సబ్ ఫీచర్

అందుకే.. కేసీఆర్‌కు జన హారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికార పార్టీ ఆత్మవిశ్వాసంతో ఎన్నికల పోరులో అడుగుపెట్టి, మళ్లీ అఖండ మెజారిటీతో గెలిచిందంటే- కచ్చితంగా ఆ ప్రభుత్వం ప్రజలకు మేలుచేసినట్టు, సమర్ధవంతమైన పాలనను అందించినట్టు మనం భావించి అభినందించాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ అధికార పార్టీనే భారీ మెజారిటీతో ఓటర్లు గెలిపించడం ఈ విషయానే్న నిరూపిస్తున్నది. ఏ పార్టీ ఎలాంటిదో, ఏ నాయకుడు ఎలాంటివాడో ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. వట్టి మాటలేవో, గట్టి మాటలేవో.. ఊకదంపుడు ఎన్నికల ప్రచారాలేవో.. హృదయంలోనుంచి వచ్చే వాగ్దానాలేవో వాళ్ళకు పక్కాగా తెలుసు. నిశ్శబ్దంగా ఉంటూనే పోలింగ్‌లో తమ ప్రతాపాన్ని ఓటర్లు నిరూపిస్తారు. తెలంగాణ ఎన్నికల్లో అదే జరిగింది. కేసీఆర్‌ని ఓడించటానికి కూటములు కట్టి కొందరూ, ఢిల్లీ అధిష్ఠానాధిపతులను సైతం ప్రచార వేదికల మీదికి దింపి మరికొందరూ విశ్వప్రయత్నం చేశారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆవేశపూరిత ప్రసంగాలకు, కేసీఆర్‌ని, మోదీని కలిపి తిట్టిన తిట్లకు జనం చప్పట్లు చరుస్తుంటే అదంతా నిజమని నమ్మి అప్పుడే గెలిచేసినట్లు తెగ సంబరపడిపోయాడు. నిజానికి వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారసభలకు, రోడ్‌షోలకు తండోపతండాలుగా జనం రావటానికి తరతమ భేదాలు అంటూ ఉండవు. ప్రజలు అన్ని పార్టీల సభలకూ వెళ్తారు... అందరు చెప్పే మాటలూ వింటారు.. కానీ ఓట్లుమాత్రం నిశ్శబ్దంగా వేస్తారు.
కేసీఆర్‌కు కాస్త కోపం ఎక్కువే అయినా.. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారంటూ ప్రత్యర్థుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినా, ఒక్కోసారి తెలంగాణ యాసలో మాట తూలినా.. ప్రజల మీద ఆయన వ్యక్తం చేసే ప్రేమ, తెలంగాణ మీద ఆయనకు ఉన్న అభిమానం, ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలూ ఆయనలోని మంచి వ్యక్తిని ప్రజలు గుర్తించేలా చేసాయి. ‘మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటా.. మీ కాళ్ళు కడుగుత... తిండికి, తాగే నీళ్ళకు కరువులేకుండా చేస్త! అందరూ ఆత్మగౌరవంతో బతకాల’- అంటూ సాగిన కేసీఆర్ మాటలకు ఓటర్లు ఫిదా అయిపోయారు.
కేసీఆర్‌లో ఒక మంచి పరిపాలకుడే కాదు, ఒక విద్యావంతుడు, ఒక కవి, ఒక గాయకుడు, మంచి వక్త ఉన్నారు. పెద్దల పట్ల, గురువుల పట్ల, తెలంగాణ పట్ల ఎంతటి భక్తిగౌరవాలతో వినయ విధేయతలతో ఆ యన ఉంటాడో తన ప్రత్యర్థుల పట్ల, తనపై కుట్రలు చేయాలని చూసిన వాళ్ళపట్ల ‘చండశాసనుడు’ అన్నట్లుగా ఉంటాడు. ఒక వ్య క్తిలో బహురూపాలు ఉం డటం కేసీఆర్ వ్యక్తిత్వంలోని ప్రత్యేకత. అది అనితర సాధ్యం.
తెలంగాణ ప్రజలు కష్టజీవులు, కల్లాకపటం తెలియని అమాయక జీవులు. బడు గు, అట్టడుగువర్గాలవారే ఇక్కడ ఎక్కువ. కేసీఆర్‌ని ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ‘దొర’ అని, ‘ఇది దొరల పాలన’ అనీ ఎద్దేవా చేస్తారు. గానీ కేసీఆర్ మాత్రం- ‘నేను ఒక రైతుని.. పేదల జీవితాల్లోని సాధక బాధకాలు నాకు తెలుసు’ అం టాడు. అందుకే ఆయన ఆహార్యం, హావభావాలూ, ఆప్యాయత ఉట్టిపడే అచ్చ తెలంగాణ యాస.. అన్నీ- ‘ఆయన మనలాంటి ఒక సామాన్యుడే.. మనకు దగ్గరివాడు’ అనిపించేలా చే స్తాయి. జనానికి కావల్సింది అదే. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ప్రతిక్షణం ప్రజలకు దగ్గరిగా ఉంటూ కష్టంలో, నష్టంలో ‘మీకు నేనున్నాను. నా పిల్లల్లా మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాను. మీకు ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి గింజలు, తాగటానికి నీళ్ళు ఇస్తాను’ అనేవాడు అయి ఉండాలి. కేసీఆర్ ఇవన్నీ జనానికి ఇచ్చాడు. ఇవే కాదు పొలాలకు నీళ్ళిచ్చాడు.. పెంచుకోవటానికి గొర్రెలు, చేపపిల్లలు ఇచ్చాడు. ఇంటింటికీ విద్యుత్ వెలుగులను ఇచ్చాడు. జనం అడగకుండానే కంటి వెలుగును, ఆడపిల్లలకు పెళ్ళి ఖర్చులను, బాలింతలకు కిట్‌లను ఇచ్చాడు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముందుముందు చెవి, గొంతు, దంత చికిత్సలు వంటివి కూడా ఉచితంగా చేయించి తన సేవాకార్యక్రమాలను ఇంకా విస్తృతం చేస్తానంటున్నాడు.
ప్రజలకు తమ కనీస అవసరాలు తీర్చగలిగే.. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించే నాయకుడు కావాలి. అలాంటి వాడికే పరిపాలనా బాధ్యతలు అప్పచెబుతారు. ఒకసారి కాదు.. పదే పదే అలాంటి నేతకే ఓట్లేసి ‘నువ్వే మా రాజువి’ అంటారు. అంతేగానీ మార్పుని కోరుకోరు. అంత మంచి ప్రభుత్వాన్ని కాదని తమ వేళ్ళతో తమ కంట్లోనే పొడుచుకోవాలని అనుకోరు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో అలాగే జరిగింది. కేసీఆర్ అన్నట్టు తాజా ఎన్నికల్లో ఓటర్ల తీర్పు తెలంగాణ ప్రభుత్వ బాధ్యతలను మరింత పెంచింది. ‘ఈ గెలుపు తెలంగాణ ప్రజల గెలుపు. ఇది మాకు గర్వాన్ని, అహంకారాన్ని తెచ్చిపెట్టకూడదు. ప్రజల నమ్మకాన్ని మళ్లీ మళ్ళీ నిలబెట్టుకునేలా ఇంకా బాధ్యతాయుతంగా మేము ఉండాలి’ అని కేసీఆర్ అనటం ఆయన వ్యక్తిత్వానికి మరో మచ్చు తునక.

-డా. కొఠారి వాణీచలపతిరావు 98492 12448