సబ్ ఫీచర్

కర్మలే కారణాలు ( పురాణ వ్యక్తులు - పూర్వజన్మలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగురించి మీకు చెబుతూ ఉన్నాను కదా. నేను శాపాలను కూడా పొందాను అని చెప్పాను కదా. నేను ఒకసారి ఉపబర్హణునిగా గంధర్వునిగా జన్మించాను. అపుడు నాకు కొన్ని వ్యసనాలుండేవి. నేను స్ర్తిలోలుడినై ప్రవర్తించేవానిని. ఒకసారి దేవసత్రం చేస్తూ విశ్వస్రష్టలైన బ్రహ్మలు విష్ణుకథాగానం చేయడానికి గంధర్వగణాలను పిలిచారు. వారిలో నేను కూడా ఆ సత్రయాగానికి వెళ్లాను. అక్కడ విష్ణుకథా గానం చేయడానికి అప్సరసలు కూడా వచ్చారు. కొద్దిసేపు నేను ఆ విష్ణు నామ సంకీర్తన చేశాను. ఆతరువాత విష్ణుకథాగానం చేసే స్ర్తిలను చూశాను. నా బుద్ధి కురచనైనందున నేను ఆ వనితలను చూసి మోహంలో పడిపోయాను. విష్ణుకథాగానం మానివేసి ఆ వనితలను తీసుకొని వెళ్లిపోయాను.
ఆ సంగతి చూసిన బ్రహ్మ నీవు శూద్రయోనిలో పుడుదువుగాక! అని శపించాడు.శాపం తెలిసి పశ్చాత్తాప పడ్డాను. బ్రహ్మను బతిమిలాడాను.
ఆ శాపఫలితంగానే ఓ బ్రాహ్మల ఇంట దాసిగా ఉన్న అమ్మకు కొడుకైనాను. కాకపోతే బ్రహ్మ వల్లనే నాకు ఆ బ్రాహ్మణులింట ఎప్పుడూ విష్ణుసంకీర్తన వినే భాగ్యంకలిగింది. ఓసారి నేను వారింట జరిగే చాతుర్మాస వ్రతానికి వచ్చిన బ్రాహ్మణులకు సేవకుడినై మెలిగాను. వారు నామీద దయతో నాకు విష్ణుమంత్రాన్నిచ్చారు.
నేను సదా విష్ణునామసంకీర్తన చేస్తూ ఉండేవాడిని. ఆ జన్మలో నాకు అమ్మగా ఉన్న ఆమె ఒకరోజు పాముకాటుకు గురై మరణించింది. దానితో నేను సంసార బంధం నుంచి విముక్తుడిని అయ్యాను.
అంతే నేను ఒక మహారణ్యానికి వెళ్లిపోయాను. అక్కడ కూర్చుని తపస్సు చేసుకొంటూ ఉండిపోయాను. నేను పరమేశ్వరునికి ఒక రూపాన్ని కలిగించుకుని ఆ రూపాన్ని నా హృదయంలో భావించుకుని చూడాలనుకొన్నాను. కానీ నాకు కుదరలేదు. నేను విష్ణునామస్మరణ మాత్రం చేస్తూ ఉండిపోయాను.
అపుడు ఓ శబ్దం మాత్రం నేను విన్నాను అది ఏంటంటే ‘‘ఇప్పుడు నీవు కోరుకున్నట్టు నన్ను చూడలేవు కానీ మరుజన్మలో నీవు నన్ను చూడగలవు’’ ఆ శబ్దం విని నాకు చాలా ఆనందం వేసింది. అప్పటి నుంచి మరుజన్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశాను. కొంతకాలానికి ప్రళయం వచ్చింది. అపుడు కూడా నేను ఈశ్వరోపాసన మానలేదు. అపుడు నాకు మహర్షులవంటి జీవితం లభించింది. దానివల్లే నారదుడిని అయ్యాను.
నారదుడిగా ఉన్నా దక్షప్రజాపతి వల్ల శాపాన్ని పొంది ఇలా త్రిలోక సంచారినైయ్యాను.
నేను సదా సదాచారాలను చేస్తుంటాను. కొందరు తెలియక నేను తంటాలు చెబుతుంటాను అంటారు కానీ నేను లోకోపహితమైన పనులకోసం ఇలా చేస్తుంటాను.
ఓసారి హిరణ్యకశిపుడు తపస్సు చేయబోయాడు. ఆ సమయంలో ఆయన భార్య లీలావతి గర్భవతి. ఆమెకు పుట్టబోయే కొడుకు హిరణ్యకశిపునికన్నా ఘోరమైన రాక్షసుడు అవుతాడని ఇంద్రుడు అనుకొని ఆ లీలావతిని అపహరించాడు. నేను ముందు జరగబోయేవాటిని తెలుసుకొని ఇంద్రునికి హితబోధ చేసి ఆ లీలావతిని నా ఆశ్రమంలో ఉండమని చెప్పాను. ఆమె గర్భస్థశిశువుకు విష్ణుకథలను చెప్పా ను. అందుకే హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు పుట్టకముందు నుంచే విష్ణ్భుక్తుడు అయ్యాడు.
