సబ్ ఫీచర్

మావోలు ఆయుధాలు దించే సమయం ఆసన్నమైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛత్తీస్‌గఢ్‌లో కొద్దిరోజుల క్రితం 62 మంది మావోయిస్టులు ఆయుధాలతో పాటు ప్రభుత్వం ముందు లొంగిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామం పెద్ద విజయంగా ప్రభుత్వం భావిస్తోంది. నారాయణపూర్ జిల్లాలో ఉన్నత స్థాయి పోలీసు అధికారుల ముందు సాయుధ మావోలు ఆత్మసమర్పణ చేశారు. విచిత్రమేమిటంటే... మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవరావు నియమితులయ్యారన్న వార్త వెలువడిన రోజునే ఈ లొంగుబాటు జరగడం గమనార్హం. ఇంతవరకూ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతి వృద్ధాప్యం కారణంగా ఆ పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగినట్టు సమాచారం. గణపతి కన్నా దూకుడు స్వభావం గల నంబాల కేశవరావు ఆ స్థానంలోకి రావడంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో సాయుధ దాడులు ఇకముందు మరింత తీవ్రతరమవుతాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. అయినా అదేమిటోగాని ఎన్నడూ లేనంతగా 62 మంది మావోయిస్టులు అదేరోజు లొంగిపోవడం ఆ పార్టీకి తీవ్రమైన ఎదురుదెబ్బగానే పరిగణించాల్సి ఉంటుంది.
తుపాకీ బరువనిపిస్తే భుజం మార్చుకోమన్నది మావోయిస్టులు చెప్పే ‘ మిలటరీ పాఠం’. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కింద పెట్టరాదన్న నియమాన్ని కాదని 62 మంది కరడుగట్టిన మావోయిస్టులు ఏకంగా ఆయుధాలను తమ శత్రువుగా భావించే పోలీసులకు అప్పగించడం సంచలనమే!
మనిషికి ఊపిరి ఎంత ముఖ్యమో మావోయిస్టులకు ఆయుధాలు అంత ముఖ్యం. రకరకాలైన మార్గాల్లో-పద్ధతుల్లో వారు ఆయుధాలు సేకరిస్తూ ఉంటారు. పోలీసులు-పారామిలటరీ దళాల నుంచి ఆయుధాలను లాక్కునే వ్యూహం- ఎత్తుగడను మావోలు బలంగా విశ్వసిస్తారు, ఆచరిస్తారు. అనేక దాడుల సందర్భంగా పోలీసుల ఆయుధాలను అపహరించిన సంఘటనలున్నాయి. ఎన్‌కౌంటర్లలో పోలీసులు, జవాన్లు మరణిస్తే వారికి చెందిన ఆయుధాలను మావోలు తప్పకుండా తీసుకెళ్ళడం రివాజుగా వస్తోంది. ఏ మార్గంలో సాధ్యమైతే ఆ మార్గంలో ఆయుధాలను పోగేయడం, రాశులుగా పోయడం, ఆయుధ శిక్షణ ఇవ్వడం, ‘సైన్యం’ రూపొందించడం వారు తమ ప్రాథమిక ‘విధి’గా భావిస్తారు. అలాంటి విలువైన ఆయుధాలను ఇప్పుడు సమర్పించడమంటే.. అందులోనూ ఎన్నికల బహిహ్కరణకు పిలుపునిచ్చి, మందుపాతరలు పేల్చి, దాడులు చేసి బీభత్సం సృష్టిస్తున్న తరుణంలో 62 మంది ఆత్మసమర్పణ చేయడం ఆలోచించదగ్గ అంశమే.
