సబ్ ఫీచర్

సర్గుజా ‘రాజు’ సాధారణ పౌరుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛ త్తీస్‌గఢ్ అనగానే మావోయిస్టులు గుర్తుకొస్తారు. ఆ రాష్ట్రంలోని అబూజ్‌మాడీ అటవీ ప్రాంతాన్ని ‘‘విముక్తి ప్రాంతం’’గా చేసుకుని సమాంతరంగా జనతన సర్కారు నడుపుతున్నారని వినికిడి. సామ్రాజ్యవాదుల పెట్టుబడిదారుల, దళారి- బూర్జువా వర్గాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతోందని ఆదివాసీల చేత మావోయిస్టులు అసహజ రీతిలో చెప్పిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బిజెపి నాయకత్వంలోని రమణ్‌సింగ్ ప్రభుత్వం గద్దె దిగింది. కాంగ్రెసు నాయకత్వంలో భూపేశ్ బఘేల్ ప్రభుత్వం ఏర్పడింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రేసులో త్రిభువనేశ్వర్ శరణ్‌సింగ్ దేవ్ కూడా కొనసాగారు.
టి.ఎస్.సింగ్ దేవ్ సాధారణ వ్యక్తికాదు, ఆయన సర్గుజా సంస్థానం రాజు. సర్గుజా సంస్థానానికి 118వ వారసుడు. అంబికాపూర్ రాజధానిగా తమ పూర్వీకులు రాజ్యమేలారు. ఇప్పటికీ వారి ప్యాలస్ చెక్కుచెదరకుండా హుందాగా కనిపిస్తోంది. వందల కోట్ల రూపాయల ఆస్తికి ఆయన వారసుడు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యంగా అంబికాపూర్ పరిసర ప్రాంత ప్రజల ప్రేమను, గౌరవాన్ని చూరగొన్న విద్యాధికుడు. మొన్నటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రజల్లో సచ్ఛీలుడు మర్యాదస్తుడన్న పేరున్నది. వందల కోట్ల రూపాయల ఆస్థికి వారసుడైనా ఆయన వివాహం చేసుకోలేదు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. 1983లో ఆయన అంబికాపూర్ పురపాలక సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికై ఆ పట్టణానికి సేవలందించారు. 2008 సంవత్సరంలో అంబికాపూర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2013 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ అంబికాపూర్ నుంచి గెలిచారు.
సింగ్‌దేవ్ ఛత్తీస్‌గఢ్ గూర్చి పూర్తిగా తెలిసిన వ్యక్తేగాక ఆయన అనేక దేశాల్లో పర్యటించి అక్కడి ప్రజల జీవన విధానాన్ని పాలనా పద్ధతులను అధ్యయనం చేశారు. అందులో భాగంగా ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్లిట్జర్లాండ్, ఇటలీ తదితర దేశాల్లో పర్యటించారు. ఎంతో సుసంపన్నమైన జ్ఞానం- అనుభవం ఉన్నా అతి సాధారణ వ్యక్తిగా ప్రజల్లో ఒకనిగా వ్యవహరించడంవల్ల ఆయన అంటే ప్రజల్లో ఆరాధనా భావం ఏర్పడింది. అన్ని సెక్షన్ల ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలని కోరుకున్నారు. కాని తృటిలో ఆ అవకాశం చేజారింది. భూపేష్ బఘేల్‌కు ఆ అవకాశం దక్కింది. 67 సంవత్సరాల సింగ్‌దేవ్ సోషల్ మీడియాలోనూ చురుగ్గా కనిపిస్తారు. తన ఆలోచనలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో ఆయన పట్ల గౌరవముంది. సచ్ఛీలుడన్న భావన కొనసాగుతోంది. రాజకీయాల్లోనేగాక ఆదివాసీ ప్రజల్లో ఒకనిగా ఒదిగిపోయి సంప్రదాయ డోలు వాయిస్తూ ఆయన నాట్యం చేస్తారు.
సర్గుజా సంస్థానంలా ఛత్తీస్‌గఢ్‌లో ఇంకా అనేక సంస్థానాలున్నాయి. ఆయా సంస్థానాల రాజుల వారసులు ఇప్పటికీ ప్రజల అభివృద్ధి- సంక్షేమంకోసం కృషిచేస్తున్నారు. ప్రజలకు ఏ అవసరముందో తెలుసుకుని దాన్ని సమకూర్చే పనుల్లో ఉన్నారు. అలాంటి అనేకమంది రాజ వంశీయుల పట్ల అక్కడి ప్రజలు ఎంతో గౌరవం చూపుతున్నారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు.
ఇక్కడే మావోయిస్టులు చెప్పే ‘వైరుధ్యాలు’ చెల్లకుండాపోతున్నాయి. ఇప్పటికీ రాజు వంశాల వారులను ప్రజలు ప్రేమిస్తున్నారంటే, గౌరవిస్తున్నారంటే వారిపట్ల విధేయత కనబరుస్తున్నారంటే మావోయిస్టుల ‘వర్గ వైషమ్యాలు’, అంతస్థుల తేడాతో ఘర్షణ తలెత్తి పోరాటాల రూపం తీసుకుంటుందన్న విశే్లషణ- సిద్ధాంతీకరణ చెల్లుబాటుకాని నాణెం అని తేటతెల్లమవుతోంది. దీని ఆధారంగా గత ఎన్నికల్లో కాంగ్రెసు నాయకత్వాన్ని ఖతం చేసినా ఒరిగింది ఏమిటి? ఏమీలేదని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మాడో, సుకుమా, బీజాపూర్ తదితర ప్రాంతాల్లో మావోలు ఆదివాసీలతో దళాలు నిర్మించి, సాయుధ దాడులు కొనసాగిస్తూ పాఠశాల భవనాలను, సెల్ టవర్లను ధ్వంసంచేస్తూ, రోడ్డు నిర్మాణాలను అడ్డుకుంటూ, ఆ పనులకు కాపలా ఉన్న సిఆర్‌పిఎఫ్ జవాన్లను పెద్దసంఖ్యలో హతమార్చడం, ఆదివాసీల పరిధిలోకి రాని బూర్జువా, సామ్రాజ్యవాద, పెట్టుబడిదారి- దళారి వర్గాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతోందని, కారల్‌మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో లాంటి నాయకులు చూపిన మార్గం తమకు శిరోధార్యమని చెప్పిస్తూ, ఆదివాసీల చేత ఎర్రజెండా పైకెత్తిస్తే అదెలా వర్తమాన పరిస్థితులకు అనుకూలమైన వైఖరి అనిపించుకుంటుంది? పెట్టుబడిదారి- దళారి- సామ్రాజ్యవాదంలోని సంక్లిష్టత, వాటి నిర్వచనాలు, వాటి ఉత్థాన పతనాల గూర్చి ఏ మాత్రం అవగాహన లేని ఆదివాసీల చేత ఈ మాటలను పలికించినంత మాత్రాన గొప్ప చైతన్యం విస్తరించినట్టవదు. కాని మావోయిస్టులు మాత్రం ఆ పదజాల విస్తరణ, ఉచ్ఛరణ గొప్ప విప్లవంతో సమానమని సంబరపడటం విడ్డూరంగాక ఏమవుతుంది? ఆదివాసీల సామాజిక- ఆర్థిక- సాంకేతిక, నైపుణ్యాల శక్తి ఎంత? వాటి ద్వారా ప్రపంచ చలనగీతిని ప్రభావితం చేసే అవకాశాలున్నాయా? ప్రస్తుతం ప్రచులితమవుతున్న భావజాలాన్ని, పనివిధానాన్ని దండకారణ్య ఆదివాసీల కార్యాచరణ, నడక మార్చగలదా? లేదన్న సంగతి ఛత్తీస్‌గఢ్ ప్రజలకు తెలుసు. అందుకే ఈసారి రమణ్‌సింగ్ సర్కారును గద్దెదింపి కొత్త ప్రభుత్వాన్ని గద్దె నెక్కించారు. ఈ విజ్ఞత ప్రదర్శించిన ఆ రాష్ట్ర ప్రజలు ప్రధాన స్రవంతిలో చేరి, ప్రపంచ పరిస్థితులను అర్థంచేసుకుని అడుగులువేసే క్రమం కనిపిస్తోంది. బస్తర్ ప్రాంతమంతా మావోయిస్టుల కంచుకోట అన్న వాదన పూర్తిగా నిరాధారమని ఆ ప్రాంతంనుంచి గెలిచిన కాంగ్రెసు శాసనసభ్యులే రుజువు చేశారు.
