సబ్ ఫీచర్

షిరిడీలో దర్శనీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాధి మందిర పరిసరాల్లో ఉన్న ఈ ప్రదేశానికి బాబా నిత్యం వ్యాహ్యాళికి వెళ్లేవారు. లెండీవనంగా పిలువబడుతున్న ఈ ప్రదేశం ఒకప్పుడు చెట్ల తోట. ఈ చెట్లతోటకు రోడ్డుకు మధ్యలో అప్పట్లో లెండీ అనే ఒక వాగు ఉండేదని చెబుతారు. అందుకే ఈ ప్రదేశానికి లెండీబాగ్ అనే పేరు వచ్చింది. బాబా రోజులో కొంత సమయాన్ని ఇక్కడే ఏకాంతంగా గడిపేవారు. బాబా ఈ ప్రాంతంలో స్వయంగా బంతి, మల్లి, సన్నజాజి, తులసి తదితర పూల మొక్కల్ని నాటి వాటికి కుండతో నీరు తోడుకొచ్చి నీళ్లు పోసేవారు. బాబా లెండీబాగ్‌లోకి తన వెంట మరెవరినీ రానిచ్చే వారు కాదు. అప్పుడప్పుడు తన సేవకుడైన అబ్దుల్‌ను మాత్రమే రానిచ్చేవారు. బొంబాయి హైకోర్టు న్యాయవాది మోరేశ్వర్ ప్రధాన్ ఈ ప్రాంతాన్ని సుందర ఉద్యానవనంగా తీర్చిదిద్దేందుకు బాబా సంకల్పంతో కొనుగోలుచేసి సగుణమేరు నాయక్ సాయంతో అందాల వనంగా తీర్చిదిద్దారు.
లెండీ వనంలో ఒకవైపు పూల మొక్కలు, అశోక చెట్లు, మరెన్నో పూల మొక్కలు ఉన్నాయి. ఇక్కడ పూసే పూలనే బాబావారి నిత్య పూజకు వినియోగిస్తారు. లెండీబాగ్‌లో మధ్యలోఉన్న పెద్ద రావిచెట్టు, రెండు వేప చెట్లను బాబా స్వయంగా నాటారని ప్రతీతి. బాబా ఇక్కడ స్వయంగా నాటిన రావిచెట్టు దగ్గర నందాదీపం అఖండంగా వెలుగుతోంది. భక్తులు తమ కోరికలు తీరటంకోసం ఈ నందాదీపానికి, చెట్లకు ప్రదక్షిణలు చేస్తారు. నందా దీపానికి ఎదురుగాగల ఔదుంబర వృక్షం కింద చిన్న దత్తాత్రేయ మందిరం ఉంది. ఇది కొన్ని శతాబ్దాల నాటిదని స్థానికులు చెబుతారు. బాబాకి ప్రీతిపాత్రమైన శ్యామకర్ణి (శ్యామసుందర్) గుర్రం ఇక్కడే శాశ్వతంగా నిద్రించింది. దాని సమాధిని చూడవచ్చు. బాగ్‌కు పడమర దిక్కున బాబా స్వయంగా తవ్విన ‘బుడ్‌ఖీ’ అనే బావి ఉంది. సాయి ఈ నూతిలోని నీటినే తాగేవారని ప్రతీతి. ఈ బావిని ‘బాబా షివడీ’ అని కూడా అంటారు. లెండీబాగ్‌కు ఉత్తరం దిక్కున నానావలి, విపి అయ్యర్, అబ్దుల్ బాబా సమాధులు ఉన్నాయి.