అంతేకాదు సృంజయుడను వాడు పుత్రవియోగం కలిగిందని ఎంతో విచారిస్తుంటే నేను దుఃఖోపశమనం కలుగచేయడానికి సృంజయునికి షోడశమహారాజుల చరిత్రను చెప్పాను. ఇంకా అతనికి దుఃఖోపశమనం కలుగకపోతే నేనే అతని పుత్రుని బతికించి తిరిగి సృంజయునికి ఆనందం కలిగించాను.
అకంపనుడనువాడు కూడా పుత్రుడు దూరమైనాడని విచారిస్తుంటే నేనే వెళ్లి అసలు పుత్రుడనువాడు ఎవరు అని అడుగుతూ అతనికి మృత్యుస్వభావాన్ని చెప్పాను. దాని ద్వారా అకంపనుడు దుఃఖోపశమనం పొందాడు.
ఒకప్పుడు జలంధరుడను రాక్షసుడు లోకాలను హింసిస్తుండేవాడు. అతని బాధలు పడలేక సజ్జనులంతా బాధపడేవారు. ఆ జలంధరుని దగ్గరకు వెళ్లి నీకు అన్ని సంపదలు వున్నాయి కానీ భార్యారత్నం లేదేమి అని అడిగాడు. జలంధరుడు కర్మచోదితుడు కనుక అతడు వెంటనే భార్యకోసం అనే్వషణ సాగించాడు. బుద్ధి మందగించడం వల్ల శివుని ఇల్లాలైన పార్వతీదేవినే తన ఇల్లాలుగా చేసుకోవాలనుకొన్నాడు. అంతే, వానికి శివునికి యుద్ధం జరిగింది. వాడు శివుని చేతిలో మృత్యువాత పడ్డాడు. లోకాలన్నీ వాని పీడ విరగడైందని ఎంతో సంతోషించారు.
విష్ణుమాయ అంతా తెలుసు అనుకొనే నేను ఒకసారి విష్ణుమూర్తినే నీ మాయల గురించి నాకు వివరించు అని చెప్పి ఇంకో జన్మను పొందాను.
ఓసారి శే్వత ద్వీపానికి వెళ్లాను. అక్కడ మన్మథాకారులు నాకు కనిపించారు. వారందరినీ విష్ణు స్వరూపులుగా భావించి ఇందులో నిజమైన విష్ణువు ఎవరై ఉంటారో కదా అని ఆలోచించాను. నాకు అసలు విష్ణువు ఎవరో తెలిసేలా చేయమని విష్ణువునే ప్రార్థించాను. ఆయన ప్రత్యక్షం అయి నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే నీ మాయల గురించి తెలుసుకోవాలని ఉంది అని చెప్పాను.
అపుడు విష్ణువు వివరంగా చెబుతాను. కానీ ముందుగా ఆ కనిపించే చెరువు దగ్గరకు వెళ్లి స్నానం చేసిరా అని చెప్పాడు. నేను వెళ్లి చెరువులో దిగాను. అపుడు నన్ను నేను మర్చిపోయాను.
నేను కాశీరాజు కుమార్తెగా జన్మించాను. నన్ను చారుమతి అని పిలిచేవారు. నన్ను మా తండ్రి శిబిరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. మాకు నగ్నజితి, విప్రజిత్తి, చారువక్త్రుడు, చిత్తుడు అనే నలుగురు కొడుకులు పుట్టారు. వారిని పెంచి పెద్ద చేశాను. వారంతా యోధాను యోధులుగా మహా బలపరాక్రమాలు కలిగిన వారుగా పేరుతెచ్చుకున్నారు.
దానితో లోకంలో ఉన్న రాజులందరి మీదకు వారి తండ్రితో కలసి దండెత్తి వెళ్లి విజయులై వచ్చేవారు. ఒకసారి వారు వారి తాత , మా తండ్రి అయిన కాశీరాజు మీదకే యుద్ధానికి వెళ్లారు. అంతే ఆ కాశీరాజు నా నలుగురు పుత్రులను వారి తండ్రిని కూడా యుద్ధంలో పరిమార్చాడు. వారంతా స్వర్గవాసులయ్యారు. నేను ఒంటరి దాన్ని అయిపోయాను. ఆ దుఃఖాన్ని భరించలేక నేను చితి పేర్చుకుని అందులో దూకి నా ప్రాణం తీసుకొందామని అనుకొన్నాను.
అపుడు ఏం జరిగిందో తెలుసా! నేను దూకపోయేసరికి నాకు జ్ఞానోదయం కలిగింది. నా పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది. నన్ను నేను చూసుకోగానే పురుషరూపం వచ్చింది. అపుడు జరిగిందేమిటా చారుమతి గురించి నేను వెదకపోగా విష్ణుమూర్తి వచ్చి ఇంకా మాయలు కావాలా అని అడిగాడు. దానితో ఇదంతా విష్ణుమాయ అని తెలుసుకొన్నాను. ఆహా ఎంతటి విష్ణుమాయనో కదా అని అనుకొన్నాను. ఇలా ఇంకా ఎన్నో జన్మలు ఉన్నాయి.

- డా. రాయసం లక్ష్మి. 9703344804