సబ్ ఫీచర్

మధుమేహం కాదు శాపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విపరీతంగా పెరిగిన నాగరికతవల్ల, సౌకర్యాలవల్ల మానవునికి శారీరక శ్రమ చాలావరకు తగ్గిపోయింది. పైగా నాలుక కోరినట్లుగా రుచిగా, సౌఖ్యంగా ఉండే ఆహారాన్ని తినడానికి అలవాటుపడ్డాడు. ఫలితంగా తాను తవ్వుకున్న గోతిలో తానే పడే పరిస్థితికి వచ్చాడు.
ఒకప్పుడు షుగర్ వ్యాధి ఎప్పుడో వయస్సు మళ్లిన వాళ్లకు వచ్చే వ్యాధిగా అనుకునేవారు. కానీ పరిస్థితులు మారాయి. అన్ని వయస్సులవారూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
మన దేశంలో దాదాపు 5 శాతం జనాభా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. డయాబెటీస్ వ్యాధిలో మన ఇండియాదే మొదటి స్థానం. తరువాత స్థానాలలో చైనా, అమెరికా, ఇండోనేషియా, జపాన్ వంటి దేశాలున్నాయి. అందుకే ఇండియాను ‘ప్రపంచ డయాబెటిస్ రాజధాని’గా పిలుస్తారు. ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ప్రకారం మన దేశంలో 2000 సం. నాటికి 31.7 మిలియన్‌ల మంది ఈ వ్యాధిగ్రస్తులు ఉండగా, 2017 నాటికి ఈ సంఖ్య 72 బిలియన్లకు చేరింది. 2025 నాటికి ఈ సంఖ్య రెట్టింపై 134 మిలియన్లను చేరుతుందని అంచనా. ప్రపంచ షుగర్ వ్యాధిగ్రస్తులలో 49 శాతం మంది మన దేశంలోనే ఉన్నారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 2030 నాటికి డయాబెటిస్ అధిక మరణాలను కలిగించే వ్యాధిగా అవతరించనుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి ప్రకారం మన దేశంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలో కేరళ 19.4 శాతంతో మొదటి స్థానంలో ఉంది. 13.6 శాతంతో చండీఘర్, 10 శాతంతో తమిళనాడు ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్‌ఓ) నివేదిక చెప్పినట్లు ప్రపంచ వ్యాప్తంగా 425 మిలియన్‌ల నుండి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. 2045 నాటికి ఈ సంఖ్య 629 మిలియన్లు చేరుతుందని అంచనా.
ఈ వ్యాధి తీవ్రతను గుర్తించిన డబ్ల్యుహెచ్‌ఓ మరియు ఐడిఎఫ్‌లు 1991 నుంచి ప్రతి ఏటా నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డేగా జరపాలని నిర్ణయించాయి. డయాబెటిస్‌కు ప్రధాన కారణమైన ‘ఇన్సులిన్’ను 1922లో కెనడా దేశానికి చెందిన సర్ ఫ్రెడ్రిక్ బాంటింగ్ కనుగొన్నారు. ఈ శాస్తవ్రేత్త జన్మదినమైన నవంబర్ 14న ఆయన గౌరవార్థం ‘ప్రపంచ చక్కెర వ్యాధి దినం’గా నిర్ణయించారు. ఈ దినం జరపడంలో ముఖ్య ఉద్దేశ్యం డయాబెటిస్ వ్యాధిపై శాస్ర్తియమైన అవగాహన పెంచడం. దానివల్ల డయాబెటిస్ వ్యాధి రాకుండా జాగ్రత్తపడవచ్చు. 2018-19 వరల్డ్ డయాబెటిస్ డే యొక్క థీమ్ ఏమనగా ‘‘కుటుంబం మరియు షుగర్ వ్యాధి’’ (ది ఫ్యామిలీ అండ్ డయాబెటిస్). అనగా కుటుంబం కేంద్రంగా ఈ వ్యాధిపై అవగాహన కలిగిస్తే, తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు.
గ్రీకు భాషలో డయాబెటిస్ అంటే ప్రవహించే తొట్టె. బహుశా అతిగా మూత్రం విసర్జించే వ్యక్తులను ఉద్దేశించి ఈ పేరు పెట్టి ఉండవచ్చు. డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. మన శరీరంలో వుండే క్లోమం అనే గ్రంధి ఉత్పత్తి చేసే ‘ఇన్సులిన్’ అనే హార్మోన్ లోపంవల్ల ఈ వ్యాధి ప్రధానంగా కలుగుతుంది. రక్తంలో చేరిన చక్కెర స్థాయిని తగ్గించడమే ఇన్సులిన్ చేసే ముఖ్యమైన పని. సహజంగా రక్తంలో చక్కెర స్థాయి ఆహారం తీసుకోకముందు 110 మి.గ్రా/డి.ఎల్ లోపు, ఆహారం తీసుకున్న తరువాత 160 మి.గ్రా/డి.ఎల్ లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే సమస్య ఉన్నట్లే. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిన స్థితిని ‘హైపర్ గ్లైసిమియా’ అంటారు. ఈ స్థితి దీర్ఘకాలం పాటు ఉంటే దానిని డయాబెటిస్ అనవచ్చు. డయాబెటిస్ వ్యాధిని ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించారు.
