సబ్ ఫీచర్

‘ఉమ్మడి పౌరస్మృతి’ ఇంకెంత దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అంశం చాలాకాలంగా ఆలోచనల స్థాయిలోనే మిగిలి ఉంది. దీనిపై ఇంతవరకూ ఎలాంటి ఫలవంతంగా చర్చలు గానీ, నిర్ణయాలు గానీ జరగలేదు. ఉమ్మడి పౌరస్మృతి గురించి భారత రాజ్యాంగంలోని 44వ అధికరణంలో ఏకపంక్తి వాక్యంలో ప్రస్తావించారు. దానిని హృదయ పూర్వకంగా రాయలేదని చాలామంది అభిప్రాయం. దీన్ని ఎందుకో దృఢ నిర్ణయంతో రాయలేదు. అది ఇలా వుంది. 'Uniform Civil code for citizens: The state shall endeavour to secure for the citizens a uniform civil code throughout the territory of India' (ప్రభుత్వం భారత భూ భాగమంతటా పౌరులందరికీ ఒకే విధమైన పౌరస్మృతి తీసుకొని రావటానికి ప్రయత్నించవలెను). ఆంగ్లంలో 'shall endeavour' అంటే తెలుగులో ‘ప్రయత్నించవలెను’ అని మాత్రమే ఎందుకు రాశారో తెలుసుకోవాలంటే రా జ్యాంగ, చట్టసభల చర్చలను అధ్యయనం చేయాల్సిందే.
ఉమ్మడి పౌరస్మృతి మొదటి నుండి మతపరంగానే వ్యతిరేకించబడింది. రాజ్యాంగం నిర్మాణ సమయంలో రాజ్యాంగ సభలోని మహమ్మదీయ సభ్యులు వారి ‘పర్సనల్ లా’కు ఇది వ్యతిరేకమని భావించారు. తమ వ్యక్తిపర చట్టాలు దైవప్రసాదితమైనవని, అవి తమ సంస్కృతీ దీపికలని, వాటికి భంగం కలుగరాదని వాదించారు. హిందూ సభ్యులు, మిగతా మైనారిటీ సభ్యులు, డాక్టర్ అంబేద్కర్ వగైరాలు ఆ వాదన దేశాన్ని విడగొట్టే ప్రమాదం వుందని ఘోషించారు. క్రిమినల్ కోడ్‌లు, అన్ని ఆస్తుల చట్టాలు ఉమ్మడిగా దేశానికంతకూ ఒకే విధంగా వున్నాయి. కనుక అదే విధంగా వివాహ, కుటుంబ, వారసత్వ చట్టాలకు కూడ ఉమ్మడి సివిల్ కోడ్ ఉండవచ్చునని ఉద్ఘోషించారు.
దేశంలో విభిన్న మతాలు, కులాలు, భాషలవారున్నారు. అందరినీ ఒకే గొడుగు కిందకు ఉమ్మడి పౌరస్మృతి ద్వారా తెచ్చి, రాజ్యాంగంలోని 14, 15వ అధికరణాలలో తెలిపినట్లు దేశంలోని మహిళలకు లింగ సమానతను, సాధికారికతను, దేశమంతటికి ఒకే వ్యవహార విధానాన్ని, జీవన విధానాన్ని, సంస్కృతిని సాధించేందుకు, శాసన దృష్టిలో మత, జాతి, కుల లింగ విభేదములతో వివక్షలను నిషేధించి రాజ్యాంగంలో చెప్పిన సమానతా హక్కులను సాధించేందుకు ఉమ్మడి పౌరస్మృతి అవసరమని, మతం మానవ హక్కులకు, గౌరవాలకు అడ్డురారాదని మేధావి వర్గం ప్రస్ఫుటంగా తెలిపింది.
