సబ్ ఫీచర్

‘కమలాని’కి కష్టకాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకత్రాటిపైకి తీసుకురావాలని ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు శుభ సంకేతాలు కర్నాటక ఉపఎన్నికల ఫలితాల రూపంలో వెలువడ్డాయి. కర్నాటకలో మూడు లోక్‌సభ, రెండు శాసనసభ నియోజకవర్గాలలో జనతాదళ్ (ఎస్)- కాంగ్రెస్ కూటమి విజయ దుందుభి మోగించింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ దక్కకపోవడంతో- కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుని జనతాదళ్ (ఎస్) ప్రభుత్వాన్ని కొలువుదీరేలా కృషి చేసిన సంగతి విదితమే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకునే జనతాదళ్ (ఎస్)తో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో స్నేహం కుదుర్చుకుని యూపీఏ కూటమిని బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావించడానికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే కారణంగా చెప్పవచ్చు. ‘కలసి ఉంటే కలదు సుఖం’ అనే నానుడిని భాజపాయేతర పార్టీలకు తెలిసొచ్చేలా చేశాయి కర్నాటకలో తాజా ఉపఎన్నికల ఫలితాలు. ఉపఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పుడు భాజపాయేతర పార్టీల కూటమిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ సహా వివిధ నగరాలకు వెళుతూ పలు విపక్ష నేతలతో చర్చలు జరుపుతున్నారు.
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లోను, వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ భాజపా వ్యతిరేక శక్తులు ఎక్కడికక్కడ సర్దుబాట్లు చేసుకుని ఎన్నికలకు వెళ్ళాల్సిన ఆవశ్యకతను కర్నాటక ఉపఎన్నికల ఫలితాలు మరోసారి నొక్కి చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం శాసనసభలకు ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. డిసెంబర్ 11వ తేదీన ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అంచనావేసిన పలు మీడియా సంస్థలు భాజపా వ్యతిరేక పవనాల గురించి లెక్కలు కడుతున్నాయి. రాజస్థాన్‌లో భాజపా అధికారం కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోందని సర్వేలు ఘోషిస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఈసారి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. రాజస్థాన్ శాసనసభలో 200 స్థానాలకు గాను ప్రస్తుతం భాజపాకు 163 సీట్లు, కాంగ్రెస్‌కు 21 సీట్లు, మాయావతి సారధ్యంలోని బహుజన సమాజ్ పార్టీకి మూడు సీట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి వసుంధర రాజె పాలనా వైఫల్యాల కారణంగా అక్కడ ఎన్నికల్లో భాజపా ఘోర పరాజయాన్ని నమోదు చేయబోతున్నట్లు వివిధ సంస్థల సర్వేల్లో స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. రాజస్థాన్ కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్‌ల మధ్య ఆధిపత్య పోరు, కాంగ్రెస్‌తో పొత్తుకు చివరి క్షణంలో బహుజన సమాజ్ పార్టీ దూరం కావడం వంటి పరిణామాలు భాజపాకు కలిసి వస్తాయని ఒక దశలో సర్వే సంస్థలు అభిప్రాయపడినప్పటికీ రానురానూ కాంగ్రెస్ బలపడుతూ వస్తోంది. పోలింగ్ జరిగే డిసెంబర్ 7వ తేదీ నాటికి కాంగ్రెస్ మరింత బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భాజపాలో పలువురు నేతలు బాహాటంగానే ముఖ్యమంత్రి వసుంధర రాజే నాయకత్వం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భాజపా మాజీ నేత హనుమాన్ బేనీవాల్, మాజీ మంత్రి తివారీ సారధ్యంలో ఆవిర్భవించిన ‘రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ’ భాజపా విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సారధ్యంలోని భాజపా ప్రభుత్వానికి కూడా గండి పడే పరిస్థితి కనిపిస్తోంది. చౌహాన్ ప్రభుత్వ విధానాలతో మరోసారి తాము అధికారంలోకి వస్తామని ‘కమలనాథులు’ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ క్రమంగా పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయి. వివిధ సర్వేల ఫలితాలను గమనిస్తుంటే మధ్యప్రదేశ్‌లో భాజపా-కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగానే ఎన్నికల పోరు సాగుతోంది. తాజా పరిణామాల్లో కాంగ్రెస్ మరింత పుంజుకుంటోందని, సుదీర్ఘకాలం పాటు భాజపా అధికారంలో ఉండడం కూడా ఆ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ యువనేత జ్యోతిరాదిత్య సింథియా పట్ల యువతలో వ్యక్తమవుతున్న ఆకర్షణ కాంగ్రెస్‌కు అదనపుబలాన్ని తెస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. పోలింగ్ జరిగే నవంబర్ 28 నాటికి కాంగ్రెస్ ఇంకా పుంజుకుంటుందని, మధ్యప్రదేశ్‌లోనూ అధికారంలోకి వస్తామని పీసీసీ వర్గాల్లో ధీమా వ్యక్తమవుతోంది.
