సబ్ ఫీచర్

నేరారోపణల ఊబిలో సీబీఐ ఉక్కిరి బిక్కిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతి’ అనే వేరుపురుగు ‘ప్రజాస్వామ్యం వేళ్ల’లోకి చొచ్చుకొని పోయి భారత జాతి జీవనాన్ని నిర్జీవం చేస్తోంది. రాజకీయ పార్టీల నేతలు అధికార దాహంతో నిస్సిగ్గుగా అవినీతి వ్యవస్థకు కొమ్ముకాస్తూ పబ్బం గడుపుకొంటున్నారు. నేతి బీరకాయ చందాన- నీతి, నిజాయితీలు కనుమరుగై అన్నిరంగాలలోనూ అవినీతి భయంకరంగా తాండవిస్తోంది. రాజకీయ పార్టీల నాయకలు- ఎన్నికల రణరంగంలో సాధ్యమైనంతగా అవినీతి వ్యవహారాలకు, అక్రమ లావాదేవీలకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రాధాన్యత యిచ్చి అధికార వ్యామోసం కోసం అర్రులు చాస్తున్నారు.
ఓటరును అవినీతిపరుడిగా అమ్ముడుపోయేటట్టు, నోట్ల రూపంలో ఓటు విలువను పెంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలో లొసుగులు, వెసులుబాట్లను ఆసరాగా చేసుకొని నేరచరితులు స్వేచ్ఛగా చట్టసభలలో ప్రవేశిస్తున్నారు. అనైతిక రాజకీయ వ్యవస్థను అవినీతి అందలం ఎక్కిస్తోంది. ఈ పరిస్థితులలో 17వ లోక్‌సభకు దేశం సమాయత్తం అవుతోంది.
మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే 1941లో స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎస్.పి.ఇ)ను నెలకొల్పారు. రెండవ ప్రపంచ యుద్ధం నాటికి సంబంధించి ‘వార్ అండ్ సప్లై’ డిపార్టుమెంటులో మొలకెత్తిన లంచగొండితనం దృష్ట్యా ‘అవినీతి వ్యవహారాల చట్టం’ తెరపైకి వచ్చింది. దాని నుంచి ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్’ (సిబిఐ) తీర్మాన రూపంగా ఆవిర్భవించింది. 1963 ఏప్రిల్ 1న నాటి వ్యవస్థాపక డైరెక్టరు డి.పి.కొహ్లీ ఆ తీర్మాన రూపకల్పనకు సిబిఐగా పేరుపెట్టారు. ప్రత్యేకమైన చట్ట ప్రతిపత్తి లేని సంస్థ కావటంతో స్వర్ణోత్సవం పూర్తి అయినా, కేంద్రంలో అధికారంలో వున్న ప్రభుత్వం చెప్పుచేతలలో వ్యవహరించే అస్వతంత్ర సంస్థగా సీబీఐ కొనసాగుతోంది. అవినీతి రాజకీయాల పట్ల అంకుశంగా కాకుండా, తానే అవినీతికి బలి అయ్యేలా ఇప్పుడు అప్రతిష్ఠ ఆరోపణలను ఎదుర్కొంటోంది. నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజన్సీగా, జాతీయస్థాయి అవినీతి కుంభకోణాలపై పోరాటం చేయగల స్థాయి నుంచి సిబిఐ క్రమేపీ దిగజారి కేంద్ర ప్రభుత్వం వద్ద ‘పంజరంలో చిలుక’లా మారింది.
కంచే చేను మేస్తోందా?
సిబిఐకు స్వయం నిర్ణయ అధికార ప్రతిపత్తి, స్వతంత్రత లేవు. ఈ విషయంలో దశాబ్దాల తరబడి కేంద్ర పాలకుల వైఫల్యం కొట్టొచ్చినట్టు స్పష్టవౌతోంది. 1988 నాటి అవినీతి నిరోధక చట్టాన్ని సవరించి సిబిఐను, బలోపేతం చేయకుండా, ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు పావుగా ప్రభుత్వాలు వాడుకొంటున్నాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఎన్నిసార్లు నిరాహారదీక్షలతో ప్రభుత్వాలను నిలదీసినా ‘జన లోక్‌పాల్’ ఆశల చివుళ్ళు వికసించటం లేదు. కొన్ని రాష్ట్రాలలో సిబిఐ ఆ రాష్ట్ర ప్రభుత్వాల దయాధర్మాలపైనే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. కొన్ని రాష్ట్రాలు సిబిఐకు ఆ మోదం ఇవ్వకపోగా, ఆమోదించి మళ్ళీ నిరాకరించిన దృష్టాంతాలున్నాయి. అవినీతి ఆర్జనలో ఆరితేరిన కళంకిత భాగస్వామ్య పా ర్టీల అనైతిక వ్యవహారాలపై సిబిఐ నిస్సహాయంగా చేతులెత్తేసిన సంఘటనలున్నాయి.