మహమ్మదీయులలో అమలులో వున్న మతాచారాలు, సంప్రదాయాలు, చట్టాలు వగైరాలలోని ముమ్మారు తలాక్ విధానం, బహు భార్యత్వ విధానము, స్ర్తిల ఆస్తిహక్కులు, వారి పోషణ హక్కులు వగైరాలకు పరిష్కారం చూపకుండా ఉమ్మడి పౌరస్మృతి సులభ సాధ్యం కాదు. ఈ అంశాలు దేశ లౌకిక తత్వానికి ఆటంకాలైనాయి. ఈ ఆటంకాలను తొలగించలేకనే బ్రిటీషు ప్రభుత్వం వాటి జోలికి పోలేదు. కాలానుగుణంగా సమాజంలో చోటుచేసుకొనే మార్పులను దృష్టిలో వుంచుకొని, గత సంస్కృతులను గూర్చి ఆలోచించకుండా అందరిలో లింగ సమానత సాధించాలని, కలిసి ఒక దేశంలో జీవించు ప్రజలకు వేరువేరు చట్టాలేమిటని, క్రిమినల్ కోడ్, శిక్షాస్మృతి, ఆస్తుల చట్టాలైన ఆస్తుల బదిలీల చట్టాలు, కంట్రాక్టు వగైరా చాలా చట్టాలు దేశమంతటికీ ఒకటై వుండగా, ఉమ్మడి పౌరస్మృతికి అభ్యంతరమేమిటని ప్రజలు, ప్రభుత్వాలు చర్చలు చేయునంతలో షాబానోబేగం కేసు సుప్రీంకోర్టులో విచారణ కొచ్చింది. అది విడాకులైన మహిళల మనోవర్తి హక్కుకు సంబంధించినది. ఆ కేసులో 23-04-1985న విడాకులైన మహమ్మదీయ మహిళకు, ఆమె పునర్వివాహం చేసుకొనకపోతే ఆమెకు మరియు ఆమె పిల్లలకు ఆమె భర్తయే జీవనభృతి చెల్లించాలని ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవ తీర్పునిచ్చారు. అది హిందూ వివాహచట్టం, క్రిమినల్ కోడ్‌లో విధానం వలెనే వున్నది. అంతేగాక రాజ్యాంగంలోని ఉమ్మడి పౌరస్మృతి ‘మృతవాక్యమై’పోయిందని కోర్టు విచారం వ్యక్తం చేసింది.
పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని, ఇతర మతగ్రంథాలను ఉటంకించి ఉమ్మడి పౌరస్మృతి దేశ సమైక్యతకు తోడ్పడుతుందని, రాజకీయపరంగా ధైర్యం తెచ్చుకొని ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిని తేవాలని తీర్పు చెప్పింది. అందుకు దేశంలోని మహమ్మదీయులు ముందుకువచ్చి సహకరించాలని కూడా చెప్పింది. ఈ తీర్పు దేశంలోని మహమ్మదీయులలో తీవ్ర కలకలం తెచ్చింది. దానికితోడు ఈ వివాదం రాజకీయం రంగప్రవేశం చేసింది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వున్నది. వారికి మహమ్మదీయులు ఓటుబ్యాంకుగా వున్నారు. వారి వ్యతిరేకతకు తలవంచింది కేంద్ర ప్రభుత్వం. ఆ తీర్పును అధిగమించుటకు స్వార్థపూరితంగా 1986వ సంవత్సరంలో The Muslim women (Protection of Rights on Divorce) తెఛ్చింది. ఈ బిల్లును ఉభయ కమ్యూనిస్టుపార్టీలు వ్యతిరేకించాయి. ఈ చట్టం ప్రకారం విడాకులైన భార్యకు భర్త జీవనభృతి కల్పించాల్సిన బాధ్యత లేదు. బంధువులు గాని వక్ఫ్‌బోర్డుగాని ఆ మహిళకు జీవనభృతిని కల్పించాలి. లేకపోతే తాత్కాలిక మనోవర్తిని క్రిమినల్ కోడ్ క్రింద పొందవచ్చు.
సుప్రీం కోర్టు సరళా ముద్గల్ తీర్పు (10-5- 1995)లో నాగరిక సమాజంలో సమానతకు, వ్యక్తిపర శాసనాలకు సంబంధం వుండరాదన్న సిద్ధాంత ప్రాతిపదికగా ఉమ్మడి పౌరస్మృతి భావన రాజ్యాంగంలో రూపుదిద్దుకున్నదని తీర్పురాస్తూ రాజ్యాంగం అధికరణం 44లో చెప్పినట్లు ఉమ్మడి పౌరస్మృతిని తేవలసిందిగా అప్పటి ప్రధానమంత్రిని ఆదేశించింది. అప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలనలో వున్నది. అంతేగాక ఆ దిశగా ఏం చర్యలు తీసుకుంటున్నారో 1996 ఆగస్టు లోగా కోర్టులో ప్రమాణపత్రం దాఖలుచేయమని తీవ్రంగా రాశారు. ఇంత తీవ్రంగా సుప్రీం కోర్టు తీర్పులిచ్చినా ఏ ప్రభుత్వమూ ఉమ్మడి పౌరస్మృతిని ఆచరణలోకి తేలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయింది. దీంతో పౌరస్మృతిని మరల మతం నుండి రాజకీయ ప్రాముఖ్యత వైపు నాయకులు మళ్ళించారు. ఓటుబ్యాంకు రాజకీయాలొచ్చాయి. మహమ్మదీయులను తమవైపు మరల్చుకొనే ఉద్దేశాలున్న పార్టీలు హిందూ చట్టాలను మరో రూపంలో మహమ్మదీయులపై రుద్దుతున్నారన్న పుకార్లు తెచ్చాయి. ఆచరణ సాధ్యం కాని ‘రెఫరెండమ్’ను పెట్టమన్నారు. ఈ వాదనలు జరుపుతున్నప్పుడే- సెల్‌ఫోన్‌లో సైతం ముమ్మారు తక్షణ తలాక్ చెప్పటం లాంటి విధానాలు మహమ్మదీయ మహిళలకు అ న్యాయం చేస్తున్నందున ‘తలాక్’ పద్ధతి చెల్లదని సుప్రీం కోర్టు కొత్త తీర్పునిచ్చింది. మహిళలు పురుషులకు చరాస్తి కాదని అది రాజ్యాంగంలోని సమానత సూత్రానికి వ్యతిరేకంగా వున్నదని, సమాజం చాలాదూరం ముందుకు నడిచిన వైనం గుర్తించాలని సుప్రీం కోర్టు తన సంచలనాత్మకమైన తీర్పులో పేర్కొన్నది. తలాక్‌కు బలమైన కారణాన్ని రుజువుచేయకుండా, ఇరువైపుల పెద్దల ఎదుట రాజీప్రయత్నం చేయకుండా తలాక్ చెప్పినా చెల్లదని ఆ తీర్పు వలన తెలుస్తుంది.
