సబ్ ఫీచర్

సాయి ఎందుకు అవతరించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయితత్వంలో అద్భుతమైన కాంతి ఉంది. తేజోవంతమైన కాంతి ఉంది. అన్యోన్యమైన ప్రేమ ఉంది. బాబా పలుకుల్లో అమృతం ఉంది. సాయి బంధువులకు అవి అయాచితంగా లభించే వరాలు. బతికున్నంతకాలం చివరి శ్వాస వరకు ఏదో విధంగా ఎంత కొంత కూడబెట్టాలన్నదే మనిషి ఆశ. సంపాదించుకోవటం, ఆస్తులు పోగెయ్యటం తప్పుకాదు కానీ, తను సంపాదించినదంతా ‘తనదే’నని, ‘తానే అనుభవించాలని’ అనుకోవటం మాత్రం పచ్చి స్వార్థం అనిపించుకుంటుంది. పోయేటపుడు మూటగట్టుకుపోయేదేదీ ఉండదనే నిజం తెలుసుకోవటానికి మనస్కరించదు. అది కూడా స్వార్థప్రభావమే. మనిషి స్వార్థం గురించి మన పురాణాల్లో మంచి హితబోధలు ఉన్నాయి. ధనం సంపాదించాలి. కానీ, అది మరెవరికీ దక్కకుండా దానిపై పాములా చుట్ట చుట్టుకుని ఉండకూడదు. స్వార్థానిది ఎప్పుడూ ఏకపక్ష దృష్టే. ‘నా’ అనే బుసలు కొట్టడమే తప్ప ‘మన’ అనే సామరస్య ధోరణిని అలవర్చదు. సాయి తన భక్తుల్లోని స్వార్థాన్ని రూపుమాపటానికి ఎన్నో ఉపదేశాలు చేశారు. ‘నీకున్న సంపదను స్వయంగా నువ్వు అనుభవించు. నీ వారసులను అనుభవించనివ్వు. అలాగే కాస్త మనసును విశాలం చేసుకుని నీ పక్కనున్నవారిని కూడా అనుభవించనివ్వు. నీ చుట్టూ వున్నవారెవరైనా ఆకలితో అలమటిస్తుంటే కనుక వారి కడుపు నింపటానికి తగినసాయం చెయ్యి. ఈ చిన్న పని కూడా చెయ్యలేకుంటే నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తంతా ఏ ఫలం లేకుండానే నిష్ఫలమవుతుంది. నీకు కావాల్సింది ఉంచుకో. మిగిలింది సత్కర్మలకు వినియోగించు అని బాబా బోధించారు.
భగవంతుని అవతారాలలో బాబాకు ఉన్నంత సామాజిక దృక్పథం, మానవతావాదం మరే అవతారాల్లోనూ లేవు. మనసును కాస్త మంచి చేసుకుంటే మనిషి మనీషి అవుతాడు. ‘నా’ అనుకోవటంలో ఒక్కరి ఆనందమే ఇమిడి ఉంది. ‘మన’ అనుకోవటంలో అందరి ఆనందాన్ని కూడా మనం అనుభవించే వెసులుబాటు ఉంది. స్వార్థరహితంగా ఉండటమంటే అంత తేలిక కాదు. ఒక్కొక్క అవలక్షణాన్నీ సులక్షణంగా మార్చుకోవాలి. అందుకోసం భక్తి, శ్రద్ధ, విశ్వాసం, సహనం అలవర్చుకోవాలి. అపుడు సాయితత్వం ఒంటబడుతుంది.
అజ్ఞానాన్ని నశింపజేసే సాయితత్వం
శ్రీ సాయి తన భక్తులపై కనబరిచేది మాతృప్రేమ. ఆవు తన దూడను ఎంత ప్రేమగా సాకుతుందో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు నిత్యం నిండే ఉంటుంది. దూడ తనకు ఎప్పుడు ఆకలివేసినా తల్లి పొదుగును కుడిస్తే పాలు ధారగా కారతాయి. తల్లి ప్రేమ కూడా అటువంటిదే. బిడ్డకు చక్కని దుస్తులు వేయటం, వారిని ముద్దులొలికేలా ముస్తాబు చేయటంలో తల్లులు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. బిడ్డకు ఈ విషయమేమీ తెలియదుకానీ, తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి ముస్తాబైతే చూసి తల్లి అమితానందాన్ని పొందుతుంది. తల్లి ప్రేమతో సరిపోల్చదగినదేదీ సృష్టిలో లేదు. అది అసామాన్యం. నిర్వ్యాజం. సద్గురువులు కూడా శిష్యులపై అటువంటి మాతృప్రేమనే చూపుతారు. సాయిబాబాకు తన భక్తులపై వున్నది అటువంటి ప్రేమే!
