సబ్ ఫీచర్

అంతర్జాలమాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక చిన్న ఆలోచనను వ్యాపార అవకాశంగా మలుచుకొని సంపద సృష్టించడం మహాగొప్ప విషయం. ఇది సేవా సంబంధిత వ్యాపారమే కావొచ్చు లేదా మరింత కష్టమైన విషయమే కావొచ్చు. కానీ కేవలం ఆలోచనకు పదునుపెట్టి దానినే పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించి, అనతికాలంలో అవిరళ కృషి చేసి అతిపెద్ద సంస్థగా అభివృద్ధి చేసి, అనంతమైన సంపదను సృష్టించి అనేకమందికి ఉపాధి కల్పిస్తున్న వారి విజయగాధలు అనేకం మనం చూస్తూనే ఉన్నాం. విదేశాల్లోనైతే మైక్రోసాఫ్టు , ఫ్లిప్ కార్ట్ డాట్ కామ్ , మింట్రా డాట్‌కామ్ , గూగుల్ , ఫేసుబుక్ , వాట్సాప్ , ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, అమెజాన్ డాట్ కామ్ , స్నాప్ డీల్, జస్ట్ డయల్ , మెసెంజర్... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో ఈ కోవకు చెందినవే. కేవలం మెదడులో మెరుపులాంటి ఆలోచనలతో అధిక సంపన్నులుగా మారిన దిగ్గజాలకు దక్కిన అవకాశాలు ఇన్ని అన్నీ అని చెప్పలేం. ఇందులో భాగంగానే చరవాణి (మొబైల్) మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి రోజుకో వింత ఆవిష్కరణలు , విభిన్న ఆకర్షణలు మనుషులను మంత్రముగ్దులకు గురిచేస్తున్నాయి .
ఒక వ్యక్తి ఒకచోట ఉండి మాట్లాడితే మరెక్కడో ఉన్న వ్యక్తికి విన బడుతుందన్న విషయం సామాన్య ప్రజానీకాన్ని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసేదే. దినదినాభివృద్ధి చెందే విధంగా ఎన్నోరకాల చరవాణి తయారీ కంపెనీలు, వివిధ రకాలైన నెట్ వర్కింగ్ సంస్థలు వెలిశాక మాములు ధరలకే సగటు మానవుడికి అవి అందుబాటులోకి వస్తున్నాయి . మొదట ఇంటికొక చరవాణి ఉంటే నేడు మనిషికి ఒక్కటి సరిపోవడం లేదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. చరవాణి దాని పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతూ, మనిషికి కావాల్సిన కనీసావసారాల్లో ఒకటిగా చేరిందనేది నమ్మశక్యం కాని విషయం.
గతంలో సమయాన్ని తెలుసుకునేందుకు గడియారాలు, వ్యాపార నిమిత్తం కాలిక్యులేటర్లు, ఉదయానే్న నిద్ర లేవడానికి అలారం వినిపించే గడియారాలు, ఉత్తర ప్రత్యుత్తరాల నిమిత్తం పోస్ట్‌కార్డులు, అత్యవసర సమాచారాన్ని పంపే టెలిగ్రామ్‌లు ఉండేవి. చరవాణి దెబ్బతో ఇవన్నీ కనుమరుగైపోయాయి . 2జీ , 3జీ , 4జీ నెట్ వర్కింగ్ లనేవి వెలిశాక స్మార్ట్ ఫోన్ల వినియోగానికి గిరాకీ పెరిగింది. స్మార్ట్ఫోన్లలో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అందుబాటులోకి వచ్చి ఒక మనిషి రోజులో అత్యధిక విలువైన సమయాన్ని ఈ ఫోన్లతోనే గడపడానికి దారి తీయడం చూస్తున్నాం.
