సబ్ ఫీచర్

లెజండరీ విలన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

=====================
జగపతిబాబు -కొనే్నళ్ల క్రితం వరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇన్నోసెంట్ పాత్రల హీరో. ఇప్పుడు స్టార్ హీరో చిత్రాలను సగం తన భుజస్కందాలపై మోస్తున్న -విలన్. హీరోగాకంటే విలన్‌గా సక్సెస్ అయిన చాలామంది నటుల్లో జగపతిబాబు ట్రాక్ వేరు.
====================

మధ్యతరగతి కుటుంబ కథా చిత్రాల్లో ఒక తరహా పాత్రలకు ముందుతరం హీరో శోభన్‌బాబు పెట్టింది పేరు. మహిళాభిమానులను దృష్టిలో పెట్టుకునే శోభన్‌కు హీరో పాత్రలు సృష్టించారు. తరువాతి తరంలో జగపతిబాబు ఆ స్టయిల్‌ను అందిపుచ్చుకున్నాడు. మావిడాకులు, శుభలగ్నం లాంటి కుటుంబ కథా చిత్రాలు జగపతిబాబుకు ‘సెపరేట్ ట్రాక్’ వేశాయి. నటుడిగా ఎదుగుదలకూ దోహదపడ్డాయి. మధ్యలో ‘గాయం’లాంటి చిత్రాల్లో సీరియస్ పాత్రలు పోషించినా, వచ్చిన అవకాశాల నేపథ్యంలో ప్రేమకథలు, కుటుంబ కథలకే ఎక్కువ శాతం పరిమితమయ్యాడు. ఇంతకుమించి, ఆయన ఏ సినీ కెరీర్‌లో ‘స్టార్’ హోదా అందుకున్న దాఖలాలు లేవు. మధ్యతరగతిలో ‘నలిగిపోయే’ పాత్రలకు కాలం చెల్లడంతో -జగపతికి సినిమాలు తగ్గాయి. క్రమంగా చాలాకాలం పాటు స్క్రీన్‌కు దూరమయ్యాడు.
ఫస్ట్ఫా అనుభవంతో -మారిన జగపతిబాబు సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాడు. ‘నమ్మితే కళామతల్లి అన్యాయం చేయదు’ అన్న నానుడి జగపతిబాబు కెరీర్‌లో నిజమైంది. గ్యాప్ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన జగపతి -ఇప్పుడు క్షణం తీరికలేనంత బిజీ. ఒకడుగు వెనక్కి వేసేది నాలుగడుగలు ముందుకేయడానికే -అన్నట్టు ‘లెజెండ్’ కోసం అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తెలుగు స్క్రీన్‌మీద విలనిజాన్ని పండించిన నటులు ఎందరో. అయితే ఈ విషయంలోనూ జగపతి ట్రాక్ వేరు. వైవిధ్యమైన విలనిజాన్ని తెలుగు ఆడియన్స్‌కు రుచి చూపించడంలో జగపతిబాబు సక్సెస్ అయ్యాడు. అంతకంటే తెలుగు సినిమా కథకులు, దర్శకులు ఊహించుకుంటున్న విలనిజం పాత్రల్ని జగపతిబాబు పండిస్తున్నాడు. విలన్‌గా జగపతి ఉంటే సినిమా చూడొచ్చనే స్థాయికి ఆడియన్స్ వచ్చారంటే -ప్రస్తుతం అతని ఇమేజ్ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