మావోయిస్టులు ఏ ఆదివాసీలపై, బడుగు, బలహీన వర్గాలపై నమ్మకంతో దశాబ్దాలుగా సాయుధ బాట పట్టారో వారే ఇప్పుడు భూపేన్ బఘేల్‌ను గద్దెనెక్కించారు. బస్తర్ ప్రాంత ఆదివాసీలు కాంగ్రెసు అభ్యర్థులను గెలిపించారు. మెజార్టీ స్థానాలు గెలిచినవారు తమ నాయకుని ఎన్నుకున్నారు, కాంగ్రెసు అధిష్టానం ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రైతులకు-పేదలకు, బలహీనులకు మేలు జరగ గలదని విశ్వసిస్తున్నారు. ఇచ్చిన అనేక హామీలను కాంగ్రెసు పార్టీ అమలుచేయగలదని నమ్ముతున్నారు. ఆ విధంగా ఎంతోకొంత మేలు జరగగలదని ఆశిస్తున్నారు.
కాని మావోయిస్టులు మాత్రం తుపాకి గొట్టం ద్వారా, సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం దక్కుతుందని దశాబ్దాలుగా ఆశలు రేపుతూ అరణ్యాలను యుద్ధ్భూమిగా మార్చారు. అటు మావోయిస్టులు- ఇటు పోలీసుల మధ్య సామాన్య ఆదివాసీలు నలిగిపోతున్నారు. తమ జీవితాలు ఛిద్రమవుతున్నాయని వాపోయేవారి సంఖ్య గణనీయంగా ఉంది. అమాయకమైన ఆదివాసీలెందరో ఈ ఘర్షణలో కన్నుమూశారు. యువకులు తమతమ గ్రామాలను వదిలి పక్షుల్లా వలసబోతున్నారు. ముసలి-ముతక గూడాలలో జీవచ్ఛవాలుగా పడి ఉన్నారు. పేదల పట్ల ప్రేమ, అణగారిన ప్రజల పట్ల ఆర్తిగలవారు చేసే కార్యక్రమం ఇలాఉంటే వర్తమాన డిజిటల్ సమాజంలో ఆదివాసీలు, ప్రజలు ఎలా ఉజ్వల భవిష్యత్ వైపు పయనిస్తారు?
కాలం చెల్లిన సిద్ధాంతాలకు ప్రాణప్రతిష్ట చేయాలని భావించి, సాయుధ పోరాటం ద్వారానే సోషలిజం సాధ్యమవుతుందన్న భ్రమల్లో ఉంటూ ప్రజలను ఇలా అనాలోచితులను చేయడం దారుణం. సంపద సృష్టితీరు మారింది. కేవలం భూమి ఆధారంగానే సంపద సృష్టిజరగడం లేదన్న సంగతి ప్రపంచమంతటా కనిపిస్తున్నా, టెక్నాలజీ అన్ని రంగాలలోకి చొరబడి ‘మేధ’కు పెద్దపీట వేస్తున్న తరుణంలో ఈ నగ్నసత్యాన్ని గమనంలోకి తీసుకోకుండా, మేధోశక్తికి వర్గంతో సంబంధంలేదని శతాబ్దాలుగా రుజువుతున్నా ఇంకా మావోయిస్టులు ‘రెండువర్గాల సిద్ధాంతాన్ని’ ఆధారం చేసుకుని ఆలోచించడం, వర్గరహిత సమాజంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న అంధ విశ్వాసంతో మందుపాతరలతో చెలరేగి పోవడం వికృతచేష్ట తప్ప మరొకటి కాదు. మావోయిస్టులు పేర్కొనే ‘‘వర్గరహిత సమాజం’’ ఏర్పడటం అసంభవం. అది మానవుని ఆకాంక్షలకు- జ్ఞానానికి- సహజాతాలకు వ్యతిరేకం. సాధికారత సాధించగలరు తప్ప సోషలిజం ఎన్నటికీ సాధ్యంకాదు. అది ‘‘మానవుని ఆవరణం’’లో లేని అంశం. అలాంటి అంశాన్ని పట్టుకుని దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్‌లో మానవ హననానికి పూనుకోవడం అజ్ఞానం తప్ప మరొకటి కాదు. ఛత్తీస్‌గఢ్‌లో సర్గుజారాజుసింగ్‌దేవ్ ప్రజాస్వామ్యంలో ఓ సాధారణ వ్యక్తిగా జీవిస్తుండగా ఇక రెండు వర్గాల సిద్ధాంతానికి ‘మాన్యత’ ఎక్కడిది?

-వుప్పల నరసింహం 99857 81799