సబ్ ఫీచర్

నేతాజీ మనోభావ వారసులు ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నెహ్రూ, గాంధీ వంశీయులపై భారతీయ జనతాపార్టీ కొత్త చరిత్రను లిఖించాలని చూస్తోంది.. స్వాతంత్య్ర పోరాటంలో ఇసుమంతైనా పాత్రలేని వారు ఇప్పుడు సమరయోధుల వారసత్వం, త్యాగాల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు.. ఆర్‌ఎస్‌ఎస్ బ్రిటిష్ వారి చెప్పుచేతల్లో ఉండేది..’- అని ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చేసిన వ్యాఖ్యలు అసత్య ప్రచారానికి పరాకాష్ఠ. అబద్ధాలను గ్లోబెల్స్ మాదిరి ప్రచారం చేయడం కాంగ్రెస్ వారికే చెల్లింది. సింఘ్వీ చేసిన వ్యాఖ్యలు యావత్ కాంగ్రెస్ నాయకుల గళంలోంచి వచ్చినట్టుగానే భావించాలి. త్యాగానికి, సాహసానికి మారుపేరైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప వ్యక్తిత్వాన్ని సైతం కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడం సమంజసం కాదు.
దేశభక్తి, సేవాతత్పరతతో నేతాజీ అలనాడు ఐసీఎస్ వంటి ఉన్నతోద్యాగాన్ని వదిలేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ భోగరాజు పట్ట్భా సీతారామయ్యంతటి వాడితో పోటీపడ్డాడు. ఆ ఎన్నికలో పట్ట్భా ఓడిపోయారు. నేతాజీ గెలిచాడు. ‘పట్ట్భా ఓటమి నా ఓటమి’ అన్నాడు గాంధీజీ. ఆ మాటలతో నిరుత్సాహం కలిగి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చేశాడు నేతాజీ. ఆయన పార్టీ నుంచి బయటకు పోతుంటే ‘అయ్యో! అన్యాయం’ అని ఒక్క మాటా అనలేదు కాంగ్రెస్ నేతలు. నేతాజీకి తగిన గౌరవం దక్కలేదని నేడు కూడా కాంగ్రెస్ నేతలు అనలేరు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం రష్యా వంటి అగ్రరాజ్యాలు అంతర్జాతీయ నేరస్తుల జాబితాలో నేతాజీ పేరును చేరిస్తే ఆమోదించింది నెహ్రూ. సౌభ్రాతృత్వం, సమానతలే తమ ఆదర్శాలు అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే వైఖరి అవలంబించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదినుంచీ నేతాజీకి ఎంతో ద్రోహం చేసింది. ఆయన పేరుతో ఒక అవార్డునైనా ప్రకటించలేదు ఏ కాంగ్రెస్ ప్రధానమంత్రి కూడా. ఆ పని ఇన్నాళ్లకు చేసింది మోదీ ప్రభుత్వం. ఆజాద్ హింద్ ఫౌజ్ 75వ వార్షిక కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, వైపరీత్యాలలో చేపట్టే రక్షణ చర్యలలో అత్యంత ప్రతిభావంతంగా పనిచేసిన పోలీసులకు ప్రతి ఏడాదీ నేతాజీ జయంతి నాడు (జనవరి 23) అవార్డును ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
సర్దార్ పటేల్, నెహ్రూ, నేతాజీల మధ్య లేని వైరాన్ని సృష్టించటానికి ఇపుడు భాజపా ప్రయత్నిస్తోందని అభిషేక్ సింఘ్వీ మరో నిరాధార నిందారోపణ చేశారు. పటేల్, నెహ్రూ, నేతాజీల భావాలు, దారులు స్పష్టంగా వేరని విస్పష్టంగా చరిత్రే చెబుతోంది. నైజాం నవాబు జాతీయతా విరుద్ధ కార్యాచరణను ఉపేక్షించింది నెహ్రూ. దానికి ఫుల్‌స్టాప్ పెట్టింది సర్దార్ పటేల్. వౌంట్ బాటన్, ఎలిజబెత్ రాణీల అభిమానిగా వారికి సన్నిహితంగా ప్రవర్తించింది నెహ్రూ. వారిని తరిమేయటానికి ఆయుధం పట్టింది నేతాజీ. 1946లో తాత్కాలిక ప్రభుత్వమైనా చాలులే అని అందలం ఎక్కింది నెహ్రూ. శత్రువు బలవంతుడని తెలిసీ, ఉదాత్త జాతీయ భావప్రేరిత ఆదర్శం కోసం ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధపడినవాడు సుభాస్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఫార్వర్డ్‌బ్లాక్ అనే పార్టీపెట్టి ఒంటరి పోరాటం చేసిన అభిమన్యుడు చంద్రబోస్.
చరిత్ర పుటలలోకి వెళితే ఆర్.ఎస్.ఎస్. సంస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ మొదట్లో విదర్భ ప్రాంత కాంగ్రెస్ కమిటీకి నాయకుడిగా పనిచేశారు. ఆ తరువాత దేశ ప్రజల్లో మానసిక ఏకతాభావం, భారతీయాత్మ స్పృహలు ఏకత్రితం కానిదే వట్టికేకలు, నినాదాలు, విడతల వారీ సత్యాగ్రహాల వల్ల స్వాతంత్య్రం లభించటం కష్టమనే అభిప్రాయంతో, జాతిజనులను సంఘటితపరచటమే తరుణోపాయం అనే ఉద్దేశంతో తదనుగుణమైన ఆచరణ మార్గాన్ని ఎన్నుకొని ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ను ఆయన స్థాపించారు. సత్యాగ్రహాల ఫలితంగా సాధించేదేమీ ఉండదనే నిశ్చితాభిప్రాయం నేతాజీ అంతటి మహాపురుషుడికి కూడా కలిగింది. అందుకనే నేతాజీ కాంగ్రెస్ పార్టీని స్వచ్ఛందంగా వదిలిపెట్టాడు. స్వతంత్ర హిందూసేన (ఆజాద్ హింద్ ఫౌజ్) అనే సాయుధ సైన్యాన్ని సమకూర్చుకొని పోరాటపుమార్గాన్ని ఎన్నుకున్నాడు. ఆయుధ మార్గం బోస్‌ది. ఐక్యతాభావ పరికల్పన మార్గం డాక్టర్ హెడ్గేవార్‌ది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన అలీపూర్ కుట్ర కేసులో నేరారోపణ ఎదుర్కొన్న అరవింద ఘోష్ కూడ చివరకు కాంగ్రెస్ నిర్దేశించిన ఉద్యమ మార్గాన్ని వదిలిపెట్టి, పుదుచ్చేరిలో యోగిగా మారి ఆశ్రమవాసి అయిపోయాడు.
ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారని, గాంధీజీ బాధితుడిగా నేతాజీని చూపించాలనుకుంటున్నారని కూడా సింఘ్వీ వ్యాఖ్యానాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన నేతాజీని గాంధీజీ కాదనటం, భగత్‌సింగ్ సాహసం దేశభక్తి కోణంలో తప్పుకాదని అనటానికి గాంధీజీ తిరస్కరించటం, అంతర్జాతీయ నేరస్తుల జాబితాలో నుంచి నేతాజీ పేరును తొలగింపజేయటానికి నెహ్రూ తిరస్కరించటం చారిత్రక వాస్తవాలు కాదా? నేతాజీ సహా ఆయన లాంటి కొందరు అకుంఠిత దేశభక్తులు గాంధీ, నెహ్రూల బాధితులే అని భారతజాతి మొత్తానికి తెలుసు.
