సబ్ ఫీచర్

గద్దర్ సుద్దులు ‘అన్న’లకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మవిమర్శ చేసుకున్నాడో, జ్ఞానోదయం కలిగిందో లేక అవసరార్థమో గాని ‘ప్రజాగాయకుడు’ గద్దర్ ప్రజల్లో ‘ఓటు చైతన్యం’ తెస్తానని బయలుదేరాడు. భార్యా సమేతంగా ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్ గాంధీలను కలసి- తన కుమారుడికి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. ప్రతిపక్షాలన్నీ కోరితే ఏకంగా తెరాస అధినేత కేసీఆర్‌నే ఢీకొంటానని పెద్ద ‘ఆఫర్’ కూడా ఇచ్చాడు. అటు బహుజన లెఫ్ట్ వేదికలపైన, ఇటు మేడ్చల్‌లో- (కాంగ్రెస్, తెదేపాల కలయికతో ఆవిర్భవించిన) ‘మహాకూటమి’ వేదికపైన హల్‌చల్ చేశాడు. అయినా ఫలితం దక్కలేదు గద్దరన్నకు. కుమారుడికి టిక్కెట్ అడగడమే గాక, తాను గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఆయన అన్నందుకు జనం ఆశ్చర్యంతో బిత్తరపోయారు. బూటకపుఎన్నికలను బహిష్కరించాలని గతంలో గళమెత్తిన ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తాననడం స్వాగతించాల్సిందే.
‘బుల్లెట్’ మార్గంలో చాలా చాలా దూరం ప్రయాణించిన గద్దర్ ఆ ‘దారి’ తప్పు అని నిజంగా గ్రహిస్తే ఆ విషయం బాహాటంగా ప్రకటించాలి. తన ఆట, పాట, మాటల ద్వారా వేలాదిమంది యువకులను రెచ్చగొట్టి ఆయుధాలతో అడవిబాట పట్టించినందుకు పశ్చాతాపం వ్యక్తం చేస్తాడా? మావోయిస్టు బాధిత కుటుంబాలకు సంజాయిషీ ఇస్తాడా? ఏమని కోరుతాడో ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. అడవిబాట పట్టించిన వారందరినీ ఆయుధాలు వదలి, హింసామార్గం వీడి ప్రజాస్వామిక మార్గంలోకి రమ్మని ఆయన విజ్ఞప్తి చేయాలి. అప్పుడే ఆయనలో భావాత్మక మార్పు వచ్చిందని ప్రజాస్వామిక వాదులు హర్షిస్తారు. విశ్వసిస్తారు. అంతేగాని కేసీఆర్‌నో, మరొకరినో తూలనాడుతూ కొత్త పాటలు పాడినంత మాత్రాన మావోయిస్టుల హింసోన్మాద విధ్వంసాగ్నిలో ఆయన ఆజ్యం పోయడాన్ని ఎవరూ మరచిపోలేరు.
ఆటపాటలతో యువకులను తప్పు మార్గం పట్టించినందుకు, వందలాది మంది పోలీసులు- మావోయిస్టు యువతీ యువకులు- అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి, విధ్వంసాలకు తాను సైతం కారణమైనందుకు సమాజానికి ఏమని సంజాయిషీ ఇస్తాడో చూద్దాం. తప్పును అంగీకరించే ధైర్యం ఉండాలి ఎవరికైనా. ఇప్పటికైనా బుల్లెట్ మార్గం వీడి బ్యాలెట్ మార్గానికి రమ్మని తన పాత మిత్రులకు పిలుపునిస్తే గద్దర్‌లో మార్పు వచ్చిందని జనం నమ్ముతారు. ప్రజాస్వామిక వాదులు హర్షిస్తారు, ఆయనకూ గౌరవం దక్కుతుంది.