***
జగపతిబాబు నటించిన చిత్రాలు ఒక్కోటి ఒక్కోరకమైన కథాంశంతో ముడిపడి ఉంటాయి. ‘ఆహా...’ చిత్రంలో ఏ పనీ చేయని బేవర్స్ పాత్రలో కనిపిస్తాడు. అప్రయోజకుడైన కొడుకును యూజ్‌లెస్ ఫెలో అని తండ్రితో తిట్టు తింటుంటాడు. కానీ, ఫ్యామిలీలో అందరికీ తలలో నాల్కలా ఉంటూ, మనసులో బాధను దిగమింగుతూ, క్లైమాక్స్ తన ప్రయోజకత్వంతో మెప్పిస్తాడు. ‘హనుమాన్ జంక్షన్’ చిత్రంలో హీరో అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. బాల్యంలో ఎదురైన ఓ ఘటనతో మూర్ఖుడిగా మారిన వ్యక్తి, ప్రేమిస్తుందనుకున్న అమ్మాయి ప్రేమలో విఫలమై జీవితాన్ని అర్థం చేసుకున్న చిత్రమైన పాత్రలో కనిపిస్తాడు. ఇక ‘దొంగాట’లో హీరో సురేష్‌తో కలిసి నటించాడు. చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ బతికే హీరో, ఓ అమ్మాయిని మోసం చేసిన బావ గుట్టురట్టు చేసి, ఆ అమ్మాయి మనసు గెలుచుకున్న పాత్రలో కనిపిస్తాడు. ‘బడ్జెట్ పద్మనాభం’ చిత్రంలో ప్రతీ పైసాకు లెక్కలు వేసుకునే మధ్యతరగతి భర్తగా మెప్పించాడు. సముద్రం, పందెం, ఫ్యామిలీ సర్కస్‌లోనూ వైవిధ్యమైన పాత్రల్ని పోషించాడు. ‘మావిచిగురు’, ‘సర్దుకుపోదాం రండి’.. ఈ రెండు చిత్రాలూ పూర్తిగా మధ్యతరగతి కుటుంబ కథాచిత్రాలే. ఫస్ట్ఫాలో -జగపతిబాబు చిత్రాల్లో ఎక్కువ సెంటిమెంటే కీలకం. రొమాన్స్, కామెడీ, ఫైట్లు తక్కువ. కొన్ని చిత్రాల్లో అలాంటివి లేనే లేవు కూడా. జగపతి నటించిన చిత్రాల్లో ఎక్కువ.. మధ్యతరగతి ఇళ్లలో పరిస్థితులు, సమస్యలే కనిపిస్తంటాయి. అందుకే కుటుంబ కథల్లో ఓ తరహా హీరో అన్న ముద్రపడింది. మధ్యతరగతి మహిళలను శోభన్‌బాబు తర్వాత అంతగా మెప్పించిన హీరో జగపతిబాబు.
**
సెకెండ్ ఇన్నింగ్స్‌లో జగపతి నడక వేరు. ఆహార్యం వేరు. వాచకం వేరు. అభినయం వేరు. మొత్తంగా జగపతిబాబే వేరు. మహిళల్ని మెప్పించిన ఒకప్పటి హీరో.. ఇప్పుడు వాళ్లు భయపడేంతటి విలన్. సెంటిమెంట్ పాత్రలతో కెరీర్ నడిపించిన జగపతి -ఇప్పుడు సెంటిమెంట్ ఏమాత్రం లేని పాత్రలతో మెప్పిస్తుండటం గమనార్హం. ఫస్ట్ఫాలో వైవిధ్యమైన కథల్లో, అమాయక పాత్రల్లో కనిపించిన నటుడే -సెకెండాఫ్‌లో ఒక్కో సినిమాలో ఒక్కో విలనీ వేరియేషన్స్‌తో, అందులోనూ వైవిధ్యమైన నెగెటివ్ మేనరిజమ్స్‌తో మెప్పించగలుగుతున్నాడు. ఫస్ట్ఫా తరువాత భారీ గ్యాప్ తీసుకున్న జగపతిబాబు, బాలకృష్ణ ‘లెజెండ్’తో విలనీ అవతారాన్ని రుచి చూపించాడు. నటుడిగా కెరీర్‌ను కొత్తపుంతలు తొక్కించేందుకు చేసిన ప్రయోగం ఫలించింది. ఒక్క సినిమా ఎక్కడలేని ఎనర్జీ ఇవ్వడంతో -పిల్లా నువ్వులేని జీవితం చిత్రంలోనూ విలనిజాన్ని చూపించాడు. జయ జానకీ నాయకా చిత్రంలో పూర్తి సీరియస్ క్యారెక్టర్, పరువుకోసం ప్రాణాలిచ్చే పాత్రతో విలనిజానికి హీరోయిక్ టచ్ ఇచ్చాడు.