దేశంలో జనాభాను మించి అధిక సంఖ్యలో ఫోన్లు ఉన్న దేశంగా భారత్ అవతరించింది. అత్యధికంగా అంతర్జాలాన్ని (నెట్) వినియోగించే వారి సంఖ్యలో ప్రపంచంలోనే భారతదేశం ప్రథమ స్థానాన్ని ఆక్ర మించిందంటే మన యువత చరవాణితో ఎలా మమేకమైపోతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సామజిక వెబ్ సైట్స్, వివిధ రకాలైన యాప్ లు అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలోని వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. నిరంతర చాటింగ్ , గ్రూప్ చాటింగ్ , కాల్స్ , కాన్థరెన్స్ కాల్స్ , వీడియో కాల్స్ , చర్చలు లాంటివి చరవాణితో చేయడం ఇప్పడు సర్వసా ధారణమైంది.
గ్రామీణ ప్రాంతాల వారు సైతం స్మార్ట్ ఫోన్‌లు వాడడం, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో అకౌంట్లు కలిగి ఉన్నారంటే వాటి వినియోగం ఏ రీతిలో ఉందో అవగాహన చేసుకోవచ్చు. గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో జరిగిన సంఘటనలను ఒకరోజు గడిచిన తర్వాత రేడియో ద్వారా, దినపత్రికల ద్వారా మరుసటిరోజు తెలుసుకునేవారు . కానీ నేడు ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా- కుగ్రామాలలో ఉన్నవారికి సైతం క్షణాలలో తెలిసిపోతోంది. అంటే అంతర్జాలం వినియోగం తో ప్రపంచమే ఒక కుగ్రామంగా తయారయ్యిందనడంలోని వాస్తవాన్ని గ్రహించాలి.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ల ద్వారా వివిధ రాజకీయ పార్టీలు అన్ని ప్రాంతాల ఓటర్ల వద్దకు వెళ్లగలికి, ప్రచారం చేసుకున్నాయ. సామాజిక మాధ్యమాన్ని దాదాపు అన్ని రాజకీయ పార్టీల వారూ జనంతో అనుసంధానం అయ్యేందుకు వినియో గించుకొంటున్నారు. గతంలో పెళ్లి సంబంధాల కోసం పెళ్లిళ్ల పేరయ్యలను కలిసేవారు లేదంటే మంచి సంబంధాలను చూడాలంటే కాళ్లకు చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ నేడు అలాంటి పరిస్థితులు లేవు. వివిధ రకాలైన పెళ్లిళ్లకు సంబంధించిన వెబ్‌సైట్స్‌లో మన ప్రొఫైల్ అప్‌లోడ్ చేస్తే దానికి తగిన సంబంధాలు దొరుకుతున్నాయి. వివిధ రకాల పోటీ పరీక్షలకు దరఖాస్తు చేయాలంటే బ్యాంకులలో డ్రాఫ్ట్ రూపంలో, చలాన్ల రూపంలో డబ్బులు కట్టి వాటితో మ్యానువల్‌గా దరఖాస్తు చేయడం ఒకప్పటి మాట. కానీ నేడు బ్యాంకు అకౌంట్ కలిగి అందులో డబ్బులుంటే చాలు ఇంట్లో కూర్చుని అన్ని పనులనూ చేసుకోవచ్చు . ఆన్ లైన్ షాపింగ్ ద్వారా ఇంట్లోనే ఉండి తమకు కావాల్సిన అన్నిరకాల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఆహార పదార్థాలను సైతం ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న యువత రోజులో అత్యధిక సమయాన్ని స్మార్ట్ ఫోన్లతో గడిపి మార్కెట్‌ను నడిపిస్తున్నారు. గనుక ప్రభుత్వం 2013 సంవత్సరాన్ని స్మార్ట్ ఫోన్ సంవత్సరంగా పేర్కొంది. గతంలో సెలబ్రిటీలు కనిపిస్తే చాలు ఆటోగ్రాఫ్‌లంటూ పేపర్, పెన్ను తీసుకోని అభిమానులు వెంటబడేవారు. నేడు సెల్ఫీల గోల మనకి తెలియనిదికాదు. పలు రకాల యాప్‌లు ఫోన్‌లో అందుబాటులో ఉండడం యువతను విశేషంగా ఆకట్టుకొంటోంది.
