సబ్ ఫీచర్

కేంద్రంలో మరో కూటమి చారిత్రక అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య దేశంలో కొన్ని చారిత్రక సందర్భాలు ఉంటాయి. ఇంకొన్ని చారిత్రక అవసరాలూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో, అవసరాలలో దేశంలోని రాజకీయ పార్టీలు ఉన్న స్థితిని మార్చుకుంటాయి. గమ్యం చేరేందుకు గమనాన్ని దగ్గర చేసుకుంటాయి. అవసరమైతే, ఆయా రాజకీయ పార్టీలు తమ తమ మూల సిద్ధాంతాలలోనూ మార్పులు, చేర్పులు చేసుకోవటం అనివార్యం కూడా. దేశ కాలమాన పరిస్థితులను బట్టి, దేశ సార్వభౌమాధికార స్థితిని బట్టి, రాజకీయ పరిస్థితులు, సమీకరణలను బట్టి, దేశ ప్రజల సంక్షేమం దృష్ట్యా , వారి ఇష్టాఇష్టాలనుబట్టి ఈ మార్పులు సహజం. ఈ మార్పులకు అనుగుణంగా మారని రాజకీయ పక్షాలు చరిత్ర పుటల్లోంచి బయటకుపోతాయి. తాము మారుతూ, మార్పులను ఆహ్వానిస్తూ ప్రజాసంక్షేమ ఎజెండాను ముందుకు తీసుకువెళ్ళే పార్టీలు మాత్రమే చరిత్రను తిరగరాస్తాయి.
ఇలాంటి కచ్చితమైన సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాలపై దృష్టిపెట్టారు. అరుదైన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని జత కలిశారు. భాజపా యేతర పక్షంగా కాంగ్రెస్, టిడిపి కరచాలనం చేశాయి. కాంగ్రెస్‌తోపాటు డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, జెడియు వంటి దాదాపు 15 పార్టీలతో జాతీయ స్థాయిలో కొత్త కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీనిని జరగరాని ఘోరం జరిగిపోయినట్టు, ప్రపంచపు ఎనిమిదవ వింతగా కొన్ని రాజకీయ పక్షాలు విమర్శిస్తుంటే, భాజపా నాయకులు మిన్నువిరిగి మీదపడ్డట్లు, భూమ్యాకాశాలు ఏకమైనట్టు గుండెలు బాదుకోవటం విశేషం. తెరాస, వైకాపాలు సైతం ‘కాంగ్రెస్- తెదేపా’ కలయికను అపవిత్రం అని చెబుతుండగా, జనసేన పార్టీ దీన్ని ‘విడుదలకు నోచుకోని సినిమా ట్రైలర్’తో పోల్చటం చారిత్రక అవసరాలను సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోవటమే లేదా భాజపాకు కొమ్ముకాసే ప్రయత్నమే.
జాతీయ రాజకీయాలు తెలుగుదేశం పార్టీకి కొత్తకాదు. కేంద్రంలో కలిసొచ్చే శక్తులను కలుపుకొని చక్రం తిప్పటం చంద్రబాబుకూ కొత్త కాదు. 1983లోనే అప్పటి ఇందిరాగాంధీ హయాంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలను ఏకం చేసి కేంద్రంపై వత్తిడి తెచ్చారు. 23రోజుల్లోనే ప్రభుత్వాన్ని పునరుద్ధరింప జేసేలా పోరాడారు. రాజీవ్‌గాంధీ హయాంలో బోఫోర్స్ వంటి కుంభకోణాలు జరిగినప్పుడు, జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి, ఆ ఫ్రంట్‌కు దిశానిర్దేశం చేసింది తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావే. 1996లో యునైటెడ్ ఫ్రంట్, ఆ తర్వాత యునైటెడ్ నేషనల్ అలయన్సు, ఎన్డీఏ వంటి కూటముల ఏర్పాటులో కీలక పాత్రధారి చంద్రబాబే. వి.వి.సింగ్, ఐకె గుజ్రాల్, దేవెగౌడ వంటి వారిని దేశ ప్రధానమంత్రులుగా చేయడంలో తెలుగుదేశమే కృషి ఉంది. లోక్‌సభ స్పీకర్ పదవితో జి.ఎం.సి. బాలయోగిని గౌరవించినా, అబ్దుల్ కలాంను రాష్టప్రతిని చేసినా ఆ ఖ్యాతి కూడా చంద్రబాబుదే. దేశానికి సమస్యలొచ్చినప్పుడు చూస్తూ ఊరకుండటం రాజకీయ పక్షాల పనికాదు. ‘సజ్జలు తిన్న కోడి సజ్జల్నే విసర్జించినట్లు’కాకుండా దేశ కాల, పరిస్థితులను బేరీజు వేసుకొని దేశ ప్రజలకు నమ్మకమైన నాయకత్వాన్ని ఇవ్వటంలో తప్పేముంది?