అలాకాకుండా గోసి గొంగడి వేషం కట్టి- ఎవరినో ఒకరిని తూలనాడుతూ పాడినా, సాముగరిడీలు ఎన్ని చేసినా జనం వినోదంగా చూస్తారే తప్ప గద్దర్‌ను పట్టించుకోరు. పెళ్లి ఊరేగింపుల్లో ఏ చుట్టరికం లేకున్నా కొందరు బ్యాండ్ మేళం ముందు నృత్యాలు చేస్తూ ఊరేగింపును కొంతసేపు ఆపుతుంటారు. కాసేపటికి వాళ్లను పక్కకునెట్టి ముందుకు సాగుతుంది ఊరేగింపు. గద్దర్‌కు ఇలాంటి స్థితి రావద్దనే కోరుకుందాం.
పల్లెల్లో గోసి గొంగడి- ఢిల్లీలో ప్యాంటూ షర్టూ ఎవరిని నమ్మించడానికో గాని ఈ మధ్య చేతిలోని కర్రకు ఎర్రగుడ్డతో పాటు నీలం రంగు గుడ్డ కడుతున్నాడు. లాల్ నీల్ నినాదంతో రాజ్యాధికారం సిద్ధిస్తుందని అనుకోవడం భ్రమే.
డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతానికి, మార్క్సు వాదానికి ఎలా పొసుగుతుందో మరి? బోడిగుండుకు మోకాలికి ముడి ఎలాపెట్టగలరో చూడాలి. కమ్యూనిస్టుల గురించి అంబేద్కర్ ఏమన్నాడో తెలిసిన వారు గాని, నిజమైన అంబేద్కర్ అనుయాయులు గాని ఈ ‘లాల్ నీల్’ నినాదానికి మోసపోరు. అది వేరే విషయం.
తనదైన శైలిలో జనాల్ని ఉర్రూతలూగించిన అద్ధుత గాయకుడు గద్దర్. ఆయన దరువు, బాణీ అనితర సాధ్యం. జరంజకం. తెలంగాణ ఉద్యమాన్ని తారస్థాయికి చేర్చడంలో ఆయన పాటలు ఉత్తేజాన్ని కలిగించాయి. కవిగా, గాయకుడిగా గద్దర్‌ను అంతా అభిమానిస్తాం.
ఇప్పుడు ప్రజల్లో ఓటు చైతన్యం కలిగిస్తానని ఆయన ముందుకొచ్చినందుకు సంతోషమే. అయితే చైతన్యం కలిగించాల్సింది బుల్లెట్ దారిలో పయనిస్తున్న వారికే గాని ఇప్పటికే బ్యాలెట్‌ను నమ్ముకున్న ప్రజలకు కాదు. ఈ విషయంలో గద్దర్ నిర్ణయం ఏమిటో?
లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నగదు నజరానాలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగిస్తున్నది. వారిపై ఉన్న క్రిమినల్ కేసులను ప్రభుత్వమే నీరుగార్చిన సందర్భాలు అనేకం. అయితే బతుకుదెరువు కోసమే తుపాకులు పట్టామని లొంగిపోయిన వారు చెప్పడం లేదు. వర్గశత్రు నిర్మూలన ద్వారా శ్రామిక నియంతృత్వాన్ని సాధించే లక్ష్యంతో మాత్రమే ఆ దారి పట్టామని చెప్పిన వారిని నజరానాలతో మార్చడం సాధ్యం కాదు. మార్క్సు సిద్ధాంతానికి కాలదోషం పట్టింది. 70 ఏళ్లు రష్యాలో- 50 ఏళ్లు చైనాలో కఠినంగా ఆ సిద్ధాంతాన్ని అమలు చేసినా రాజ్యరహిత సమాజం ఏర్పడలేదు. పైగా ఆ దేశాలన్నీ అథోగతి పాలయ్యాయి. అందుకే రష్యా, చైనా, తూర్పు యూరప్ కమ్యూనిస్టు దేశాలు ఆ సిద్ధాంతానికి తిలోదకాలిచ్చాయి. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు సాధిస్తున్న ప్రగతిని గురించి అవగాహన కలిగిస్తే మావోయిస్టుల్లో మార్పు రావచ్చు. అందుకు సిద్ధపడితే గద్దర్‌ను అభినందిద్దాం.

--మందాడి సత్యనారాయణ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)