్రంగా కలలుకలలుగా కలగనండి వాటి సాకరంకై చెమటను దేహంపై పోసుకోండి.
నీళ్ళల్లో పడవ బోల్తాపడింది మరణం; రోడ్డుపై రక్తం పారింది మరణం; గాలిలో జీవితం ఎగిరిపోయింది మరణం; భుజాలపై కాదు నిలువెల్ల మరణాన్ని పరిచయంచేసిన వ్యవస్థకు శివారెడ్డిగారు జోహార్లు అర్పిస్తున్నారు. అవును మరణం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. రోడ్డుపై కుటుంబం మరణిస్తే పది లక్షలు ప్రకటించిన వ్యవస్థకు పాడే కట్టాలి. మరణానికి వెలకట్టిన వ్యవస్థను మార్చే అక్షరం కావాలి. నిర్లక్ష్యపు పాము వ్యవస్థలో చేరి ప్రాణాలపై బుసకొడుతుంటే స్పందించాల్సిన హృదయం మామూలే అని అనుకోవడం దాక తెచ్చిన వ్యవస్థను ఊడ్చిపడేయాలి.
ఎందుకో తెర్లవారుజాము చాలా సున్నితంగా ఉంటుంది పిల్లాడి పాదాలు. అరిచేతుల్లా మెత్తగా ఉంటుంది. నోటినుండి కారే జొల్లులా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే అందరం పొద్దునే మరో ప్రపంచంలో విహరిస్తాము. రాత్రి పడుకోకుండా కొట్టుమిట్టాడిన కనురెప్పలపై ఎవరో మేకులు దింపారు. సావిట్లో గొడ్డు నెమరేస్తున్న శబ్దం చెవుల్లోచేరి మరణ భయాన్ని చూపిస్తుంది. నిద్ర అలలు కంటి తీరాన్ని చేరడం లేదు తీరంపై ఎవరో నిప్పు అందించుకొని తగలెడిపోతున్నారు. రాత్రిని దోసిళ్లలోకి ఒంపుకొని కన్నుల్లో పోసుకోండి పొద్దునే సూర్యుడి కిరణాలు కన్నుల కింద వికసిస్తాయి. ఉదయం పసి పిల్లలాంటిది ఎత్తుకొని ముద్దాడండి.
వాడు ఎందుకు తాకుతున్నావు అంటాడు? శివారెడ్డిగారు మనిషిని తాకకుండా ఎలా మాట్లాడగలను? ఎలా మను విప్పగలను. మనిషిని చేతితో తాకితే ఎదుటివాడి ఆత్మను నా ఆత్మ తాకినట్టే ఎందుకంటే నా చేతిలో నా ఆత్మ ఉంది అంటారు. అవును ఎవరినైనా ప్రేమగా దగ్గరికి తీసుకొని వారి చేయినో లేదా భుజంమీద చేయి వేసుకునో లేదా అతని తల నిమురుతూనో మాట్లాడకపోతే అది అసహజమే. మనిషిని తాకకుండా మనిషిని దగ్గరికి తీసుకోకుండా మాట్లాడేవాడు మనిషే కాదు. ఆలింగనం చేసుకోకుండా మాట్లాడేవాడు ఎడారిలాంటి వాడు అయ్యుంటాడు. వాడిని వెంటనే కౌగిలించుకోండి మనుషుల ప్రేమ గురించి బిగ్గరగా చెప్పండి అప్పుడే అడవి విస్తరిస్తుంది. ఎవరైనాసరే చేయి అందించకుండానే లేచి నిలబడ్డారా లేదా భుజాలపై ఎగరకుండానే ప్రవహిస్తున్నారా? ఒకరిని ఒకరు హత్తుకోలేకపోతే ఎలా? ప్రేమతోనో, బాధతోనే, ఎదుటివారిని పట్టుకోకుండా మాట్లాడితే వారికి మీ గురించి పూర్తిగా ఎలా తెలుస్తుంది. అందుకే మనిషితో మాట్లాడేటప్పుడు దగ్గర దగ్గరగా స్పర్శ స్పర్శగా మాట్లాడండి. అప్పుడే ఒక మనసు మరొక మనసును అర్థం చేసుకుంటుంది.