ప్రస్తుత పరిస్థితులలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన దేశంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దనోట్ల రద్దు నుండి సీబీఐలో సంక్షోభం వరకు ప్రజాగ్రహానికి కొదవలేదు. తమపై ప్రధాని మోదీ అనుసరిస్తున్న వైఖరి కక్షపూరితంగానూ, అణచివేత ధోరణిగానూ ఉందని ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక హోదాకు, విభజన హామీలకు పాతరపెట్టి చివరకు వెనుకబడ్డ ప్రాంతాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి రప్పించుకోవటం దేనికి నిదర్శనం? రాష్ట్రంలో ఐటీ అధికారుల మూకుమ్మడి దాడులు దేనికి సంకేతం? భాజపాతో తెలుగుదేశానికి దోస్తీ ఉన్నంత కాలం మోదీని ఎదిరించే సత్తా చంద్రబాబుకు లేదని కొందరు విమర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను, విభజన హామీలను మోదీ దగ్గర తాకట్టుపెట్టారని ఆరోపించిన ఇతర పార్టీల నాయకులు- ఎన్డీఏ నుంచి తెదేపా బయటకురాగానే నాలుక మడతపెట్టారు. తెలుగు ప్రజల హక్కుల కోసం, దేశ ప్రజల క్షేమం కోసం బిజెపి వ్యతిరేక పక్షాలను కాంగ్రెస్ పార్టీ ఇరుసుగా ఒకటి చేస్తుంటే కొందరు జీర్ణించుకోలేని దుస్థితి నెలకొంది.
చరిత్ర గమనంలో ఎన్నో పార్టీలు పుట్టాయి. మరెన్నో పార్టీలు గిట్టాయి. మార్క్సిజంను నమ్మిన పార్టీలు సైతం ఆయా చారిత్రక సందర్భాలలో మార్పులను ఆహ్వానించాయి. ఐక్య సంఘటనలు కట్టాయి. సైద్ధాంతికతలోనూ మార్పులను ఆహ్వానించాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలను చెప్పుకోవచ్చు. కాంగ్రెస్‌ను ప్రధాన శత్రువుగా ప్రకటించిన వామపక్షాలు ఆ తర్వాత భాజపాను ప్రధాన శత్రువుగా ప్రకటించాయి. విప్లవ పార్టీలు సైతం వర్గశత్రు నిర్మూలనే ఏకైక పంథా అనే తప్పుడు సూత్రీకరణ నుంచి చెంపలేసుకొని ప్రజాయుద్ధ పంథాను చేపట్టాయి. కాంగ్రెస్ నుంచి చీలిన ఎన్నో పార్టీలు తిరిగి కాంగ్రెస్‌తోనే చెలిమిచేశాయి. ఇలా రాజకీయ పక్షాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పల్లవించాలే తప్ప, పిడివాద పార్టీల్లా, చలనంలేని పార్టీల్లా ఉండకూడదు. బిజెపియేతర పక్షాలను ఐక్యం చేయటం నేటి చారిత్రక అవసరం, సందర్భం. ఈ సందర్భానికి చంద్రబాబు కేంద్ర బిందువుగా మారడం తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయం.

-పోతుల బాలకోటయ్య 98497 92124