బిజినెస్‌మేన్‌లో ఒక తరహా, సాక్ష్యంలో మరో తరహా.. ఇలా ప్రతి సినిమాలో ‘విలన్’ అనే పాత్రలో చూపిస్తోన్న ‘వైవిధ్య విలనిజం’ జగపతిబాబుకు కలిసొచ్చింది. ఇప్పుడు స్టార్ హీరోల చిత్రాలకు కథ రాసుకునేటపుడే -విలన్‌గా జగపతిబాబును దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రను మలుస్తున్నారంటే అతిశయోక్తి అనలేం. హీరో రాంచరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ చిత్రానికి ఇదే జరిగింది. రంగస్థలం ఊళ్లో 30ఏళ్లుగా రాజకీయాన్ని శాశించే ప్రసిడెంట్ పాత్ర. పెదవి విప్పి మాట్లాడకుండా, బాడీలాంగ్వేజ్‌తో కథకుడు కూడా రాయలేని డైలాగులు చెప్పేశాడు జగపతిబాబు. విలనీ మేనరిజంలోని గాంభీర్యాన్ని పరాకాష్టకు తీసుకెళ్లగలిగాడు. తాజాగా ‘అరవింద సమేత.. ’ చిత్రంలో బసిరెడ్డి పాత్ర. తలవంచని ఫ్యాక్షన్ లీడర్‌గా, సంధికి వెళ్లాడని కన్నకొడుకునే నరికేసిన విలన్ పాత్రలోని క్రౌర్యం జగపతిబాబుకే సాధ్యమేమో. అందుకే బాడీ లాంగ్వేజ్‌తో భయపెట్టిన జగపతికి ఆడియన్స్ హ్యాట్సాఫ్ అన్నారు. సామాన్యుడి ఊహల్లో నాటుకుపోయిన రాయలసీమ ఫ్యాక్షన్ దృశ్యాన్ని కళ్లకద్దినట్టు చూపించగలిగాడు.
విలనిజం ఎంతపండితే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుందన్న -తెలుగు సినిమా నమ్మకానికి ఇప్పుడు జగపతిబాబు ఒక్కడే ప్రత్యామ్నాయం. పెద్ద దర్శకులు, నిర్మాతలు, ఆడియన్స్ మైండ్‌లో ప్రత్యేకమైన విలన్‌గా జగపతిబాబు చోటు సంపాదించాడనడంలో సందేహం లేదు. విలనిజంతో సినిమా విజయానికి కారకులైన గొప్ప తెలుగు నటుల జాబితాలో ఇప్పుడు జగపతికీ బలమైన చోటే ఉంది. అందుకే అతను నటించిన చిత్రాలు మార్కెట్ సంపాదించుకుంటున్నాయి. జగపతిబాబు విలనిజాన్ని చూసిన కళ్లతో -ఒక్కసారి అతని ఫస్ట్ఫా చిత్రాలు చూస్తే మరో విషయం బోధపడుతుంది. ఫస్ట్ఫాలో జగపతిబాబు అడ్వాన్స్‌డ్‌గా నటించేశాడా? అప్పట్లో ఆడియన్స్‌కి అతని నటన కనెక్ట్ కాలేకపోయిందా? అన్న సందేహాలు కలుగుతాయి. తనకొచ్చిన పాత్రల్ని పోషించడంలో అప్పట్లోనే పరిణితి చూపించినా, ఆడియన్స్‌కు అందకపోవడం వల్లే వెనకపడ్డాడా? అన్న సందేహాలూ ముసురుతాయి. ఈ కోణంలో ఆలోచిస్తే జగపతిబాబు సెకెండాఫ్‌లో విలనిజానికి ‘లెజెండ్’ అయితే, ఫస్ట్ఫాలో వైవిధ్యమైన పాత్రల్ని పోషించిన భిన్నమైన హీరోగానూ లెజెండే. అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుడి గుండెల్లోనూ గొప్ప విలన్‌గా అవార్డులు అందుకుంటున్నాడు జగపతిబాబు.
తలదనే్న మరో విలన్ వచ్చి మెప్పించి నిలదొక్కుకునే వరకూ ‘జగపతే’ లెజెండ్.

-శ్రీనివాస్ పర్వతాల 94906 25431