టైప్ 1 డయాబెటిస్
దీనిని ఇన్సులిన్ ఆధారిత డయాబెటిస్ అంటారు. కొన్ని అనువంశీక కారణాలవల్ల, ఇతర కారణాలవల్ల ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే క్లోమ కణాలు దెబ్బతింటాయి. అందువల్ల ఇన్సులిన్ లోపం కలుగుతుంది. బయటనుంచి ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా దీనికి చికిత్స చేస్తారు. క్లోమ కణాలు దెబ్బతినడానికి ముఖ్యకారణం కొన్నిరకాల వైరస్‌లని ఇటీవలి పరిశోధనలు తెలుపుతున్నాయి.
టైప్ 2 డయాబెటిస్
దీనిని ఇన్సులిన్‌పై ఆధారపడని డయాబెటిస్ అంటారు. దేహంలో ఇన్సులిన్ వున్నదానిని పీల్చుకొనే సామర్థ్యం లోపించడంవల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలో ఎక్కువమంది ఈ రకానికే చెందుతారు.
జస్టేషనల్ డయాబెటిస్: గర్భం ధరించిన స్ర్తిలలో (దాదాపు 9 శాతంమంది) ఈ వ్యాధి కనిపిస్తుంది. దేహంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కాని అది అంత ప్రమాద స్థాయిలో పెరగదు. ఈ స్థితి ఉన్నవారికి, వారికి జన్మించబోయే శిశువుకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.
అతిగా మూత్రవిసర్జన, అధిక దాహం, వీపరీమైన ఆకలి, బరువు తగ్గుట, దృష్టి మందగించటం, అలసట మొదలైనవి డయాబెటిస్ ప్రధాన లక్షణాలు.
రక్తంలో చక్కెర స్థాయి పెరగడంవల్ల రక్తం చిక్కగా తయారవుతుంది. అందువల్ల సన్నటి రక్తకేశనాళికలలో రక్తం ప్రవహించలేదు. దీనివల్ల సన్నటి రక్తకేశనాళికలద్వారా రక్తసరఫరా కలిగిన కన్ను, మూత్రపిండాలు లాంటి భాగాలు దెబ్బతింటాయి. కంటిలోని రెటీనాకు రక్తసరఫరా తగ్గిపోవడంవల్ల దృష్టి మందగిస్తుంది. ఈ స్థితిని డయాబెటిస్ రెటినోపతి అంటారు. 2.6 శాతం అంధత్వం దీనివల్లనే కలుగుతున్నది. రక్తంలోని మలినాలను తొలగించేందుకు ఉద్దేశించిన మూత్రపిండాలలో కూడా సన్నటి రక్తకేశనాళికలు ఉంటాయి. రక్తంలోని చక్కెర ఈ నాళాలపై తన ప్రభావాన్ని చూపిస్తుంది. అందువల్ల మూత్రపిండాల వడపోత కార్యక్రమం దెబ్బతింటుంది. శరీరంలో విషపూరిత మలినాలు పేరుకొనిపోతాయి. ఈ స్థితిని డయాబెటిస్ నెఫ్రోపతి అంటారు. షుగర్ వ్యాధి నరాలపై కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల చేతులు, కాళ్ళు స్పర్శ తగ్గి తిమ్మిరెక్కినట్లుగా ఉంటాయి. ఈ స్థితిని డయాబెటిస్ న్యూరోపతి అంటారు. కాళ్లు, చేతులు స్పర్శను కోల్పోతాయి. వాటికి రక్తసరఫరా తగ్గిపోతుంది. అందువల్ల ఆ భాగాలు గాంగ్రీన్ (కుళ్లిపోవడం)కు గురి అవుతాయి. ఈ స్థితిలో వాటిని తొలగించడం మినహా మరో మార్గం ఉండకపోవచ్చు. ఇలా శరీర భాగాన్ని తొలగించడాన్ని ‘ఆంప్యుటేషన్’ అంటారు. డయాబెటిస్ ఉన్నవారిలో నొప్పి పెద్దగా తెలియకపోవడంవల్ల గుండెనొప్పిని కూడా అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారిలో గుండెపోటు వచ్చే అవకాశం 2-3 రెట్లు ఎక్కువ.
పిజ్జాలు, బర్గర్లు, అధిక కేలరీల శక్తిగల క్రొవ్వులు, కార్బోహైడ్రేటులు ఎక్కువగా తీసుకోవడం, నిలకడగా ఒకే ప్రదేశంలో కూర్చొని ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, మద్యపానం, మానసిక ఒత్తిడి వంటివి ఈ వ్యాధి ప్రధాన కారణాలు. వ్యాధి వున్నవారు తప్పకుండా సంబంధిత డాక్టర్‌ను సంప్రదిస్తూ, వారి సలహా మేరకు రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకుంటే మిగిలినవారిలాగే ఆరోగ్యంగా జీవించవచ్చు.

- డి. మురళీకృష్ణ 94913 12002