సబ్ ఫీచర్

వర్ధమాన కవులారా... ఒక్కసారి ఆలోచించండి!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమైన కవి ఎప్పుడూ- పరుల ప్రాపుకో ప్రాపకానికో, సంతోషానికో, సంతృప్తికో, మెప్పుకో- గొప్పకో రాయడు. తనను తాను చీల్చుకుంటూ- కాల్చుకుంటూ- పుటంపెట్టి పరీక్షించుకుంటూ అదొక పవిత్ర ధర్మంలానే రాస్తాడు.
మనసును తొలిచేస్తున్న లేదా జీర్ణించుకోలేకపోతున్న జీవన సందర్భాలను కొందరు కవులు కవిత్వంగా అద్భుతంగా అక్షరీకరిస్తుంటాడు. కవిత్వంలో భావచిత్రాలు మనముందే ఉన్నట్లు, ఆ పద బంధాలన్నీ మన కళ్లముందునుంచి సాగిపోతున్నట్లు- అత్యంత వాస్తవికంగా కవిత్వం రాయడమంటే - సమాజంలోని సౌందర్యాన్నీ- సంతోషాన్నీ, దుఃఖాన్నీ తనదే అన్నంత స్థాయిలో అనుభూతిస్తే కానీ సాధ్యంకాదు.
కవికి కవి హృదయం వున్నట్లు, కవిత్వంలో దార్శనికత, తాత్త్వికతలు ఉండాలి. అప్పుడే ఎనె్నన్నో కవితాప్రక్రియల నుండి వస్తున్న ఆటుపోట్లను విజయసాధకంగా ఎదుర్కోకలదు. ఏ సాహిత్య ప్రక్రియలోనైనా పొల్లు, తాళు కవిత్వాలు వుంటాయి. అది కొంత శాతం వరకు ఎప్పటికీ వుంటూనే వుంటుంది. అట్లాంటి అంశాలను తేలికగా విడిచిపెట్టాల్సిందే. ఏక కాలంలో జీవితాన్నీ, కవిత్వాన్నీ అత్యంత ప్రేమతోనూ, జాగరూకతతోనూ అనునిత్యం దర్శించే కవులు లేకపోలేదు. నిలువెత్తు ఊపిరితో శిరసు ఎంచక బతుకుతున్న కవిత్వంలా, దేనికీ లొంగని తత్త్వంలా- అడుగడుగున అద్భుత భావ చిత్రమయంగా కనిపించి పాఠకుల గుండెల్లో నిరంతరం వినిపిస్తుంటారు.
చిన్న చిన్న మాటల్ని ప్రయోగించి లోతైన ఆలోచనలు వెల్లడించడం కవి శైలీ రహస్యం. నిజానికి కవిత్వాన్ని రాయడం, ఎక్కువగా రాయడం తేలికైన పద్ధతి. కానీ గూఢంగా, గుప్తంగా, క్లుప్తంగా చెప్పడం కష్టం. మరో కవి పాఠకుల అవగాహనకి వదిలిపెట్టి, కవితల్ని పజిల్స్‌లాగా పేర్చి, గళ్ళనుంచి తప్పుకోవడమూ అలవాటే. కవి- నేలను ప్రేమించి, ఆ తల్లి నుదుట అక్షరాల్ని అచ్చొత్తుతాడు. ఆకాశాన్ని ఆలింగనం చేసుకొని, సూర్యచంద్రుల సాక్షిగా నక్షత్రాల మీద రక్తాక్షరాలు దిద్దుతాడు. మనిషి చేరదీసి ఉత్సాహపు ఉగ్గుపాలు పడతాడు. దేశాన్ని దేహంగా ధరించి, సామాజిక మార్పులను ప్రతిబింబిస్తాడు. ప్రతిధ్వనిస్తాడు. కవిత్వానికి ప్రేరణ అవసరం. సమాజంలోని సమస్యలకి స్పందించి కవి రచనలు చేస్తూంటాడు. కొన్ని సందర్భాల్లో పోటీకూడా ప్రేరణే. పోటీ వుంటేనే ఒక్కోసారి కవి వ్యక్తీకరణ శక్తి నిగ్గుతేలుతుంది. కొందరు ఆపాద మస్తక కవి స్వరూపులు-సుఖాన్ని దుఃఖాన్ని పడుగుపేకలుగా నేసిన పచ్చని శాలువాని కప్పుకుంటారు. నిన్న, నేడు, రేపు సరిహద్దులు వారికి ఉండవు. జీవితం ఎంత పరిణామాత్మకమైందో కవిత్వం కూడా అంతే. పరిణామం హఠాత్తుగా జరిగే ప్రక్రియ కాదు. అది విస్తార, వికాస, ప్రయోగ, పరిణత దశల్లోంచి- కవి హృదయాంతర్గతంలో రూపొంది ఒక కొత్త సంప్రదాయంగా పరిఢవిల్లుతుంది.
నిజమైన కవి-నికార్సైన విమర్శని, లోతైన విమర్శని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడు. అరకొర విమర్శలూ ఊహాజనిత విమర్శలూ, ఆత్మశ్రయ విమర్శలూ- జడాత్మక విమర్శలూ, పాక్షిక పక్షపాత విమర్శలూ ఒంటెద్దుపోకడలు లెక్కలోకి తీసుకోడు. బతుకుబాటలో తారసపడే అన్ని బంధాలను అర్థం చేసుకోడానికి ఎంతో అధ్యయనం చేస్తూ, తపన పడుతూ, కవిత్వాంశాల్ని మానవీయ కోణంలో ఆవిష్కరించే ప్రయత్నంలో పరిష్కారం కనిపెట్టేసరికి కవి తలప్రాణం తోకకొస్తుందేమో. కవిత్వం బలమైన అయస్కాంతం వంటిది. ఎక్కడా ఒదగని- దేనికీ లొంగని సాహిత్యాభిమానుల్ని చటుక్కున ఆకట్టుకుంటుంది. గానుగలో చెరుకులా కవి నలిగిపోతున్నా అక్షరాల్ని నలగనీయడు. అభివ్యక్తిలో సంక్లిష్టత రానీయడు. కవి ఎప్పుడూ వర్తమాన సామాజిక స్థితినీ, సహజ సంక్లిష్టతలనూ, మనిషి అంతరంగ వేదనలనూ, ఎప్పటికప్పుడు తన కవిత్వంలో శక్తివంతంగా, పరిశుద్ధంగా పాఠకులకు నివేదించాలి. పతనమైపోతున్న నైతిక విలువలూ, అసలు స్పృహకే రాని పౌర విధులు, లుప్తమైపోతున్న దేశభక్తితోపాటు, వేగంగా విచ్ఛిన్నమైపోతున్న మానవ సంబంధాలు, ఇవన్నీ సమాజాభివృద్ధిని స్వప్నించే కవికి ఎంతో ఆందోళన కలిగించే అంశాలు. కవి కవిత్వంలో తన అనుభవపు ఇంటెన్సిటీని పాఠకుడిలో కూడా కలిగించాలనుకున్నప్పుడు తన భాషలో భౌతిక స్పర్శని భాగం చేయడానికి ప్రయత్నిస్తూనే వుంటారు.
ఏ కవి అయినా నిగ్రహావధులను అధిగమించి, ఉద్విగ్నావేశంలో మాత్రమే నిజమైన కవిత్వ సృజన చేయగలడు. అయితే నేటి కవుల్లో చాలామంది కవిత్వాన్ని ఒక సీరియస్ వ్యాపకంగా భావించకుండా అలవోకగా రాస్తున్నారు. చాలా సందర్భాల్లో మంచి కవిత్వాన్ని రాయగల కవులు కూడా కవిత్వాన్ని వాసిలేని రాశిని సృష్టించడం దురదృష్టకరం. కవికి ఉద్యమాల పట్ల సహజమైన సానుభూతి ఉంటుంది. సామాజిక వ్యథకు పరిష్కారం బాటలో కలసి నడిచేది ఉద్యమకార్యకర్తలే తప్ప పాలక యంత్రాంగం కాదనే నమ్మకంలో నిజాన్ని నిర్భయంగానే కవిత్వీకరిస్తుంటాడు. కవిత్వానికి సమాజానికి అవినాభావ సంబంధం ఉందని, సమాజంనుంచే చైతన్యం పొంది, ఆ సమాజానే్న చైతన్యపరిచే కవిత్వమే ఉత్తమమైందని భావించే వాస్తవిక సంఘటనలు స్వీకరించి, ఆధునిక దృక్పథంతో కవిత్వం రాసిన కవులెందరో వున్నారు.
కవిత్వాన్ని కన్నబిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు కవి కాక మరెవరౌతారు? జీవితాన్ని కవిత్వంగా- కవిత్వాన్ని జీవితంగా అందంగా- అమూల్యంగా అబ్బురంగా కవే చూసుకుంటాడు.
కొత్తగా కవిత్వం రాస్తున్నవారు తగిన కవిత్వ అధ్యయనం, కృషి, పరిశీలన పరిశోధన చేయకుండానే ‘‘కవి’’ అనిపించుకోవాలని ఉబలాట పడ్తున్నారు. చాలామంది కవులు పత్రికల్లో పేరు చూసుకోవాలనే కోరికతో తప్ప కవితా రచనను ఒక సామాజిక, పౌర బాధ్యతగా స్వీకరిస్తే ఎప్పటికీ అమూల్యంగా నిలిచిపోతుంది.

- ఎస్.ఆర్ భల్లం, 9885442642