ఉత్తమ ఆండ్రాయిడ్ యాప్‌ల జాబితాను గూగుల్ గతంలో విడుదల చేయగా, ప్లే స్టోర్ లో లభ్యమయ్యే యాప్ లలో ఎన్నో ఉచిత యాప్‌లు నేడు అందుబాటులో ఉంటూ సగటు మానవుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో అనేక అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అనేకానేక సైబర్ నేరాల్లో అశ్లీల సాహిత్యం , బూతు చిత్రాలు, వ్యక్తిగత సమాచారం దొంగిలించడం, మార్పిడి బ్యాంకింగ్ మోసాలు వంటివి ఎక్కువగా ఉన్నాయి . అమెరికా, బ్రెజిల్, టర్కీ, చైనా , పాకిస్తాన్ , బంగ్లాదేశ్, అల్జీరియా, అరబ్ ఎమిరేట్స్ వంటి పలు ఐరోపా దేశాలు కేంద్రంగా కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరికీ తోచినట్లు వారు ఉపయోగించుకుంటున్నారు. దీనిపై ఎలాంటి అజమాయషీ, కట్టడి లేకుండా పోయంది.
స్మార్ట్ ఫోన్‌ల వాడకం, అంతర్జాల వినియోగంపై ఎలాంటి షరతులు లేకపోవడంతో ఎవరైనా వాడుకునే అవకాశం ఉన్నందున ఒకరిని చూసి మరొకరు వీటిని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు . ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్న కుటుంబాలకు చెందిన ఈ సంస్కృతి సోకింది. ఫోన్‌లో అంతర్జాల సౌకర్యం అనేది డబ్బుతో ముడిపడి ఉంది. స్మార్ట్ ఫోన్ కొన్నవాడు అందులో నెట్ బ్యాలెన్స్ వేసుకోవడం తప్పనిసరి కావడంతో ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నవారెందరో ఉన్నారు. అంతర్జాలం సౌకర్యాన్ని సరైన మార్గంలో వినియోగిస్తే మంచిదే కానీ , దేశంలో అత్యధికశాతం యువత కేవలం నిరుపయోగమైన వెబ్‌సైట్లతో కాలక్షేపం చేస్తున్నారు .
నిరంతర పరిణామ క్రమంలో భాగంగా పలు రంగాలలో శాస్ర్తీయ , సాంకేతిక అభివృద్ధిని చూసి సంతోషించాలో లేక వాటి బారిన పడి యువత చెడుమార్గంలో పయనిస్తూ వారి భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసు కుంటు న్నందుకు భాదపడాలో తెలియని పరిస్థితులు దాపురించాయి . తల్లి దండ్రులు ఎంతోకష్టపడి చదివించి, కోటి ఆశలతో ఎదురుచూస్తున్నందున వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఉండాలంటే యువత లక్ష్యాన్ని నిర్దేశించుకోని సమయాన్ని వృథా చేసుకోరాదు. ఏది అవసరం ? ఏది అనవసరం?? అనేది గుర్తించి అవసరమైన రీతిలో అంతర్జాలాన్ని వినియోగించుకుంటూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకొనేందుకు ప్రయత్నించాలి. ప్రభుత్వాలు సైతం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి, వారి శక్తి సామర్థ్యాలను తగిన స్థాయిలో ఉపయోగించుకోవాలి. అంతర్జాలం ద్వారా కలిగే ముప్పు నుండి నేటి యువతను కొంత మేరకైనా రక్షించడానికి పాలకులు ప్రయత్నిస్తే అది దేశానికే ప్రయోజనకరం.

-డా. పోలం సైదులు 94419 30361