తదుపరి కేంద్ర ప్రభుత్వం ‘ముమ్మారు తలాక్ బిల్లు’ తెచ్చింది. బిల్లు లోక్‌సభను దాటింది. రాజ్యసభలో పెండింగ్‌లో ఉంటూ కాలదోషం పడుతున్నందున 20-9-2018న కేంద్ర ప్రభుత్వం మరొకసారి అదే బిల్లును ఆర్డినెన్సుగా తెచ్చింది. పాలకుల రాజకీయ ఉద్దేశాలు పక్కన పెడితే ఈ ఆర్డినెన్స్ వల్ల ముస్లిం మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. దీని ప్రకారం ముమ్మారు తలాక్ పేరిట ముస్లిం మహిళలకు భర్తలు విడాకులు ఇవ్వడం నేరం. ఆ నేరానికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. విడాకులిచ్చాక భార్యకు మనోవర్తి చెల్లించాలి. మైనరు పిల్లలను తల్లి భద్రతకివ్వాలి. తక్షణ ముమ్మారు తలాక్‌లు అధికమవుతున్నందున ఈ ఆర్డినెన్సు తెచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఆర్డినెన్స్ చట్టంగా అమలులోకి వచ్చాక మహమ్మదీయ మహిళలు నిర్భయంగా వైవాహిక జీవితం గడిపేందుకు ఎంతైనా అవకాశమున్నది.
మహమ్మదీయులలో బహుభార్యాత్వ రద్దు వలన మానవ సంబంధాలు మెరుగవుతాయి. దేశానికి గల ప్రమాదాలలో ఒక ప్రమాదం తప్పినట్లే కాగలదు. ముమ్మారు తలాక్, బహుభార్యత్వం వంటివి రద్దు చేయడం మన దేశానికి అవసర చర్యలే. ఇవన్నీ ఉమ్మడి పౌరస్మృతి వలన సుసాధ్యం కాగలవు. ఇందువలన ముఖ్యంగా ముస్లిం మహిళలకు సామాజిక న్యాయం, సాధికారికత, సమానత్వ హక్కుల రక్షణ కలుగుతాయి. మహిళల జీవితాలకు భరోసా కలిగి, భయం, అనిశ్చితి తొలగి తాను భర్తకు చరాస్తిగాకాక మంచి వ్యక్తిత్వమున్న భార్యగా, స్వేచ్ఛగా జీవించగలదు. ఆమెకు ధైర్యమైన, నమ్మకమైన, ప్రశాంత కుటుంబ జీవితం లభించగలదు. సర్వమానవ సమాన రాజ్యాంగ స్వభావాన్ని దేశం పాటించగలుగుతుంది. కొన్ని ఇతర దేశాలలో ట్రిపుల్ తలాక్ రద్దయినా, మన సుప్రీం కోర్టు తీర్పులనిచ్చినా మన ప్రభుత్వాలు ముందుకు రాలేకపోయాయి. సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని ‘లా కమిషన్’ గౌరవించలేదు. హేతుబద్ధత, మానవీయత లోపించిన విధానాలు మనకు ఇంకెన్నాళ్ళు? ఇప్పటికైనా ఈ ఆర్డినెన్సు బిల్లు రూపం దాలిస్తే ప్రభుత్వ విధానాన్ని అందరూ స్వాగతించాలి. ఇదే ఒరవడిలో దేశానికి ఉమ్మడి పౌరస్మృతి రాగలదని ఆశిద్దాం.

-బి.హనుమారెడ్డి 94402 88080