సబ్ ఫీచర్

మావోలకు పట్టని రెండంకెల వృద్ధి రేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ఆర్థిక వృద్ధి రేటు 9-10 శాతం సాధించాలని, 2022-23 సంవత్సరం నాటికి రూ.28 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ‘నీతి ఆయోగ్’ ఇటీవల వ్యూహపత్రాన్ని ప్రకటించింది. దేశం ఇప్పుడొక సంధియుగంలో ఉందని, గతంలో కోల్పోయిన అవకాశాల్ని సరిదిద్దుకునే సమయమిదని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అభిప్రాయపడ్డారు. 1991 సంవత్సరంలో ప్రారంభించిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని, ఆ విధానం పటిష్టపడుతోందని దీనివల్ల ప్రజలు దారిద్య్రం నుంచి బయటపడి మెరుగైన జీవితాల్ని గడిపేందుకు వీలుందని నిపుణులు భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 2.7 లక్షల కోట్ల డాలర్లు ఉండగా, 2022-23 సంవత్సరం నాటికది 4 లక్షల కోట్ల డాలర్లుగా ఎదగాలన్న లక్ష్యాన్ని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. వ్యవసాయం, కార్మిక రంగం, రైల్వే, బ్యాంకింగ్, గృహనిర్మాణం తదితర రంగాలలో అందుకోవలసిన నూతన ఎత్తులను ఈ వ్యూహపత్రంలో పొందుపరిచారు.
1978లో చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనాయి. ఈ నలభై ఏళ్ళలో ఆ దేశం అందనంత ఎత్తుకు ఎదిగింది. అక్కడ కమ్యూనిస్టు పార్టీ నియంతృత్వం కొనసాగుతున్నా అభివృద్ది అనూహ్యంగా పెరిగింది. భారతదేశంలో 1991 సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కారణంగా ఇతర అనేక అడ్డంకుల కారణంగా స్థూల జాతీయోత్పత్తి అనుకున్నంత పెరగడంలేదు. దాంతో ఆశించిన రీతిలో ప్రజలు దారిద్య్రంనుంచి బయటపడలేకపోతున్నారు. ఇపుడు దీన్ని అధిగమించడానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగమే నీతి ఆయోగ్ వ్యూహపత్రం. వృద్ధి రేటును దాదాపు 10 శాతానికి తీసుకెళ్ళే ప్రయత్నం ఎన్నదిగింది. చైనా రెండంకెల వృద్ధి రేటును ఎప్పుడో సాధించింది. భారత్ మాత్రం ఇంకా ఆపసోపాలు పడుతోంది. ఆ వృద్ధిని సాధించడానికి ఇంకో దశాబ్దకాలం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. చైనాలో సంస్కరణలు ప్రవేశపెట్టిన పుష్కర కాలానికి భారత్‌లో అలాంటి సంస్కరణలు తీసుకురావడంతోపాటు అనేక ఆటంకాలు ఎదురుకావడం సంప్రదాయవాదులు అడ్డుకట్టలు వేయడం కారణంగా వృద్ధి రేటు ‘సింగిల్ డిజిట్’లోనే ఇంకా కొనసాగుతోంది.
ఉపగ్రహాలు
భారత అంతరిక్ష సంస్థ ‘ఇస్రో’ అంతరిక్షంలోకి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెడుతోంది. కమ్యూనికేషన్ల కోసం, ఇతర అవసరాల కోసం వీటిని పంపుతున్నారు. అలాగే సైనిక అవసరాల కోసం కొన్నింటిని ఇస్రో పంపింది. ఆ రకంగా అమెరికా, రష్యా, చైనాల తరువాత భారతదేశ ఉపగ్రహాలు అంతరిక్షంలో ఎక్కువ తిరుగుతున్నాయి, సేవలు అందిస్తున్నాయి. 21వ శతాబ్దపు పోరాట యుద్ధ రీతుల్లో కీలకమైన నెట్‌వర్క్ ఆధారిత పోరాట సామర్థ్యాలను ఈ ఉపగ్రహాలు సమకూర్చుతున్నాయి. తాజాగా జీ-శాట్7ఏ ఉపగ్రహం భారత వైమానిక దళానికి కొండంత అండగా నిలుస్తుందని భావిస్తున్నారు. ‘ఇండియన్ యాంగ్రీబర్డ్’గా పిలుస్తున్న ఈ ఉపగ్రహం నెట్‌వర్క్ కేంద్రీకృత కార్యకలాపాలకు ఉపయుక్తంగా నిలుస్తోంది. ఒక భద్రమైన నెట్‌వర్క్‌కు ఇది దోహదపడుతోంది.
డ్రోన్ల వినియోగంలోనూ ఈ సాంకేతికత సాయపడనున్నది. రాడార్ కేంద్రాలు, వైమానిక స్థావరాలను ఈ ఉపగ్రహాలు అనుసంధానించనున్నాయి. సంకేతాలు అందని మారుమూల ప్రాంతాలలో ఇంతకాలం పడిన బాధలనుంచి ఇపుడు ‘విముక్తి’ లభించనున్నది. ప్రపంచంలో ఎక్కడైనా మరింత మెరుగైన రీతిలో తమ ‘ఆపరేషన్ల’ను నిర్వహించడానికి ఇపుడు సాధ్యమవుతుంది. సమన్వయం మరింత సులువవుతుంది. నిఘా కోసం గరిష్ఠంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం పనికొస్తుంది. పాకిస్తాన్ లాంటి శత్రుదేశాల ఆటలు కట్టించేందుకు ఇపుడు మరిన్ని జవసత్వాలు ఒనగూరాయి. దేశ అంతర్గత అవసరాలకోసం సైతం దీన్ని ఉపయోగించుకోనున్నారు. వామపక్ష తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి సైతం ఈ నిఘా నేత్రం ఎంతో సమర్థవంతంగా పనిచేయనుంది.