మావోయిస్టుల హింస, ఆ భావజాలంపై విశ్వాసం సడలడంతోనే వారు లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఏ రకంగా చూసినా ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ. ఓవైపు రిక్రూట్‌మెంట్లు ఆగిపోయాయని చెప్పుకుంటున్న సమయంలో, అనేక ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు మరణిస్తున్నారని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఈ లొంగుబాటుకు ప్రాధాన్యత మరీ ఎక్కువైంది. ప్రభుత్వం లొంగుబాటు ‘పాలసీ’ని ఎంతో నిష్ఠగా అమలు చేసిన సమయంలోనూ ఇంతమంది సాయుధ మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయిన జాడలేదు. కొందరు మిలీషియా సభ్యులు, సానుభూతిపరులు లొంగిపోయారే తప్ప ఆయుధాలతో కరడుగట్టిన మావోలు పెద్దసంఖ్యలో లొంగిపోవడం ఇదే ప్రథమం.
ఈ పరిస్థితిని చూస్తుంటే మావోయిస్టులు ఆయుధాలు కిందపెట్టే సమయం ఆసన్నమైందని అనిపిస్తోంది. దానికి సంకేతమా ఇది? ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా మావోయిస్టులకు కంచుకోటగా భావించే నేలపైనే ఈ మూకుమ్మడి లొంగుబాటు జరిగిందంటే మావోయిస్టు శ్రేణుల్లో పునరాలోచనకిది చిహ్నమా? అమాయక ఆదివాసీ యువకులను ఆకర్షించి, వారికి ఆయుధ శిక్షణ ఇచ్చి దళాలుగా నిర్మిస్తే ఆ దళాలు కాస్త బెటాలియన్లుగా, ఆ బెటాలియన్లు కాస్త సైన్యంగా రూపాంతరం చెంది దండకారణ్యాన్ని పూర్తిగా ‘విముక్తి’చేసి, అక్కడి నుంచి చీమల దండులా ఆ ‘సైనికులు’ మిగతా గ్రామాలను, పట్టణాలను, నగరాలను విముక్తి చేసి అంతిమంగా- ఢిల్లీలోని ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేస్తారన్న ‘రంగుల కల’ సాకారమయ్యే అవకాశం ఇసుమంత కూడా కనిపించదు.
మావోయిస్టు గెరిల్లా దళాలను ‘రా రమ్మని’ ఏ గ్రామం కూడా ఆహ్వానించడం లేదు. తమ గ్రామాలను విముక్తి చేయమని ఎవరూ వేడుకోవడం లేదు. తమ గ్రామాలపై ఎర్రజెండా రెపరెపలాడాలని ఎవరూ ఆశించడం లేదు. ప్రతి గ్రామాన్ని ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ ముద్దాడుతోంది. ఆ సాంకేతిక పరిజ్ఞానం వెలుగులో, జ్ఞానదారిలో పయనించేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఆ ‘దృశ్యం’ స్పష్టంగా అంతటా కనిపిస్తోంది. మావోయిస్టు ఉద్యమ ప్రారంభ రోజుల్లో మాదిరి ఇప్పుడు ఏ గ్రామం లేదు. ఎవరూ ఊహించని రీతిలో గ్రామాలు రూపాంతరం చెందాయి. అలాగే సామాజిక సమీకరణలు సైతం అనూహ్యంగా మారాయి. పూర్వపు భూస్వామ్యపు ‘పెత్తనం’ ఇప్పుడు అంజనమేసినా అగుపించదు. సాధారణ ప్రజలదే ‘పెత్తనం’ కొనసాగుతోంది.
ప్రజలు విధ్వంసాన్ని, హింసను ప్రేమించడం లేదు. అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆకాంక్షిస్తున్నారు. మావోయిస్టులు ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ కదులుతున్నారు. తుపాకీ మొనతో ప్రజలను, నేతలను భయభ్రాంతులకు గురిచేసి అవసరమైతే అంతమొందించి తమ పంతం నెగ్గించుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. అదే వారి సిద్ధాంతం. ప్రజల అభిమతానికి, మావోయిస్టుల ఆలోచనలకు ఎంత మాత్రం పొసగడం లేదు. పైగా సాంకేతిక పరిజ్ఞానం పల్లెపల్లెకు పాకి జీవితం మరింత సరళతరమవుతోంది. సుఖమయమవుతోంది. దీన్నికాదని కష్టాలను-కన్నీళ్ళను ఎందుకు ఆహ్వానించాలి?-అని వారు ప్రశ్నిస్తున్నారు. అలా గత 50 ఏళ్ళలో ఎన్నోసార్లు ఉద్యమించినా ఒరిగింది ఏమీలేదు. పైగా తమకు ఇష్టమైన వారి ప్రాణాలు అన్యాయంగా గాలిలో కలిసిపోయాయి. ఆ అనుభవం ఉండగా ఇప్పుడు తిరిగి మావోయిస్టు గెరిల్లా దళాలను గ్రామాలు ఆహ్వానిస్తాయనుకోవడం వెర్రితనమే తప్ప మరొకటి కాదు.
