సబ్ ఫీచర్

తెలుగు బోధన అధ్వాన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాష అంతరించిపోతోందని గగ్గోలు పెట్టడం తప్ప అటు తెలుగు భాషావేత్తలు ఇందుకు సంబంధించి చికిత్సలు మాత్రం చేయటం లేదు. తెలుగు భాష బోధించేది ఎక్కడ అంటే పాఠశాల స్థాయిలోనే. పాఠశాల స్థాయిలో తెలుగు భాషాబోధన ఎంత అధ్వాన్నంగా ఉంటున్నదో తెలుసుకున్న నాధుడు లేనే లేడు. రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో తెలుగు భాషని ఎవరు ఎలా ఎటువంటి వారు తెలుగు బోధిస్తున్నారో తెలుసుకోవాలి. చాలామంది టీచర్లు తెలుగు చెప్పేవారు మొక్కుబడి పాఠంగానే చెబుతున్నారు. తెలుగు నేర్పే టీచర్లు ఉన్నప్పటికీ వారు తెలుగును తెలుగుగా నేర్పటం లేదు. ప్రస్తుతం మన విద్యాశాఖ తయారుచేసిన నియామకపు రూల్సు రెగ్యులేషన్ ద్వారా తెలుగు భాషకి ఉసురు తీస్తున్నాయి. తెలుగు టీచర్లుగా గతంలో ఓరియంటల్ కాలేజీల్లో చదువుకొన్నవారు మాత్రమే తెలుగు పండితులుగా నియమించేవారు. ఇపుడు తెలుగు పండితులు బదులు తెలుగు టీచర్లు వచ్చారు. చాలామంది తెలుగు టీచర్లుకి ఎలా బోధించాలో తెలీటం లేదు. వీరందరూ బి.ఏ. తెలుగు చదివి కరస్పాండెన్స్ కోర్సులో చదివి ఎలాగో అలా పని అయిందనిపించి ఉద్యోగాల్లో చేరి పద్యం- కవనం- వచనం వంటి వాటి తేడాలు తెలియని వారంతా తెలుగు టీచర్లు అయ్యారు. అంతేకాదు అల్పప్రాణం అంటేను, మహాప్రాణం అంటే తెలియనివారు అందరూ టీచర్లు అయ్యారు. మొక్కుబడిగా పాఠం అయిందనిపిస్తున్నారు. వీరికంటే బాగా చెప్పగల వారిని తయారుచేయగల కళాశాలలు మూతపడ్డాయా అనిపిస్తోంది.
రాష్ట్రాల్లో తెలుగు భాషకి జీవం పోసే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. తెలుగులో తెలుగు ఉపాధ్యాయ ఉద్యోగాలకోసం తెలుగు పండిట్ శిక్షణా కళాశాలలు అంటే తెలుగు ప్రాచ్య కళాశాలలని ప్రభుత్వం పోషించటం లేదు. తెలుగు భాషా ప్రాచ్య కళాశాలల్లో 5 సం.ల కాలం వరకూ తెలుగు భాషపై వివిధ రూపాల్లో అధ్యయనం చేస్తూ పాండిత్యాన్ని సంపాదించేవారు. ఈ బి.ఏ. తెలుగు చదివని తెలుగు టీచర్లుగా నూటికి 95% మంది తెలుగు టీచర్లే తప్ప తెలుగు పండితులు కారన్న సంగతి అధికారులకి అర్ధంకావటం లేదు.
మన తెలుగు భాషలు బోధించే టీచర్లు వారి అర్హతలు వారు చేసే బోధనకి ఎటువంటి ఎలిజిబిలిటీ లేనే లేదు. వీరు తెలుగు బోదించడానికి అర్హులు కానేకారు. అయినా గత 30 నుండి నలభై సంవత్సరాలుగా ఇదే తంతు జరుగుతోంది. ప్రభుత్వం నియామకాలు చేస్తున్నాం అనుకుంటున్నారే తప్ప వీరు ఈ ఉద్యోగానికి అర్హులా కారా అన్న సంగతి పట్టించుకోవటం లేదు. అర్హతలు గల టీచర్లు ఎంతమంది ఉన్నారో అన్న సంగతి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. అన్నీ తప్పుల తడకల విధానాల ద్వారా అధికారులు టీచర్లు ఉద్యోగాల్లో చేరి అటు ప్రభుత్వానికి ఇటు భావితరాల వారికి తెలుగు భాషకి తీవ్ర ద్రోహం చేస్తున్నారు. రాష్ట్ర అధికార భాషా సంఘం మొత్తం ఇన్ని సంవత్సరాలుగా అందినంత ఖర్చులు రాసి డబ్బులు పాడుచేయటమే తప్ప కేవలం ప్రాచ్య కళాశాలల అభ్యున్నతికి పాటుపడిన పాపాన పోలేదు. ప్రాచ్య కళాశాలల్లో బోధించే స్థాయిగల ఉపాధ్యాయులు అవసరం ఎంతో ఉంది. ఇప్పటికీ వందలాది సంవత్సరాల తెలుగు భాషా సాంస్కృతిక వారసత్వ వైభవం అంతా అంతరించిపోతుంటే బి.ఏ(తెలుగు) ఒక పార్టుగా చదివే టీచర్ల బోధనవల్ల భాష అభివృద్ధి చెందటం చాలా కష్టం. వీరి స్థాయి అందుకు ఏమాత్రమూ చాలదు. కొందరు టీచర్లు బోధన నిమిత్తం పాండిత్యం సంపాదించేవారూ ఉంటారు. అటువంటి వారికి ఔన్నత్యం ఎపుడూ ఉంటుంది.
భాషా వ్యాకరణం, శబ్ద రచన, పద్య రచన, అవధానం వంటి అన్ని అంశాలపై పూర్తిస్థాయి శిక్షణ గలవారు రస ఛంద అలంకార శాస్త్రాలని బాగా అధ్యయనం చేసిన వారికి మాత్రమే బోధించే శక్తి ఉంటుంది. చాలామంది ఏదో ఉద్యోగం, ఏ ఉద్యోగం రాలేదు ఇక ఏదారీ దొరకలేదని టీచరు ఉద్యోగం కోసం వచ్చి వారు తెలుగు టీచర్లయ్యారు. వీరికి బోధనాసక్తి భాషా పరిచయాసక్తి, భాషా ఉచ్ఛారణ రచనా, శిక్షణ, ప్రాచీన పద్య కావ్య పఠనం, బోధన, రచన అవగాహన తదితరాలపై పిల్లలకు చెప్పటం పరిచయం చేయటం వంటి వాటిపై అసలు ఏ ఆసక్తి ఉండటం లేదు. బాల బాలికలకు తెలుగు భాషలో ఉండే రసాస్వాదన పట్ల ఏమాత్రం ఆసక్తి రేకెత్తించకుండా ఆ తెలుగు ఉందిలే అనిపించి తెలుగులోనే తప్పులు వ్రాస్తూ తెలుగులోనే మాట్లాడటానికి అయిష్టత పెంపొందించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తెలుగు భాషని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పం కనక ఉన్నట్లయితే మొట్టమొదటగా..
1. ప్రాచ్య కళాశాలల్లో తెలుగు భాషాభివృద్ధిని తగిన వారిని ఏర్పాటుచేయాలి.
2. తెలుగు భాష అభివృద్ధికి భాషా నిపుణులుగా ప్రాచ్య కళాశాలల్లో 5 సం. ఇంటిగ్రేటెడ్‌గా చదివిన భాషా పండితులనే నియమించాలి.
3. యూనివర్సిటీలో బి.ఏ. తెలుగు అర్హతలపై తెలుగు పండిట్ నియామకాలకు అనర్హులుగా చేయాలి.
4. తెలుగు పండిట్‌గా నియామకాలకి ఓరియంటల్ ప్రాచ్య కళాశాలల అర్హతలనే అర్హతలుగా నిర్ధారించాలి.
5. తెలుగు భాష పాఠశాలల్లో ఎవరు ఎలా బోధిస్తున్నారో ప్రతి 6 నెలలకీ నిపుణులతో సమీక్షించాలి.
6. అన్ని పాఠశాలల్లో తెలుగు భాష తప్పనిసరి చెయ్యాలి. 1వ తరగతి లగాయితు 10వ తరగతి వరకూ తెలుగు విధిగా బోధించాలి.
7. తెలుగు బాగా చదవటం వ్రాయటం వంటి అంశాలపై తరచూ వర్క్‌షాపులు నిర్వహించాలి.
8. ప్రాచీన తెలుగు గ్రంథాలు, తెలుగు వాఙ్మయము, వ్యాకరణం, ఉచ్ఛారణ, పద బంధకోశం, నిఘంటువులు వంటి అన్ని అంశాలు ఉపాధ్యాయులకి తగినంత టీచింగ్ మెటీరియల్, కవులు, వారి చిత్రాలు, మెగజైన్‌లు వంటివి అందుబాటులోకి తేవాలి.
9. ‘తెలుగు’ రచనలు రచయితలు, కావ్యాలు వంటివి పాఠశాల స్థాయిలో పుస్తక పరిచయం, పఠనాసక్తి వంటివి రేకెత్తించాలి.
10. బాలల్లో తెలుగులో ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించే వారికి, బాగా తెలుగు బోధించి ప్రచారం చేసే ఏర్పాటుచేయాలి.
11. తెలుగు భాష ప్రచారం ప్రసారం కోసం రాజకీయాలకు మాలిన్యాలకు అతీతంగా తెలుగు భాషా ప్రచార సభ ఏర్పాటుచేసి పిల్లలకు పరీక్షలు కూడా నిర్వహించాలి.
ఇలా ప్రచారం ప్రసారం చేస్తే కొంతవరకైనా తెలుగు ప్రచారం జరిగి పూర్వవైభవం వస్తుంది. ఇందులో రూపాయికి బొమ్మబొరుసువలే చిత్తశుద్ధి/ నిస్వార్థ బుద్ధి ఉండాలి. అపుడే విజయం సాధ్యం అవుతుంది.

- నడకుదుటి నాగ గాయత్రి