సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధైర్యసాహసములకును స్వాతంత్య్రమునకును తోడిబాలురందెల్ల గదాధరుని జెప్పి మఱియొకని జెప్పవలయును. పసితనమునుండి సైతము పిఱికితనమననెట్టిదో, సిగ్గన నెట్టిదో, యాత డెఱుగడు. దృఢగాత్రుడును తేజో నిధియనగు నాతడు తాను న్యాయమని నమ్మిన విషయములలో నొకరి బెదిరింపులనెంత మాత్రము లక్షించువాడు కాడు. పెద్దలు వలదనినను తనయంతరాత్మ ధర్మమని తెల్పిన విషయముల నాతడు విడుచువాడు కాడు.
స్ర్తిల సౌశీల్యమునకు శుద్ధాంతవాసము- ‘ఘోషాపద్ధతి’- కేవల నిరుపయోగమని నమ్మి యాత డూరిలో పలుకుబడిగల వారల యెదుట తదాచారమును తృణీకరించెను. ధనియను కమ్మరయిల్లాలున కొకప్పుడు తాను చేసియుండిన వాగ్దానము ననుసరించి గదాధరుడు తన యుపనయన సందర్భమున నెవరెండ ప్రతిఘటించినను లక్షింప యామెకడ తన ప్రథమ భిక్షను గైకొనెను.
సత్యమునకు దర్మమునకునేగాని అర్థరహిత బాహ్యాచారములకు అంజలి ఘటింపని గదాధరుడు ఆ యూరి పూర్వాచార పరాయణులకు విప్లవకారునివలె దోచియుండవలయును. కాని ముముక్షుకోటికి జ్ఞానభిక్ష నొసగిన వానికి తొలిబిచ్చమిడిన యాధని యెంతటి ధన్యమో కదా!
ఐనను ఈ ‘బాల విప్లవకారుడు’ భక్తిప్రవత్తులు కొఱవడినవాడు కాడు. ఏలన బాల్యమునుండియు భగవద్భక్తియే యాతని జీవితలతకు ప్రధానాశ్రయమై యొప్పను. ఇంటిలో నిత్య దేవతార్చనమునందేమి, ఊరిలో జరుగు నీశ్వర సేవలందేమి, గదాధరుడెల్లప్పుడును అగ్రగణ్యుడై దీపించువాడు. బైరాగులనినను సన్న్యాసులనినను ఆతనికి అతి బాల్యమునుండియు పరమానందము. అవకాశము లభించినప్పుడెల్లా నాతడు వారితో స్వేచ్ఛగా సంభాషించుచు గలిసిమెలసి వర్తించుచుండెడివాడు. వయసు వచ్చినకొలది నాతని భక్త్భివములు ప్రస్ఫుటముకాజొచ్చెను. ఈశ్వర ధ్యాననిమగ్నుడై సాక్షాత్కారమున సంగమించు దివ్యభావములనాతడు వడయసాగెను. బాల్యజీవితమున నిట్టి మహోత్కృష్ట సంఘటనములలో ప్రధానమైనవి మూడు- వర్షాకాల మేఘములలముకొనిన నల్లని యాకసమున ముత్తెపుసరమును బోలు తెల్లని కొంగల బారును గాంచినప్పుడొకసారియు, ఊరిలో నాటకమున శివవేషము దాల్చినప్పుడు రెండవ తూరియు, తీర్థయాత్రాసమయమున ఈశ్వర సంకీర్తనము చేయుతఱి మఱియొక మాఱును గదాధరుడు అత్యుత్తమ సమాధిస్థితి ననుభవించెను. ఈ భక్త్భివములే క్రమముగా ఆతని కళాకౌలమును మూఢాచార నిరాసనమును బాల నాయకత్వము నతిక్రమించి యాతని గుణగణములను పరామాత్మానే్వషణమున పాదుకొల్పెను. ఆత్మసామ్రాజ్యమున నాతకు గడించిన యఖండ విజయములే మానవకోటి కాతని నాదర్శపురుషునిగా- యుగపురుషునిగా నొనర్చి మించినది.
***
- సాధన దశ -
శ్రీరామకృష్ణుని దివ్యత్వము
1855-వ సంవత్సరమున కలకత్తాలో దక్షిణేశ్వర వనమున రాణి రాసమణి యను నామె నిర్మించిన కాళికాలయము శ్రీరామకృష్ణు నఖండవ్యక్తిత్వ విజృంభణమునకు దిగిన వాతావరణము నొసగెను. (ఇంతటినుండి జగత్ప్రసిద్ధమైన శ్రీరామకృష్ణ నామమున గదాధరుని బేర్కొందము.) కాళీదేవియాలయమున ప్రధానర్చకుడైన యాతడు నిర్వహించుచుండిన నితయ పూజావిధులాతని యంతరంగమునందలి భర్త్యగ్నిని రగుల్కుల్పెను. బాహ్యలోకము నెఱుగని గాఢ ధ్యానమున, దివ్యసంకీర్తనమున నాతడు గంటలు గడవువాడు. మఱియు రాత్రులందు సమీపముననున్న చిట్టడవికి పోయి, భక్తికి బాహ్యవేషములేలయని కట్టుబట్టలను తుదకు జందెమును గూడ విసర్జించి, విశేష కాలము భగవద్ధ్యానమున గడుపుచుండువాడు. శ్రీరామకృష్ణునకు సన్నిహితుడగు హృదయ రాముడది గనిఱాళ్లు ఱువ్వి నిరోధింపజూచెను గాని భగవద్ధ్యాన నిమగ్నునకు బాహ్యావరోధము లెట్లు భీతిగొల్పగలవు? పూజావిధానమున బాహ్యాచారములు క్రమముగా సడలిపోవ, జగజ్జనని సన్నిహిత సంబంధమున మానసము నాక్రమింప, నాతడపూర్వరీతిని దేవి నర్చింపసాగెను.
ఇదియంతయు శ్రీరామకృష్ణుని యంతరంగమున జెలరేగుచుండిన భగవత్పరితాపబడబానలమునకు బాహ్య లక్షణము. తానర్చించు కాళికాదేవి ఆలయమునందలి కేవల నిర్జీవ శిలావిగ్రహమా, లేక సృష్టి స్థితిలయ కారిణియగు సాక్షాత్ పరమేశ్వరియా? అగుచో అల దివ్యమాత తనకేల దర్శనిమీయదు?... ఇట్టి పరితాపాగ్ని హృదయమును దహింప, సాక్షాత్కారము లేని జీవితము దుర్భరముకానాతడిట్లు ప్రార్థింపసాగెను. తల్లీ! ఒక దినము గడచిపోయినది. నాకింకను నీవు ప్రసన్నపు గావైతివిగదా!... అమ్మా! ఆనందమరుూ! నీకృపాకటాక్షమున నీవు నాకు సాక్షాత్కరింపక తప్పదు.’’ తీవ్ర భగవద్విరహ వేదనచే మొగము నేలనుబెట్టి రాచుకొన గాయములై నెత్తురు కాఱెడిది.
ఇంకావుంది...

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మెహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి