సబ్ ఫీచర్

‘భవిష్యవాణి’ని గుర్తించని మావోయిస్టులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఐదువందలకు పైగా జిల్లాలు ఉండగా కేవలం పది జిల్లాల్లోనే మావోయిస్టుల ప్రాబల్యమున్నదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల అన్నారు. లక్నోలో ‘రాపిడ్ యాక్షన్ ఫోర్స్’ (ఆర్‌ఎఎఫ్) 26వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ- రెండు, మూడేళ్లలో దేశవ్యాప్తంగా మావోయిజాన్ని పూర్తిస్థాయిలో రూపుమాపుతామన్నారు. ఒకప్పుడు వందకు పైగా జిల్లాల్లో తమ ప్రభావం ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో తమకు పలుకుబడి ఉందని గొప్పగా చెప్పుకున్న మావోయిస్టులు తాజాగా కేవలం పది అంటే పది జిల్లాలకే పరిమితమయ్యారు. దీంతో వారి ‘గ్రాఫ్’ ఎలా పతనమవుతున్నదో కళ్ళకు కడుతోంది.
ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలలో మావోల ప్రభావం కొంత కనిపిస్తోంది. ఆదివాసీలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో మాత్రమే మావోయిస్టులు కనిపిస్తున్నారు. సమాజమేమో ఎనె్నన్నో నూతన టెక్నాలజీలతో, నూతన ఆవిష్కరణలతో శోభాయమానంగా పరిమళిస్తుంటే మావోయిస్టులు మాత్రం ఇంకా అక్షరాలు-అంకెలు తెలియని ఆదివాసీల మధ్య గడుపుతూ తమదే రాజ్యాధికారం అని కలలుకనడంతో వారి ఊహాత్మక ప్రపంచం ఎంత విశాలమైనదో అర్థమవుతున్నది. వాస్తవికతకు ఎవరు దూరంగా బతికినా వారి ‘కలలు’ కల్లలవుతాయి. జీవితంలో వాస్తవికత ముఖ్యమన్న మాటను విస్మరించి ఇలా ‘్ఢల్లీ దూర్ నహీ..’- అంటూ హిందీలో కలలుకంటూ కాలం గడపడం వల్ల ఒరిగేది ఏమిటి? హళ్ళికి హళ్ళి, సున్నకు సున్నా మాత్రమే! మరి ఈమాత్రం దానికి వేల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌తో మావోయిస్టు పార్టీని, ‘ప్రజాసైన్యాన్ని’ నడపడం అవసరమా? ఏమాత్రం వాస్తవికతకు దగ్గరగా లేని, ఊహాలోకంలో విహరించే వారి చేతిలో ఇంత పెద్ద బడ్జెట్, మారణాయుధాలు ఉండటం సమంజసమా?
దండకారణ్యంలో, ఖనిజాలు దండిగా లభించే ప్రాంతంలో బెదిరించి, తుపాకులతో భయపెట్టి భారీ మొత్తంలో డబ్బు-దస్కం గుంజుతూ మందుగుండుకు, మందు పాతరలకు, మర తుపాకులకు ఖర్చుచేస్తే దానికి ఏమాత్రం ప్రాసంగికత ఉంటుంది? విలువైన ఆర్థిక వనరులను పేదరికాన్ని పారదోలేందుకు, నిరుద్యోగాన్ని తరిమేసేందుకు సాయశక్తులా ఖర్చుచేయాల్సిన సందర్భంలో ఇలా నిరర్ధకమైన వాటిపై దశాబ్దాలపాటు ఖర్చుచేయడమంటే మతి ఉండి చేసే పనేనా? మతిలేక చేసే పనా? అన్న ప్రశ్న తప్పక ఉదయిస్తుంది! ఒకవేళ ఆ ప్రశ్ననే మావోయిస్టులనే అడిగితే అదేదో పిచ్చి ప్రశ్నగా, ప్రశ్నవేసిన వారిని పిచ్చివాళ్ళుగా చూస్తారు! అంతటి ‘ఘటికులు’వాళ్ళు!