సుప్రీం కోర్టు ఎన్నిసార్లు నిలదీసినా, స్వ చ్ఛమైన అవినీతి రహితమైన పారదర్శక పా లనను అందించటానికి కేంద్రంలోని పాలకులకు చిత్తశుద్ధి లేకపోవటంతో సిబిఐ అప్రతిష్ఠపాలవుతోంది. పార్లమెంటులో మెజారిటీ కోల్పోయే పరిస్థితులు రాకుండా పాలక పక్షం వారు చిన్నా చితకా పార్టీల అండతో ప్రభుత్వాలను రక్షించుకొంటూ అవకాశవాద రాజకీయాలకు, అవినీతి కలాపాలకు పాల్పడుతున్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలలో అనైతికత పెచ్చుపెరిగి, సిబిఐ వంటి సంస్థలను గుప్పెట్లో పెట్టుకొనే ధోరణులు కనిపిస్తున్నాయి. 2013లో లోక్‌పాల్, లోకాయుక్త చట్టం వచ్చినా, కొన్ని రాష్ట్రాలు అవినీతి నిర్మూలనకు అత్యంత ప్రధానమైన లోకాయుక్త నియామకాలు చేయకపోవడాన్ని సుప్రీం కోర్టు నిలదీస్తోంది. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థగా వాసికెక్కి, నిజాయితీగా విధులు నిర్వర్తించే సీబీఐలో అంతర్గత విభేదాలు తలఎత్తాయి. తాజా పరిణామాల్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సంచలనాత్మకంగా సిబిఐపై కొరడా ఝుళిపించింది.
నేతలు, అధికారుల నిర్వాకం..
స్వాతంత్య్రానంతర భారతావనిలో నామమాత్రంగా రాజకీయ అధికార వ్యవస్థకు ప్రాధాన్యత వున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓటుహక్కు వినియోగించుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొన్నా, పాలకులకు ఉన్నత స్థాయి అధికారుల అండదండలు అవసరం. పాలనా యంత్రాంగంలోని అధికారులు (బ్యూరోక్రాట్స్)- పదవులు అధిష్ఠించే రాజకీయ నాయకులతో సమానంగా శక్తియుక్తలు కలిగి ఉంటే పాలన, సంక్షేమం, ప్రజాశ్రేయస్సు ‘నిత్యకల్యాణం- పచ్చతోరణం’గా నడుస్తుంది.
ప్రస్తుత స్థితిగతులలో అవినీతి వేరుపురుగు అయి పార్టీల నాయకులను, ప్రభుత్వ అధికార వ్యవస్థను నిర్జీవంచేస్తోంది. తమకు అనుకూలమైన పాలనాధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవటం రాజకీయ నాయకులకు అవసరం. పాలనలో పారదర్శకత, సామర్థ్యం, నిస్వార్థత, నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజా పరిణామాలను పరిశీలిస్తే- సిబిఐ సంక్షోభంలో ఎవరు నిష్కళంక మేధావులో గ్రహించలేని పరిస్థితులు నెలకొని వున్నాయి.
అఖండ భారతావనిలో బ్రిటిష్ పాలనలో- 1841 సెప్టెంబరు 8న ఒక్క రూపాయి లంచం తీసుకొంటూ.. ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టాలో షౌకత్ అలీ అనే వ్యక్తి పట్టుబడితే, అప్పటి బ్రిటిష్ న్యాయాధికారి నాలుగునెలల కఠిన కారాగార శిక్ష, రూ. 100 అపరాధ రుసుము విధించారు. స్వతంత్ర భారతావనిలో లాల్ బహదూర్ శాస్ర్తీ, గుల్జారీలాల్ నందా, అటల్ బిహారీ వాజపేయి వంటి జాతినేతలు ఎందరో ఆదర్శప్రాయంగా అత్యున్నత బాధ్యతలు నిర్వర్తించారు. మన తెలుగు రాష్ట్రాలలో గుర్తుచేసుకొంటే ప్రజాజీవనాన్ని వావిలాల వంటి మహనీయులెందరో నిష్కల్మషంగా ప్రభావితం చేశారు. కాని ప్రస్తుత రాజకీయాల్లో, కీలక సంస్థల్లో నిష్కళంక చరిత్రులు, మేధావులు ఎవరు? ప్రజలు ఎవరిని విశ్వసించాలి? నేరారోపణల ఊబిలో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పౌర సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. కంచే చేను మేస్తే ఎలా..?

-జయసూర్య