గత పదిహేనేళ్ళుగా అప్రతిహతంగా ‘కమలనాథుల’ పాలన కొనసాగుతున్న ఛత్తీస్‌గఢ్‌లోనూ ప్రస్తుత ఎన్నికల్లో భాజపాకు కాంగ్రెస్ నుండి గట్టి పోటీ తప్పడం లేదు. ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కాంగ్రెస్ తరఫున గతంలో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవశాలి అజిత్ జోగి పార్టీ నేతలతో విబేధించి ‘జనతా కాంగ్రెస్’ని స్థాపించడం, మాయావతి సారధ్యంలోని బహుజన సమాజ్ పార్టీతో జనతా కాంగ్రెస్‌కు పొత్తు కుదరడం తదితర పరిణామాలు ఇక్కడ కాంగ్రెస్ విజయావకాశాలకు కొంతమేరకు గండికొట్టే ప్రమాదం ఉంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈశాన్య రాష్ట్రం మిజోరంలో అధికారంలోకి రావాలని భాజపా ప్రయత్నిస్తోంది. ఇక్కడ ప్రధాన పోటీ ముఖ్యమంత్రి లాల్‌తన్హ్‌లా సారధ్యంలోకి కాంగ్రెస్, జోరం తంగా సారధ్యంలోని మిజో నేషనల్ ఫ్రంట్‌ల మధ్యే నెలకొని ఉందని పరిశీలకుల అంచనా. మిజో నేషనల్ ఫ్రంట్ కేంద్రంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)లో భాగస్వామిగా ఉన్నప్పటికీ భాజపా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తృతీయ ప్రత్యామ్నాయంగానే బరిలోకి దిగింది. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ నినాదంతో మిజోరంలో ఎన్నికలను ఎదుర్కొంటున్న భాజపా ఇక్కడ విజయంతో ఈశాన్యంలో కాంగ్రెస్‌కు చోటు లేకుండా చేస్తామని ధీమాగా చెబుతోంది. ఇప్పటి వరకూ ఇక్కడ ఒక్క అసెంబ్లీ సీటు కూడా ‘కమలం’ ఖాతాలో లేనప్పటికీ అసోం, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ మాదిరిగా ఇక్కడ కూడా అనూహ్య ఫలితాలను నమోదు చేస్తామని భాజపా నేతలు చెబుతున్నారు.
ఇక, తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ భాజపా బలం నామమాత్రమే. గతంలో తెదేపాతో పొత్తు కారణంగా ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానంలో విజయం సాధించిన భాజపా ఇప్పుడు తెలంగాణపై ప్రభావం చూపే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. అయితే అధికార తెలంగాణ రాష్ట్ర సమితితో భాజపా లోపాయికారీ అవగాహనకు వచ్చిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కేసీఆర్ సారథ్యంలోని తెరాస తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపాతో అవగాహన పెట్టుకుని లోక్‌సభ ఎన్నికలకు వెళ్ళాలనే అవగాహన తెరాస-్భజపాల మధ్య కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తెలంగాణలో తెరాసయేతర పార్టీల మధ్య అవగాహనకు చంద్రబాబు వ్యూహ రచన చేశారు. కాంగ్రెస్, తెదేపా, సిపిఐ, తెలంగాణ జన సమితి పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. ఈ కూటమి ఆవిర్భావం తర్వాత- నిన్నటి వరకూ నల్లేరుపై బండి నడక మాదిరిగా సాగిన తెరాస రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్‌తో గట్టి పోటీగా తలపడాల్సిన పరిస్థితికి చేరుకున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రకటించే నాటికి, ఇప్పటికీ పరిస్థితుల్లో ఎంతో మార్పు కనిపిస్తోంది. కర్నాటక ఉపఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో పాటు, దేశవ్యాప్తంగా భాజపాయేతర పార్టీల మధ్య ఐక్యతకు జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మెజారిటీ రాష్ట్రాలు కాంగ్రెస్ ఖాతాలో పడతాయన్న అంచనాలు ఊపందుకుంటున్నాయి. ఆయా రాష్ట్రాల్లో భాజపాకు నాయకత్వం వహిస్తున్న నేతలపై వ్యతిరేకతకు తోడు, ప్రధాని నరేంద్ర మోదీ-్భజపా సారథి అమిత్ షాలపై జాతీయ స్థాయిలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత కూడా భాజపాకు గడ్డుపరిస్థితులు తెచ్చి పెడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పుంజుకుంటే 2019 లోక్‌సభ ఎన్నికలలో ‘కమలనాథుల’కు కష్టకాలం తప్పదని పరిశీలకులు ఘంటాపథంగా చెబుతున్నారు.

-బోళ్ళ సతీష్‌బాబు 89774 49299