సబ్ ఫీచర్

ధిక్కార స్వరం... ‘పుటం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు: 109, వెల: రూ.80/-
ప్రతులకు: దాసోజు లలిత,
ఫ్లాట్ నెం.3, వీధి-8, శక్తినగర్,
చింతకుంట పాత చెక్‌పోస్ట్,
హైదరాబాద్-74
సెల్: 9542869968
================

కవి దాసోజు కృష్ణమాచారిగారి కలం నుండి జాలువారిన విశ్వకర్మ వృత్తి కవిత్వం ‘‘పుటం’’ పేరుతో వెలువడింది. ధిక్కార స్వరంతోపాటు.. సృజనాత్మకత పుటంతో తీర్చిదిద్దిన ఇందలి కవితలు మేలిమి బంగారాన్ని తలపిస్తాయి! కవియొక్క ఆవేదన, ఆక్రోషం, ఆగ్రహంతో ముప్పేట అల్లుకుపోయిన ఆయన కవిత్వంలో ఆర్తిఉంది. ఆర్ధ్రత ఉంది. అన్నింటికి మించి..ప్రపంచీకరణ నేపథ్యంలో.. విధ్వంసమవుతున్న చేతివృత్తుల పట్ల కవియొక్క వేదనాభరిత స్పందనలున్నాయి.. కుల వృత్తులపైనే జీవనం గడుపుతున్న పల్లె ప్రజల వ్యథలకు అద్దంపట్టేలా కవి తమ భావాలకు అక్షరాకృతినిచ్చారు. పెత్తందారీ వ్యవస్థపై తమ కలాన్ని ఎక్కుపెట్టారు.
పీడిత జన పక్షాన నిలిచిన కవి కృష్ణమాచారిగారు ఇందలి కవితల్లో అడుగడుగునా వృత్తిదారుల వ్యథాభరిత జీవితాలను అక్షరాల్లో బంధించారు. వృత్తిదారుల కష్టాలను ఏకరువుపెడుతూనే.. వారిలో చైతన్యాన్ని నింపేందుకు కవి చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.. వృత్తి పనులవారు తమ దుర్భర పరిస్థితులనుండి బయటపడటానికి కృష్ణమాచారి గారి కవిత్వం ఓ పథాన్ని నిర్దేశిస్తుంది. కవి అక్షరాయుధాలతో.. సమాజానికి పుటంపెట్టే విధంగా రచనను కొనసాగించడం అభినందనీయం.
కవి తమ కవిత్వం ద్వారా స్వతంత్ర భారతావనిలో.. అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నవారు చేతి వృత్తులవారేనని తేల్చిచెప్పారు. నిజానికి, మొత్తం సమాజ అస్తిత్వాన్ని మోస్తున్నది చేతివృత్తుల వారే అయినప్పటికీ... పాలకుల ద్వారా వారు అనాదరణకు గురికావడంపట్ల కవి తమ ఆవేదనను వ్యక్తపరిచారు.
ఇందలి కవితల్లో.. పాలకులను నిలదీసే పంక్తులున్నాయి.. అన్నిరకాల చేతివృత్తుల సమూహాన్ని పోరాటానికి సంసిద్ధంచేసే పదబంధాలు కొలువుదీరాయి.
‘‘అమ్మ గర్భగుడిలనే/ అచ్చులద్దుకుని / లోకమంతా చరిత్ర చెరపలేని / మా తాతల అస్థిపంజరాలు / ఎన్ని సునామీలొచ్చినా.. / ఉత్పత్తి వత్తినై / భూమి పొరలను / తొల్చుకొని లేచి వస్తా’’ అంటూ మొట్టమొదటి ‘‘కీనీడ’’ కవితలో చక్కని భావాలను జోడించి విగ్రహంతో మాట్లాడించారు.
‘‘దండు’’ కవితలో...
గుండెకు గుండు గుచ్చుకున్నా
గింతంత బయపడనోళ్లం..
బూట్లసప్పుడుకు అదురుకునేదెక్కడ? అని ప్రశ్నించారు.
‘‘అంబేద్కరా’’ కవితలో కవి ప్రకటించిన భావాలు అందరినీ కదిలిస్తాయి.. ఆలోచింపజేస్తాయి. ప్రతి పంక్తీ ఆర్తిగా, ఆర్ద్రంగా మలచడంలో కవి సఫలీకృతులైనారు.
ఉదయిస్తున్న సూర్యునిపై
బాడిసె పట్టుకొని
కొమ్మను చెక్కుతూ
బొమ్మను దిద్దుకుంటూ
గడపగడపకు బోనం
చీకట్ల దీపంతో