నగరం కాళ్ళు చేతులు, తల లేని ఒక అనాథ శవం ఇది నగరం గురించి శివారెడ్డిగారు అన్నది. అవును నగరానికి బాధ్యులు ఉండరు. నగరం అందరూ ఉన్న ఒంటరిది నగరాన్ని అందరూ వాడుకొని వదిలేసిన వేశ్య అని నేను అంటాను అంతే కదా నగరం నారికత నేర్పుతుంది. బంధాలను చంపి చిక్కగా నవ్వుతుంది. నగరం పరుగుపెట్టిస్తుంది. అర గడియలో ప్రాణాలను హరిస్తుంది. మరి నగరాన్ని ప్రేమగా ప్రేమించేవారు ఎవరు? ఎప్పుడో ఒకసారి నగరంలో పల్లెని కలగనని వారుంటారా? నగరీకరణను ధ్వంసంచేయాలి అనే ఆలోచన రాకుండానే నగరంలో జీవించగలరా? నగరాన్ని వాడుకొని వదిలేస్తే పల్లె తిరిగి వస్తుందా. నగరాన్ని గుప్పిట్లో పెట్టుకొని పల్లెను శ్వాశలో బద్రించుకోండి. పాదాల నిండా వెలుగులను నింపుకొని నగరంలో మోపండి. నగరాన్ని వెలుగులతో నింపండి. పల్లె, పట్టణం రెండు మనవే. పల్లె అంటే నిర్లక్ష్యం వద్దు పట్టణం అంటే వాడుకొని వదిలేయద్దు. పల్లె మన ఉనికి పట్టణం మన జీవితం ఇది తెలిసినవారే రెండింటిని బతికిస్తారు.
ఒక కాలో, చెయ్యో లేదా కన్నో లేకపోతే ఏమైంది వారికి శరీరంలోని అవయవాలు ఎన్ని ఉన్నాయని లెక్క కట్టదు. గాలిలో ఈదుతూ సమయాన్ని వెనక్కి నెట్టేసుకుంటూ గమ్యాన్ని అందరికన్నా ముందే చేరుకోవాలని అనుకుంటారు. బహుశ వాళ్ళు శరీరంలో అవయవాలు లేనిచోట గమ్యాన్ని బిగించుకున్నారేమో అందుకే కదులుతూనే ఉంటారు. చీకటి అంటే వారికి నిర్లక్ష్యం, చులకన ఉండవు ఎందుకంటే వారు అందులోనే నివసించాలి కదా దానిని ప్రేమిస్తూ వెలుగుకోసం నడుస్తారు. ఎందుకు ఆ బతుకు అనే వారిని అది కదా బతకడం అంటే అనేలా చేస్తున్నారు. ఏదైనా కోల్పోతేనే కదా దాని విలువ తెలిసేది అందుకే కాబోలు వారు దేనిని లేదా ఎవరిని నిర్లక్ష్యంచేయరు. అందరిని కలుపుకుంటూ ఆనందాలను పంచుకుంటూ తిరుగుతారు. నిజానికి ఎంతమంది వారిని చూసి నేర్చుకోవాలో? మనం జాలి పడటంకాదు వారి నుండి కాసింత పట్టుదల స్వీకరించాల్సిందే.
మనిషంత పద్యాన్ని ఊహిస్తున్నారు. మనిషంత కవిత్వాన్ని వెతుకుతున్నారు. మనిషి ఆలోచనంత కావ్యాన్ని రాయాలనుకుంటున్న అని అజేయం పుస్తకంలో శివారెడ్డిగారు రాసుకున్నారు. రాసుకున్నదాని కన్న తన జీవితం మొత్తం ‘మనిషంత కాదు అంతకు కొన్ని వందరెట్ల కవిత్వాన్ని మనముందు ఉంచారు’ ఆయన కవిత్వాన్ని పరిశీలిస్తే అసలు ఆయనకు కవిత్వం కానిది ఏదని అనిపిస్తుంది. ఆయనకు ప్రతి స్పందర్భం కవిత్వమే. ఆయన కవిత్వ కవిత్వంగా మాట్లాడుతారు. ఆయన తన చల్లని చేతుల్లో కవిత్వాన్ని నింపుకొని మనల్ని దీవిస్తారు. అజేయం పుస్తకంలో సుదీర్ఘమైన, లోతైన, భావగర్భితమైన కవితలు కనపడుతాయి. ఒక్కసారి ఆ కవిత్వాన్ని చదివితే ఇంకా వేరే కవి రాసే కవిత్వం జోలికి మీరుపోలేరు. ఎందుకంటే ఆయన కవిత్వ సంకెళ్ళనువేసి పద్యాల చెంతనే ఉంచుకుంటారు. కవిత్వం ఇంకా బతికుందంటే ఇలాంటి మహానుభావుల కలంలోనే ఆయన కవిత్వాన్ని చదివి ఈ వ్యాసం రాసే అదృష్టాన్ని కలిగించిన శివారెడ్డిగారికి పాదాభినందనాలు సమర్పిస్తూ...

-- అఖిలాశ