పట్టణాలు- నగరాలు- మహానగరాల్లో జీవితం గడిపే అశేష పేద ప్రజల కష్టాలు-కన్నీళ్లు పట్టక అరణ్యాలలో, అడవుల్లో మకాం వేసి రాజ్యాధికారంతో అన్నింటినీ ముడివేసి పొద్దుగడిపితే సబబుగా ఉంటుందా? రాజ్యాధికారం వారికి దక్కేవరకు ఎవరి అవసరాలు ఆగుతాయి? ఎవరి సమస్యలు అలాగే స్తంభిస్తాయి? అంటే వర్తమానంలోగాక భవిష్యత్‌లో జీవించడం లేదా భూతకాలంలో జీవించడం అంతటి ‘నేరం’మరొకటి ఉండదు. మావోయిస్టులు అచ్చం ఇదే నేరానికి పాల్పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వేయి రేకలుగా వికసిస్తూ జీవన సౌందర్యం ఎంతో కళాత్మకంగా పరిమళిస్తూ వ్యాపిస్తూ ఉంటే దాన్ని చూడడానికి, పట్టించుకోడానికి ఏమాత్రం ఆసక్తిచూపకుండా నిరంతరం రాజ్యాధికారం అంటూ.. మార్క్స్, మావో బూట్లలో కాళ్లు తొడిగి ‘లాంగ్ మార్చ్’ చేసి గత 50 ఏళ్లుగా కలలుగంటూ ఆ కలల్ని ఇంకా కొనసాగించడం వింతల్లోకెల్ల వింత! వర్తమానంలో నాల్గవ పారిశ్రామిక విప్లవం పురివిప్పి అన్ని రంగాలలోకి వ్యాప్తిస్తుండగా, దాని సారాంశం అందరి అనుభవంలోకి వస్తున్నా అటువైపు చూడకుండా, పట్టించుకోకుండా ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ పేర పగటి కలలు గనడం దారుణం గాక ఏమవుతుంది?
ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరిగింది. ఆ రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ ఒకటి. తమ ప్రాబల్యం ఎక్కువగా ఉందనుకున్న ఆ రాష్ట్రంలో ఎన్నికల బహిష్కరణకు మావోలు పిలుపునిచ్చినా జరగబోయేది ఏమిటో అందరికీ తెలిసిందే! అయినప్పటికీ దశాబ్దాలుగా ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి సాధించింది ఏమిటో వారికన్నా తెలుసా? అని ప్రశ్నిస్తే సమాధానం రావడం కష్టమే. కోట్లాది మంది ఓటర్లు పాల్గొనే ప్రక్రియను కాదని తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని ఎన్ని దశాబ్దాలుగా చెబుతున్నా ఆ నినాదానికి గల గుర్తింపు, మన్నన ఏపాటిదో ఈపాటికే భారతీయులందరికీ అర్థమయింది!
సాయుధ పోరాటం ద్వారానే శ్రామిక శ్రేయోరాజ్యం నిర్మిస్తామని గత ఐదు దశాబ్దాలకు పైగా మావోలు బలంగా చెబుతున్నా ఆ జాడలు ఎక్కడా కనిపించడం లేదన్న ‘నగ్నసత్యం’ తెలిసినా భవిష్యత్‌పై భరోసాతో కాలం గడపడంవల్ల ఒరిగేది శూన్యం. ఎందుకంటే భవిష్యత్‌లో మరింతగా టెక్నాలజీ పెరిగి, రోబోల సంఖ్య వృద్ధిచెంది కృత్రిమ మేధ విస్తరించి శ్రామికులన్న పదానికి అర్థమే మారిపోన్నునది. మరి ఆ సమయంలో ‘కార్మిక-కర్షక రాజ్యం’ ఏర్పడుతుందని బోధించడం వెర్రివాళ్లుచేసే వాదన అవుతుంది తప్ప మెడ మీద తలకాయ ఉన్న వారెవరూ ఆ ‘కల’ను కనలేరు. ఎందుకంటే రోబోలు, కృత్రిమ మేధ అంతటా పరచుకున్న సందర్భంలో ‘శ్రమశక్తి’కి మాన్యత ఎక్కడ ఉంటుంది? ఆ శక్తి ఆధారంగా శ్రేయోరాజ్యం నిర్మిస్తామని చెప్పడం ప్రగల్భాలు పలకడం తప్ప మరొకటి కాదు. భవిష్యత్ ఇంత తేటతెల్లంగా కళ్ళకు కనిపిస్తుండగా దాన్ని తిలకించేందుకు తిరస్కరిస్తూ, హత్యలు-దొమీలు- దోపిడీలు చేస్తూ పొద్దుపుచ్చడం దారుణం గాక ఏమవుతుంది?
