సబ్ ఫీచర్

అనైతిక పొత్తులు ప్రశ్నార్థకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అత్యంత ప్రమాద పరిస్థితిలో ఉంది కాబట్టి మనం కలసికట్టుగా జాతిని దేశాన్ని రక్షించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెదేపా అధినేత చంద్రబాబు ఆమధ్య యుగళగీతం ఆలపించారు. బద్ధ శత్రువులైన కాంగ్రెస్, తెదేపాలు ఇలా ‘దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలం’టూ ఘనమైన ప్రకటనలు చేయడం రాజకీయాల్లో లబ్ది కోసం కాదా? భిన్న ధ్రృవాలైన ఈ నేతల మాటలను జనం విశ్వసిస్తారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపా పొత్తును జనం ముక్తకంఠంతో తిరస్కరించారు. మరి- వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకూ కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు ఉంటుందా? ‘తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ (జగన్)తో జాగ్రత్తగా ఉండండని తెలుగు తమ్ముళ్లను గతంలో హెచ్చరించిన చంద్రబాబుకు కాంగ్రెస్ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో లాభం ఉంటుందా? కాంగ్రెస్ ఓ రాచపుండు అని, ఎన్టీఆర్ కుమార్తె పురంధ్రీశ్వరి గతంలో కాంగ్రెస్‌లోకి వెళ్లడం పట్ల కూడా చంద్రబాబు విమర్శలు గుప్పించిన విషయాన్ని జనం ఇంకా మరచిపోలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఏపీకి ప్రత్యేక హోదా రాకపోయినా ఆమేరకు నిధులు ఇచ్చారని, నిజానికి ప్రత్యేక హోదా సంజీవని కాదు అని గతంలో పేర్కొన్న చంద్రబాబు ఈరోజున మోదీపై విమర్శల దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబు ఇపుడు అదే పార్టీకి చేరువ కావడం గమనార్హం. కాంగ్రెస్ వ్యతిరేకత అనే పునాదిపై ఆవర్భివించిన తెలుగుదేశం పార్టీని అదే కాంగ్రెస్ నీడకు చేర్చడం చంద్రబాబుకే చెల్లింది.
2014 ఎన్నికల తర్వాత నాలుగేండ్లకు పైగా నరేంద్ర మోదీతో జత కట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో తెదేపా నేతల ఇళ్లపై, వ్యాపారుల ఆస్తులపై సీబీఐ సోదాలు జరిపితే- ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది’ అనే కొత్త పల్లవిని అందుకున్నారు.
2019 ఎన్నికల్లో చంద్రబాబుకు గడ్డు పరిస్థితి తప్పదని ఇప్పటికే పలు సర్వేలు సూచించాయి. ఈ నేపథ్యంలో ఆయన ‘మోదీపై ఎదురుదాడి’ అనే కొత్త నాటకానికి తెరతీశారు. కాంగ్రెస్‌తో తెదేపా జతకట్టినందుకు ఎన్‌టిఆర్ ఆత్మక్షోభిస్తే ఎవరికి కావాలి? బతికుండగానే ఎన్టీఆర్‌ను గద్దె దించిన ఘనత చంద్రబాబుది. ఇపుడు ఆయన తెలుగువారి ఆత్మగౌరవం అంటూ మోదీపై విమర్శలకు దిగడం విడ్డూరం.
రాజకీయాల్లో ఒకరిని ఒకరు నమ్మరు. నమ్మినట్లు నటించాలి. సోనియాగాంధీ లోగడ తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును నమ్మి మోసపోయింది. ఇప్పు డు చంద్రబాబును నమ్మినా కాంగ్రెస్‌కు అదే గతి పడుతుంది. ప్రధాని పదవి కోసం కాంగ్రెస్ పార్టీ ఎవరితోనైనా పొత్తుకు సిద్ధమవుతుంది. తెదేపాతో పొత్తు వల్ల లాభం ఉండదని భావిస్తే చంద్రబాబుతో స్నేహానికి చరమగీతం పాడుతుంది. తెదేపాతో పొత్తు కన్నా ఉత్తరాదిలోని ఇతర పార్టీలతో చెలిమి చేస్తే అధికారం దక్కే అవకాశాలు మెరుగుపడతాయని కాంగ్రెస్ భావిస్తుంది. అందలం ఎక్కేందుకు ఎవరితోనైనా జత కట్టడమే అసలు సిసలు రాజకీయం. ఈ విషయంలో కాంగ్రెస్‌ను మించిన పార్టీ ఏదీ లేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు కొత్త మిత్రులు తోడైతే చంద్రబాబు పరిస్థితి ఏమిటి?
హిందువులను తిట్టడమే
అసలైన ‘సెక్యులరిజం’!