కలి కుండ పులిసిన
మాడిన కడుపు.. అంటూ
కొనసాగించిన పంక్తులు అందరినీ ఆలోచింపజేస్తాయి..
కవి తెలంగాణ భాషకు పట్టంకడుతూ ‘పుటం’ గ్రంథం నిండా కవితలను పొందుపరిచారు. ధిక్కార స్వరానికి సముచిత స్థానం కల్పిస్తూ.. కవిత్వాన్ని పండించారు. ‘‘నిద్దురెక్కడ’’ కవితలో..
వొల్కబోసుకున్న దుఃఖమంతా
నదులై పారుతుంటే
నేను ఒడ్డుకు చేరుకునేదెప్పుడు?
రాజ్యాధికారంవైపు వెళ్ళే వేళ ఎక్కడ? అని ప్రశ్నించారు. ‘‘పురిటి మరకలు’’ కవితలోని పంక్తులు అందరినీ కదిలిస్తాయి..
‘‘పుటం’’ శీర్షికతో రాసిన కవితలో విశ్వకర్మల వ్యథలకు అద్దంపట్టారు. ఆకలికి స్వర్ణం కరుగదు/ నిప్పుకణికలకు నీరై పారి అచ్చులద్దుకొని చేతులు చాపుతూ/ కిరణాలై మెరుస్తుంది అంటూ రాసిన పంక్తులు కవితకు నిండుదనాన్నిచ్చాయి.. ముగింపు స్వాభిమాన భరితంగా ఉంది. ఖమ్మం జిల్లా ముదిగొండ కాల్పులను చూసి.. ‘‘హతారాలు మాట్లాడుతయి’’ కవితకు రూపమిచ్చారు. తూటాలు తగిలేది / ఎదురునిల్చిన / నోరులేని పోరాటానికే.. అంటూ రక్తం మరక కాని తూటాని కనిపెట్టాలని ఉంది అని చెప్పడం బాగుంది.
నేలంతా రక్తం పులుముతుండ్రు
విద్రోహం అంతా గాపైన కూసునోళ్ళదే..
ఆ రాబందులదే, కోడెనాగులదే..
వౌనానికి ఎప్పుడో ఒక మారోజు ఉదయిస్తుంది. ఆరోజు హతారాలు నాట్యమాడుతయి అంటూ చక్కని ముగింపునిచ్చారు.
‘‘నెలవంకలూ- పురివిప్పిన పులులు’’ కవితను కవితాత్మకంగా పలచినారు.
సమస్త అస్తిత్వాల జన్మస్థానం ఆ మట్టిపాదాలే కుదుళ్ళు అని తేల్చి చెబుతూ ‘‘మట్టి పాదాలు’’ కవితను ఈ గ్రంథంలో పొందుపరిచారు. ‘‘మనుషులు కావాలి’’ కవితలో దేవుడికి దీపం, ధూపం, నైవేద్యం, హారతులు ప్రదక్షిణాల లంచంకావాలి.. మాకు మాత్రం మనసున్న మనిషి కావాలి. మాటల మనషువొద్దు. చేతలుచేసే మనుషులుకావాలి అని ఆకాంక్షించారు.
‘‘బతుకంతా..’’ కవితలో - నా వెంట నడ్చిన ఇల్లాలికి/ ముల్లెకట్టిచ్చేదేముంది? అంటూ రాసిన ప్రారంభ పంక్తులు బాగున్నాయి..
‘‘పోరాటధారని నేనే’’ కవితలోని పదప్రయోగంలో కవియొక్క ప్రతిభ కానవస్తుంది.
నీవులేవు...తెలంగాణ ఉన్నది.. నీవు లేవు.. మరో ఉద్యమం ఎలా కావాలి మొదలు? అంటూ ‘‘జయ శంకరా’’ కవితను రాసిన ఆచార్య జయశంకర్‌కు నివాళి సమర్పించారు.
ఆకలి, లోహం, కర్ర, మట్టి, రాయి, ఆరాటం జీవరాసుల నుంచి.. పోరాటం నేర్చుకుని అడుగెయ్యాలని పిలుపునిచ్చారు. ఒక్క మనమే కాదు.. మన చుట్టూ సెమటకార్చిన బతుకుల మధ్య అతుకేసి నడవాలని హితవు పలికారు. ఇలా ఎన్నో పంక్తులు ఈ కావ్యంలో ఉదహరించడానికి యోగ్యంగా ఉన్నాయి. ధిక్కార స్వరానికి పెద్దపీట వేస్తూ.. రాసిన ప్రతి కవితలో కవి యొక్క సామాజిక బాధ్యత, సామాజిక చైతన్యం కోసం ఆయన పడే ఆరాటం.. కానవస్తుంది.. విశ్వకర్మ వృత్తివారే కాక.. మిగతా చేతివృత్తులవారి వ్యథలకు అద్దం పడుతూ రాసిన ఈ గ్రంథం ప్రతి ఒక్కరూ చదువదగింది.

-- దాస్యం సేనాధిపతి, 9440525544