సబ్ ఫీచర్

‘ఒవైసీ’లకు పగ్గాలు.. కేసీఆర్‌కు విశ్రాంతి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాం రాజంతటి గొప్ప పరిపాలకుడు దేశంలో మరెవ్వరూ లేరు. గర్వించతగ్గ నిజాం చరిత్రే తెలంగాణ చరిత్ర’’- అని చెప్పే తెరాస పార్టీ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతటితో ఆగకుండా నిజాం చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టాలని, ప్రజల చేత నిత్యం పారాయణం చేయించాలని కంకణం కట్టుకున్నట్లున్నది. అంతేకాదు.. ‘మజ్లిస్ - ఎంఐఎం- (రజాకార్ల వారసత్వ) పార్టీ మన తెలంగాణకు గర్వకారణం’ అన్న ఆణిముత్యం లాంటి మాట కేసీఆర్ నోట వినాల్సిరావటం మన దౌర్భాగ్యం. నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల ఆత్మలు ఘోషించినా పర్వాలేదు, స్వతంత్ర సమర యోధులు- వివిధ పక్షాలు- ప్రజలు- ఎందరెందరో ఎన్నివిధాలా ఖండించినా కేసీఆర్‌కు లెక్కలేదు. ‘‘తాను మెచ్చింది రంభ- తాను మునిగింది గంగ’’- అన్న ధోరణి ఆయనది. మన ఖర్మకాలి మరోసారి కేసీఆర్‌కు అధికారం దక్కితే సమరయోధుల పెన్షన్లు రద్దుచేసి, వారు తెలంగాణ ద్రోహులని ప్రకటించినా, అమరుల స్మారకాలను తొలగించినా ఆశ్చర్యపోనక్కరలేదు.
నిజంగానే నిజాం రాజులు అంత గొప్పవారైతే, వారు ప్రజారంజకంగా పాలించి వున్నట్లైతే- ప్రజలు ఎదురుతిరిగి నిజాంను గద్దెదించాలని పోరాడి ప్రాణాలర్పిస్తారా? ప్రజల కనీస మానవ హక్కులను అరికాల రాచి- నిరంకుశ పాలనతో ప్రజలను అణగదొక్కి క్రూరంగా హింసించాడు నిజాం. బానిస బతుకయ్యింది ప్రజలది. భరించరాని పన్నులతో ప్రజల రక్తాన్ని పీల్చివేసిన నిజాం, అతని తాబేదార్లైన జమిందార్లు- జాగీర్దార్లు- దొరలు- దేశముఖులు ప్రజలను దోచుకుని విందులు, విలాసాలతో, రాసక్రీడలతో సర్వభోగాలను అనుభవించారు. ప్రజలు కూటికి, గుడ్డకు అలమటించారు నిజాం రాజ్యంలో. వాక్ స్వాతంత్య్రం- సమావేశ స్వాతంత్య్రం లేకుండా క్రూరంగా అణచివేతకు గురయ్యారు ప్రజలు.
నిజాం రాజ్యంలో కేవలం 7 శాతం ముస్లిం జనాభా వుంటే, 93 శాతం హిందూ జనాభా వుండేది. అయినా మెజార్టీ ప్రజల తెలుగు భాషను- ప్రజల సంస్కృతీ, సాంప్రదాయాలను అణిచివేశారు. విద్యాబోధనలో, పరిపాలనలో ఉర్దూను బలవంతంగా రుద్దారు. హిందువుల పండగలు, పబ్బాలు ప్రభుత్వ ఆంక్షలకు లోబడి బహిరంగంగా కాకుండా నాలుగు గోడల మధ్యన జరుపుకోవాల్సిన దుర్గతి ఉండేది.
ఇవి చాలవన్నట్లు కాశీం రజ్వీ అనే దుర్మార్గుడి నాయకత్వంలో రజాకార్లు అనే రాకాసి మూకలను పెంచిపోషించి- ఆయుధాలు ఇచ్చి ప్రజలపై స్వైరవిహారం చేయించాడు నిజాం. ప్రజల ఆస్తులను దోచుకోవటం- ఊళ్ళకు ఊళ్ళు తగలబెట్టడం- మహిళలను చెరబట్టడం- రైతుకూలీలను సజీవంగా దహనం చేయటం- వేలాది మందిని కాల్చిచంపడం- పసిపిల్లలను నరికివేయటం లాంటి పరమ కిరాత హింసాకాండ కొనసాగించాడు. రజాకార్ల వారసులదే నేటి ఎంఐఎం పార్టీ. చివరకు నిజాం సంస్థానాన్ని మరో పాకిస్తాన్‌గా చేయడానికి హిందువులపై మారణహోమం జరిపించాడు నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్.
