సబ్ ఫీచర్

అమ్మానాన్నా.. వోటేయండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రతి ఊళ్లోనూ సందడే సందడి.. అయితే, ఈ కోలాహలం నగరాల్లో కన్నా పల్లెల్లో మరీ ఎక్కువ.. పనులు మానుకుని సైతం పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వోటుహక్కు వినియోగించుకొనేవారు గ్రామాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు.. ‘వోటు వేయడం ఓ బాధ్యత’ అన్న ధ్యాస నగర ప్రజల్లో తక్కువే.. నగరాల్లో విద్యావంతులు, సంపన్న కుటుంబాల వారు వోటు వేయడానికి అంతగా ఆసక్తి చూపరన్నది పోలింగ్ గణాంకాలను విశే్లషిస్తే ఇట్టే అర్థమవుతుంది. పోలింగ్ రోజును ‘సెలవుదినం’గా భావించి ఇతర వ్యాపకాల్లో మునిగిపోతారే తప్ప నగర జీవుల్లో చాలామంది పోలింగ్ కేంద్రాల వైపు దృష్టి సారించరు. ట్రాఫిక్ రద్దీ, పోలింగ్ కేంద్రాలను వెతుక్కోవడం, వోటరు జాబితాలను ఓపిగ్గా పరిశీలించడం, పోలింగ్ కేంద్రం వద్ద ‘క్యూ’లో నిలబడడం, వోటు వేసే వరకూ నిరీక్షించడం అంటే నగరాల్లో కొంతమందికి మహా చికాకు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది.
ఈనెల 28న మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నందున పట్టణాలు, నగర ప్రాంతాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వయోజనులంతా విధిగా వోట్లు వేస్తేనే మంచి నేతలు శాసనసభకు వెళతారని, అన్ని వర్గాలకూ మంచి భవిష్యత్ ఉంటుందని, ప్రజోపయోగ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్న సందేశాన్ని ఎన్నికల అధికారులు వినిపిస్తున్నారు. పత్రికలు, టీవీలు, కరపత్రాల ద్వారా ఈ విషయంపై ప్రచారం చేయడమే కాదు, పిల్లల సేవలను సైతం అధికారులు వినియోగించుకుంటున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో డివిజనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఐఎఎస్ అధికారి కవీంద్ర కివాయత్ మరో అడుగు ముందుకేసి, చిన్నారుల చేత వారి తల్లిదండ్రులకు లేఖలు రాయిస్తున్నారు.
‘మా జీవితాలను తీర్చిదిద్దేది మీరే.. మేం బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలంటే మీరు విధిగా వోట్లు వేసి, మంచి పాలకులను మాకు అందించాలి..’ అని తల్లిదండ్రులను వేడుకొంటూ పిల్లల చేత లేఖలు రాయిస్తున్నారు. పిల్లలు రాసిన ఈ లేఖలను చదివి, ఇన్నాళ్లూ వోటు వేయని తల్లిదండ్రులు సైతం పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారు. ‘ప్రతి వోటూ ఎంతో విలువైనది.. మీరు వేసే వోటు వృథా పోదు.. మా భవిష్యత్‌ను నిర్దేశించేది మీరు వేసే వోట్లే.. పోలింగ్‌కు వెళ్లకపోతే మాకు బంగారు భవిష్యత్ సాధ్యం కాదు.. మా ఆశలు, ఆకాంక్షలు నెరవేరవు.. వోటు వేయడం సామాజిక బాధ్యత.. వోటు వేస్తామని మాకు వాగ్దానం చేయండి..’ అంటూ చిన్నారులు రాసిన లేఖలు తల్లిదండ్రులను ఆలోచింపజేస్తున్నాయి. ఈసారి తప్పకుండా వోటు వేస్తామని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థుల చేత ఇలా లేఖలు రాయిస్తున్నందున ఈసారి నగరాల్లో వోటింగ్ శాతం కచ్చితంగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. పిల్లల కోర్కెలను పేరెంట్స్ ఎలా తీరుస్తారో, వోటు వేయాల్సిందిగా చిన్నారులు చేసే విన్నపాలకు తల్లిదండ్రులు తప్పక స్పందిస్తారని అధికారులు భావిస్తున్నారు. పిల్లలు రాసిన ఈ లేఖలపై ‘తప్పకుండా వోటు వేస్తాం’ అని తల్లిదండ్రులు రాస్తూ సంతకాలు పెడుతున్నారు. బంధుమిత్రులకు కూడా వోటు విలువను తెలియజేసి, వారిని సైతం పోలింగ్ కేంద్రాలకు రప్పిస్తామని పేరెంట్స్ భరోసా ఇస్తున్నారు. పెద్దల్లో చైతన్యం రగిలిస్తున్న పిల్లలను అభినందించాల్సిందే.