సబ్ ఫీచర్

క్రమంగా పుంజుకుంటున్న స్వదేశీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధిపేరుతో పాలక పక్షాలు బహుళజాతి సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. తమ ఉత్పత్తులను ఏ విధంగా మార్కెట్ చేయాలన్న అంశం బహుళజాతి సంస్థలకు తెలిసినంతగా ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదనడంలో సందేహం లేదు. అది ఆ సంస్థలకు వెన్నతో పెట్టిన విద్య. బహుళజాతి సంస్థల దాటికి తట్టుకోలేక పలు స్వదేశీ వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఒకానొకప్పుడు గ్రామ సీమలకు జీవనాధారంగా వున్న పలు కుటీర పరిశ్రమలు నేడు కనుమరుగు అయ్యాయి. స్వదేశీ ఉత్పత్తుల స్థానాన్ని బహుళజాతి సంస్థల ఉత్పత్తులు కబ్జా చేసాయి. స్వదేశీ అనేది కేవలం ఎన్నికల నినాదంగా మారింది. ఈ నేపధ్యంలో కొందరు ఆధ్యాత్మికవేత్తలు ఒకవైపు ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందిస్తునే మరోవైపు స్వదేశీ ఉత్పత్తులు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. బహుళజాతి సంస్థలు తయారుచేస్తున్న వస్తువుల నాణ్యతతో ఈ వస్తువులు పోటీ పడుతుండడం గమనార్హం. ధరకూడా అందరికీ అందుబాటులో వుంటున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాబా రాందేవ్, జగ్గీ వాసుదేవ్, రవిశంకర్, మాతా అమృతానందమయి, రామ్హ్రీమ్‌సింగ్ తదితరులు వివిధ రకాల వస్తువులు (నిత్యావసరాలు, సౌందర్యసాధనాలు) స్వదేశీ పరిజ్ఞానంతో సేంద్రీయ వ్యవసాయం ద్వారా తయారుచేయించి మార్కెటింగ్ చేస్తున్నారు. వీరందరికీ లక్షలాదిమంది అనుచరులు వున్నారు. ఈ ఆధ్యాత్మికవేత్తల వాక్కే వేదవాక్కుగా భావించే వారే వీరి అనుచరులు. ప్రస్తుతం బాబా రాందేవ్ మినహా మిగిలినవారు తయారుచేస్తున్న వస్తువులు వారి అనుచరులకే అందుబాటులో వున్నాయి.
బాబా రామ్‌దేవ్ పతంజలి పేరిట పలు వస్తువులను మార్కెట్ చేస్తున్నారు. ఇందులో ఫాస్ట్‌మూవింగ్ కన్సూమర్ గూడ్స్ కూడా వుండడం గమనార్హం. పతంజలి ఉత్పత్తులు నాణ్యత, ధరలను వివరిస్తూ రాందేవ్ అటు ప్రింట్ ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో వ్యాపార ప్రకటనలతో ముంచెత్తుతున్నారు. దీంతో పతంజలి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడింది. సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహిస్తామని పాలక పక్షాలు కబుర్లు చెప్పడానికే పరిమితం అవుతున్నాయి. అయితే ఈ ఆధ్యాత్మిక వేత్తలు మాత్రం ఒకవైపు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మరోవైపు సదరు ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. పలువురు రైతులలో సేంద్రీయ వ్యవసాయం లాభసాటి కాదు అనే అపోహ వుంది. ఈ అపోహను తొలగించడానికి ఈ ఆధ్యాత్మికవేత్తలు చేస్తున్న కృషి అనిర్వచనీయం.
ప్రజల్లో ఈ మధ్య ఆరోగ్యంపట్ల శ్రద్ధ పెరిగింది. శతాబ్దాల తరబడి నిర్లక్ష్యంకు గురైన ఆయుర్వేదం పట్ల ప్రజల్లో ఆసక్తి కలుగుతున్నది. దీనిని గమనించిన పలు బహుళజాతి సంస్థలు ఆయుర్వేదం పేరిట పలు నూనెలు, సబ్బులు, క్రీమ్‌లు, లోషన్‌లు వంటివి మార్కెట్ చేస్తున్నాయి. శాస్ర్తియంగ ఆయుర్వేదం అనుసరించి ఆధ్యాత్మిక వేత్తలు నూనెలు, సబ్బులు, క్రీమ్‌లు తదితరాలు తయారుచేయడంతోపాటు నాణ్యమైన మందులు కూడా తయారుచేస్తున్నారు. దీంతో ఆయుర్వేదంకు మంచి రోజులు మెల్లమెల్లగా వస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో బహుళజాతి సంస్థలు తయారుచేస్తున్న ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులకు ఆధ్యాత్మిక వేత్తలు తయారుచేస్తున్న ఉత్పత్తులు గట్టి పోటీనిస్తున్నాయి. పతంజలి ఉత్పత్తులు అయితే బహుళజాతి కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొందరు కుహనా లౌకికవాదులు, ఆధ్యాత్మిక వేత్తలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులకు మతం రంగు పులమడానికి ప్రయత్నం చేయడం దురదృష్టకరం. మతం పేరుతో ఈ వస్తువులకు గిరాకీ ఏర్పడకుండా నిరోధించాలన్నదే వీరి దురాలోచన. ఆధ్యాత్మికవేత్తలు తయారుచేస్తున్న వస్తువులు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు కూడా అందుబాటులో తీసుకురావాలి. దీనివల్ల స్వదేశీ ఉత్పత్తులకు మార్కెటింగ్ పెరుగుతుంది. సేంద్రీయ వ్యవసాయంకు డిమాండ్ పెరుగుతుంది. ఆయుర్వేదంకు పూర్వ వైభవం కలిగే అవకాశాలు వున్నాయి.

- ఫి. మస్తాన్ రావు