సబ్ ఫీచర్

మద్యం మత్తులో లైంగిక నేరాల జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్ధరాత్రి వేళ మహిళ నిర్భయంగా నడివీధిలో తిరిగినపుడే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని అలనాడు జాతిపిత గాంధీజీ అన్నారు. కానీ, నేడు పగటి పూటే అతివలు తిరగలేని పరిస్థితులు దాపురించాయంటే నేరాల జోరు ఎంతలా ఉందో మనం ఊహించవచ్చు. దేశంలో నేడు ప్రతి నిమిషానికి ఒక అత్యాచార ఘటన జరుగుతోంది. ఇక హత్యలు, కిడ్నాప్‌లు, ఇతర నేరాల సంగతి చెప్పనక్కర్లేదు. మహిళలపై లైంగిక నేరాలు, ఇతర అసాంఘిక కృత్యాలకు మద్యం కారణమవుతోందనేది కాదనలేని వాస్తవం. గణాంకాల ప్రకారం ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పదు. తాగడానికి మంచినీళ్లు లభించకున్నా, మద్యం మాత్రం విచ్చలవిడిగా మారుమూల గ్రామాల్లో సైతం పుష్కలంగా దొరుకుతుంది.
ప్రపంచీకరణ నేపథ్యంలో పట్టణ సంస్కృతి అంతకంతకూ పెరుగుతూ హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, రిసార్టులు, రహదారుల పక్కనే ‘దాబాలు’ వెలసి ప్రజానికాన్ని మద్యం మత్తులో నింపేస్తున్నాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దీనికితోడు హెరాయిన్, కొకైన్, గంజాయి లాంటి వివిధ రకాల మాదకద్రవ్యాలు నగరాలలోకి తరలిస్తున్నారు. నైజీరియన్ దేశస్థులతో పాటు మన దేశానికి చెందిన డ్రగ్స్ ముఠాలు పోలీసులకు తరచూ దొరకడాన్ని చూస్తే ‘మత్తుమందు’ సరఫరా ఎంత సులువుగా జరుగుతోందో మనకు అవగతమవుతుంది. మహిళలపై లైంగిక నేరాలను నిరోధించేందుకు ఎన్ని చట్టాలను అమలు పరిచినప్పటికీ ఆ ఘటనలు పునరావృత్తం అవుతున్నాయి. చట్టాల పట్ల భయం లేకపోవడం కాదు, మద్యం మత్తులో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఎంతోమంది యువకులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తమకు తెలియని ధైర్యంతో- మత్తు ఆవహించిన క్షణాన తప్పులు చేస్తున్నారనడంలో వాస్తవం లేకపోలేదు. మహిళపై అత్యాచార ఘటనలు జరిగితే- ఆ దోషుల్లో అధిక శాతం మంది మత్తులో ఉండటం నిజం కాదా? ప్రతి శుభకార్యానికీ మద్యం సేవించడం చాలామందికి అలవాటుగా మారింది. ప్రియురాలు ప్రేమను అంగీకరించినా, అంగీకరించకపోయినా మద్యం సేవించే యువకులు ఎందరో ఉన్నారు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే మద్యం.. విసుగ్గా ఉన్నపుడు మద్యం.. ఇలా అనేక సందర్భాల్లో మద్యం సేవించాల్సిన పరిస్థితులు నేడు దాపురించాయి.
ఏ యువకుడైనా మద్యం సేవించాడంటే- ఆ ఒక్క వ్యసనంతోనే ఊరుకుంటాడా? అంటే అది లేదు. సిగరెట్, పాన్ పరాగ్, గుట్కా, గంజాయి, వివిధ రకాల విదేశీ మత్తుపదార్థాలను సైతం తీసుకోవడం అలవాటవుతుంది. మత్తు ఆవహించినపుడు కొన్ని గంటల సేపు ఉల్లాసంగా ఉండవచ్చు. కానీ, ఈ అలవాటు వల్ల ఆర్థికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయోనన్న విషయం చాలామంది యువకులకు అర్థం కాదు. విచక్షణ కోల్పోయినపుడు లైంగిక నేరాలు, ఇతర అకృత్యాలకు తెగించడం తప్ప మత్తు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వీటివల్ల ఎవరికి లాభం చేకూరుతుందో యువకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేరాలకు పాల్పడుతున్న వారిలో అధికశాతం మంది యువకులే కావడం గమనార్హం. భార్యను భర్త వేధిస్తున్నాడంటే కారణం మద్యం.. మహిళపై ఒక వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడంటే కారణం మద్యం. ఇంకా వివిధ అసాంఘిక చర్యలకు ఇదే కారణమవుతోంది. ఒక వ్యక్తి ధైర్యవంతుడు కాకపోయినా- మద్యం సేవించాడంటే అతనిలో తెలియని మైకం, శక్తి, ధైర్యం ప్రవేశించి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోవడం సర్వసాధారణం.
‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని మహానుభావులు సెలవిచ్చారు. కానీ, చుట్టూ మద్యం ప్రియులుంటే యువకులు ఏదో ఒకసారి మద్యం రుచి చూడక మానరు. రుచి చూశాక దాన్ని వదలడం వారి తరం కాదు. నేటి యువకులంతా తప్పుచేస్తున్నారనడం కాదు. కానీ తప్పు చేస్తున్నవారిలో అధిక శాతం మంది మద్యం సేవించేవారే కావడం మనం గమనించాలి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్యం ప్రియులు ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సర్వసాధారణంగా మారిపోయింది. మత్తుకు సంబంధించిన ఏ పదార్థమైనా మార్కెట్లో లభిస్తే- వాటికి బానిసలుగా మారిపోయి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు మద్యపానానికి బానిసలై అనారోగ్యం పాలవడం, కొన్ని సందర్భాలలో మరణించడం చూస్తున్నాం. దాంతో వారి కుటుంబాలు వీధినపడుతున్నాయి. కుటుంబాలకు, సమాజానికి చేటు కలిగిస్తున్న మద్యపానం అవసరమంటారా? దానివల్ల ఉపయోగమేమీ లేనందున- దానిని వ్యతిరేకించడం తప్పంటారా? అయితే, మద్యం విక్రయాల ద్వారా వచ్చే ధనాన్ని ప్రభుత్వాలు ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నాయి. అందుకే వీలైనన్ని మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లను అనుమతిస్తున్నారు. ఇవిగాక అనధికారికంగా పల్లెల్లో నడిచే బెల్టుషాపులకు లోటే లేదు. మరోవైపు గ్రామాలలో నాటుసారా కూడా ఏరులై పారుతోంది. సారా తాగిన మైకంలో ఇతరులతో గొడవలు పడటం, చివరికి పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం తప్పదు. ఆరోగ్యం పాడైన తర్వాత ఎంతగా ఆవేదన చెందినప్పటికీ ఫలితం శూన్యమే. మద్యం సేవించేవారి సంఖ్య క్రమంగా పెరగడంతో మారుమూల పల్లెల్లో బెల్టుషాపులు ఊపందుకున్నాయి. ఇంకోవైపు కల్తీమద్యం ప్రాణాపాయాన్ని కలిగించే విధంగా తయారైంది. స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి వంటి సందర్భాల్లో మద్యం దుకాణాలకు సెలవు ప్రకటిస్తే- అధిక ధరలకు మద్యం కొనుగోలు చేస్తూ మందుబాబులు మరింత చేతి చమురు వదిలించుకుంటున్నారు.
మద్యం కొనుగోలుకు కనీస వయోపరిమితి ఉండాలన్నది మరో కీలకాంశం. ఢిల్లీలో మద్యం సేవించడానికి అర్హమైన వయసు 25 సంవత్సరాలు ఉంటే తెలంగాణాలో 18 సంవత్సరాల పరిగణిస్తున్నారు. 1986లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మద్యపానానికి అలవాటుపడిన వారి సగటు వయసు 19 సంవత్సరాలు. 1990 నాటికి 17 సంవత్సరాలుగా, 1994 నాటికి 14 సంవత్సరాలుగా దిగజారింది. దేశంలో మహిళల పట్ల లైంగిక నేరాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే, మద్యం మహమ్మారిని అంతం చేయాలని ఎవరూ అంతగా డిమాండ్ చేయడం లేదు. మద్యం, మత్తు పదార్థాలను పూర్తిస్థాయిలో అడ్డుకున్నపుడు అత్యాచారాలు, ఇతర నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఖాయం. అలాగే, ఏనాడైతే అన్ని ప్రాంతాల్లోనూ మద్యపాన నిషేధం విధిస్తారో అప్పుడే మన దేశం ప్రపంచ దేశాలలో అగ్రగామిగా చేరుతుంది. సమస్త ప్రజల సర్వతోముఖాభివృద్ధికి దోహద పడుతుంది. సామాజిక ప్రవర్తన పట్టుతప్పడానికి కారణమవుతున్న మద్యపానానికి అడ్డుకట్టవేయడం ప్రభుత్వ బాధ్యత. ఈ చర్యలను ఎంత త్వరగా చేపడితే నేరాలు, ఘోరాలు అంతే స్థాయిలో తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా పేదవర్గాల్లో మద్యం సేవించడానికి అయ్యే ఖర్చు పట్ల, దాని ఫలితంగా ఎదురయ్యే దుష్పరిణామాల పట్ల అవగాహన కల్పించాలి.

-డాక్టర్ పొలం సైదులు 94419 30361