సబ్ ఫీచర్

పట్టించుకుంటే పట్టు కోల్పోతాం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విమర్శ’ అనేది నిజానికి చాలా కష్టమైన పనే అయినా కొంతమంది విషయంలో మాత్రం అది చిటికేసినంత తేలికైన పని. ఎందుకంటే వీళ్ళకు ఎదుటివాళ్ళను చీటికీ మాటికీ.. చిన్న చిన్న విషయాలకు విమర్శించడం అంటే మహా ఇష్టం.. మహా సరదా. దేవుడు మనిషికి నోరు ఇచ్చింది అడ్డదిడ్డంగా.. ఎలా పడితే అలా వాగటానికన్నట్లు ఇష్టమొచ్చినట్లు అనాలోచితంగా ఏదో ఒకటి ఎవరినో ఒకరిని అంటూనే వుంటారు. ‘ఒక వేలుతో ఎదుటివాడిని చూపిస్తే.. నాలుగువేళ్ళు తననే చూపిస్తుంటాయన్న’ వంటిమీద స్పృహ ఆ సమయంలో వాళ్ళకు ఉండదు. ఏవో లోపాలు, పొరపాట్లు, హెచ్చుతగ్గులు అందరిలోనూ ఉంటాయని.. అలాగే తనలోనూ అవి ఉండి వుండవచ్చుననీ ఏ మాత్రం ఆలోచించరు.
నలుగురు ఒకచోట ఏ సభలోనో, పెళ్లి వేడుకల్లోనో కలిసినప్పుడు ఆప్యాయంగా ‘హలో.. నమస్తే.. బాగున్నారా?’ అని ఆప్యాయంగా పలకరించుకోవడం ఇపుడు తగ్గిపోయింది. ఒకవేళ పలకరించుకున్నా అది ముఖప్రీతి, మొక్కుబడి వ్యవహరంగానే ఉంటోంది తప్ప గుండె లోతుల్లోనుంచి వచ్చిన అభిమానంగా అనిపించటంలేదు. పైగా సూదంటురాయి లాంటి చూపులతో ‘వాళ్ళు ఏం బట్టలు కట్టుకున్నారు.. ఎలాంటి డ్రస్సులేసుకున్నారు.. ఆభరణాలు ఏం పెట్టుకున్నారు?’ వంటి విషయాలతో విమర్శ ప్రారంభించి.. వ్యక్తిగత విషయాల వరకూ కొనసాగించడం... అంతటితో ఊరుకోకుండా ఉన్న కొద్ది సంగతులకు మిర్చీ, మసాలాలు జోడించి కథలల్లి ఆనందించటం చేస్తూ వుంటారు. ‘ఆమె చూడు.. ఎంత మామూలు చీర కట్టుకుని వచ్చిందో... ఫంక్షన్లకు వచ్చేది అలాగేనా? మెళ్ళో పుస్తెలతాడు తప్ప మరో నగ లేదు.. పేదవాళ్ళు కూడా అలా ఎక్కడికీ రారు’ అంటారు సింపుల్‌గా వున్న ఒక స్ర్తిని ఉద్దేశించి. చక్కగా అలంకరించుకుని రిచ్‌గా తయారై వచ్చినా ఆవిడను అయినా మెచ్చుకుంటారా అంటే లేదు. ‘తన వైభోగం చూపించుకోవటానికన్నట్టు దగ ధగ మెరిసే భారీ పట్టుచీర కట్టుకుని... వళ్ళంతా నగలు దిగేసుకుని ఎలా గ్రాండ్‌గా తయారై వచ్చిందో చూడు..! అంతా షో..!’ అంటారు అప్పుడు. ఇలాంటి విమర్శలను తమలో తాము అనుకుని ముఖం చిట్లించేవాళ్లు కొందరయితే.. పక్కనున్న వాళ్ళ చెవులు కొరికి షేర్ చేసుకుని ఆనందించేవాళ్ళు మరికొందరు. ‘ఇదిగో... మీకీ విషయం తెల్సా... ఆ నాగమణిగారి అమ్మాయి మొగుడ్ని వదిలేసి పుట్టింటికి వచ్చిందట.. డైవర్స్ కూడా అయిందని అంటున్నారు’. ‘అదిగో... ఆ బ్లాక్ సూట్‌లో వున్నాడే.. ఆయన మాకు దూరపు చుట్టం అవుతాడు.. ఆయన ఈమధ్యనే సెకెండ్ సెటప్ పెట్టాడు తెల్సా..’- ఇలా సాగుతాయి విమర్శల పరంపరలు.
డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని నలుగురితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు పక్కన తింటున్నవాళ్ళను ఉద్దేశించి ‘అబ్బ.. ఆ మసాలా కూరలు ఎలా తింటారో... అల్లం, వెల్లుల్లి కంపు!’ అని ముక్కు మూసుకోవటం.. నాన్ వెజ్ తింటున్న వాళ్ళను చూసి భరించలేనట్లు చూపు తిప్పుకోవడం వంటి చర్యలు సంస్కారహీనమైనవి. ఆ వాసనలు, ఆ దృశ్యాలు నచ్చనపుడు అక్కడికి వెళ్ళడం వాళ్ళే మానెయ్యాలి గానీ.. వెళ్లి అవతలివాళ్ళను కామెంట్ చెయ్యకూడదు.
సెంటిమెంట్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాలలోనూ ఇలాగే అత్యుత్సాహంతో తలదూర్చి విమర్శించడం కొంతమంది పనిలేనివాళ్ళు చేసే ఏకైక పని! ‘ఆవిడ భర్త చనిపోయినా బొట్టుపెట్టుకుంది.. అదేంటో..’, ‘వాళ్ళది మరీ చాదస్తం భక్తి! అస్తమానం గుళ్ళూ, గోపురాలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు’ వంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు.
విమర్శ విషయంలో తన, పర అన్న భేదభావాలు చూపించేవాళ్ళు కూడా ఉంటారంటే అది ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ కాదు. ఇతరుల విషయంలో తప్పుగా అనిపించిన విషయాలే తన వాళ్ళ విషయంలో ఒప్పులుగా అనిపించడం.. వాళ్ళను తెగిడిన నోటితోనే వీళ్ళను పొగడడం చేస్తూ ‘ఔరా!’ అనిపించేలా ప్రవర్తిస్తూ ఉంటారు. విమర్శ అనేది అది కావాలని చేసిన కువిమర్శ కాకుండా మంచి మనసుతో చేసిన సద్విమర్శ అయినపుడు అది ఎవరైనా ఆహ్వానించదగినదే! విమర్శ మంచిదే అని దీని భావం. సద్విమర్శ మనలోని లోపాలను మనం సరిదిద్దుకునేలా చేస్తుంది. అది మన శ్రేయోభిలాషుల విమర్శ గనుక మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. కనుక మంచి విమర్శ ఎప్పుడూ మంచిదే!
**
వ్యక్తిగత విమర్శల్లో నిజం ఎంతో.. అబద్ధం ఎంతో.. పుకార్లపాలు ఎంతో అన్న విచక్షణ తెలియకుండా ఎవరినీ కామెంట్ చేయకూడదన్న సంస్కారం ఎవరికీ ఉండటంలేదు. వట్టి నోటి దూల వ్యవహారం. అంతే! అందులో అదోవిధమైన వికృతానందం...! ఆ ఆనందానికి నిర్వచనం చెప్పడం అయ్యే పనికాదు.
**
సమాజంలో ప్రతి వ్యక్తికీ స్వేచ్ఛగా, స్వతంత్రంగా తను ఎలా కావాలనుకుంటే అలా బ్రతికే హక్కు ఉంది. వాళ్ళ హక్కును హరించే వాళ్ళను అపహాస్యం చేసే పని ఎవరు చేసినా అది సభ్యత కాదు. విమర్శ ముదిరి అది అవమానాన్ని, పరువు నష్టాన్ని కలిగించినపుడు అది నేరం కూడా అవుతుంది. సంఘంలో పదిమందితో కలిసి బ్రతుకుతున్న మనిషి... ఎదుటి మనిషి ఇష్టాయిష్టాలను, అభిరుచులను, అలవాట్లను గౌరవించటం సంస్కారం అనిపించుకుంటుంది.

- వాణీచలపతిరావు