హిందువులను కించపరుస్తూ కంచె ఐలయ్య రాసిన పుస్తకాన్ని న్యూ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశంగా పెట్టారు. ఈ విషయమై కొందరు ఆందోళనలు చేసిన ఫలితంగా ఆ తర్వాత దానిని తొలగించారు. వివాదాస్పద పుస్తకాన్ని పాఠ్యాంశంగా నిర్ణయించడం పెద్ద తప్పు. తన పుస్తకాన్ని నిషేధించారని తెలిశాక కంచె ఐలయ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశాడు. ‘నీకు అండగా నేనుంటాను..’అని రాహుల్ గాంధీ ఐలయ్యకు భరోసా ఇచ్చాడన్న వార్త పత్రికల్లో ప్రచారమైంది. కంచె ఐలయ్య క్రైస్తవ మత ప్రచారకుడు. ఇతనికి అమెరికాలోని కొలరాడో నుండి నిధులు వస్తున్నాయి. భారతదేశంలో ‘హిందుత్వ’ అనే మాట వినపడకుండా చేయండని విదేశాల్లోని క్రైస్తవ సంస్థలు ఆదేశించడంతో ఐలయ్య హిందువులకు, అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా గ్రంథరచనలు చేస్తున్నాడు. అందుకే బ్రాహ్మణులపై విద్వేషం వెళ్లగక్కుతూ తన పుస్తకంలో హీనమైన భాషలో విమర్శించాడు. మెజారిటీ మతస్థులను తూలనాడే ఐలయ్యకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతు పలికాయి. అంటే వారికి క్రైస్తవం ‘మత్తుమందు’ కాదు. హైందవంపై గుడ్డి వ్యతిరేకతే మత్తుమందు అని తేలింది. వామపక్షవాదులకు కారల్ మార్క్స్ చెప్పింది ఇదేనా? హిందువులను, హిందూ మతాన్ని తిట్టడమే ‘సెక్యులరిజం’ అని మన దేశంలో కొందరు మేధావులు, వామపక్ష నేతలు సూత్రీకరిస్తున్నారు.
ఎన్నికల్లో లబ్ది కోసం
ఎనె్నన్ని వేషాలు..?
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల మానస సరోవర యాత్ర చేశాడు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో క్షీరాభిషేకం నిర్వహించాడు. సోమనాథ దేవాలయంలో పూజలు జరిపాడు. ‘నేను యజ్ఞోపవీతం ధరించిన బ్రాహ్మణుణ్ణి’అని ఆయన చెప్పుకున్నాడు. ఇది నిజమేనా? రాహుల్ గాంధీ బ్రాహ్మణుడే అయితే- హిందువులపై విషం చిమ్మే కంచె ఐలయ్యకు ఎట్లా మద్దతునిచ్చాడు? ఎన్నికలలో ప్రయోజనం కోసం ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన బ్రాహ్మణ సామాజికవర్గం మద్దతు కోసం తాను బ్రాహ్మణుణ్ణని ఆయన చెప్పుకుంటున్నాడు. నిజానికి రాహుల్ గాంధీ క్రైస్తవుడు కాబట్టి షెపర్డ్ కంచె ఐలయ్యను బలపరిచాడు. ఇది ప్రత్యక్ష సత్యం! ఇలాంటి వ్యక్తులు భారత ప్రధానులు అయితే ఈ దేశ భద్రత ఎలా ఉంటుంది? ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీద తిరుగుతున్న రాహుల్ బాబు కాంగ్రెస్ గెలుపు కోసం ఇంకెన్ని అసత్యాలు చెబుతాడో..
మరుగున పడిన
అలనాటి మహా నేతలు...
ప్రపంచంలోనే అత్యున్నతమైన సర్దార్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్‌లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. కానీ, సర్దార్ పటేల్ తమవాడు అని కాంగ్రెస్ వారు చెప్పుకుంటున్నారు. నిజానికి- సర్దార్ పటేల్‌కు ప్రధాని పదవి దక్కకుండా అలనాడు అడ్డుకున్నది జవహర్‌లాల్ నెహ్రూయే. ఆయనకు ‘్భరతరత్న’ పురస్కారాన్ని రాకుండా చేసింది కూడా కాంగ్రెస్ వారే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పటేల్‌కు సముచితమైన నివాళిని సమర్పించింది. దాదాపు 500 స్వదేశీ సంస్థానాలకు ఇండియన్ యూనియన్‌లో పటేల్ విలీనం చేస్తే, ఏడాది తిరగకుండానే నెహ్రూ భాషాప్రయుక్త రాష్ట్రాల పేరిట దేశాన్ని ముక్కలు ముక్కలు చేశారు. ‘ఫెడరలిజం’ పేరుతో ప్రాంతీయ వైషమ్యాలు పెంచింది ఎవరు? నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ నాయకులు కాదా?
సర్దార్ వల్లభ భాయ్ పటేల్ దార్శనికుడు. దేశ సమగ్రతకు ఆయన ప్రతీక. భారతదేశం అంటే గురుకొచ్చేది సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రమే. గత డెబ్బది సంవత్సరాలుగా ఈ మహాపురుషుల స్ఫూర్తిని బుద్ధి పూర్వకంగా నెహ్రూ కుటుంబం మరుగున పడేటట్లు చేసింది. కమ్యూనిస్టులైతే మరో అడుగు ముందుకువేసి నేతాజీ సుభాస్ చంద్రబోస్‌ను ‘హిట్లరు బూట్లు నాకే కుక్క’అని నీచంగా వ్యాఖ్యానించారు. తమ పీపుల్స్‌వార్ పత్రికలో నేతాజీని గాడిదగా చిత్రిస్తూ కార్టూన్ వేశారు. జాతీయవాదంపైన, జాతినేతలపైన కమ్యూనిస్టులకు ఎందుకింత ద్వేషం?
మహానేతల పేర్లకు బదులు నేడు దేశంలో అవినీతిపరులైన, అసమర్థులైన నాయకుల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మాలవీయ, నేతాజీ, పటేల్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, లాల్‌బహదూర్, టంగుటూరి ప్రకాశం పేర్లు మరుగున పడుతున్నాయి. వాటికి బదులు ఆర్థిక నేరస్థుల పేర్లు ఇప్పుడు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. రాబర్ట్ వాద్రా, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, పి.చిదంబరం, కార్తీ చిదంబరం వంటి అక్రమార్కులకే విస్తృత ప్రచారం!

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్