ఇటీవల విశాఖ మన్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు కిడారి సర్వేశ్వరరావు, సోమలను పట్టపగలు హత్యచేయడంతో మావోయిస్టుల మానసిక స్థితి ఎలా మారిందో ఇట్టే అర్థమవుతోంది. గిరిజన ప్రజాప్రతినిధులను పొట్టన పెట్టుకుని, పేదల రాజ్యం కోసమే ఆ హత్యలు చేశామని చెప్పేవారి తర్కం ఎంత కుతర్కమో ఇట్టే తెలిసిపోతోంది. ఈ మానసిక స్థితిలో ఇంకెన్ని దశాబ్దాలు ఇలా పేద సాదలను, పోలీసులను హత్యలు చేస్తూ పొద్దుపుచ్చినా ఒరిగేది శూన్యం.
ఈ మాత్రం ఊహచేయలేని మేధావులు, అర్బన్ నక్సల్స్ ఆర్భాటంతో మావోయిస్టులకు సంఘీభావం ప్రకటించడం మరో విషాదం. ప్రపంచం ఎంతగా సంక్లిష్టమై కుంచించుకుపోతున్నదో ప్రత్యక్షంగా చూస్తూ, అనుభవిస్తూ, ఆ ప్రపంచంలోని మీగడనంతా జుర్రుకుంటూ తద్భిన్నమైన సమాజం కోసం పాటుపడుతున్నామని పేర్కొనడం తమనితాము వంచించుకోవడం తప్ప మరొకటి కాదు. అర్బన్ నక్సల్స్, హక్కుల నాయకుల ముసుగులో పట్టణ మావోయిస్టుల బండారం ఎప్పుడో బయటపడింది. సగం దాచి- సగం తెరిచి చేసే కార్యక్రమాలను ఎవరూ పసిగట్టలేరన్న ధీమా వ్యక్తం చేయడం పూర్తిగా అమాయకత్వం తప్ప మరొకటి కాదు. తానే గొప్పవాడినని అనుకొంటే, తనను తలదనే్న వారుంటారు సమాజంలో. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడట్లేదని అనుకున్నట్టు అర్బన్ మావోయిస్టులు దండకారణ్యంలోని సాయుధ మావోయిస్టులతో జతకట్టి ‘ప్రాపగండా’లో తలమునకలైతే అదెవరికీ తెలియదు? అర్థం కాదని భావిస్తే ఎలా? ‘రాజ్యం’కున్న చేతులు- కళ్లు పరిమితమని తలచి రహస్యంగా చేస్తున్నామనుకున్న కుట్రలన్నీ ఎప్పుడో అప్పుడు, ఎలాగో అలాగ బయటపడుతూనే ఉంటాయి. అలా బయటపడి కట్టడి చేయడం కారణంగానే వందకు పైగా జిల్లాలనుంచి ఇప్పుడు కేవలం పది జిల్లాలకే మావోయిస్టులు పరిమితమయ్యారు. ఈ తెలివిడి, జ్ఞానం, భవిష్యవాణి మావోయిస్టుల గుండెల్లో పలికితే ఎంతో అభివృద్ధి సాధ్యమవుతుంది. మరింతగా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళతాయి! అందరు కోరుకునేది ఇదేగా?
కొసమెరుపు ఏమిటంటే- కిడారి సర్వేశ్వరరావు, సోమలను హత్యచేసిన మావోలకు పోలీసులు ఎదురుపడ్డారు. కాల్పులు జరిగాయి. వారిలో కొందరు గాయపడి ఉంటారని ఒడిశాలోని కోరాపుట్ జిల్లా ఎస్పీ ఇటీవల ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో లొంగిపోయిన మావోయిస్టులు కిట్టి పురుషోత్తం, అతని భార్య వినోదినీ సైతం ఈ హత్యలను తీవ్రంగా తప్పుపట్టారు. మావోయిస్టు పార్టీ మానవ సంబంధాలకు దూరంగా జరుగుతోందని విమర్శించారు. భవిష్యవాణి ఈ రూపంలో వెలువడినా పట్టించుకోకపోతే ఎలా?....

-వుప్పల నరసింహం 99857 81799