సబ్ ఫీచర్

శ్రేయోదాయకమైనవే కోరుకోవాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనలో శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడతాయి. భగవంతుడు నిరాకారుడని నమ్మేవారు భగవంతుడు ఆకారంగలవాడని నమ్మేవారిని ఖండించి అది వట్టిభ్రమ అంటారు. యోగీశ్వరులు కూడా మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరించటం ఎందుకు? అని ప్రశ్నిస్తారు. ఇతర శాఖలవారు కూడా ఆక్షేపణచేస్తూ వారి సద్గురువువారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవచేయనేల? అని అంటారు. సాయిబాబా గురించి కూడా అటువంటి క్షేపణలున్నాయి. శిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగారు. యోగులు ఈవిధంగా ధనం పోగుచేయటం శ్రేయస్కరమా? వారిలాధనాన్ని జాగ్రత్తచేస్తే వారి యోగిగుణము లెక్కడ? అని బాబాను పలువురు విమర్శించారు. అయితే, దక్షిణ స్వీకరించటం బాబా ఉద్దేశమేమిటో మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. బాబా ప్రయోగించే యుక్తి అమోఘమైనది. అన్నీతానే చేస్తున్నా దేనిపైనా అభిమానం ఉంచలేదు. ఎవరైనా నమస్కరించినా, నమస్కరించకపోయినా, దక్షిణ ఇచ్చినా, ఇవ్వకున్నా బాబాకు అందరూ సమానులే. బాబా ఎవరినీ అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించెడివారుకాదు. తనను పూజించలేదని విచారించేవారుకాదు. వారు ద్వంద్వాతీతులు. సాయిబాబా మహిమ అగాధం. వారి లీలలుకూడా అటువంటివే. వారి జీవితం అటువంటిదే. బాబా పరబ్రహ్మంయొక్క అవతారమే!
* * *
వేదాలు, పురాణాలు, బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అటువంటపుడు మనవంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎలా వర్ణించగలం? ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనుటమే మేలని అనిపిస్తోంది. వౌనవ్రతాన్ని ఆచరించటమే సద్గురువుని స్తుతించటానికి తగిన మార్గమని అనిపిస్తుంది. కానీ, సాయిబాబా సుగుణాలనుచూస్తే మన వౌనవ్రతం విషయాన్ని మరిచి మనల్ని మాట్లాడేలా ప్రేరేపిస్తుంది. మన స్నేహితులుగాని, బంధువులుగాని మనతో లేకుంటే మంచి పిండివంటలు ఎన్ని వండుకుని తిన్నా అవి రుచిగా అనిపించవు. అదే మనకిష్టమైనవారు మనతో ఉంటే ఆ పిండి వంటలు మరింత రుచికరంగా ఉంటాయి. సాయితత్వం కూడా అటువంటిదే.
బాబా తన భక్తులను ఏదైనా కోరిక కలిగినపుడు అది ప్రియమైనదా?. శ్రేయస్కరమైనదా? అని వివేచించుకోమన్నారు. ప్రియమైనవి మనిషిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. వీటివల్ల సాధారణంగా ఏ ఉపయోగమూ ఉండదు. పైగా ఇవి కలిగించే నష్టమూ ఎక్కువే. మనం నిత్యం జీవితంలో ఎంతో కష్టపడి చేసే పనుల్లో చాలావరకు ప్రియమైనవే. ఇక, శ్రేయోదాయకమైన పనులు శాశ్వతానందాన్నిస్తాయి. ఇవి తాత్కాలికంగా ఇబ్బందులకు గురిచేసినా అంతిమంగా వీటివల్ల అమోఘమైన ఫలితం కలుగుతుంది. బిడ్డలు అనారోగ్యంపాలైతే తల్లి చేదు మాత్రలనే మింగిస్తుంది. అవి చేదుగాఉన్నా రోగాన్ని విరిచేస్తాయని ఆమెకు తెలుసు. బిడ్డ శ్రేయస్సునుకోరి మాతృమూర్తి ఇచ్చే మాత్రలు ఆరోగ్యాన్నీ, సత్తువను కలిగిస్తాయి. జీవితంలో ప్రగతిని కోరుకునేవారు, ఆధ్యాత్మిక సాధనలో పురోగతిని అభిలషించేవారు ప్రియమైన వాటిని వదిలి శ్రేయస్కరమైన వాటివైపు దృష్టిమరల్చాలి. ప్రియమైన వాటివల్ల కలిగే విపరిణామాలను పదేపదే తల్చుకుని వాటిని మనసులోంచి తొలగించుకోవటమే వైరాగ్యం. శాశ్వతానందాన్ని కలిగించే శ్రేయస్కరమైన వాటిపై శ్రద్ధను పెంచుకుని వాటిని ఆచరించటమే అభ్యాసం. మనోనిగ్రహానికి ఇదే మూల మంత్రం.
జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలకోసం అల్పమైన సుఖాలను వదులుకోక తప్పదు. ఒక విద్యార్థి ఉన్నత విద్యాభ్యాసం చేయదలిస్తే అది పూర్తయ్యే వరకు, కనీసం పరీక్ష సమయంలోనైనా తనకిష్టమైన సినిమాలు చూడటం, టీవీ, ఆటలు ఆడటం వంటి కోరికలను త్యాగంచేయక తప్పదు. ఇదే వైరాగ్య భావం. వైరాగ్యమంటే సుఖాలనువదిలి మనసును కష్టపెట్టుకోవటం అనే పొరపాటు అభిప్రాయం జనంలో ఉంది. అది నిజంకాదు. మన ఆనందంకోసం అల్పమైన సుఖాలను త్యాగంచేయటం కూడా వైరాగ్యం కిందకే వస్తుంది.
ఒకపక్క వైరాగ్యాన్ని పెంచుకుంటూనే మరోపక్క మన ఉన్నత లక్ష్యం సడలిపోకుండా ఉండేందుకు అభ్యాసంచేయాలి. మనసు చంచలమైనది. అది లక్ష్యంనుంచి పదే పదే పక్కకు జరుగుతుంది. అలా జరిగినపుడల్లా దానిని వెనక్కి మరల్చాలి. ఇలా కొంతకాలం అభ్యాసంచేస్తే మనసు లక్ష్యంపై కేంద్రీకృతమవుతుంది. మనోనిగ్రహాన్ని సాధించేందుకు దీన్ని మించిన మార్గం లేదు.
ఏది మనదో అదే మనవద్ద ఉంటుంది..
బాబా శయనించే తీరుచూసి దేవతలైనా అచ్చెరువొందాల్సిందే. మొట్టమొదట బాబా ఎచ్చట నిద్రించేవారో, ఎలా నిద్రించేవారో తెలుసుకుందాం. ఒకసారి నానాసాహెబు డేంగలే సుమారు నాలుగు మూరల పొడవు, జానెడుమాత్రమే వెడల్పుగల ఒక కఱ్ఱబల్లను బాబా పడకకని తెచ్చెను. బాబా ఆ బల్లను నేలపై వేసుకొని పడుకోవటానికి బదులుగా దానిని మసీదు దూలాలకు పాత గుడ్డపీలికలను కట్టి ఊయలలా వేలాడదీశారు. దానిపైకి ఎక్కి బాబా పడుకునేవారు. దూలానికి బల్లనుకట్టి వేలాడదీసిన గుడ్డ పీలికలు పలుచనివి, ఏమాత్రం బలమైనవికావు. అవి ఆ కొయ్యబల్ల బరువును వెయ్యటమే గగనమనుకుంటే, ఇక బాబా బరువునుకూడా కలిపి అవి ఎలామోస్తున్నాయనేది శిరిడీవాసులకు ఆశ్చర్యానందాన్ని కలిగించేది. ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలగటం నిజంగా బాబా లీలయే.