సబ్ ఫీచర్

కర్మయోగి విద్వాన్ విశ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటలతో కన్నీళ్ళెట్టించి, వీణానాదంతో విస్మయం కలిగించి, మనసున్న మబ్బుతో మాటల జతకట్టి అభిమానుల స్మృతులలో నిలువెత్తు విగ్రహంగా నిలిచిపోయిన మహనీయులు ‘విశ్వం’గారు.
ముక్కోటి దేవతలొక్కటైనారని ఒక సినిమా పాట. అయితే సాహిత్య జగత్తులో- అర్థాంతరన్యాసాల విన్యాసాలతో అలరించిన భారవి, సుదీర్ఘ సమాస ఘటిత పదజాలంతో సుందర చిత్రాలను కళ్ళకుకట్టించిన భట్టబాణుడు, కమనీయ రమణీయ కవితావిలాస కళాకోవిదుడు కాళిదాసులు కలిసికట్టుగా విశ్వంగారి రచనలలో చిరంజీవులు కావడం చిత్రం.
ఆర్యావర్తాన్ని గంగాసింధు సరస్వతీ నదులు ముప్పేటల హారంగా మురిపిస్తే- పాత్రికేయులుగా, పరమోత్కృష్ట కావ్యానువాదకులుగా పాఠక హృదయ క్షేత్రాల్ని సస్యశ్యామలం చేసిన సాత్త్వికమూర్తి విద్వాన్ విశ్వం. అతని పోరాట జీవితం సరస్వతీ నదిలా అంతర్వాహిని.
ఆలాంటి సమున్నతమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానంమేరకు ప్రధాన సంపాదకులుగా విచ్చేసి అసువులు అనంతాకాశ విశ్వంలో కలిసిపోయేదాక ‘కవనార్థమ్ముదయించితిన్’ అన్న తిరుపతి వేంకట కవులు లాగా ‘రచనార్థమ్ముదయించితిన్’ అంటూ రచనలు సాగిస్తూ రసజ్ఞలోకంలో శాశ్వతంగా నిలిచిపోయిన కర్మయోగి ‘విశ్వం.’
విద్వాన్ విశ్వంగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగిగా చేరబోతున్నారనే చల్లని మాటను చెవిలో పడవేసినవారు నా మిత్రులు ఎస్.బి.రఘునాథాచార్యులు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో ఆచార్యులుగా ఉంటూ పి.వి.ఆర్.కె.ప్రసాద్‌గారి సౌజన్యంతో తి.తి.దే.లో ‘కోఆర్డినేటర్ ఆఫ్ పబ్లికేషన్స్’గా వ్యవహరిస్తున్నవారు. అధర్వవేద అనువాదాలు కొనసాగించడానికి విశ్వంగారు రానున్నారని వారే చెప్పారు. తిరుపతికి ఏ పండితుడు వచ్చినా, ఏ మహాకవి వచ్చినా వారిని కలుసుకోవడం నాకు ఐదు దశాబ్దాలుగా అలవాటు. ఆ అలవాటు ప్రకారమే నా కాళ్ళు విద్వాన్ విశ్వంగారున్న తి.తి.దే. రాంనగర్ క్వార్టర్స్‌కేసి కదిలాయి. విశ్వంగారితో నా గురించి నాలుగు మాటలు చెప్పాను. విశ్వంగారు చాల ఆప్యాయంతో పలుకరించారు. వారికి నాపట్ల అభిమానం కలగడానికి కారణాలేవో నాకు తెలియదు. బహుశా నా పేరు వినగానే వారికి తమ మిత్రులయిన గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారి పేరు గుర్తుకువచ్చిందేమో! అంతేకాదు నేను ‘విద్వాన్’ పరీక్ష వ్రాశాక నా ఉద్యోగ జీవితం మొదలయిందని చెప్పడంతో వారు తమ ‘విద్వాన్’ అనడం మెరుపులా మెరసిందేమో? మరి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కె.ఆనందన్ అనే పరిశోధక విద్యార్థి ‘విద్వాన్ విశ్వం రచనలు- పరిశీలన’ అనే అంశం ఎంపిక చేసుకొని ఎం.్ఫల్ కొనసాగించడమూ వారికి తెలిసి వుండవచ్చు. ఏది ఏమయినా విశ్వంగారు రాంనగర్ క్వార్టర్స్‌నుండి తి.తి.దే. పరిపాలన భవనం వెనకున్న ఆఫీసర్స్ క్వార్టర్స్‌కు మకాం మార్చేసినా నేను ప్రతినెల ఒకటి రెండుసార్లు ఆదివారాలలో వారిని కలిసేవాణ్ణి. నాకు రాజకీయాలపట్ల గాని, తి.తి.దే. పాలనా వ్యవహారాలపట్ల గాని ఆసక్తి అంతంత మాత్రం గావడంతో చాలవరకు మా సంభాషణలో సాహిత్యాంశాలే దొరలేవి.