ఎంతో అమానుషంగా, అధర్మంగా తనను గాంధీ, నెహ్రూలు అవమానించినా నేతాజీ తన ‘అజాద్ హింద్ ఫౌజ్’లోని రెండు రెజిమెంట్లకు గాంధీ, నెహ్రూల పేర్లుపెట్టడం ఆయన మహోదాత్త మహర్షితత్త్వానికి తార్కాణం. గాంధీ-నెహ్రూల మనస్తత్త్వానికి మనం పట్టాల్సిన మంగళారతి కానేకాదు.
ఇక నేతాజీ దృక్కోణం, నిరంతర స్మరణ నామ స్ఫూర్తిరూపం, ఆదర్శం ఛత్రపతి శివాజీ మాత్రమే. ఈ విషయం నేతాజీ జీవిత చరిత్రను క్షుణ్ణంగా చదివితే ఎవరికైనా తెలుస్తుంది. ‘లోకమాన్య’ బాలగంగాధర తిలక్, ‘దేశబంధు’ చిత్తరంజన్ దాస్ చాలా సున్నితంగా ఉండేవాళ్ళు తమ తమ భావజాల పూర్వక కార్యక్రమాలలో. వాళ్ళతో కలిసి తిరిగేవాడు నేతాజీ. జాతీయతా స్ఫూర్తిని కలిగించటానికి ‘లోకమాన్య’, ‘దేశబంధు’ల హృదయసీమల్లో ఏకైక ఆదర్శం శివాజీ. అందుచేత వాళ్ళతో సన్నిహితంగా ఉండి, వాళ్ళ ప్రభావంతోనే ముందడుగు వేసిన నేతాజీ కూడా ఎప్పుడూ ఛత్రపతి శివాజీని తన ఆదర్శమూర్తిగా చెప్తుండేవాడు. శివాజీని ఒక కొండ ఎలుకగాను, ఒక మత మూఢునిగా చిత్రించి చెప్పే కమ్యూనిస్టు భావజాల సంకరపు కాంగ్రెస్ ఎక్కడ? శివాజీ మానసిక పథగామి నేతాజీ ఎక్కడ? ఈ కాంగ్రెస్ వాళ్లా నేతాజీకి రాజకీయ వారసులు? కాంగ్రెస్‌కు ఏనాడో రాజీనామా చేసి మళ్లీ ఆ పార్టీ తిరిగి కూడా చూడని నేతాజీకి కాంగ్రెస్ వారు ఎన్నటికీ మానసిక వారసులు కాలేరు.
‘బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి ఉండిన న్యాయవాదులలో నెహ్రూ ఒకరు’ అని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తాజా ఉవాచ. అది నేతాజీ రాజకీయ చతురతకు తార్కాణమే గాని నెహ్రూకు నేతాజీ మీద సానుభూతి ఉన్నదనటానికి బలమైన సాక్ష్యం కానే కాదు. ఆ రోజులలో బ్రిటిష్ పాలకులకు నెహ్రూ ఆంగ్లభాషా పటిమ మీద, తార్కికపుశైలి మీద పిసరంత గౌరవం ఉండేది. దాని ఆధారంగానే తమ వాదనను వినిపిస్తూ ఆంగ్లేయులను కొంచెమైనా పునరాలోచనలో పడవేయగలడేమో అనే ఆశాలేశంతో ఇండియన్ నేషనల్ ఆర్మీ పెద్దలు నెహ్రూను నియమించుకున్నారు. నెహ్రూకు మాత్రం నేతాజీ మీద అభిమానం గాని, గౌరవం గాని, కనీసం జాలి గానీ ఏమాత్రం లేదని అందరికీ తెలుసు ఆరోజులలో.