క్లుప్తంగా ఇదీ నిజాం చరిత్ర. నిజాం దుష్టపాలనా వివరాలు ఆంధ్ర మహాసభ చరిత్ర- ఆంధ్రుల చరిత్ర, సాయుధ పోరాట చరిత్ర లాంటి గ్రంథాలలో మనకు పూర్తిగా తెలుస్తాయి. ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజం ఉద్యమాలు, గ్రంథాలయోద్యమం- ఆంధ్ర భాషా విద్యాలయాల ప్రేరణతో ప్రజలు తిరగబడి చేసిన సాయుధ పోరాటాలకుతోడు ‘ఉక్కుమనిషి’ సర్దార్ పటేల్ పంపిన భారత సైన్యాల ప్రవేశంతో నిజాం సంస్థానం విముక్తిపొంది భారత్‌లో విలీనమైంది. నిజాం లొంగిపోగా- రజాకార్లు తోక ముడిచారు.
పరమ దుర్మార్గుడైన నిజాం రాజు నిరంకుశ చరిత్ర మన ‘కేసీఆర్ సారు’కు ఆదర్శవంతంగా కనిపిస్తున్నది. అందుకే నిజాం రాజు సమాధికి నివాళులర్పించాడు. మరోవైపు.. ‘నా గొంతుమీద కత్తిపెట్టినా భారతమాతకు జై అనను’- అని చెప్పిన అససొద్దీన్ ఒవైసీ మరోసారి ‘‘బతకమ్మా- బతకమ్మా- కైసే బతకమ్మా- కాయికా బత్‌కమ్మా- గోల్‌గోల్ గూమేతే దీవానే లోగ్’’ అని తెలంగాణ ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజించే బతకమ్మ తల్లిని తూలనాడినా, ఆయన తమ్ముడు అక్బరొద్దీన్ ఒవైసీ- ‘‘15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే హిందువులను నరికిపారేస్తాం.. ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయినా మాముందు తల వంచవలసిందే’’- అని గర్వంగా ప్రకటించినా కేసీఆర్‌కు అంగీకారమే కాబోలు! అందుకే ‘ఎంఐఎం పార్టీ వుండటం తెలంగాణకే గర్వకారణం’ అని ప్రకటించాడు.
ఈ జాతి మొత్తం ఆరాధ్య దైవంగా పూజించే శ్రీరాముడిని, ఆయన తల్లి కౌసల్యాదేవిని తూలనాడుతూ ‘‘యే కహంకా రామ్‌హై- ఓ కౌసల్యా కహా కహా పిరికే కహాఁ ఫైయిదా కియే ఉస్‌కో’’ అన్న ఒవైసీ సోదరులు కేసీఆర్‌కు అలయ్ బలయ్ దోస్తులేనట. అందుకే ప్రతి చిన్న విమర్శలకు కూడా తోక తొక్కిన పాములెక్క బుసలుకొట్టే తెరాస చోటాబడా నాయకులు ఎంఐఎం విషయంలో వౌనం పాటిస్తున్నారు. నిజాం పాలనే ఆదర్శమని భావించి అలాంటి పాలనే తీసుకురావాలన్న ఆరాటం ఉంటే కేసీఆర్‌కు ఎందుకు ఇంత శ్రమ. ఆ బాధ్యత ఒవైసీ సోదరులకు అప్పగిస్తే సరిపోతుంది కదా!
అససొద్దీన్‌ను రాజుగా పట్ట్భాషేకం చేసి, అక్బరొద్దీన్‌ను కాశీం రజ్వీగా ప్రమాణ స్వీకారం చేయిస్తే ఈ ఎన్నికల తలనొప్పి- లొల్లి లేకుండా పోతుంది. కేసీఆర్ నిత్యం మెచ్చుకునే నిజాం తరహా ఆదర్శపాలన ఎలా వుండేదో ఈతరం తెలంగాణ ప్రజలకు రుచి చూపిస్తారు ఒవైసీ సోదరులు. అప్పుడు బాగా అలసిపోయిన కేసీఆర్ తాను కోరుకున్నట్లే విశ్రాంతి తీసుకోవచ్చు. ఆయన తనయుడు కెటిఆర్ తృప్తిగా సన్యాసం తీసుకోవచ్చు. అప్పుడు గులాబీ తమ్ముళ్ళకు- కేసీఆర్‌కు వంత పాడాల్సిన పని తప్పుతుంది. మీడియా యాజమాన్యాలకు బలవంతంగా భజన చేయాల్సిన దుర్గతి కూడా తప్పుతుంది.

-మందాడి సత్యనారాయణ రెడ్డి