సంగ్రహాలయం (మ్యూజియం)
శ్రీ సాయిబాబా పవిత్ర స్పర్శతో పావనమైన పురాతన వస్తుదర్శనం సాయిభక్తులకు ప్రాప్తింప చేయాలనే ఉద్దేశంతో ముఖ్య మందిరంవద్ద ఉన్న దీక్షిత్‌వాడాలోని సంగ్రహాలయం (మ్యూజియం)లో సంస్థానంవారు ఆ వస్తువులను ఒకచోట పెట్టారు. వీటిలో శ్రీ సాయిబాబా వాడిన పాదుకలు, సట్కా, భిక్షాపాత్ర, చిలుం, కఫ్నీ, పచ్చీసుపటాట, గ్రామఫోను, రికార్డులు, సాయి మహారాజు కోటు, తిరగలి, శ్రీవారి రథం, శ్రీవారికి చివరగా స్నానం చేయించిన మంచం, బాబావారి రాగి వంట పాత్రలు అలాగే బాబావారి అరుదైన ఫొటోలు మొదలైనవి ఇక్కడ చూడవచ్చు. సంగ్రహాలయం ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు తెరచి ఉంటుంది.
ఖండోబా మందిరం
అహమ్మద్‌నగర్- మన్మాడ్ మార్గంలో బస్టాండుకు ఎదురుగా శ్రీసాయినాథ్ ఆసుపత్రివద్ద ఖండోబా మందిరం ఉంది. ఆస్పత్రి గేటుకు పక్కనేగల ఈ మందిరం చాలా పురాతనమైనది. అత్యంత మహిమ గలది. చాంద్‌పాటీలు భార్య సోదరుడి పెళ్లి బండ్లు శిరిడీకి వచ్చిన సందర్భంలో ఈ మందిరం సమీపంలో ఉన్న మర్రిచెట్టువద్దే ఆగాయి. ఈ పెండ్లి వారితో కలిసి వచ్చిన బాబా మందిర ఆవరణలో అందరితోపాటు దిగినపుడు మందిరం పూజారి అయిన మహల్సాపతి బాల ఫకీరు (అప్పుడు బాబా వయసు సుమారుగా పదహారు ఏళ్లు ఉండవచ్చు)ను ‘‘ఆవో సారుూ!’’ అని ఆహ్వానించాడు. అప్పటినుంచే ఫకీరుగా, బాబాగా పిలువబడిన బాబాసాయిగా ప్రసిద్ధి చెందారు.
ఖండోబాను వీరభద్రస్వామి అవతారమని చెబుతారు. అలాగే పరశు, మార్తాండ్, స్కండోబా, ఖండేరావు, మహల్సాకాంత్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ ఖండోబా మందిరం నాలుగైదు వందల ఏళ్లక్రితం నాటిదని తెలుస్తోంది. ఖండోబా విగ్రహానికి ఎడమవైపున మహల్సా, కుడివైపున బాసయి విగ్రహాలున్నాయి. వీరిద్దరు ఖండోబా భార్యలు. వీరిద్దరు గంగాపార్వతుల అవతారాలని కూడా అంటారు. ఈ ఆలయాన్ని నేటికీ మహల్సాపతి వంశీకులే నిర్వహిస్తున్నారు. బాబా హయాంలో తాను దక్షిణగా స్వీకరించిన మొత్తంలోంచి కొంత మొత్తాన్ని ఈ మందిరం మరమ్మతులకోసం ఇచ్చినట్టు శ్రీసాయి సచ్చరిత్రలో ఉంది.
సాఠే వాడా
హరివినాయకసాఠే అనే భక్తుడికి పుత్ర సంతానం లేదు. రెండో పెళ్లిచేసుకుంటే పుత్ర సంతానం కలుగుతుందని బాబా అతనికి చెప్పారు. సాఠే అలాగే చేశాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. సాఠే నిరుత్సాహపడ్డాడు. కానీ మూడోసారి అబ్బాయి పుట్టాడు. దాంతో సంతృప్తిచెందిన సాఠే గురుస్థానానికి ఎదురుగా ఉన్న స్థలాన్ని కొని బాగుచేసి ఒక రాతి వాడాను నిర్మించాడు. దీనికి అతని పేరుపైనే సాఠే వాడా అనే పేరు వచ్చింది. ఆరోజుల్లో బాబాను దర్శించుకోవటానికి వచ్చే భక్తులకు సాఠే వాడాయే వసతి కల్పించేది. ఎందరో భక్తులు ఈ వాడాలో ఉంటూ బాబా అనుగ్రహంతో విచిత్రానుభూతుల్ని పొందారు.
- ఇంకావుంది...
*
సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1,
కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566