కాల్పనిక సాహిత్యంలో చదువుకున్న రీతిలో ‘స్టార్‌వార్స్’ లాంటి యుద్ధ రీతులను సైతం ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్న ఈ సాయుధ బలగాలను ఓడిస్తామని, దేశ ఆర్థిక వృద్ధి రేటుకు అడ్డుకట్ట వేసి ప్రస్తుత పాలకుల నడ్డి విరుస్తామని, ఎర్రకోటపై ఎర్రజండాను 2050 సంవత్సరానికల్లా ఎగురవేస్తామని మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నం విడ్డూరంగా తోస్తోంది. ఆర్థిక వనరులను, మానవ వనరులను పెద్దఎత్తున ఆ ‘పగటికల’ కోసం ఖర్చుచేయడం నిజంగా దారుణం. ప్రజల్ని దారిద్య్రం నుంచి ఎలా బయటపడేయాలో ఆలోచించకుండా తమకు ‘రాజ్యాధికారం’ ఎలా దక్కుతుందా?.. అని బుర్రబద్ధలు కొట్టుకోవడం విడ్డూరంగాక ఏమవుతుంది?
టెస్లా ఆవిష్కరణలు
అమెరికాలోని ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ సంస్థ అనేక ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తోంది. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించి వేగంగా ప్రయాణించడానికి వీలుగా హైస్పీడ్ సొరంగ మార్గానికి ఈ సంస్థ శ్రీకారం చుట్టింది. లాస్ ఏంజిల్స్‌లో ఇటీవల భూమి ఉపరితలానికి 30 అడుగుల కింద సొరంగంలో హైస్పీడు కారులో ప్రయాణించారు. టెస్లా ఎలక్ట్రిక్‌కారు అందులో గంటకు 64కి.మీ వేగంతో ప్రయాణించింది. ట్రాఫిక్ సమస్యలు అసలే లేవు. ఇది ఇలా వుంటే ఒక ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణించినట్టు భూమి నుంచి వివిధ గ్రహాలకు వెళ్లి వచ్చేందుకు వీలుగా అంతరిక్ష యాత్రికుల కోసం ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్-ఎక్స్ సంస్థ అనేక ప్రణాళికలను సిద్ధం చేసింది. అంగారక గ్రహంపైకి సైతం మనుషులను తీసుకెళ్లి తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. కొన్ని సంవత్సరాల్లో ఈ‘కల’ నెరవేరగలదని భావిస్తున్నారు. ఈ విప్లవాత్మక ప్రయాణానికి రంగం సిద్ధమవుతోంది. ఇక సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో కొనసాగుతున్న విప్లవాత్మక పరిణామాలకైతే లెక్కే లేదు. పాఠశాల విద్యార్థులు సైతం వివిధ కంపెనీలను స్థాపించి వాటి సిఈఓలుగా వ్యవహరిస్తున్నారు. అనేక నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నారు. కుబేరులవుతున్నారు. భారతదేశంలోనూ అలాంటి బాలురు ఉండటం విశేషం. ఇట్లా ప్రపంచం ఓ సరికొత్త
కక్ష్యలో పయనిస్తోంది. అన్ని రంగాలు అనూహ్యంగా రూపాంతరం చెందాయి. ఇంకా ఆ మార్పు కొనసాగుతూ ఉంది. విద్య వేయిరకాలుగా వికసించింది. మానవ మేధస్సు లక్ష రంగాల్లో రాణిస్తోంది. కృత్రిమ మేధ అవసరమైన చోట మానవునికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తోంది. గతంలో ఈ వెసులుబాటు లేదు.
ఈ వౌలిక తేడాను, వ్యత్యాసాన్ని మావోలు పరిగణనలోకి తీసుకోకుండా, సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేయకుండా ముతకధోరణిలో ఒక అవగాహనకొచ్చి ఇదే అంతిమం.. ఇదే సర్వస్వం అంటూ సంబరపడటం పూర్తిగా కాలం చెల్లిన విధానం. సమాజం గిరిగీసిన చట్రంలో ఒదిగిపోయే రోజులు పోయాయి. విశాల విశ్వం అంచులను తాకాలనే తాపత్రయం పెరుగుతున్న తరుణంలో అనేక ఆవిష్కరణల అనంతరం ఇంకా ఎన్నో మిగిలే ఉన్నాయన్న భావన ప్రతిక్షణం వెంటాడుతున్న సందర్భంలో తదనుగుణమైన ‘కాలపరీక్ష’లో నెగ్గాలన్న పట్టుదలతో యువత పనిచేస్తున్న దృశ్యం అంతటా కనిపిస్తుండగా ఈ తేజోవంతమైన ప్రక్రియను పక్కన పెట్టేందుకు, దాన్ని ‘నెగేట్’ చేందుకు దండకారణ్యంలో మావోయిస్టులు ప్రయత్నించడం పవిత్రమైన కార్యంగా కనిపిస్తోందా? ప్రజలను పక్కతోవ పట్టించడంగా అనిపిస్తోందా?.. చాలా కాలం క్రితం తిరస్కరించిన సిద్ధాంతాలకు భారతదేశంలో ప్రాణప్రతిష్ట చేస్తామని మావోలు నెత్తుటి హోలి ఆడటం సమంజసంగా వుందా?

- వుప్పల నరసింహం, 9985781799