ఒకసారి పెనే్నటిపాట గురించి ప్రస్తావించే వేళ ఆంధ్ర నాయకులు ఉమ్మడి మదరాసు రాష్ట్రంనుండి విడిపోయేవేళ ఆంధ్రులు అత్యధికంగా ఉన్న బళ్ళారిని వదులుకోవడంవల్ల అనంతపురానికి అన్నివిధాల అన్యాయం జరిగిందని వాపోయేవారు. తిరుపతికి సుమారు 40కి.మీ. దూరంలోని పీలేరులో నా మిత్రుడు ఒక పత్రిక మొదలెట్టాలని అనుకొన్నాడు. ఆ పత్రిక ప్రారంభోత్సవానికి ఎవరిని పిలిస్తే బాగుంటుందని నన్నడిగాడు. ఎవరని ఆలోచించడమెందుకు పాత్రికేయ జీవితం గడిపిన విశ్వంగారినే పిలుద్దామన్నాను. నేనూ, నా మిత్రుడు విశ్వంగారిని కలిశాము. వారు నా మిత్రునితో మీకు ‘స్వంత ప్రెస్ ఉందా?’అన్నారు. అంతే కాదు నా మిత్రునికున్న పరిజ్ఞానాన్ని అంచనావేశారు. ఆ తరువాత వారు పీలేరుకు రావడం, పీలేరు పట్టణంలో జరిగిన కార్యక్రమానికి ఊహించనంత జనం రావడం నాకు బాగా గుర్తున్న దృశ్యాలు. చిన్న పత్రికలు నడపడంలోని ఇబ్బందుల గురించి వారు బాగా ఆ సభలో చర్చించారు. అప్పటికే విశ్వంగారు వృద్ధాప్యంలో ఉన్నా నా కోరికమేరకు ఒప్పుకోవడం నా అదృష్టంగానే భావించాను. ఆచార్య జి.ఎన్.రెడ్డిగారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా గవర్నర్ ఎంపికచేసి ప్రకటించే వేళ తిరుపతిలో ఆ నియామకానికి విర్ధుంగా భారీఎత్తున నిరసన గళాలు గొంతెత్తాయి. అయినా వారిని అభినందించాలని మిత్రులు, సహచరులు నిర్ణయించుకొని ఆ సభకు ఎవరిని పిలిస్తే బాగుంటుందని చర్చించుకొంటున్నప్పుడు మిత్రులు ఎందరి పేర్లో సూచించారు. కొందరు తప్పించుకొన్నారు. చిరకాలం రాజ్యమేలిన పార్టీ ఎన్నికలలో ఓడిపోయి ప్రాంతీయ పార్టీ రావడం ఒక కారణం కావచ్చు. ఆ సందర్భంలో రాయలసీమవాసి, కవి, పండితుడు, పాత్రికేయుడు, బహుగ్రంథ రచయిత విశ్వంగారున్నారు కదా! అని నా సిద్ధాంతవ్యాస పర్యవేక్షకులు ఆచార్య నాగయ్యగారికి నేను చెబితే చూద్దామన్నారు. ఆ తరువాత ఈ సలహా పేచీలేని వ్యవహారమని ఏకగ్రీవంగా ఆహ్వానించడం జరిగింది. కవితల కారణంగా కొందరికి విస్తృత ప్రచారం కలగవచ్చుగాని నాలుగుకాలాలపాటు రచన చేబట్టిన నిఘంటు నిర్మాణదక్షులు ఆచార్య జి.ఎన్.రెడ్డిగారిని అభినందించారు. తాను గాక తన సంస్థ బాగుపడాలని త్రికరణశుద్ధిగా పాటుపడగల ధైర్యశాలి రెడ్డిగారని సభాముఖంగా ప్రశంసించారు.
విశ్వంగారు తిరుపతిలో ఉన్న సంవత్సరాలలో నా తరువాత ఆచార్య మద్దూరి సుబ్బారెడ్డిగారు విశ్వంగారిని అప్పుడప్పుడు కలుసుకొనేవారు. తాను ఒకడుగా వెళ్ళడంకాకుండా తమతోబాటు డా.రాఘవరెడ్డిగారితో వెళ్ళి విద్వాన్ విశ్వంగారికి ఆరోగ్యపరమయిన సలహాలు కూడా ఇప్పించేవారు.
ఆచార్య జి.ఎన్.రెడ్డిగారు విశ్వంగారిని మా తెలుగు అధ్యయనశాఖకు విశిష్టాచార్యులుగా ఆహ్వానించారు. అపుడు విశ్వంగారు తమ రచనల నేపథ్యాన్ని బాగా ఆవిష్కరించారు. ఒక విద్యార్థి ‘‘పాట పద్యంగా ఆ తరువాత వచనరూపంలో రావడానికి కారణాలేమిట’’ని అడిగితే- ‘‘శ్రమ అందరిదయినప్పుడు ‘పాట’ పుట్టింది. శ్రమ కొందరిదే కావడంతో ఒకడు వక్తగా ఇతరులు శ్రోతలుగా మారినపుడు ‘పద్యం’ బావుటా ఎగరేసింది. సమాజంలో వస్తున్న ఎన్నో మార్పుల కారణంగా ఎవరికివారు తమ అనుభవాలను అక్షరరూపంలో మలచుకొని ఆనందించే వేళల్లో వచన కవిత్వం వచ్చింద’’ని అన్నప్పుడు కరతాళధ్వనులు మిన్నుముట్టాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విద్వాన్ విశ్వంగారిని ఎంతో గౌరవంగా చూసేవారు. ఒక ఆఫీస్‌ని పెట్టి ఆఫీస్‌కు రావాలని గాని, ‘ఆఫీసర్స్ మీట్’కు తప్పక రావాలని గాని వారు నిర్బంధించలేదు సరికదా మీరు చాలా పెద్దవారు. మీ ఇంట్లోనే ‘ఒక చిన్న ఆఫీసు’ సమకూరుస్తాం అనడం అలాగే వారి సదుపాయాలు కల్పించడం నాకు బాగా తెలుసు. విశ్వంగారు తన అనువాదం చక్కగా రాయడానికి ‘లేఖకుడు’ కావాలి. కాస్త కవితాహృదయం కలవాడు, తప్పులులేకుండా వ్రాయగలిగినవాడు, చక్కటి దస్తూరికలవాడు కావాలన్నారు. నేను నా ఎరుకలోని వారి అర్హతలు గుర్తించి కలువకుంట రామమూర్తిని నావెంట విశ్వంగారి ఇంటికి తీసికెళ్ళాను. వారు అరగంటసేపు డిక్టేషన్ ఇచ్చారు. తాను చూపిన కొన్ని భాగాలను చదవమన్నారు. దస్తూరి చూచారు. చివరకు నేను వెంటబెట్టుకొని వెళ్ళిన రామమూర్తికే ఉద్యోగం ఇచ్చారు. నెలకు ‘వేయి రూపాయల’ ఆనరోరియమయినా, కారులాంటి సౌకర్యాలు లేకున్నా తాను తిరుపతిలో ఉన్న కొన్ని సంవత్సరాలలోనే ‘అధర్వవేదానువాదం’ చాలావరకు పూర్తిచేశారు. కథాసరిత్సాగరం అందించారు. సప్తగిరి అభివృద్ధికి పాటుపడ్డారు.
నిజ జీవితంలో ఎన్నో కోలుకోలేని సంఘటనలు జరిగినా ఆ వేదనలను గొంతులోనే అణచి ఎంతో సేవచేశారు. తిరుపతిలో ఉండగానే వారు స్వీయ చరిత్ర మొదలెట్టారు. మూడునాలుగు వారాలు వారి అనుభవాలతోడి జీవితం చదివి ఆశ్చర్యపడుతుంటే విశ్వంగారు ‘్భతిక దేహాన్ని’ వదలి విశ్వంలో కలిసిపోవడం వారితో పరిచయమున్నవారికి ‘అశనిపాతం.’
ప్రాచ్య సంస్కృతిపట్ల పరమాభిమానంబు
కొండంత కలిగిన కోవిదుండు
అంతంత చిగురించు అభ్యుదయము పట్ల
ఆకర్షితుండైన ఆర్యవరుడు
పాత్రికేయ ఖ్యాతి పది దిక్కులను మ్రోగ
సత్యంబు వీడని సజ్జనుండు
చదువరులమ్మదిమెచ్చు చతుర వాక్యములతో
మనసులో మెదిలెడి మహితయశుడు
సాటివారలలో గట్టి మేటి యగుచు
కీర్తిశేషుడై వెలిగిన మూర్తి యతడు
‘వేణుగోపాలు’ చిత్తాన వెలయునతడు
అట్టి విశ్వనామకునికి నంజలివిగొ.

-- ఆచార్య కె. సర్వోత్తమరావు, 9704104000