‘ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఒక్కరైనా అప్పట్లో నేతాజీకి మద్దతుగా నిలిచారా?’ అన్నది అభిషేక్‌జీ మరో ప్రశ్న. ఆర్‌ఎస్‌ఎస్ ఒక రాజకీయ పార్టీ కానే కాదు. అది ఒక జాతీయతావాద సాంస్కృతిక సంస్థ. కాంగ్రెస్, ఫార్వర్డ్ బ్లాక్‌లు రాజకీయ పక్షాలు. ఆర్‌ఎస్‌ఎస్ ఏ సందర్భంలో కూడా ఒక రాజకీయ పక్షాన్ని బలపరచే ప్రశే్న లేదు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ బ్రిటిష్ వారి చెప్పుచేతల్లో ఉండేదని కూడా సింఘ్వీ సెలవిచ్చారు. ఇది ముమ్మాటికీ నిరాధారం. ఇంకా మాట్లాడితే కాంగ్రెస్ ఎప్పుడూ అంటకాగుతూ ఉండే వామపక్షాల వాళ్ళే ఆ పని చేశారు. ‘క్విట్ ఇండియా’ను వ్యతిరేకించింది కమ్యూనిస్ట్ పార్టీ.
ఇక చరిత్ర పుటల్లోకి వెళితే కాంగ్రెస్ వారి ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్ళకు భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించలేదు. కాకపోతే దానికి ఉన్న చాలా నేపథ్య వాస్తవాలలో కాంగ్రెస్ చేసిన ఆందోళన ఒకటి మాత్రమే. 1948లో ఇద్దామనుకున్న భారత స్వాతంత్య్రం 1947లోనే ఇవ్వాలని అప్పటి బ్రిటన్ ప్రధాని అట్లీ నిర్ణయించారు. అందుకు కారకుడు నేతాజీ. అతని పోరాటం ఇంగ్లాండుకు పుట్టించిన వణుకు, భీతి మరో కారణం. ఆర్‌ఎస్‌ఎస్ నేత గోల్వాల్కర్‌జీ ప్రపంచ దేశాలలో అప్పటికే చేసిన సుడిగాలి పర్యటన ఇంకో కారణం. ఆయన ప్రపంచ దేశాలలో చాలామంది నాయకులను కలసి, భారతదేశానికి జరుగుతున్న అన్యాయం గురించి తెలియజేయడం, పాకిస్తాన్ నాయకుడు జిన్నా రగిల్చిన ద్విజాతి సిద్ధాంతపు చిచ్చును భారతదేశ ఐక్యతా విచ్ఛిన్నతకు వాడుకోవాలనే తెల్లదొరల తొందర, ఆరాటం కూడా మనకు స్వాతంత్య్రం లభించడానికి కారణాలు. అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆవిర్భావ చరిత్రలోని ఐక్యతాస్ఫూర్తి భారతీయులలో పతాకస్థాయి చేరుకోవటం, బ్రిటన్‌కు ఇంకా అపఖ్యాతి పెరగకూడదనే అనే ఆ దేశపు అధిక సంఖ్యాక హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుల కోరిక, హెచ్చరికలు-ఇలాంటివి కారణాలతో భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించింది. అప్పట్లో ఒక అడుగు ముందుకు, ఆరడుగులు వెనక్కు సాగుతూ ఉండిన గాంధీ, నెహ్రూల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్య్రానికి ప్రధాన కారణం కానే కాదు.
ఒక అబద్ధం వందసార్లు చెబితే అది వాస్తవంగా చెలామణీ అవుతుంది. ఈ సూత్రం ఆచరణ మార్గంగానే- అభిషేక్ సింఘ్వీ లాంటి అనేకుల ‘ప్రవచనాల’ ద్వారా కాంగ్రెస్ పార్టీ రోజులు వెళ్ళదీసుకుంటూ వస్తోంది. అంతేగాని తమకు ఏ విధంగానూ చెందని నేతాజీ లాంటి జాతీయ వీరయోధ మహనీయులకు తాము వారసులమని కాంగ్రెస్ వారు చెప్పుకోవడం సిగ్గుచేటు, అబద్ధాల బ్రతుకుపాటు.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 98497 79290