బద్ధకం, నిద్ర, చంచల మనసు, దేహాభిమానం తదితర అవలక్షణాలను విడిచి యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పాలి. బాబాపై మనం కనబరిచే భక్తి విశ్వాసాలు సహజంగా ఉండాలి. అపుడే మనం భక్తి యొక్క రహస్యం గురించి తెలుసుకోగలుగుతాం. ఇంతటి సులువైన మార్గం ఉండగా, ఇతర మార్గాలను అవలంభించి అనవసరంగా అలసిపోవడం వృథా ప్రయాస. అందరూ ఒకే మార్గంలో ప్రయాణించి శ్రీ సాయితత్వాన్ని తెలుసుకుందురుగాక! అవి అజ్ఞానాన్ని నశింపజేస్తాయి. మోక్షాన్ని సంపాదించి పెడతాయి. లోభి ఎక్కడ ఉన్నా అతని మనసు తాను పాతిపెట్టిన సొత్తుపైనే ఉంటుంది. బాబా పట్ల మనం కనబరిచే భక్త్భివం విషయంలో కూడా మనం అలాగే ఉండాలి. బాబాను నిజమైన భక్తులు తమ హృదయంలో ప్రతిష్ఠించుకుందురుగాక!
* * *
శ్రీసాయి శిరిడీలో ఫకీరు రూపంలో అవతరించిన పరమేశ్వర స్వరూపుడు. సాయిబాబా ఒక కర్తవ్యం కోసం ఈ భూమిపై అవతరించారు. అది పూర్తవగానే భౌతికదేహాన్ని చాలించారు. భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని ఏడు, ఎనిమిది శ్లోకాలలో శ్రీకృష్ణపరమాత్ముడు ఇలా నుడివారు. ‘‘్ధర్మం నశించినపుడు, అధర్మం పెరిగిపోయినపుడు నేను అవతరిస్తాను. సన్మార్గులను రక్షించటానికి, దుర్మార్గులను శిక్షించటానికి, ధర్మస్థాపన కోసం యుగయుగాల్లోనూ అవతరిస్తాను’’. ఇదే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని హృదయంలో యోగులు నివశిస్తారని ప్రతీతి. కాబట్టి భగవంతుడు, యోగులు వేరు కాదు. శ్రీకృష్ణుడే పలుమార్లు చెప్పాడు- యోగులు నా ఆత్మ అని. భగవంతుని ప్రతినిధులైన యోగులు, సన్యాసులు అవసరం వచ్చినపుడెల్లా అవతరించి భగవంతుని కర్తవ్యాన్ని నెరవేరుస్తారు.
భగవంతుడు భూమిపై వేర్వేరు రూపాలు దాల్చి ఎందుకు అవతరిస్తాడంటే- ద్విజులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులవారు తమ కర్మలను మానినపుడు, శూద్రులు పైజాతులవారి హక్కులను అపహరించినపుడు, మత గురువులను గౌరవించక అవమానించినపుడు, మత బోధలను ఎవరూ లక్ష్యపెట్టనపుడు, ప్రతివాడును తనకు తానే గొప్ప పండితుడనని విర్రవీగినపుడు, జనులు నిషిద్ధాహారాలు, మద్యపానాలకు అలవాటుపడినపుడు, మతంపేరుతో కాని పనులు చేయునపుడు, వేర్వేరు మతాలవారు తమలో తాము కలహించినపుడు బ్రాహ్మణులు సంధ్యావందనం మానినపుడు, సనాతనులు తమ మతాచారాలు పాటించనపుడు, ప్రజలు ధనదారా సంతానాలే జీవిత పరమార్థంగా భావించి మోక్షమార్గాన్ని మరిచినపుడు యోగీశ్వరులు ఉద్భవించి తమ వాక్కాయ కర్మలతో ప్రజలను సవ్య మార్గంలో పెట్టి వ్యవహారాలను చక్కదిద్దుతారు. వారు దీపస్తంభములవలె సహాయపడి, జనులు నడవాల్సిన సన్మార్గాన్ని, సత్ప్రవర్తనను నిర్దేశిస్తారు. నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవుడు, జానాబాయి, గోరా, గోణారుూ, ఏకనాథుడు, తుకారామ్, నరహరి, నర్సిబాయి, సజన్‌కసాయి, సాంవతమాలి, రామదాసు తదాతిగా గల యోగులు తదితరులును వేర్వేరు సమయాల్లో ఈ విధంగానే ఉద్భవించి జనులకు సవ్యమైన మార్గాన్ని చూపారు. అలాగే సాయిబాబా కూడా సకాలంలో శిరిడీలో చేరారు.
*
ఇంకావుంది...
*
సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566