ఉత్పత్తికి నిలయమైన జనారణ్యాన్ని కాదని దండకారణ్యంలో ఆదివాసీల మధ్య కదం తొక్కితే ఉత్పత్తిలో పాల్గొనే సమాజం బెదిరిపోయి చేతులెత్తేస్తుందనుకోవడం కాలం చెల్లిన ఆలోచన తప్ప కాలానుగుణమైనది ఎంతమాత్రం కాదు. ప్రపంచ చలన గతులను, ఆర్థిక చలన గతులను అంచనా వేయకుండా దశాబ్దాల తరబడి అరణ్యాలలో తిష్టవేసి దేశాన్ని ‘మార్కెట్ రహిత వ్యవస్థ’తో నడిపిస్తామనుకోవడం అంత సవ్యమైనదికాదు. జనతన సర్కారు దండకారణ్యంలో పిండదశలో ఉందని, ఆ పిండం కాస్త బ్రహ్మాండంగా ఎదుగుతుందని ఊహించడం వెర్రి ఆశ తప్ప మరొకటి కాదు. ఆ పిండం పెరిగేందుకు అవసరమైన ‘ఆక్సిజన్’ ఎక్కడా లేదు. మరి అది ఎలా ఎదుగుతుంది? ప్రపంచమంతటా మార్కెట్ ఎకానమీ రోజురోజుకూ వనె్నకెక్కుతూ, నూతన సంస్కరణలతో దూసుకుపోతుంటే, ఎనె్నన్నో ఆవిష్కరణలతో అలరారుతుంటే ప్రజలు ఏకోన్ముఖులై అటుగా కదులుతూ ఉంటే- ఏది జరిగినా తమ కోసం... తమవల్ల.. తమతో జరుగుతోందని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని మావోలు విశ్వసిస్తున్నారు. ఇంటర్నెట్ ఊపిరిగా నిలుస్తోందని భావిస్తున్న సందర్భంలో మావోయిస్టులు ఈ దృశ్యాన్ని తుడిచేసి కొత్త పలకపై కొత్తగా అక్షరాభ్యాసం చేయిస్తామని ఎకె-47 తుపాకీ పట్టుకుని నిలుచుంటే చైతన్యం ఎలా వ్యాప్తిచెందుతుంది?
ప్రజల్ని ఎంతగానో ప్రేమిస్తారని భావించే మావోయిస్టులు ఇప్పుడు ఆయుధాల్ని కిందపెట్టే సమయం ఆసన్నమైందని ఎంత త్వరగా గుర్తిస్తే అంతగా ప్రజలకు మేలుజరుగుతుంది. అంతే తప్ప నంబాళ కేశవరావు తన కఠిన స్వభావంతో మరింత మొరటుగా ‘ఆయుధ భాష’ మాట్లాడ్డానికి ప్రయత్నిస్తే మిగిలేవి కష్టాలు- కన్నీళ్ళే. పేద ప్రజలు ఇంకెంత కాలం కష్టాలను సహించాలి? సౌకర్యవంతమైన జీవితానికి ఎందుకు మొఖం వాచి గడపాలి? మావోయిస్టుల మార్గంలో కష్టాలు.. కన్నీళ్లు తప్ప సౌకర్యవంతమైన జీవితం అన్నమాటే లేదని గత ఐదు దశాబ్దాల చరిత్ర చాటిచెబుతోంది. అందుకే ఆయుధాలను విసర్జించే సమయం ఆసన్నమైందని చెప్పడం.

-వుప్పల నరసింహం 99857 81799